
పూర్తి అనుబంధ సంస్థ ఆదిత్య బిర్లా ఫైనాన్స్‌ను విలీనం చేసుకునే ప్రక్రియ పూర్తయినట్లు ఆదిత్య బిర్లా క్యాపిటల్ (ఏబీసీఎల్) వెల్లడించింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) ఆదేశాల మేరకు ఇది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చినట్లవుతుందని పేర్కొంది.
ఆదిత్య బిర్లా ఫైనాన్స్‌ను మాతృ సంస్థలో విలీనం చేయాలని గతేడాది మార్చిలో నిర్ణయం తీసుకున్నారు. విలీన సంస్థకు ఎండీ, సీఈవోగా విశాఖ మూల్యే, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా రాకేశ్ సింగ్ వ్యవహరిస్తారు. దీంతోపాటు నగేష్ పింగే, సునీల్ శ్రీవాస్తవ్ లను కంపెనీ ఇండిపెండెంట్ డైరెక్టర్లుగా నియమించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.
2024 డిసెంబర్ 31 నాటికి రూ .5.03 లక్షల కోట్లకుపైగా ఆస్తులు ఏబీసీఎల్ నిర్వహణలో ఉన్నాయి. వీటిలో రూ .1.46 లక్షల కోట్లకు పైగా ఏకీకృత రుణాలు ఉన్నాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో 9 నెలల కాలంలో కంపెనీ జీవిత, ఆరోగ్య బీమా వ్యాపారాలలో రూ .16,942 కోట్ల స్థూల ప్రీమియంను ఆర్జించింది. అదే సమయంలో రూ.28,376 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయాన్ని, రూ.2,468 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని ఆర్జించింది. 2024 డిసెంబర్ 31 నాటికి కంపెనీ అన్ని వ్యాపారాలలో 1,482 శాఖలు, 2 లక్షలకు పైగా ఏజెంట్లు / ఛానల్ భాగస్వాములతో పాటు అనేక బ్యాంక్ భాగస్వాములతో దేశవ్యాప్త ఉనికిని కలిగి ఉంది.