ప్రభుత్వ పథకాలను దుర్వినియోగం చేస్తూ పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అవకతవకలకు పాల్పడుతున్నారని.........
టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు
పెద్దపల్లిరూరల్: ప్రభుత్వ పథకాలను దుర్వినియోగం చేస్తూ పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అవకతవకలకు పాల్పడుతున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు ఆరోపించారు. మిషన్‌కాకతీయ పెద్దపల్లిలో కమీషన్ కాకతీయగా మారిందని విమర్శించారు. పెద్దపల్లిలో శుక్రవారం పార్టీ మండలాధ్యక్షుడు ఎడెల్లి శంకర్ అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజాసమస్యలు పక్కన పెట్టిన స్థానిక ఎమ్మెల్యే కోట్ల రూపాయల మిషన్ కాకతీయ పనులను బినామీలకు అప్పగిస్తూ కాంట్రాక్టర్ అవతారమెత్తారని ఆరోపించారు. ఈ ప్రాంతం నుంచే గోదావరిజలాలు హైదరాబాద్ తీసుకెళ్తానన్న సీఎం కేసీఆర్ తన సొంత నియోజకవర్గానికి నీటిని తరలించుకుపోతున్నా ఇక్కడి ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదన్నారు.
సుల్తానాబాద్‌లో పైపును తొలగించి చెరువు నింపింది తానేనని చెప్పినా.. కార్యకర్తలపై కేసులు నమోదు చేయడం సరికాదన్నారు. తాము పైపులను ధ్వంసం చేయడం వల్లే అప్పన్నపేట వద్ద సంపులోకి గోదావరి జలాలు వదిలే ఏర్పాట్లు చేస్తున్నారని విజయ్ అన్నారు. 42 కిలోమీటర్ల పైపులైన్ ఇక్కడి భూముల నుంచే వెళ్తోందని, ఎల్లంపల్లి నీటిని అప్పన్నపేట, పెద్దపల్లి, గర్రెపల్లి, సుల్తానాబాద్ చెరువుల్లోకి వదలాలని డిమాండ్ చేశారు.
నష్టాల్లో ఉందంటూ తెలంగాణ ఆర్టీసీని మూసేస్తామని సీఎం ప్రకటించడం దారుణమన్నారు. ఆర్టీసీ కార్మికులను క్రమబద్ధీకరిస్తామని, డ్రైవర్, కండక్టర్లను నాలుగో తరగతి ఉద్యోగులుగా పరిగణిస్తామని హామీ ఇచ్చిన సీఎం మాట మార్చడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. సమావేశంలో నగరపంచాయతీ వైస్‌చైర్మన్ నూగిళ్ల మల్లయ్య, నాయకులు ఉప్పురాజు, బొడ్డుపల్లి శ్రీను, సంపత్, అశోక్, కుమారస్వామి, కోనేరు వినాయకరావు, జగదీశ్, అక్కపాక తిరుపతి, రంగయ్య, కొమ్ము శ్రీనివాస్, ప్రశాంత్ పాల్గొన్నారు.