
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు
సాక్షి, బయ్యారం (మహబూబాబాద్): పోడుసాగు చేస్తున్న తమను అటవీ అధికారులు అక్రమంగా శనివారం రాత్రంతా నిర్బంధించి దాడిచేశారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన మండలంలో ఆదివారం సంచలనంగా మారింది. బాధితుల కథనం ప్రకారం.. మండలంలోని గురిమెళ్ల గ్రామ సమీపంలో మానుకోట మండలం సండ్రలగూడెం గ్రామానికి చెందిన 50 మందికి పోడు భూములున్నాయి. ఈ భూములను అటవీహక్కుల చట్టానికి ముందు నుంచి సాగు చేసుకుంటున్నట్లు బాధిత రైతులు చెబుతున్నారు.
ఈ క్రమంలో శనివారం పోడు భూముల్లో సాగు చేస్తున్న పంటల వద్దకు సండ్రలగూడెం గ్రామానికి చెందిన గలిగె సాయిలు, పొడుగు రమేష్, గలిగె భిక్షపతి, గలిగె బాలక్రిష్ణ, రెడ్డబోయిన రంజాన్ వెళ్లారు. ఈ సమయంలో అటవీ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకుని బయ్యారం తీసుకొచ్చారు. రాత్రంతా కార్యాలయంలోనే ఉంచి తమను కొట్టినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం గ్రామస్తులు అటవీశాఖ కార్యాలయానికి రావటంతో కాగితం రాయించుకుని ఇంటికి పంపించారు. కాగా అటవీశాఖాధికారుల దాడిలో గాయపడ్డ బాధితులను బంధువులు చికిత్స నిమిత్తం మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతున్నట్లు బాధితులు తెలిపారు.
ఆదివాసులను టార్గెట్ చేసి వేధిస్తున్నారు
పోడుభూములను ఆదివాసీలతో పాటు బంజారాలు, ఇతర కులాల వారు సాగు చేస్తున్నప్పటికీ అటవీ అధికారులు ఆదివాసీలనే టార్గెట్ చేసి వేధిస్తున్నారు. సండ్రలగూడెంకు చెందిన ఐదుగురు రైతులను రాత్రంతా నిర్బంధించి కొట్టడం సరికాదు. ఈ విషయంపై ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని బాధితులకు న్యాయం చేయాలి.
- వీసం వెంకటేశ్వర్లు, తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు
ప్లాంటేషన్‌లో చెట్లను తొలగిస్తుండగా పట్టుకున్నాం
గురిమెళ్ల సమీపంలో తాము నాటిన జమాయిల్ ప్లాంటేషన్‌లోని 10 ఎకరాల్లో జమాయిల్ మొక్కలను శనివారం సండ్రలగూడెంకు చెందిన వారు పీకేస్తుండగా సమాచారం అందింది. దీంతో అధికారులు అక్కడికి చేరుకుని ఐదుగురు దొరకగా మిగతావారు పరారయ్యారు. దొరికిన వారిని బయ్యారంలోని అటవీశాఖ కార్యాలయంకు శనివారం రాత్రి తీసుకువచ్చాం. ఆదివారం గ్రామస్తులు వచ్చి మరోసారి ఇలా చేయమని రాసి ఇచ్చారు. దీంతో అదుపులో ఉన్న వారితో పాటు మరికొందరిపై పోలీసులకు ఫిర్యాదు చేసి వదిలిపెట్టాం. తప్పు ఒప్పుకునన వారే అటవీశాఖాధికారులు దాడిచేసి గాయపరిచారని తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదు.
– కర్నావత్ వెంకన్న, అటవీశాఖాధికారి, బయ్యారం