global head
-
కాగ్నిజెంట్ గ్లోబల్ హెడ్‌గా శైలజ జోస్యుల
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ సర్వీస్ లైన్ గ్లోబల్ హెడ్‌గా శైలజ జోస్యుల నియమితులయ్యారు. కంపెనీ అంతర్జాతీయ జీసీసీ ప్రణాళికల అమలుకు ఆమె తోడ్పడనున్నారు. గతంలో కాగ్నిజెంట్‌లో ఆరేళ్లు పని చేసిన శైలజ, కొద్ది విరామం తర్వాత తిరిగొచ్చారు.ఆర్థిక సేవల మార్కెట్లో ఆమెకు అపార అనుభవం ఉందని కాగ్నిజెంట్ అమెరికాస్ ప్రెసిడెంట్ సూర్య గుమ్మడి తెలిపారు. నిరూపితమైన ట్రాక్ రికార్డుతో, శైలజ నాయకత్వం జీసీసీల ఏర్పాటు, అభివృద్ధిలో తమ సామర్థ్యాన్ని పెంచుతుందని, క్లయింట్లకు గొప్ప విలువను అందిస్తుందని పేర్కొన్నారు.ఈవైలో కొంతకాలం పనిచేసిన తర్వాత జోస్యుల తిరిగి కాగ్నిజెంట్‌లో చేరారు. 2018 నుంచి 2024 వరకు కాగ్నిజెంట్‌లో హైదరాబాద్ సెంటర్ హెడ్‌గా, బీఎఫ్ఎస్ఐ ఆపరేషన్స్ డెలివరీ గ్లోబల్ హెడ్‌గా సేవలందించారు. దాదాపు 30 ఏళ్ల అనుభవం ఉన్న ఆమె థామ్సన్ రాయిటర్స్, హెచ్ఎస్బీసీల్లో నాయకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. -
భారత్ ఏఐకి అనుకూలం
న్యూఢిల్లీ: కృత్రిమ మేథ (ఏఐ) అభివృద్ధికి భారత్‌లో అనువైన పరిస్థితులు ఉన్నాయని టెక్ దిగ్గజం గూగుల్ గ్లోబల్ హెడ్ (గవర్నమెంట్ అఫైర్స్, పబ్లిక్ పాలసీ) కరణ్ భాటియా తెలిపారు. దేశీయంగా ఫౌండేషన్ మోడల్స్‌ను రూపొందించుకోవాలన్న భారత్ ఆకాంక్షలను సాకారం చేసేందుకు గూగుల్ తోడ్పాటు అందిస్తుందని పేర్కొన్నారు. ఇటీవల నిర్వహించిన గ్లోబల్ సర్వే ప్రకారం ఎకానమీపై ఏఐ సానుకూల ప్రభావాలు అంతర్జాతీయ సగటుతో పోలిస్తే భారత్‌లోనే ఎక్కువగా ఉంటాయని వెల్లడైనట్లు భాటియా చెప్పారు. దేశీయంగా పలు భాషలు ఉన్నందున స్థానిక పరిస్థితులకు అనుగుణమైన సాధనాలను రూపొందించడం కోసం దేశీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. వీటి రూపకల్పనలో గూగుల్ కూడా ముఖ్యపాత్ర పోషించగలదని వివరించారు.ఇప్పటికే ఐఐఎస్సీతో కలిసి ’ప్రాజెక్ట్ వాణి’పై పని చేస్తున్నామని, గూగుల్ ట్రాన్స్‌లేట్‌ను ప్రవేశపెట్టామని భాటియా వివరించారు. -
ఇన్ఫోసిస్‌కు మరో సీనియర్ అధికారి గుడ్‌బై
బెంగళూరు: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో సీనియర్ స్థాయి అధికారుల రాజీనామాల పరంపర కొనసాగుతోంది. తాజాగా సంస్థ గ్లోబల్ హెడ్ (ఎనర్జీ, యుటిలిటీస్, రిసోర్సెస్, సర్వీసెస్ విభాగం) సుదీప్ సింగ్ రాజీనామా చేశారు. సింగ్ సారథ్యంలో ఈ విభాగం ఆదాయం 100 మిలియన్ డాలర్ల నుంచి 750 మిలియన్ డాలర్లకు చేరింది. సుదీప్ రాజీనామాపై స్పందించేందుకు ఇన్ఫీ నిరాకరించింది. కన్సల్టింగ్ విభాగం గ్లోబల్ హెడ్ కెన్ టూంబ్స్ గతేడాది అక్టోబర్‌లో వైదొలిగారు. అంతకు ముందు ఆగస్టులో మరో కీలకమైన అధికారి ఎం.డీ.రంగనాథ్ కూడా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పదవి నుంచి తప్పుకున్నారు. -
టెక్‌మహీంద్రా మొబైల్ జాబ్ ప్లాట్‌ఫామ్
న్యూఢిల్లీ: ఐటీ సేవల దిగ్గజం టెక్ మహీంద్రా.. ఉద్యోగార్థుల కోసం జాతీయ స్థాయిలో మొబైల్ జాబ్ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేసింది. ఇందుకోసం జాతీయ స్థాయిలో సరల్ రోజ్‌గార్ కార్డులను ప్రవేశపెట్టినట్లు బుధవారం ప్రకటించింది. రూ. 50 వెచ్చించి ఈ సరల్ రోజ్‌గార్ కార్డును కొనుగోలు చేయడం ద్వారా సర్వీసులను పొందవచ్చని పేర్కొంది. తదనంతరం 1860-180-1100 నంబర్‌కు డయల్ చేసి తమకు నచ్చిన భాషలో వాయిస్‌కాల్ ద్వారా భారత్‌లోని ఏ ప్రదేశం నుంచైనా ఉద్యోగార్ధులు రిజిస్టర్ చేసుకోవచ్చని టెక్ మహీంద్రా మొబిలిటీ బిజినెస్ హెడ్ జగదీశ్ మిత్రా వెల్లడించారు. ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలు, గ్రాడ్యుయేట్ కంటే కింది స్థాయిలోని(దినసరి వేతనంతో పనిచేసే వర్కర్లు, ఎంట్రీలెవెల్) కొలువుల కోసం వేచిచూసే అభ్యర్థుల మధ్య అనుసంధానకర్తగా ఈ మొబైల్ జాబ్ మార్కెట్ ప్లేస్ పనిచేస్తుందని కంపెనీ వెల్లడించింది. అంతేకాకుండా కార్పొరేట్, ప్రధాన కంపెనీలకు తమ అర్హతలను సరైన రీతిలో తెలియజేసేందుకు వీలుగా తొలిసారి రెస్యూమెలను రూపొందించుకునేవారికి తాము సహకారం కూడా అందిస్తామని మిత్రా చెప్పారు. చిన్న, మధ్యతరహా సంస్థలు(ఎస్ఎంఈలు)/ఎంట్రప్రెన్యూర్స్ కూడా ఈ సేవల ద్వారా రిజిస్టర్ అయినవారికి వాయిస్ కాల్స్ ద్వారా సంప్రదించే అవకాశం ఉందని ఆయన వివరించారు. ప్రస్తుతం 100కుపైగా ఉద్యోగ విభాగాల్లో లక్షకు పైబడి జాబ్స్ సరల్ రోజ్‌గార్ ద్వారా అందుబాటులో ఉన్నాయని టెక్ మహీంద్రా వైస్‌ప్రెసిడెంట్(మొబిలిటీ, వ్యాస్ ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియో) వివేక్ చందోక్ చెప్పారు. రిటైల్, అకౌంటింగ్, టైలర్, ఎలక్ట్రీషియన్, మెషీన్ ఆపరేటర్, కుక్స్, సెక్యూరిటీగార్డులు, డెలివరీ బాయ్స్ వంటి కేటగిరీల్లో డిమాండ్ అధికంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. దేశవ్యాప్తంగా లక్షకు పైగా టెలికం రీచార్జ్ సేవలందించే రిటైల్ అవుట్‌లెట్స్ వద్ద ఈ సరల్ రోజ్‌గార్ కార్డులు లభిస్తాయని చందోక్ తెలిపారు.