
సాక్షి, హైదరాబాద్: రక్షణరంగంలో కీలక విభాగమైన మిస్సైల్స్ అండ్ స్ట్రాటజిక్ సిస్టమ్స్ (ఎమ్‌ఎస్‌ఎస్)కు డైరెక్టర్ జనరల్ (డీజీ)గా ప్రముఖ శాస్త్రవేత్త ఎమ్మెస్సార్ ప్రసాద్ (57) నియమితులయ్యారు. ఆయన ఐఐటీ మద్రాస్‌లో బీటెక్, బాంబే ఐఐటీ నుంచి ఎరోనాటికల్ ఇంజనీరింగ్ విభాగంలో ఎంటెక్ పూర్తి చేశారు. అనంతరం 1984లో డీఆర్‌డీవోలో చేరి మిస్సైల్ టెక్నాలజీలో కీలక శాస్త్రవేత్తగా ఎదిగారు. జలాంతర్గాముల నుంచి ప్రయోగించే పలు క్షిపణుల తయారీలో ఆయన ప్రధాన భూమిక పోషించారు. ఆయన ఆవిష్కరణలకు గుర్తింపుగా 2003, 2007, 2011లో డీఆర్‌డీవో పలు అవార్డులతో సత్కరించింది. మిసైల్ స్ట్రాటజిక్ ప్రోగ్రామ్‌లో ఆయన చేసిన విశేష కృషికి 2014లో బెస్ట్ ఇన్నోవేటివ్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ అవార్డు కూడా అందుకున్నారు.