15  ఏళ్లుగా బిల్లేది? | Water taking from the AMRP | Sakshi
Sakshi News home page

15  ఏళ్లుగా బిల్లేది?

Published Tue, Sep 17 2019 3:02 AM | Last Updated on Tue, Sep 17 2019 3:02 AM

Water taking from the AMRP - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ బిల్లులు కట్టడంలో హైదరాబాద్‌ జలమండలి చేస్తున్న నిర్లక్ష్యం నీటి పారుదల శాఖ పాలిట శాపంగా మారింది. ఏఎంఆర్‌పీ ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు నీటిని సరఫరా చేస్తుండగా, దాన్ని వినియోగించుకుంటున్న జలమండలి మాత్రం కరెంట్‌ బిల్లులు కట్టట్లేదు. ఏకంగా 15 ఏళ్లుగా కరెంట్‌ బిల్లులు కట్టకపోవడంతో అవి రూ.776 కోట్లకు పేరుకుపోయాయి. కరెంట్‌ బిల్లులు కట్టాలంటూ ట్రాన్స్‌కో అధికారులు నీటిపారుదల శాఖ ఇంజనీర్ల క్యాంపు కార్యాలయాలకు కరెంట్‌ కట్‌ చేస్తున్నారు.

24 లేఖలు రాసినా..
నాగార్జునసాగర్‌ ఫోర్‌షోర్‌ పుట్టంగండి పంపింగ్‌ స్టేషన్‌ నుంచి హైదరాబాద్‌ తాగునీటికి ఏటా 16.5 టీఎంసీల మేర నీరు వినియోగించుకునేలా ఆదేశాలుండగా, రోజూ 525 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. దీనికయ్యే విద్యుత్‌ బిల్లును అధికారులు నీటిపారుదల శాఖకే పంపిస్తున్నారు. వాస్తవానికి ఈ మొత్తాన్ని జలమండలికి నీటిపారుదల శాఖకు చెల్లించాలి. అయితే 15 ఏళ్లుగా జలమండలి పూర్తి స్థాయిలో బిల్లులు చెల్లించట్లేదు. దీనిపై నీటిపారుదల శాఖ 24 లేఖలు రాసినా జలమండలి స్పందించలేదు.

మరోపక్క బిల్లులు చెల్లించకుంటే క్యాంపు కార్యాలయాలకు కరెంట్‌ కట్‌ చేస్తామని ట్రాన్స్‌కో అధికారులు నీటిపారుల శాఖకు నోటీసులు పంపిస్తున్నారు. దీంతో 2004 నుంచి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, మొత్తం రూ.776.45 కోట్ల బిల్లులు చెల్లించాలని నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు చీఫ్‌ ఇంజనీర్‌ నరసింహా.. జలమండలికి లేఖ శనివారం రాశారు. బిల్లులు కట్టకపోవడంతో ఏఎంఆర్‌పీ క్యాంపు కార్యాలయానికి విద్యుత్‌ శాఖ కరెంట్‌ కట్‌ చేస్తోందని పేర్కొన్నారు. పుట్టంగండి పంపింగ్‌ స్టేషన్‌కు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయే అవకాశం ఉందని.. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా బిల్లులు చెల్లించాలని కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement