Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Andhra Pradesh Hospitals To Halt Aarogyasri Services From April 71
AP: ఈ నెల 7 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్

సాక్షి, విజయవాడ: ఈ నెల 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేయనున్నట్లు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్‌ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. బకాయిలు చెల్లించాలని పదే పదే విజ్ఞప్తి చేసినా కూటమి సర్కార్‌ స్పందించడం లేదు. దీంతో బకాయిలు భారీగా పేరుకుపోవడంతో సేవలు నిలిపివేస్తున్నట్లు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్(ASHA) ప్రతినిధులు ప్రకటించారు. ఏప్రిల్ 7 నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలను పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించామని తెలిపారు.‘‘అప్పుల భారం మోయలేక, బాధలు భరించలేక.. ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. ప్రతీ నెలా నెట్ వర్క్ ఆసుపత్రుల నుంచి రూ.330 కోట్ల రూపాయల సేవలు అందిస్తున్నాం. బకాయిలు చెల్లిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. సగం కూడా రావడం లేదు. నెట్ వర్క్ ఆసుపత్రులకు రావాల్సిన బకాయిలు రూ. 3500 కోట్ల వరకూ పేరుకుపోయాయి. మందులు, పరికరాలు అప్పులిచ్చే కంపెనీలు పూర్తిగా నిలిపివేశాయి. బ్యాంకుల నుంచి ఓవర్ డ్రాఫ్ట్‌లో డబ్బులు తెచ్చుకునే పరిస్థితి లేదు. ఆసుపత్రులు వైద్యులకు జీతాలిచ్చే పరిస్థితిలో లేవు’ అని హాస్పిటల్స్ అసోసియేషన్ తెలిపింది.వైద్యసేవలు అందించలేని పరిస్థితి నెలకొందని మార్చి 7న నోటీసు పంపించాం. నోటీసు పంపించిన తర్వాత రూ.350 కోట్లు మాత్రమే ప్రభుత్వం చెల్లించింది. మేం ఎప్పుడు డబ్బులు అడిగినా పాత బకాయిలు చెల్లించామనే చెబుతున్నారు. కానీ ప్రభుత్వం చెల్లించే దానికంటే మేం ఎక్కువగానే సేవలు అందిస్తున్నాం. తొంభై శాతం ప్రజలకు ఎన్టీఆర్ వైద్య సేవ కింద 3300 ప్యాకేజీలకు సేవలు అందిస్తున్నాం. ప్రతీ నెలా బకాయిలు పేరుకుపోవడంతో ఆసుపత్రుల మనుగడే కష్టంగా మారింది. మాకు ఉన్న బకాయిల్లో రూ.1500 కోట్లు అత్యవసరంగా చెల్లించాలి. అలా చెల్లించలేని పక్షంలో మా సర్వీసులను మొదలు పెట్టే పరిస్థితి లేదు. కొత్త ఇన్స్యూరెన్స్ స్కీమ్‌కు వెళ్లేముందు ప్రభుత్వం మా బకాయిలన్నీ చెల్లించాలి’’ అని అసోసియేషన్‌ ప్రతినిధులు డిమాండ్‌ చేశారు.

Sakshi Editorial On NDA Govt Waqf Amendment Bill2
పంతం నెగ్గించుకున్న ఎన్డీయే

ఎవరు ఎంతగా వ్యతిరేకించినా వక్ఫ్‌ సవరణ బిల్లు చట్టంగా మారబోతోంది. అంతా సవ్యంగా ఉన్నప్పుడు ఎవరైనా స్వోత్కర్షలకు పోవచ్చు. కానీ క్లిష్ట సమయాలే ఎవరేమిటన్నది నిగ్గుదేలుస్తాయి. బిల్లు పార్లమెంటులో గట్టెక్కడం మాట అటుంచి టీడీపీ ఇన్నాళ్లుగా వేస్తున్న సెక్యులర్‌ వేషాలకు తెరపడింది. టీడీపీ, జేడీ(యూ)ల మద్దతు లేనిదే కేంద్రంలో ప్రభుత్వాన్నే నడపటం సాధ్యం కాని దీనస్థితిలోవున్న ఎన్డీయే సర్కారు... ఇప్పుడు వక్ఫ్‌ బిల్లుపై సునాయాసంగా తన పంతం నెగ్గించు కోవటం ఎలా సాధ్యమైందో అందరికీ తేటతెల్లమైంది. వీరితోపాటు మొదట వీరావేశంతో మాట్లాడిన ఒడిశాకు చెందిన బీజేడీ ఆఖరి నిమిషంలో స్వరం మార్చి పార్టీ ఎంపీలకు స్వేచ్ఛనిస్తున్నట్టు ప్రకటించటం ప్రభుత్వానికి కలిసొచ్చింది. నిరుడు ఆగస్టులో ఈ బిల్లు ప్రవేశపెట్టి ఆదరా బాదరాగా ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం తహతహలాడినా విపక్షాలు తీవ్రంగా ప్రతిఘటించటంతో దీన్ని సంయుక్త పార్లమెంటరీ సంఘం (జేపీసీ) పరిశీలనకు పంపక తప్పలేదు. ఎన్డీయే సర్కారు ఏర్పాటైన పదేళ్లలో ఒక బిల్లు జేపీసీకి వెళ్లటం అదే ప్రథమం. రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల అనంతరం పెరిగిన బలం వల్లనైతేనేమి, ఏపీకి చెందిన కొందరు దిగజారుడు ఎంపీలతో రాజీనామాలు చేయించటం వల్లనైతేనేమి అప్పటితో పోలిస్తే ఇప్పుడు రాజ్యసభలో ఎన్డీయే బలం పెరిగింది. అందుకే వక్ఫ్‌ బిల్లు సునాయాసంగా గట్టెక్కుతుందని అధికారపక్షం నిర్ణయానికొచ్చింది. వక్ఫ్‌ ఆస్తులకు సంబంధించి సమస్యలు లేవని ఎవరూ అనరు. ఎన్నడో 1954లో వచ్చిన తొలి వక్ఫ్‌ చట్టం అవసరాలకు అనుగుణంగా లేదన్న ఉద్దేశంతో 1995లో దాని స్థానంలో మరో చట్టం తీసుకొచ్చారు. 2013లో సవరణలు చేశారు. అయినా మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం వున్నదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. వక్ఫ్‌కు సంబంధించిన ఆస్తుల్లో దాదాపు సగంవరకూ వాటి యాజమాన్యం లేదా నిర్వహణకు సంబంధించి సమస్యలున్నాయి. అవినీతి ఉన్నదనీ, అక్రమాలు చోటుచేసుకుంటున్నాయనీ ఆరోపణలు రావటం కూడా వాస్తవం. పారదర్శకత పాటించటంలేదన్న విమర్శ కూడా ఉంది. వీటిని సరిదిద్దాలంటే ముస్లిం పండితులతో, నిపుణులతో, ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు వంటి సంస్థలతో మాట్లాడాలి. ఎలావుంటే బాగుంటుందన్న అంశంలో సూచనలూ, సలహాలూ తీసుకోవాలి. కానీ ఇవేమీ చేయకుండా బిల్లు తీసుకురావటంతో ముస్లిం వర్గాల్లో సంశయాలకు అవకాశం ఏర్పడింది. ముస్లింల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ బిల్లు తీసుకొచ్చినట్టు ప్రభుత్వం చెప్పటం బాగానేవున్నా ఆచరణ అందుకు విరుద్ధంగా ఉంది.బుజ్జగింపు ధోరణితో, ఓటుబ్యాంకు రాజకీయాలపై దృష్టితోనే బిల్లును వ్యతిరేకిస్తున్నారని విపక్షాలపై ఆరోపణలు చేస్తున్న ప్రభుత్వం తాను చేసిందేమిటో ఆలోచించిందా? నిజంగా చిత్తశుద్ధి వుంటే బిల్లు రూపకల్పనకు ముందు ఆ వర్గాలతో చర్చించటానికి అభ్యంతరమేమిటి? ముస్లిమేతరులకు వక్ఫ్‌ బోర్డులు, కౌన్సిళ్లలో స్థానం ఎందుకు కల్పించారన్న విషయమై ప్రభుత్వం ఇచ్చిన సంజా యిషీ ఏమాత్రం సంతృప్తికరంగా లేదు. మసీదుల నిర్వహణ లేదా మతపరమైన ఇతర అంశాలకు సంబంధించి వక్ఫ్‌ కౌన్సిళ్లు జోక్యం చేసుకోబోవని, కేవలం వక్ఫ్‌ ఆస్తుల వ్యవహారాలనే చూస్తాయని కేంద్రమంత్రులు అమిత్‌ షా, కిరణ్‌ రిజుజు చెబుతున్నారు. కానీ మౌలికంగా వక్ఫ్‌ ఆస్తి అంటే సంపన్న ముస్లింలు భక్తిభావనతో మతపరమైన అవసరాల కోసం, ఆ వర్గాల అభ్యున్నతి కోసం దానం చేసే ఆస్తి. అటువంటప్పుడు ఆ ఆస్తుల నిర్వహణలో అన్యులకు చోటీయటం అసమంజసం కాదా? ఇతర మతాలకు సంబంధించిన ధార్మిక ఆస్తుల నిర్వహణలో కూడా ముస్లింలకు అవకాశం ఇస్తారా? ఒకవేళ అలా ఇచ్చినా అందుకు ఆ మతస్తులు అంగీకరిస్తారా? ఇంతకాలం ముస్లిమేతరులు సైతం తమ ఆస్తిని కారుణ్య భావనతో వక్ఫ్‌కు ఇవ్వొచ్చన్న నిబంధన ఉండేది. కానీ తాజా సవరణ ప్రకారం అయిదేళ్లపాటు ఇస్లామ్‌ను ఆచరిస్తేనే అందుకు అర్హత వస్తుంది. అయితే ఇస్లామ్‌ ఆచరణే మిటో బిల్లు వివరించలేదు. 2013లో ఆ మరుసటి సంవత్సరం జరిగే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో వుంచుకుని ఆదరా బాదరాగా వక్ఫ్‌ చట్టానికి అప్పటి యూపీఏ ప్రభుత్వం సవరణలు తెచ్చిందని, అందువల్ల ఒక్క ఢిల్లీలోనే అనేక ఆస్తులు వక్ఫ్‌ ఆస్తులుగా మారాయని ప్రభుత్వం చెబుతున్నది. కానీ ఆ సవరణలను నాటి బీజేపీ నేతలు ఎల్‌కే అడ్వాణీ, సుష్మాస్వరాజ్‌ సమర్థించారు. సవరణలు పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించటంలో తోడ్పడ్డారు. వక్ఫ్‌ బిల్లు తీసుకొచ్చిన ఉద్దేశంపై దేశవ్యాప్తంగావున్న 20 కోట్లమంది ముస్లింలలో ఎన్నో సంశయాలున్నాయి. బిల్లులోని నిబంధనలు ఆ సంశయాలను మరింత పెంచేవిగా ఉన్నాయి. వక్ఫ్‌ ఆస్తుల్ని ఆర్నెల్లలోపు డేటా బేస్‌లో నమోదు చేయనిపక్షంలో వాటికి సంబంధించిన వివాదాలపై న్యాయస్థానాల మెట్లెక్కటం అసాధ్యమని బిల్లు చెప్పటం సమంజసంగా అనిపించదు. వివాదంలో పడిన వక్ఫ్‌ ఆస్తులపై ప్రభుత్వ ఉన్నతాధికారి నిర్ణయం అంతిమం కావటం కూడా సమస్యాత్మకం. ఏ ఉన్నతాధికారైనా ప్రభుత్వ ప్రయోజనాలకు విరుద్ధంగా నిర్ణయం తీసుకోవటం సాధ్యమేనా? ఇది అనుమానాలు రేకెత్తించే అవకాశం లేదా? మొత్తానికి తెలుగుదేశం వంటి పక్షాలు బిల్లుకు ఓటేసి, ఆపైన సవరణలు తీసుకొచ్చామంటూ లీకులిస్తూ, తమ సవరణలతో బిల్లు పకడ్బందీగా వచ్చింద నడం హాస్యాస్పదం. అందులోని డొల్లతనం ఏమిటో ఈ నిబంధనలే చెబుతున్నాయి. క్లిష్ట సమయాల్లో తటస్థత వహించటం ద్రోహంతో సమానం. తటస్థత మాట అటుంచి నిస్సంకోచంగా బిల్లును సమర్థించి టీడీపీ తన నైజాన్ని బయట పెట్టుకుంది. ఇందుకు మూల్యం చెల్లించక తప్పదు.

YSRCP YV Subba Reddy Opposes Waqf Bill in Rajya Sabha3
వక్ఫ్ బిల్లులో ముస్లింల అభ్యంతరాలను పట్టించుకోలేదు: వైఎస్సార్‌సీపీ

ఢిల్లీ: వక్ఫ్ (సవరణ) బిల్లులో ముస్లింల అభ్యంతరాలను పట్టించుకోలేదని వైఎస్సార్‌సీపీ పేర్కొంది. రాజ్యసభ ముందుకు వక్ఫ్ బిల్లును తీసుకెళ్లిన క్రమంలో చర్చ సందర్భంగా వైఎస్సార్‌సీపీతరఫున వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారు. ‘ వక్ఫ్ బిల్లులో ముస్లింల అభ్యంతరాలను పట్టించుకోలేదు. ఈ బిల్లు మత స్వేచ్ఛను హరించేలా ఉంది. ఏపీలో 50 లక్షల మంది ముస్లింలు ఉన్నారు. వారి ప్రయోజనాలను, వక్ఫ్ ఆస్తులను రక్షించడంలో తెలుగుదేశం ప్రభుత్వం విఫలమైంది. వక్ఫ్ బిలలుకు టీడీపీ మద్దతు ఇచ్చి నిజస్వరూపాన్ని బయటపెట్టింది.తమకు సిద్ధాంతాలు కంటే రాజకీయాలు ముఖ్యమని టీడీపీ చెప్పింది. ముస్లింల విశ్వాసాన్ని టీడీపీ కోల్పోయింది. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓట్లే కాదు.. విలువలను కూడా పాటించాలి. జేఏసీలో ముస్లింల అభ్యంతరాలను వైఎస్సార్‌సీపీస్పష్టం చేసింది. వైఎస్సార్‌సీపీఈ బిల్లును వ్యతిరేకిస్తోంది. ఈ బిల్లు ప్రాథమిక హక్కులకు విరుద్ధం. రాజ్యాంగం విరుద్ధంగా ఉన్న బిల్లు చెల్లదని ఆర్టికల్ 13 స్పష్టం చేస్తోంది. మైనార్టీ ఆస్తుల వ్యవహారంలో ప్రభుత్వాల జోక్యం అనవసరం.వేలాది సంవత్సరాలుగా ముస్లింల అధీనంలో భూమిపై జోక్యం చేసుకోవడం వారి హక్కులకు భంగం కల్గించడమే. వక్ఫ్ బోర్డులో నాన్ ముస్లింలను చేర్చడం వారి మత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే అవుతుంది. ఇది ఆర్టికల్ 25 కు విరుద్ధం’ అని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

Rasi Phalalu: Daily Horoscope On 04-04-2025 In Telugu4
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. వ్యాపారాలు లాభిస్తాయి

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: శు.సప్తమి రా.1.50 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం: మృగశిర ఉ.11.16 వరకు, తదుపరి ఆరుద్ర, వర్జ్యం: రా.7.25 నుండి 8.56 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.24 నుండి 9.11వరకు, తదుపరి ప.12.26 నుండి 1.15 వరకు, అమృత ఘడియలు: రా.12.46 నుండి 2.20 వరకు; రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు, యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు, సూర్యోదయం: 5.57, సూర్యాస్తమయం: 6.10. మేషం... శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. కొత్త పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.వృషభం... వ్యవహారాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. మిత్రులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.మిథునం... బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఆస్తిలాభం. శ్రమ ఫలిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.కర్కాటకం.... వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.సింహం... యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి.కన్య...... పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.తుల... ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. మిత్రులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.వృశ్చికం..... కుటుంబసమస్యలు. కార్యక్రమాలలో అవరోధాలు. ఆరోగ్యం మందగిస్తుంది. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.ధనుస్సు... కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వాహయోగం. చర్చలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.మకరం..... దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. కార్యజయం. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.కుంభం.. వ్యవహారాలలో అవరోధాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశపరుస్తాయి.మీనం... కొన్ని కార్యక్రమాలు వాయిదా పడతాయి. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

World leaders criticise Donald Trump tariffs as major blow5
ప్రతీకారం తప్పదు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన తాజా టారిఫ్‌లపై ప్రపంచ దేశాలన్నీ మండిపడుతున్నాయి. ప్రపంచ వాణిజ్య యుద్ధానికి తెర తీశారంటూ దుయ్యబడుతున్నాయి. ప్రతీకారం తప్పదని ఆయా దేశాల అధినేతలు స్పష్టం చేశారు. వాణిజ్య యుద్ధాలు ఇరు పక్షాలను దెబ్బతీస్తాయని జర్మనీ హెచ్చరించింది. తమపై ట్రంప్‌ విధించిన 10 శాతం సుంకాన్ని ఎదుర్కోవడానికి లాటిన్‌ అమెరికాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన బ్రెజిల్‌ బుధవారం ఒక చట్టాన్ని ఆమోదించింది. దెబ్బకు దెబ్బ: ఈయూ యూరోపియన్‌ యూనియన్‌పై 20 శాతం సుంకాలను యూరప్‌ దేశాలన్నీ తీవ్రంగా ఖండించాయి. ఇది పూర్తిగా అన్యాయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ‘‘అమెరికా వస్తువులకు ఈయూ అతి పెద్ద మార్కెటని ట్రంప్‌ మర్చిపోయినట్టున్నారు. యూఎస్‌పై ప్రతీకార సుంకాలు విధిస్తాం’’అని హెచ్చరించాయి. ‘‘ఈయూ ఉక్కుపై అమెరికా సుంకాలకు ప్రతిస్పందనగా ప్రతీకార ప్యాకేజీని ఖరారు చేస్తున్నట్టు ఈయూ అధ్యక్షురాలు ఉర్సులా వాండడెర్‌ లెయన్‌ ప్రకటించారు. చర్చలు విఫలమైతే తమ ప్రయోజనాలను, వ్యాపారాలను రక్షించుకోవడానికి మరిన్ని ప్రతీకార సుంకాలు తప్పవని స్పష్టం చేశారు. అయితే ఈ సుంకాల యుద్ధంతో అంతిమంగా నష్టపోయేది ప్రపంచ ఆర్థిక వ్యవస్థేనంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ...సమరమే: కెనడా ప్రపంచ వాణిజ్య వ్యవస్థనే అతలాకుతలం చేసే ట్రంప్‌ సుంకాలపై పోరాడతామని కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ ప్రతిజ్ఞ చేశారు. ఇతర దేశాలతో పోలిస్తే కెనడాపై తాజా టారిఫ్‌ల ప్రభావం పరిమితమే. అయినా ఉక్కు, అల్యూమినియం, ఆటోమొబైల్స్‌పై అమెరికా సుంకాలు లక్షలాది కెనడియన్లను నేరుగా ప్రభావితం చేస్తాయని కార్నీ ఆక్షేపించారు. ఈ సుంకాలను ప్రతిదాడులతో ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. మంచిది కాదు: బ్రిటన్‌ వాణిజ్య యుద్ధం ఎవరికీ మంచిది కాదని బ్రిటన్‌ ప్రధాని కియిర్‌ స్టార్మర్‌ వ్యాఖ్యానించారు. ‘‘అన్ని పరిస్థితులకూ మేం సిద్ధంగా ఉన్నాం. ప్రతిస్పందనగా మావైపు నుంచి ఏ చర్యలనూ తోసిపుచ్చలేం’’అని పార్లమెంటుకు చెప్పారు. విచారకరం: జపాన్‌ ఈ దిగుమతి సుంకాలు చాలా విచారకరమని జపాన్‌ వ్యాఖ్యానించింది. అవి ప్రపంచ వాణిజ్య సంస్థ, యూఎస్‌–జపాన్‌ ఒప్పందాలను ఉల్లంఘించడమేనని పేర్కొంది. అమెరికా తమపై విధించిన 36 శాతం సుంకంపై చర్చలు జరుపుతామని అయితే థాయిలాండ్‌ తెలిపింది. సుంకాల ప్రకటనకు ఒక రోజు ముందే.. అమెరికా దిగుమతులపై ఇజ్రాయెల్‌ అన్ని సుంకాలను రద్దు చేసినా.. ఫలితం లేకపోయింది. ఇజ్రాయెల్‌ వస్తువులపై ట్రంప్‌ 17 శాతం సుంకాలను విధించడంపై ఆ దేశం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. భారీ మూల్యం తప్పదు: ఆ్రస్టేలియా ఆ్రస్టేలియా గొడ్డు మాంసంపై ట్రంప్‌ కఠిన ఆంక్షలు దారుణమని ప్రధాని ఆంటోనీ అల్బనీస్‌ విమర్శించారు. ఇందుకు అమెరికా ప్రజలు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. అయితే, ‘‘మేం పరస్పర సుంకాలకు దిగబోం. అధిక ధరలకు, ఆర్థిక మందగమనానికి దారితీసే రేసులో చేరబోం’’అని స్పష్టం చేశారు. కంపెనీలను కాపాడుకుంటాం: స్పెయిన్‌ దేశీయ కంపెనీలను, పరిశ్రమలను, మొత్తంగా ఆర్థిక రంగాన్ని ఈ సుంకాల ప్రభావం బారినుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకుని తీరతామని స్పెయిన్‌ ప్రధాని పెడ్రో శాంచెజ్‌ ప్రకటించారు. స్వేచ్ఛా వాణిజ్య ప్రపంచమే తమ లక్ష్యమన్నారు. గొడవలొద్దు: స్వీడన్‌ వాణిజ్య అడ్డంకులను కోరుకోవడం లేదని స్వీడన్‌ ప్రధాని ఉల్ఫ్‌ క్రిస్టెర్సన్‌ అన్నారు. ‘‘మాకు వాణిజ్య యుద్ధం వద్దు. అమెరికాతో కలిసి వాణిజ్యం, సహకార మార్గంలో పయనించాలని, తద్వారా ఇరు దేశాల ప్రజలు మెరుగైన జీవితాన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నాం’’అని చెప్పారు. హానికరమైన సుంకాలు: ఇటలీ ట్రంప్‌ సుంకాలను ఆయన మిత్రురాలు, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఘాటుగా విమర్శించారు. ఈ సుంకాలు హానికరమని హెచ్చరించారు, ‘‘వాణిజ్య యుద్ధాన్ని నివారించాలి. అది తీవ్రతరం కాకముందే పరిష్కారం కోసం అమెరికా ప్రయతి్నంచాలి’’అని సూచించారు. ఆర్థిక సంక్షోభం: ఫ్రాన్స్‌ ట్రంప్‌ సుంకాలు అతి పెద్ద ఆర్థిక సంక్షోభానికి దారి తీస్తాయని ఫ్రాన్స్‌ ఆందోళన వెలిబుచి్చంది. ఫ్రెంచ్‌ వైన్, స్పిరిట్స్‌ ఎగుమతులపై ఇవి గణనీయ ప్రభావం చూపుతాయని ప్రభుత్వ ప్రతినిధి సోఫీ ప్రైమాస్‌ వ్యాఖ్యానించారు. తక్షణం రద్దు చేయాలి: చైనా ఏకపక్ష టారిఫ్‌లను అమెరికా తక్షణం రద్దు చేయాలని చైనా డిమాండ్‌ చేసింది. ప్రపంచ ఆర్థికాభివృద్ధికి ఇవి గొడ్డలి పెట్టని అభిప్రాయపడింది. అమెరికా ప్రయోజనాలతో పాటు అంతర్జాతీయ సరఫరా గొలు సులను కూడా దెబ్బతీస్తాయని హెచ్చరించింది. విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని అమెరికాకు సూచించింది.చర్చలే మార్గం: దక్షణ కొరియా ఈ సమస్యకు చర్చలే మార్గమని ద క్షణ కొరియా అభిప్రాయపడింది. ప్రపంచ వాణిజ్య యుద్ధం వాస్తవ రూపం దాల్చిందని తాత్కాలిక అధ్యక్షుడు హాన్‌ డక్‌ సూ అన్నారు. ఆర్థిక మంత్రి, ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష జరిపారు. ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి శక్తి సామ ర్థ్యాలన్నింటినీ ధారపోద్దామని చెప్పారు.– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Sakshi Guest Column On Hyderabad Central University Land Issue6
కోర్టు ఆదేశాలు ప్రభుత్వానికి చెంపపెట్టు

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల ‘కంచ గచ్చి బౌలి’ భూమిని, రేవంత్‌ రెడ్డి సర్కార్‌ వేలానికి పెట్టింది. వేలం వద్దని విద్యార్థులు జేఏసీగా ఏర్పడి కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఉగాది పండగ రోజున ఆ ప్రాంతపు చెట్లను తొలగించి, మట్టిని చదును చేయడానికై 50 భారీ బుల్డోజర్లు, పొక్లైన్లతో, వందలాది మంది పోలీసులు ఆ భూమిలోకి వెళ్లారు. వాటిని అడ్డుకోవడానికి యత్నించిన విద్యార్థులపై పోలీసులు విరుచుకుపడ్డారు. జుట్టు పట్టి ఈడ్చి వాహనాల్లో పడేశారు. 200 మందిని, 4 పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. చివరికి ఈ వ్యవహారం దేశ అత్యు న్నత న్యాయస్థానానికి చేరడంతో జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం స్టే ఆదేశాలు జారీ చేసింది. గత కేసీఆర్‌ ప్రభుత్వం ప్రభుత్వ భూములను 100 కోట్లకు ఎకరం అమ్మింది. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం అమ్మకానికి పూనుకున్న కంచ గచ్చి బౌలి భూమి ఎకరాకు 100 కోట్ల పైమాటే. 400 ఎకరాలను వేలం వేస్తే 40 వేల కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం దృఢంగా భావించింది.అందుకే ఆందోళన చేస్తున్న విద్యార్థులపై తీవ్ర హింసకు పూనుకుంది. తద్వారా ఎన్నికల ప్రణాళి కలో ఇచ్చిన 7వ హామీ ‘ప్రజాస్వామ్య హక్కుల రక్షణను పాతిపెట్టినట్లే’!‘ఆధునిక రాజ్యంలో ప్రభుత్వం అనేది మొత్తం బడా సంపన్నుల సమష్టి వ్యవహారాలు చక్కబెట్టే కమిటీ మాత్రమే’ అని ఒక జర్మన్‌ తత్వ వేత్త అంటారు. అంటే సామాన్య మెజారిటీ ప్రజలు కేంద్రంగా ప్రభుత్వాలు పనిచేయవని ఉద్దేశం. హెచ్‌సీయూ భూములను అమ్ముతున్న తెలంగాణ ప్రభుత్వం, ప్రభుత్వ రంగ పరిశ్రమ లను అమ్ముతున్న మోదీ ప్రభుత్వ విధానాలకు పైవాక్యం సరిగ్గా సరిపోతుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థ లను కారు చౌకగా బడా పెట్టుబడిదారులకు అమ్ముతోంది. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విశ్వవిద్యాలయ భూములను బడా కార్పొరేట్లకు అమ్మకానికి పూనుకుంది. ఇది ఈ దేశ విద్యార్థుల వైజ్ఞానిక భవిష్యత్తుకు విద్రోహం తలపెట్టడమే! ఉన్న ప్రభుత్వ వనరులను తెగనమ్మడానికి బదులు.... ప్రత్యామ్నాయంగా మోదీ–రేవంత్‌ బడా సంపన్నులపై ‘ప్రగతిశీల పన్ను’ ఎందుకు వేయకూడదు? అవినీతి సొమ్మును, లక్షల కోట్ల నల్లధనాన్ని ప్రజల ప్రయోజనం కొరకు వెలికి తీసి, ఎందుకు వినియోగించకూడదు?పాలకులు ప్రజల ఆస్తులు అమ్మడమే ఏకైక పనిగా సాగుతున్నారు. దశాబ్దాలుగా పథకం ప్రకారం విశ్వవిద్యాలయం భూములకు కోత విధిస్తున్నారు. కేసీఆర్‌... ప్రభుత్వ భూములను అమ్మితే దునుమాడిన రేవంత్‌ రెడ్డి... అదే పనికి ఇప్పుడు పూనుకున్నారు. ఈ చర్య అక్కడి జీవా వరణ – పర్యావరణ స్థితిని నాశనం చేస్తుంది. హెచ్‌సీయూ వెల్లడించిన సమాచారం ప్రకారం 734 రకాల పూల మొక్కలు, 10 క్షీరద జాతులు, 15 రకాల సరీసృపాలు, నెమళ్లు లాంటి 220 రకాల పక్షులు, రెండు చెరువులు ఇక్కడ ఉన్నాయి. పుట్టగొడుగుల్లా పోలి ఉండే ప్రకృతి సిద్ధమైన భారీ బండరాళ్ల అమరికలు ఈ 400 ఎకరాలలో ఉన్నాయి. ఈ ప్రకృతి వైవిధ్యాన్నీ, దేశ భవిష్యత్తునూ ప్రభుత్వం విధ్వంసం చేయతల పెట్టింది. విశ్వవిద్యాలయ భూమిలో ప్రపంచ ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తామని బుకాయిస్తోంది. ఇటీవలే చైనాలో మన హెచ్‌సీయూ లాంటి ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో చదివిన విద్యార్థులే ‘డీప్‌ సీక్‌’ అనే ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ (ఏఐ)ను, అతి చౌకగా ఆవిష్కరించారు. అమెరికా టెక్‌ ఆధిపత్యాన్ని కూల్చారు. భూములను అమ్మడం కంటే, ప్రపంచ ప్రమాణా లతో కూడిన, ఆధునిక మానవ అవసరాలను నెరవేర్చే చదు వులు మరింత భారీ డబ్బును సమీకరిస్తాయి. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం హెచ్‌సీయూ భూముల్లో నెలకొల్పుదామనే ప్రపంచ కంపెనీలు, ఈ విశ్వ విద్యాలయాల్లో చదివిన విద్యా ర్థులు సృష్టించే సంపద కంటే గొప్పవేం కాదు. ‘అక్కడ పులులు జింకలు లేవు. కొన్ని నక్కలు మాత్రమే అభివృద్ధిని అడ్డుకోవడానికి చూస్తున్నాయి. ప్రతిపక్షాలు విద్యార్థులను రెచ్చ గొడుతున్నాయ’ని ముఖ్య మంత్రి మాట్లాడడం అత్యంత దురదృష్టకరం. గురువారం (ఏప్రిల్‌ 3వ తేదీ) సుప్రీంకోర్టులోనూ ప్రభుత్వం అసలు అది అటవీ భూమికాద’ని బుకాయించడమూ తెలిసిందే. ప్రభుత్వ విలువైన భూములను, సహజ వనరులను ప్రైవేటు సంస్థలకు, వ్యక్తులకు ధారా దత్తం చేయకూడదని 2012 సెప్టెంబర్‌ 14న విడుదలైన జీఓఎమ్‌ఎస్‌ నం. 571 స్పష్టంగా చెబుతోంది. వనరుల సమీకరణ కొరకు ప్రభుత్వ భూములను అమ్మడం, వేలం వేయడం వల్ల భూమి తీవ్రంగా తగ్గిపోయి అన్యాక్రాంతమవు తుంది. దీనివల్ల సమాజ భవిష్యత్తు, ప్రజా ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటాయని ఈ జీవో పేర్కొంటున్నది. ప్రభుత్వ భూముల వినియోగం, అత్యంత శాస్త్రీయంగా న్యాయబద్ధంగా ఉండాలని ఈ జీఓ చెబుతోంది. ప్రజల ప్రయోజనం కొరకే భూములను కేటాయించాలి. ఆ భూమి వల్ల వచ్చే భవిష్యత్‌ ప్రయోజనాలన్నీ ప్రజలకే చెందాలి. ప్రజా ప్రయోజనాలకు ఇవ్వ వలసి వస్తే బంజరు భూములను, డ్రై ల్యాండ్స్‌ను మాత్రమే కేటాయించాలి. రెండు పంటలకు సాగు నీటి వసతి గల భూములను అసలు కేటాయించడానికి వీలు లేదు. పర్యావరణపరంగా సున్నితమైన భూములను, ట్యాంక్‌ బెడ్స్‌ను, రివర్‌ బెడ్స్‌ను, కొండలను, అడవులను ఎట్టి పరిస్థితుల్లో అన్యాక్రాంతం చేయకూడదు. ప్రభుత్వ భూము లను, నిధుల సమీకరణ కొరకు, ఎట్టి పరిస్థితులలో వేలం వేయరా దని ఈ జీఓ స్పష్టం చేస్తోంది.హెచ్‌సీయూ భూమి పర్యావరణపరంగా సున్నితమైంది. హైదరాబాద్‌ మహానగరానికి ఊపిరితిత్తి లాంటిది. నీరు ఇంకడానికి భూగర్భ నీటిమట్టాన్ని పెంచడానికి ఇతోధికంగా తోడ్పడుతోంది. ఇంత విలువైన భూములను, ప్రైవేట్‌ బడా కంపెనీలకు ధారాదత్తం చేయడం భావ్యమా? ఈ సంగతులన్నింటినీ గ్రహించింది కాబట్టే సుప్రీం కోర్టు గురువారం తెలంగాణ ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలించింది. ఈ భూముల్లో ప్రభుత్వం ఎటువంటి కార్యకలాపాలనూ నిర్వహించకుండా స్టే విధించింది. ఈ నెల 16న తిరిగి ఈ కేసుపై వాదనలు వింటామనీ, అప్పటికి ఈ భూములపై సమగ్ర నివేదికను తయారుచేసి తమకు సమర్పించాలనీ ఆదేశించింది. ఈ ఆదేశాలు ప్రభుత్వానికి చెంపపెట్టులాంటివని వేరే చెప్పనవసరం లేదు కదా!నైనాల గోవర్ధన్‌ వ్యాసకర్త తెలంగాణ జలసాధన సమితి కన్వీనర్‌ ‘ 97013 81799

Sakshi Guest Column On USA and Iran Issues7
దాడి కోసం సాకుల వెతుకులాట

ఇరాన్‌ అణు కార్యక్రమం గురించి మార్చి 25న ఆసక్తికరమైన నివేదిక ఒకటి వెలుగులోకి వచ్చింది. బయట అంతగా ప్రచారంలోకి రాని ఆ నివేదిక, అమెరికాకు చెందిన 18 ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీలు కలిసి రూపొందించింది. వాటిలో సీఐఏ, పెంటగాన్‌ డిఫెన్స్‌ ఇంటెలిజెన్స్, అమెరికా నేషనల్‌ సెక్యూరిటీ ఏజెన్సీ వంటివి ఉండటం గమనించదగ్గది. ఆ నివేదికను బట్టి, ఇరాన్‌ అణ్వస్త్రాలను తయారు చేయడం లేదు, చేయాలని కూడా అనుకోవటం లేదు.ఇది ఇరాన్‌ నాయకత్వం స్వయంగా చెప్తున్న విషయమే!్డ అయి నప్పటికీ అమెరికా నాయకత్వం, ఇజ్రాయెల్‌తో పాటు, అమెరికా ఆదేశాల ప్రకారం వ్యవహరిస్తుందా అనిపించే ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ అణుశక్తి పర్యవేక్షణ సంస్థ ఇందుకు విరుద్ధమైన వాదనలు చేస్తూ వస్తున్నాయి. అణ్వస్త్రాల ఉత్పత్తికి వీలు లేదని అమెరికా హెచ్చరిస్తుండగా, అసలు శాంతియుత ఉపయోగానికా లేక ఆయుధాల కోసమా అనే దానితో నిమిత్తం లేకుండా అణు పరిశోధనలనే సహించబోమని ఇజ్రాయెల్‌ వాదిస్తున్నది. చర్చలకు సిద్ధం అంటున్నప్పటికీ...వాస్తవానికి ఇరాన్‌ అణు పరిశోధనా కేంద్రాలన్నీ ఐక్యరాజ్య సమితి అణుసంస్థ పర్యవేక్షణలో ఎప్పటి నుంచో ఉన్నాయి. తమ పరిశోధనలు, వాటి నియంత్రణల విషయమై పాశ్చాత్య దేశాలతో చర్చలకు సిద్ధమని గతంలోనూ ప్రకటించిన ఇరాన్‌ నాయకత్వం, నిరుడు ఇజ్రాయెల్‌తో క్షిపణుల రూపంలో ప్రతి దాడుల తర్వాత మరొకమారు స్పష్టం చేసింది. అటువంటి అంగీకార పత్రం ‘జాయింట్‌ కాంప్రహెన్సివ్‌ ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌ (జేసీపీఓఏ) పేరిట 2015 నుంచి ఉండేది కూడా! కానీ ట్రంప్‌ పోయినమారు అధ్యక్షునిగా ఉన్నప్పుడు అమెరికా దాని నుంచి ఏకపక్షంగా ఉపసంహరించుకున్నది. ఇపుడు తిరిగి ఆ విషయమై చర్చలకు యూరోపియన్‌ దేశాలు సుముఖంగా ఉన్నా ఇజ్రాయెల్‌ అంగీకరించటం లేదు. అమెరికా ఒకవైపు చర్చలంటూ, మరొకవైపు బాంబింగ్‌ అని బెదిరిస్తున్నది. అయితే చర్చలు మధ్యవర్తుల ద్వారా తప్ప ప్రత్యక్షంగా జరిపే ప్రసక్తి లేదని ఇరాన్‌ స్పష్టం చేస్తున్నది.దీన్నిబట్టి అర్థమవుతున్నదేమిటి? అమెరికా, ఇజ్రాయెల్‌లకు కావలసింది ఇరాన్‌ శాంతియుత వినియోగానికైనా సరే అణు పరిశో ధనలు జరుపుకొనేందుకు వీలు లేదు. ఇరాన్‌ నుంచి అమెరికాకు మధ్య సుమారు 7,000 మైళ్లు, యూరప్‌తో సుమారు 1,500 మైళ్ల దూరం ఉంది. ఇరాన్‌ వద్ద అణ్వస్త్రాలు ఉన్నాయనుకున్నా వాటి నుంచి ముప్పు ఉండేది మొదట యూరప్‌కు. అయినప్పటికీ ఇరాన్‌ ప్రతిపాదించిన ప్రకారం చర్చలకు వారు సిద్ధంగా ఉన్నారు. ఇరాన్‌ అణ్వస్త్ర ప్రయోగం అమెరికాపై చేయాలంటే వాటిని అంతదూరం మోసుకుపోగల దీర్ఘశ్రేణి క్షిపణులు, బాంబర్లు అవసరం. ఇరాన్‌ వద్ద ఇటు అణ్వస్త్రాలుగానీ, అటు క్షిపణులూ బాంబర్లుగానీ లేవని అమె రికాకు తెలుసు. అదే సమయంలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌ల వద్ద అవన్నీ వేలాదిగా ఉన్నాయి. అయినప్పటికీ ఎందుకీ వైఖరి? ఇక్కడ అర్థమవుతుంది రహస్యం. ఇరాన్‌ భౌగోళికంగా పశ్చిమాసియాలో భాగం. ఆ ప్రాంతం యావత్తూ పాశ్చాత్య శక్తులకు రెండు కారణాల వల్ల ముఖ్యమైనది. ఒకటి – తమ సామ్రాజ్యవాద భౌగోళిక వ్యూహాల దృష్ట్యా. రెండు, ఇరాన్‌ సహా ఆ ప్రాంతపు దేశాలన్నింటా గల అపారమైన చమురు నిక్షేపాలు. గాజా యుద్ధం ముమ్మరంగా సాగుతుండిన రోజుల్లో ఇజ్రాయెల్‌ తాము గాజాతో ఆగబోమని, మొత్తం పశ్చిమాసియా చిత్రాన్నే మార్చివేయగలమని ప్రకటించింది. ఆ మార్పులో భాగంగా ఇరాన్‌ ప్రస్తుత నాయకత్వాన్ని లేకుండా చేయగలమని బాహాటంగా హెచ్చరించింది. ఇరాన్‌లో ప్రస్తుత నాయకత్వం పట్ల ప్రజలలో కొంత అసంతృప్తి ఉన్న మాట నిజం. కానీ ఆ స్థాయి ఎక్కడైనా మామూ లుగా ఉండేదేగానీ తీవ్రమైనది కాదు. అటువంటిది ఉంటే ప్రజాగ్రహంతో ఇరాన్‌ షా 1979లో పతనమైనట్లు జరిగేది. లేదా యూరప్‌లోని జార్జియా, ఉక్రెయిన్, కిర్గిజ్‌స్థాన్, యుగోస్లావియా వంటి దేశాలలో సీఐఏ ప్రోత్సాహంతో ‘కలర్‌ రివల్యూషన్స్‌’ పేరిట ప్రభుత్వాలను కూలదోయటం, దేశాలనే చీల్చటం చేసినట్లు జరిగి ఉండేది. కానీ అవేవీ సాధ్యం కాగల పరిస్థితులు ఇరాన్‌లో లేవు.నేను ఒకసారి వారం రోజులపాటు ఇరాన్‌లో ఉండటం తటస్థించింది. అంతకు ముందు మొహమ్మద్‌ రజా పహ్లవీ చివరి నియంతగా ఉండిన కాలంలో, ఇండియాలోని పలు నగరాలలో చదువుతుండిన ఇరానియన్‌ విద్యార్థులు మా జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)కి వచ్చి కొద్ది రోజుల చొప్పున హాస్టళ్లలో బస చేసి, షా పాలన పట్ల నిరసనలు ప్రకటించి వెళుతుండేవారు. అలాగే పాశ్చాత్య దేశాల పన్నుగడల పట్ల ఆ ప్రజల వ్యతిరేకతలు ఎంతటివో కూడా వారి ద్వారా తెలుస్తుండేవి. షా ప్రభుత్వంతోపాటు పహ్లవీ వంశ రాచరికం కూలిన దశాబ్దాల అనంతరం సైతం పాశ్చాత్య శక్తుల పట్ల వ్యతిరేకతలు ఎంతమాత్రం మారలేదని నేనక్కడ ఉన్న రోజులలో అర్థమైంది. అందుకు కారణం తమ పట్ల అమెరికా కూటమి విధానాలుగానీ, ఇజ్రాయెల్‌ కేంద్రిత వ్యూహాలుగానీ మారక పోవటమే!ఇరానే ఎందుకు లక్ష్యం?పాలస్తీనా సమస్యపై అరబ్‌ దేశాలకు, ఇజ్రాయెల్‌కు మధ్య యుద్ధాలలో ఇజ్రాయెల్‌ గెలవటం, ఈజిప్టు నేత గమాల్‌ అబ్దుల్‌ నాసర్‌ మృతితో పాన్‌ అరబిజం బలహీన పడటంతో అరబ్‌ రాజ్యా లకు ఇజ్రాయెల్‌ పట్ల రాజీ వైఖరి, అమెరికా కూటమి పట్ల సఖ్యత మొదలయ్యాయి. ఇజ్రాయెల్‌ను గుర్తించి దౌత్య సంబంధాలు నెల కొల్పుకోసాగాయి. పాలస్తీనాను నెమ్మదిగా మరచిపోయాయి. పాలస్తీనా నాయకుడు అరాఫత్‌ 2004లో మృతి చెందిన తర్వాత కొత్తగా అధికారానికి వచ్చినవారు అమెరికా, ఇజ్రాయెల్‌లకు పూర్తిగా మచ్చిక అయిపోయారు. హమాస్‌ కారణంగా ఇటీవలి యుద్ధం తలెత్తకపోయి ఉంటే బహుశా పాలస్తీనా విషయం అన్నదే క్రమంగా మరుగున పడేది. అరబ్‌ రాజ్యాలన్నీ పాలస్తీనాను ఇంచుమించు వదిలివేయగా, బలమైన మద్దతుగా నిలిచిన దేశం ఇరాన్‌. ఆసక్తికరం ఏమంటే, సున్నీ ముస్లిం దేశమైన పాలస్తీనాను సున్నీ అరబ్‌ రాజ్యాలు వదలివేయగా, షియా రాజ్యమైన ఇరాన్‌ వారి వెంట నిలిచింది. వారికి ఇరాన్‌ కనీసం పొరుగు దేశమైనా కాదు. పాలస్తీనా సమస్యతో తనకేమి సంబంధం అని భావిస్తే అడిగేవారు లేరు. అయినా ఇటువంటి వైఖరి తీసుకోవటం ఇజ్రాయెల్, అమెరికాలకు ఎంత మాత్రం సరిపడనిది అయింది. ఇరాన్‌తో అరబ్‌ దేశాలకూ సున్నీ–షియా భిన్నత్వం కారణంగా అరకొర సంబంధాలు మాత్రమే ఉన్నాయి.ఈ మొత్తం పరిస్థితుల మధ్య పశ్చిమాసియాలో ఇరాన్‌ ఒక్కటే ఇజ్రాయెల్, అమెరికాలకు ఏకైక శత్రు దేశంగా మిగిలింది. లెబనాన్, సిరియా, హిజ్బుల్లా, హౌతీలను ఏదో ఒక విధంగా దారికి తెచ్చు కోవచ్చు. కానీ ఇరాన్‌ సాధారణమైన శక్తి కాదు. అది గాక దాని వెంట రష్యా, చైనా ఉన్నాయి. పైపెచ్చు ఇటీవల ఉమ్మడి సైనిక విన్యాసాలు జరిపాయి. అణు రంగం విషయమై కూడా త్రైపాక్షిక చర్చలు నిర్వహించాయి. అణు ఇంధనం ఇరాన్‌ రియాక్టర్లలో ప్రస్తుతం 60 శాతం మేరకు శుద్ధి అయి ఉంది. శాంతియుత వినియోగానికి అది అవసరం. అణ్వస్త్రాల కోసం 90 శాతం శుద్ధి కావాలి. ఆ స్థాయికి వెళ్లగల సాంకేతిక శక్తి ఇరాన్‌కు ఉంది. కానీ అటువంటి ఆయుధాల తయారీ ఇస్లాంకు వ్యతిరేకమంటూ పాతికేళ్ల క్రితం ప్రకటించిన అధినాయకుడు అలీ ఖమేనీ ఇప్పటికీ అందుకు కట్టుబడి ఉన్నారు. అయినప్పటికీ ఇజ్రాయెల్, అమెరికాలు యుద్ధం చేయదలచిన వారికి సాకులు కరవా అన్నట్లు ప్రవర్తిస్తున్నాయి.టంకశాల అశోక్‌ వ్యాసకర్త సీనియర్‌ సంపాదకుడు

Sunrisers Hyderabad vs Kolkata Knight Riders Live Updates8
ఎస్ఆర్‌హెచ్‌ను చిత్తు చేసిన కేకేఆర్‌..

KKR vs SRH Live Updates: ఎస్ఆర్‌హెచ్ ఘోర ఓట‌మి..ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 80 ప‌రుగుల తేడాతో ఎస్ఆర్‌హెచ్‌ ఓట‌మి పాలైంది. 201 ప‌రుగుల భారీ ల‌క్ష్య చేధ‌న‌లో ఎస్ఆర్‌హెచ్ 16.4 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 120 ప‌రుగులకే కుప్ప‌కూలింది. సన్‌రైజ‌ర్స్ బ్యాట‌ర్ల‌లో హెన్రిచ్ క్లాసెన్‌(33), మెండిస్‌(27) ప‌ర్వాలేద‌న్పించగా మిగితా బ్యాట‌ర్లంతా దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు. స్టార్ బ్యాట‌ర్లు అభిషేక్ శ‌ర్మ‌(2), హెడ్‌(4), ఇషాన్ కిష‌న్(2) సింగిల్ డిజిట్ స్కోర్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. కేకేఆర్ బౌల‌ర్ల‌లో వైభ‌వ్ ఆరోరా, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి త‌లా మూడు వికెట్లు సాధించ‌గా.. రస్సెల్ రెండు, హ‌ర్షిత్ రాణా, న‌రైన్ ఒక్క వికెట్ సాధించారు. ఈ మెగా టోర్నీలో ఎస్ఆర్‌హెచ్‌కు వ‌రుస‌గా మూడో ఓట‌మి కావ‌డం గ‌మ‌నార్హం. ఎస్ఆర్‌హెచ్ ఏడో వికెట్ డౌన్.. క్లాసెన్ ఔట్‌హెన్రిచ్ క్లాసెన్ రూపంలో ఎస్ఆర్‌హెచ్ ఏడో వికెట్ కోల్పోయింది. 33 ప‌రుగులు చేసిన క్లాసెన్‌.. వైభ‌వ్ ఆరోరా బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 15 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఎస్ఆర్‌హెచ్..7 వికెట్ల న‌ష్టానికి 114 ప‌రుగులు చేసింది. క్రీజులో ప్యాట్ క‌మ్మిన్స్‌(14), హ‌ర్ష‌ల్ ప‌టేల్‌(1) ఉన్నారు.12 ఓవ‌ర్లకు ఎస్ఆర్‌హెచ్ స్కోర్‌: 84/612 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఎస్ఆర్‌హెచ్ 6 వికెట్ల న‌ష్టానికి 84 ప‌రుగులు చేసింది. క్రీజులో హెన్రిచ్ క్లాసెన్‌(13), ప్యాట్ క‌మ్మిన్స్‌(6) ఉన్నారు.ఎస్ఆర్‌హెచ్ నాలుగో వికెట్ డౌన్‌నితీశ్ కుమార్ రూపంలో ఎస్ఆర్‌హెచ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 19 ప‌రుగులు చేసిన నితీశ్ కుమార‌.. ర‌స్సెల్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు.7 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఎస్ఆర్‌హెచ్ 4 వికెట్ల న‌ష్టానికి 51 ప‌రుగులు చేసింది. క్రీజులో క‌మిందు మెండిస్‌(22), క్లాసెన్‌(1) ఉన్నారు.క‌ష్టాల్లో ఎస్ఆర్‌హెచ్‌.. 9 ప‌రుగులకే 3 వికెట్లుక‌ష్టాల్లో ఎస్ఆర్‌హెచ్‌.. 9 ప‌రుగులకే 3 వికెట్లు 201 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఎస్ఆర్‌హెచ్ త‌డ‌బ‌డుతోంది. కేవ‌లం 9 ప‌రుగుల‌కే మూడు వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. ట్రావిస్ హెడ్‌(4), ఇషాన్ కిష‌న్‌(2), అభిషేక్ శ‌ర్మ‌(2) తీవ్ర నిరాశ‌ప‌రిచారు. ఇంపాక్ట్ ప్లేయ‌ర్ వైభ‌వ్ ఆరోరా రెండు వికెట్లు ప‌డ‌గొట్టగా.. హ‌ర్షిత్ రాణా ఓ వికెట్ సాధించారు.ఎస్ఆర్‌హెచ్ తొలి వికెట్ డౌన్‌.. హెడ్ ఔట్‌201 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఎస్ఆర్‌హెచ్‌కు భారీ షాక్ త‌గిలింది. 4 ప‌రుగులు చేసిన ట్రావిస్ హెడ్‌.. తొలి ఓవ‌ర్‌లోనే వైభ‌వ్ ఆరోరా బౌలింగ్‌లో ఔట‌య్యాడు. క్రీజులోకి ఇషాన్ కిష‌న్ వ‌చ్చాడు.చెల‌రేగిన కేకేఆర్ బ్యాట‌ర్లు.. ఎస్ఆర్‌హెచ్ టార్గెట్ ఎంతంటే?ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాట‌ర్లు చెల‌రేగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవ‌ర్లలో 6 వికెట్ల న‌ష్టానికి 200 ప‌రుగులు చేసింది. కోత్‌క‌తా బ్యాట‌ర్ల‌లో వెంక‌టేశ్ అయ్య‌ర్‌(29 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌ల‌తో 60) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. ర‌ఘువంశీ(50), రింకూ సింగ్‌(32), ర‌హానే(38) కీల‌క ఇన్నింగ్స్‌లు ఆడారు. ఎస్ఆర్‌హెచ్ బౌల‌ర్ల‌లో క‌మ్మిన్స్‌, ష‌మీ, హ‌ర్ష‌ల్ ప‌టేల్‌, క‌మిందు మెండిస్ త‌లా వికెట్ సాధించారు.దూకుడుగా ఆడుతున్న కేకేఆర్‌..17 ఓవ‌ర్లు ముగిసే సరికి కేకేఆర్ నాలుగు వికెట్ల న‌ష్టానికి 149 ప‌రుగులు చేసింది. క్రీజులో వెంక‌టేశ్ అయ్య‌ర్‌(20), రింకూ సింగ్‌(24) ఉన్నారు.కేకేఆర్ నాలుగో వికెట్ డౌన్‌ర‌ఘువ‌న్షి రూపంలో కేకేఆర్ నాలుగో వికెట్ కోల్పోయింది. 50 ప‌రుగులు చేసిన ర‌ఘువ‌న్షి.. క‌మిందు మెండిస్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 14 ఓవ‌ర్లు ముగిసే స‌రికి కేకేఆర్ 4 వికెట్ల న‌ష్టానికి 113 ప‌రుగులు చేసింది. క్రీజులో వెంక‌టేష్ అయ్య‌ర్‌(5), రింకూ సింగ్‌(3) ఉన్నారు.కేకేఆర్ మూడో వికెట్‌.. ర‌హానే ఔట్‌అజింక్య ర‌హానే రూపంలో కేకేఆర్ మూడో వికెట్ కోల్పోయింది. 38 ప‌రుగులు చేసిన ర‌హానే.. జీష‌న్ అన్సారీ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 12 ఓవ‌ర్లు ముగిసే స‌రికి కేకేఆర్ మూడు వికెట్ల న‌ష్టానికి 104 ప‌రుగులు చేసింది. క్రీజులో ర‌ఘువ‌న్షి(49), వెంక‌టేష్ అయ్య‌ర్‌(1) ఉన్నారు.నిల‌క‌డ‌గా ఆడుతున్న ర‌హానే, ర‌ఘువంశీఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయిన కేకేఆర్ నిల‌క‌డ‌గా ఆడుతోంది. 8 ఓవ‌ర్లు ముగిసే స‌రికి కేకేఆర్ రెండు వికెట్ల న‌ష్టానికి 71 ప‌రుగులు చేసింది. క్రీజులో అంగ్క్రిష్ రఘువంశీ(26), అజింక్య ర‌హానే(29) ఉన్నారు.కేకేఆర్‌కు ఆదిలోనే భారీ షాక్‌..టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌కు ఆదిలోనే భారీ షాక్ త‌గిలింది. కేకేఆర్ ఇన్నింగ్స్ రెండో ఓవ‌ర్ వేసిన ప్యాట్ క‌మ్మిన్స్ బౌలింగ్‌లో క్వింట‌న్ డికాక్‌(1) ఔట్ కాగా.. రెండో ఓవ‌ర్‌లో మ‌హ్మ‌ద్ ష‌మీ బౌలింగ్‌లో సునీల్ న‌రైన్‌(7) ఔట‌య్యాడు. మూడు ఓవ‌ర్లు ముగిసే స‌రికి కేకేఆర్ రెండు వికెట్ల న‌ష్టానికి 17 ప‌రుగులు చేసింది. క్రీజులో ర‌హానే(1), ర‌ఘువంశీ(1) ఉన్నారు.ఐపీఎల్‌-2025లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరబాద్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎస్ఆర్‌హెచ్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ రెండు మార్పుల‌తో బ‌రిలోకి దిగింది. తుది జ‌ట్టులోకి క‌మిందు మెండిస్‌, సిమర్‌జీత్ సింగ్ వ‌చ్చారు.తుది జ‌ట్లుసన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీప‌ర్‌), కమిందు మెండిస్, సిమర్‌జీత్ సింగ్, పాట్ కమిన్స్(కెప్టెన్‌), హర్షల్ పటేల్, మహ్మద్ షమీ, జీషన్ అన్సారీ.కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్ (వికెట్ కీప‌ర్‌), సునీల్ నరైన్, అజింక్యా రహానే (కెప్టెన్‌), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, మొయిన్ అలీ, రమణదీప్ సింగ్, ఆండ్రీ రస్సెల్, హర్షిత్ రాణా, వరుణ్ చక్ర‌వ‌ర్తి

BJDs message to MPs on Waqf Bill vote in U turn9
లాస్ట్ మినిట్‌లో వక్ఫ్ బిల్లుపై బీజేడీ యూటర్న్..

ఢిల్లీ: వక్ఫ్ (సవరణ) బిల్లు గురువారం రాజ్యసభ్యలో చర్చకు వచ్చిన సందర్భంలో నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. తొలుత వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నామంటూ అదే రాజ్యసభలో ముందురోజు(బుధవారం) చెప్పిన ‘ద బిజు జనతాదళ్(బీజేడీ).. గురువారం నాటికి వచ్చేసరికి యూటర్న్ తీసుకుంది. ఆ బిల్లుకు సంబంధించి తమ పార్టీ అభ్యర్థులు ఎలాగైనా ఓటేసుకోవచ్చని స్పష్టం చేసింది. వారి( బీజేడీ ఎంపీలు) మనస్సాక్షి ప్రకారం ఓటేసుకోవచ్చంటూ యూ టర్న్ తీసుకుంది. ఇక్కడ తమ ఎంపీలు ఎలా ఓటేసినా అంటే అనుకూలంగా ఓటేసినా ఎటువంటి విప్ జారీ చేయబోమని తేల్చి చెప్పింది. తాము మైనార్టీ వర్గాల సెంటిమెంట్స్ ను గౌరవిస్తామన్న రోజు వ్యవధిలోనే ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం హైడ్రామాకు తెరలేపింది.బీజేడీ తొలుత చెప్పింది ఇదే..‘‘ మేము మైనార్టీల సెంటిమెంట్స్ ను పరిగణలోకి తీసుకుంటాం. మా సభ్యులంతా వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తారు. మాకు లోక్ సభలో ఎంపీలు లేరు.. మాకు రాజ్యసభలో ఉన్న ఏడుగురు సభ్యులు వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగానే ఓటేస్తారు’’ అని పేర్కొంది.మరి మళ్లీ బీజేడీకి ఏమైంది?అయితే రాజ్యసభలో ముందు చెప్పిన మాటకు బీజేడీ కట్టుబడలేదు. తమ ఎంపీలు ఇష్టప్రకారమే ఓటేయొచ్చని తెలిపింది. ‘‘వారు ఫ్రీగా ఓటేసుకోవచ్చు. అనుకూలంగా ఓటేసినా, వ్యతిరేకంగా ఓటేసినా తాము వారికి ఎటువంటి విప్ జారీ చేయం’’ అని తెలిపింది. బీజేడీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆదేశాలతోనే ఆ పార్టీ యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

Tollywood Most Beautiful female actress Upcoming Movies Updates10
అందమైన భామలు... అదిరిపోయే లుక్కులు

సిల్వర్‌ స్క్రీన్‌పై అందంగా మెరిసిపోతుంటారు కథానాయిలు. ఫర్‌ ఎ చేంజ్‌ డీ గ్లామరస్‌గా కనిపించే అవకాశం వస్తే... ‘సై’ అంటారు. అలాంటి పాత్రలు చేసినప్పుడు దక్కే కిక్కే వేరు అంటున్నారు ఈ భామలు. గ్లామర్‌.. డీ గ్లామర్‌... ఏదైనా కొందరు తారలు ప్రస్తుతం అదిరిపోయే లుక్కుల్లో కనిపించడం మాత్రమే కాదు... నటనపరంగానూ విజృంభిస్తున్నారు. అదిరిపోయే లుక్కుల్లో కనిపించనున్న ఆ అందాల భామల గురించి తెలుసుకుందాం.ప్రతీకారంతో... ‘అరుంధతి’, ‘రుద్రమదేవి’, ‘భాగమతి’, ‘నిశ్శబ్దం’ వంటి ఉమెన్ సెంట్రిక్‌ ఫిల్మ్స్‌ చేసిన హీరోయిన్‌ అనుష్కా శెట్టి నటించిన తాజా సినిమా ‘ఘాటీ’. ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ (2023) మూవీ తర్వాత అనుష్క టాలీవుడ్‌లో కమిటైన చిత్రమిది. ‘వేదం’ (2010) వంటి హిట్‌ మూవీ తర్వాత అనుష్క, డైరెక్టర్‌ క్రిష్‌ జాగర్లమూడి కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ‘ఘాటీ’. యూవీ క్రియేషన్స్‌ సమర్పణలో ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్ మెంట్‌ బ్యానర్‌పై రాజీవ్‌ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. ఒడిశాలోని ఒక మహిళ జీవితంలో జరిగిన వాస్తవ ఘటన నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారట.బిజినెస్‌ ఉమన్‌గా సత్తా చాటుతున్న ఆమెను కొందరు కావాలని టార్గెట్‌ చేస్తారు. ఈ కారణంగా వ్యాపారంలో నష్టాలపాలైన ఆ మహిళ అందుకు కారకులైన వారిపై ఎలా ప్రతీకారం తీర్చుకుంది? అనే నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుందని టాక్‌. ఈ చిత్రంలో దేశీ రాజు అనే లీడ్‌ క్యారెక్టర్‌ని తమిళ నటుడు విక్రమ్‌ ప్రభు పోషించారు. అత్యధిక బడ్జెట్‌తో, అత్యున్నత స్థాయి సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో రూపొందిన ‘ఘాటీ’ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీతో సహా పలు భాషల్లో ఈ నెల 18న విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. అయితే ఏప్రిల్‌ ఆరంభమైనా చిత్రయూనిట్‌ ఎలాంటి ప్రమోషన్స్‌ చేపట్టకపోవడంతో విడుదల ఉంటుందా? వాయిదా పడుతుందా? అనే చర్చ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది.ఇటు అమ్మోరు తల్లి... అటు రాక్షసి...ఉమెన్‌ సెంట్రిక్‌ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌లా ఉంటారు నయనతార. అలాగే డిఫరెంట్‌ రోల్స్‌ చేయడంలోనూ ఆమె ముందుంటారు. నటనలో వైవిధ్యం చూపిస్తుంటారు. ప్రస్తుతం నయనతార తమిళంలో ‘మూక్కుత్తి అమ్మన్‌ 2’ చిత్రంలో లీడ్‌ రోల్‌ చేస్తున్నారు. సుందర్‌.సి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమాలో నయనతార అమ్మవారి పాత్రలో కనిపిస్తారు. వేల్స్‌ ఫిల్మ్‌ ఇంటర్‌నేషనల్, అవ్నీ సినీమ్యాక్స్, రౌడీ పిక్చర్స్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. రూ. వంద కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ చెన్నైలో ఇటీవల మొదలైంది. ఇక 2020లో నయనతార లీడ్‌ రోల్‌లో నటించిన తమిళ చిత్రం ‘మూక్కుత్తి అమ్మన్‌’ (తెలుగులో అమ్మోరు తల్లి) సినిమాకు సీక్వెల్‌గా ‘మూక్కుత్తి అమ్మన్‌ 2’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు ‘రాక్కాయీ’ సినిమాలో తన చిన్నారిని రక్షించేందుకు ఎంతటి సాహసాలనైనా చేసే తల్లి పాత్రలో నయనతార నటిస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార గెటప్‌ కొత్తగా ఉంటుంది. సెంథిల్‌ నల్లస్వామి డైరెక్షన్‌లో డ్రమ్‌స్టిక్స్‌ ప్రోడక్షన్, మూవీ వెర్స్‌ ఇండియా సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది.నాగ సాధువుగా...ఓ వైపు హీరోయిన్‌గా, మరో వైపు లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలతో పాటు ప్రత్యేక పాటల్లో సందడి చేస్తున్నారు తమన్నా. ఆమె లీడ్‌ రోల్‌లో నటించిన తాజా చిత్రం ‘ఓదెల 2’. ‘ఓదెల రైల్వేస్టేషన్ ’ (2021)కి సీక్వెల్‌గా ‘ఓదెల 2’ రూపొందింది. తొలి భాగానికి దర్శకత్వం వహించిన అశోక్‌ తేజయే రెండో భాగాన్ని కూడా తెరకెక్కించారు. డైరెక్టర్‌ సంపత్‌ నంది ఈ చిత్రానికి క్రియేటర్‌గా వ్యవహరించారు. తొలి భాగంలో జోడీగా నటించిన హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్‌. సింహా మలిభాగంలోనూ నటించారు. మధు క్రియేషన్స్, సంపత్‌ నంది టీమ్‌ వర్క్స్‌పై డి. మధు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదలవుతోంది. సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో తొలిసారిగా శివశక్తి (నాగ సాధు) పాత్రలో నటించారు తమన్నా. ఓదెల గ్రామానికి ఊహించని కష్టం వస్తుంది. ఆ ఊరిలో కొలువై ఉన్న ఓదెల మల్లన్న స్వామి నాగ సాధు (తమన్నా) పాత్ర ద్వారా ఆ సమస్యని ఎలా పరిష్కరించారు? అనే నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుంది. ఈ సినిమా నుంచి విడుదలైన తమన్నా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌కి అనూహ్యమైన స్పందన వచ్చింది. అలాగే టీజర్‌ సినిమాపై అంచనాలు పెంచింది. పైగా ‘ఓదెల రైల్వేస్టేషన్ ’ సూపర్‌ హిట్‌ కావడంతో ‘ఓదెల 2’పై భారీ అంచనాలున్నాయి. రివాల్వర్‌ పట్టిన రీటా...‘నేను శైలజ’ (2016) సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు కీర్తీ సురేశ్‌. ఆ తర్వాత ‘నేను లోకల్, అజ్ఞాతవాసి, రంగ్‌ దే, సర్కారువారి పాట, దసరా, భోళా శంకర్‌’ వంటి సినిమాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారామె. మహానటి సావిత్రి బయోపిక్‌గా రూపొందిన ‘మహానటి’ (2018) చిత్రానికిగాను ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకున్నారు కీర్తి. ఆమె టైటిల్‌ పాత్రలో నటించిన తాజా చిత్రం ‘రివాల్వర్‌ రీటా’. జేకే చంద్రు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాధికా శరత్‌కుమార్, రెడిన్‌ కింగ్సీ కీలక పాత్రలు పోషించారు.ప్యాషన్‌ స్టూడియోస్‌ అండ్‌ ది రూట్‌ బ్యానర్స్‌ పై సుధన్‌ సుందరం, జగదీష్‌ పళనీస్వామి నిర్మించారు. కామెడీ నేపథ్యంలో సాగే యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ ఇది. సాధారణ జీవితం గడుపుతున్న ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన రీటా అనుకోని పరిస్థితుల్లో తుపాకీ చేతపట్టాల్సి వస్తుంది. ఆ తర్వాత ఆమె ఎదుర్కొన్న సవాళ్లేంటి? అనేది ఈ సినిమాలో ఆసక్తిగా ఉంటుందని చిత్ర యూనిట్‌ పేర్కొంది. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా తెలుగు విడుదల హక్కులను హాస్య మూవీస్‌ అధినేత, నిర్మాత రాజేశ్‌ దండా సొంతం చేసుకున్నారు.డీ గ్లామరస్‌గా బుట్టబొమ్మ... తెలుగు తెరపై బుట్టబొమ్మలా పూజా హెగ్డే ఎంతో అందంగా కనిపించారు. ఎన్నో గ్లామరస్‌ రోల్స్‌ కూడా చేశారు. కానీ రొటీన్‌కి డిఫరెంట్‌గా పూజా హెగ్డే తొలిసారిగా ఓ డీ గ్లామరస్‌ రోల్‌ చేశారు. సూర్య హీరోగా కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన పీరియాడికల్‌ లవ్‌ అండ్‌ యాక్షన్‌ డ్రామా ఫిల్మ్‌ ‘రెట్రో’. ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించారు. ఈ ‘రెట్రో’ మూవీలోనే పూజా హెగ్డే డీ గ్లామరస్‌ రోల్‌ చేశారు. స్టోన్‌ బెంచ్‌ క్రియేషన్స్, 2డీ ఎంటర్‌టైన్మెంట్‌ సంస్థలు నిర్మించిన ‘రెట్రో’ మే1న విడుదల కానుంది. ఇంకా రాఘవా లారెన్స్‌ సక్సెస్‌ఫుల్‌ హారర్‌ ఫ్రాంచైజీ ‘కాంచన’ లేటెస్ట్‌ మూవీ ‘కాంచన 5’లో పూజా హెగ్డే ఘోస్ట్‌ రోల్‌ చేస్తున్నారని కోలీవుడ్‌ సమాచారం. ఇదే నిజమైతే... పూజాకు ఈ రోల్, గెటప్‌ కూడా సరికొత్తదే.సీతగా సాయిపల్లవి... పల్లెటూరి అమ్మాయిలా, స్టూడెంట్‌లా... ఇలా హీరోయిన్‌ సాయిపల్లవి ఇప్పటివరకు విభిన్నమైన పాత్రలు చేశారు. కానీ ఇప్పటివరకు ‘రామాయణం, మహాభారతం’ వంటి ఇతిహాసాల నేపథ్యంలో రూపొందిన సినిమాల్లో సాయి పల్లవి స్క్రీన్‌పై కనిపించలేదు. అయితే సీతగా సాయిపల్లవి ఎంత అద్భుతంగా వెండితెరపై మెరిసిపోతారో, వచ్చే ఏడాది దీపావళికి సిల్వర్‌ స్క్రీన్‌పై చూడొచ్చు. రామాయణం ఆధారంగా బాలీవుడ్‌ దర్శకుడు నితీష్‌ తివారి ‘రామాయణ’ మూవీ తీస్తున్నారు.ఈ చిత్రంలో రాముడి పాత్రలో రణ్‌బీర్‌ కపూర్, సీతగా సాయిపల్లవి నటిస్తున్నారు. లక్ష్మణుడిగా రవిదుబే, హనుమంతుని పాత్రలో సన్నీ డియోల్, రావణుడిగా యశ్‌ నటిస్తున్నారని సమాచారం. నితీష్‌ మల్హోత్రా, యశ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళి సందర్భంగా రిలీజ్‌ కానున్నాయి. ఈ సంగతి ఇలా ఉంచితే... బాలీవుడ్‌లో సాయిపల్లవి నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం. అలాగే హిందీలో సాయి పల్లవి ‘ఏక్‌ దిన్‌’ అనే లవ్‌స్టోరీ మూవీ కూడా చేశారు. ఆమిర్‌ ఖాన్‌ తనయుడు జూనైద్‌ ఖాన్‌ నటించిన ఈ చిత్రం విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదు.మహిళల చుట్టూ పరదా...అనుపమా పరమేశ్వరన్ కూడా జోరుమీదున్నారు. అటు హీరోయిన్‌గా, ఇటు లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారామె. తాజాగా ఆమె లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘పరదా’. ‘ఇన్ ద నేమ్‌ ఆఫ్‌ లవ్‌’ అనేది ఉపశీర్షిక. ‘సినిమా బండి’ మూవీ ఫేమ్‌ ప్రవీణ్‌ కాండ్రేగుల దర్శకత్వం వహించారు. దర్శనా రాజేంద్రన్, సంగీత ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఆనంద మీడియాపై విజయ్‌ డొంకాడ, శ్రీనివాసులు పీవీ, శ్రీధర్‌ మక్కువ నిర్మించిన ఈ మూవీ త్వరలో విడుదల కానుంది. వైవిధ్యమైన సోషియో డ్రామా, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో సుబ్బు పాత్రలో నటించారు అనుపమ. ఆమె పుట్టినరోజు (ఫిబ్రవరి 18) సందర్భంగా చిత్రబృందం ఓ ప్రత్యేక వీడియోను రిలీజ్‌ చేసింది. ‘పరదాలమ్మా పరదాలు... రంగురంగుల పరదాలు... డిజైనర్‌ పరదాలు.... తీసుకోవాలమ్మా తీసుకోవాలి’ అంటూ అనుపమ చెప్పే డైలాగులకి మంచి స్పందన వచ్చింది. మహిళల చుట్టూ సాగే కథాంశంతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళుతుందని యూనిట్‌ పేర్కొంది. త్వరలో ఈ మూవీ రిలీజ్‌ డేటిని ప్రకటించనున్నారు మేకర్స్‌. స్వారీకి సై...‘భీమ్లా నాయక్‌’ (2022) చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు సంయుక్త. ఆ తర్వాత ‘బింబిసార, సార్, విరూపాక్ష’ వంటి హిట్‌ సినిమాల్లో నటించారామె. ప్రస్తుతం తెలుగులోనూ చేతి నిండా ప్రాజెక్టులతో దూసుకెళుతున్నారు. ‘స్వయంభూ, నారి నారి నడుమ మురారి, హైందవ, అఖండ 2: తాండవం’ వంటి తెలుగు చిత్రాల్లో హీరోయిన్‌గా నటిస్తున్నారామె. అదే విధంగా తొలిసారి ఓ లేడీ ఓరియంటెడ్‌ సినిమాలోనూ నటిస్తున్నారు.ఇదిలా ఉంటే... నిఖిల్‌ హీరోగా భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘స్వయంభూ’. ఠాగూర్‌ మధు సమర్పణలో భువన్, శ్రీకర్‌ పాన్‌ ఇండియా స్థాయిలో ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో యోధుడి పాత్ర కోసం నిఖిల్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ , గుర్రపు స్వారీలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. భారీ యుద్ధ సన్నివేశాలు ఉన్న ఈ మూవీలో సంయుక్త కూడా పోరాట సన్నివేశాలు చేయాల్సి ఉందట. ఈ స్టంట్స్‌ చేయడానికి గుర్రపు స్వారీ నేర్చుకున్నారు సంయుక్త. మరి.. ఆమె పోరాటాలు ఏ స్థాయిలో ఉంటాయో తెలియాలంటే సినిమా విడుదల వరకూ వేచి చూడాలి. ఇదిలా ఉంటే... సంయుక్త టిస్తున్న తొలి హిందీ చిత్రం ‘మహారాజ్ఞి–క్వీన్‌ ఆఫ్‌ క్వీన్స్‌’. ఈ మూవీకి చరణ్‌ తేజ్‌ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే మోహన్‌లాల్‌ హీరోగా రూపొందుతోన్న మలయాళ చిత్రం ‘రామ్‌’లోనూ నటిస్తున్నారు సంయుక్త. యువరాణి పంచమి‘సవ్యసాచి’ (2018) సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నిధీ అగర్వాల్‌. ‘మిస్టర్‌ మజ్ను, ఇస్మార్ట్‌ శంకర్, హీరో’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఆమె నటించిన తాజా చిత్రం ‘హరి హర వీరమల్లు: పార్ట్‌–1 స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌’. పవన్‌ కల్యాణ్‌ హీరోగా జ్యోతి కృష్ణ, క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహించారు.నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రోడక్షన్స్పై ఎ. దయాకర్‌ రావు నిర్మించిన ఈ మూవీ మే 9న విడుదల కానుంది. పీరియాడిక్‌ యాక్షన్ అడ్వెంచర్‌ మూవీగా రూపొందిన ‘హరి హర వీరమల్లు’లో చారిత్రాత్మక యోధుడు వీరమల్లు పాత్రలో పవన్‌ కల్యాణ్‌ నటించగా.. పంచమి అనే యువరాణి పాత్రలో నిధీ అగర్వాల్‌ సరికొత్తగా కనిపించనున్నారు. ఆమె పాత్రకు చాలాప్రాధాన్యం ఉంటుందట. ఈ కథానాయికలే కాదు... ఇంకొందరు కూడా వైవిధ్యమైన పాత్రల్లో కనిపించి, మెప్పించనున్నారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement