
సాక్షి, హైదరాబాద్: ఉల్లి కొరత మరో 3 వారాల వరకు ఉంటుందని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ వర్గాలు అంటున్నాయి. ఈజిప్ట్ నుంచి కేంద్ర ప్రభుత్వం 6,090 టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకుంటోంది. అందులో 500 టన్నులు సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విన్నవించింది. ఈ మేరకు వారం రోజుల్లో రాష్ట్రానికి ఉల్లి వచ్చే అవకాశముందని అధికారులు అంటున్నారు. కాగా, రాష్ట్రంలో ఉల్లి ధరలను నియంత్రించేందుకు మార్కెటింగ్ శాఖ చర్యలు చేపట్టింది. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్, మెహిదీపట్నం రైతు బజార్లలో కిలో ఉల్లి రూ.40కే విక్రయించేలా ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే.
ఆధార్ కార్డు చూపించిన వారికి రోజూ సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు విక్రయించనున్నారు. కొరతను వ్యాపారులు అవకాశంగా తీసుకొని ఇష్టారాజ్యంగా ధరలు పెంచకుండా చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.ప్రస్తుతం తెలంగాణలో ఉల్లిపాయ ఫస్ట్ క్వాలిటీ ధర క్వింటాలుకు రూ.4 వేల నుంచి రూ.8 వేలకు పెరిగింది. కర్ణాటక, కర్నూలు నుంచి వచ్చే రెండో క్వాలిటీ ధర రూ.3,700 నుంచి రూ.6,000కు గరిష్టంగా పెరిగింది. కాగా,ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా రావడం వల్ల ఉల్లి విత్తనాలు వేయడంలో మూడు, నాలుగు వారాలు ఆలస్యమైంది. దీంతో ఖరీఫ్ ఉల్లిపాయ సాగు విస్తీర్ణం తగ్గింది.
మన రాష్ట్రంలో ఖరీఫ్‌లో 10 వేల ఎకరాల్లోపే ఉల్లి సాగవుతుంది. కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి రాష్ట్రానికి ఉల్లి దిగుమతి అవుతోంది. ఆయా రాష్ట్రాల్లోనూ ఆలస్యపు రుతుపవనాల వల్ల విస్తీర్ణం తగ్గింది. కోత సీజన్‌లో అకాల వర్షాలు ఉల్లి పంటను దెబ్బతీశాయి. సెప్టెంబర్–అక్టోబర్ కాలంలో కురిసిన వర్షాల వల్ల ఉల్లి రవాణాపైనా ప్రభావం పడింది. దీంతో ఉల్లి కొరత ఏర్పడింది.