
మరో 43 కోట్ల ఈ–కేవైసీ లావాదేవీలు
ఫిబ్రవరి నెలలో నమోదు
న్యూఢిల్లీ: డిజిటల్ లావాదేవీలకు ఆధార్ కీలకంగా మారుతోంది. ఫిబ్రవరి నెలలో ఆధార్ ఆధారిత ధ్రువీకరణ లావాదేవీలు 225 కోట్లుగా ఉన్నాయి. ఆధార్ ఆధారిత ఈ–కేవైసీ లావాదేవీలు మరో 43 కోట్లు జరిగాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇతర రంగాల్లో ఆధార్ ఆధారిత ధ్రువీకరణకు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఆధార్ ధ్రువీకరణలు మెరుగైన కస్టమర్ అనుభవానికి తోడ్పడుతున్నట్టు ప్రభుత్వ ప్రకటన తెలిపింది.
ఆధార్ ఆధారిత ఈ–కేవైసీ లావాదేవీలు గతేడాది ఫిబ్రవరి గణాంకాలతో చూస్తే 14 శాతం పెరిగాయి. ఇక 2025 ఫిబ్రవరి నాటికి మొత్తం మీద ఆధార్ ధ్రువీకరణ లావాదేవీలు 14,555 కోట్లను అధిగమించాయి. అలాగే ఇప్పటి వరకు నమోదైన ఆధార్ ఆధారిత ఈ–కేవైసీ లావాదేవీలు 2,311 కోట్లకు చేరాయి. ఆధార్ ముఖ గుర్తింపు ధ్రువీకరణలకూ ఆదరణ పెరుగుతోంది. ఫిబ్రవరిలో ఇలాంటివి 12.54 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి.
2021 ఫిబ్రవరిలో ఆధార్ ముఖ గుర్తింపు ధ్రువీకరణను ప్రవేశపెట్టగా.. అప్పటి నుంచి చూస్తే నెలవారీ గరిష్ట లావాదేవీలు ఫిబ్రవరిలోనే నమోదు కావడం గమనార్హం. ఇప్పటి వరకు మొత్తం ముఖ గుర్తింపు ధ్రువీకరణ లావాదేవీలు 115 కోట్లకు చేరాయి. ఇందులో 87 కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే నమోదు కావడం గమనార్హం. కోటక్ మహీంద్రా ప్రైమ్, ఫోన్‌పే, కరూర్ వైశ్యా బ్యాంక్, జేఅండ్‌కే బ్యాంక్ ముఖ గుర్తింపు ధ్రువీకరణ కోసం కొత్తగా అనుమతి పొందాయి. ఇప్పటి వరకు మొత్తం 97 సంస్థలకు ఇందుకు అనుమతి లభించింది.