
కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ‘స్టార్టప్ మహాకుంబ్ 2025’లో చేసిన వ్యాఖ్యలు భారత స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో చర్చకు దారితీశాయి. సంస్థలు డీప్‌టెక్ ఇన్నోవేషన్‌పై దృష్టి సారించడం లేదని, ఈ విభాగానికి వెంచర్ క్యాపిటల్ (వీసీ) నిధులు తగ్గిపోతున్నాయన్నారు. 2023లో డీప్‌టెక్ వీసీ ఒప్పందాల్లో 11%, పెట్టుబడి విలువలో 13% వాటాను కలిగి ఉన్నాయని, అయితే ఈ గణాంకాలు 2024లో వరుసగా 9%, 6%కు పడిపోయాయని తెలిపారు. 2025 ప్రారంభం నాటికి డీప్‌టెక్ వెంచర్లు మొత్తం వీసీ పెట్టుబడుల్లో 9% మాత్రమే ఆకర్షించాయని పేర్కొన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, బయోటెక్నాలజీ, అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ వంటి అద్భుతమైన టెక్నాలజీలపై దృష్టి సారించే డీప్‌టెక్ రంగంలోని స్టార్టప్‌లు వెంచర్ క్యాపిటలిస్టులను ఆకర్షించడంలో సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఈ విభాగంలోని స్టార్టప్‌లు తమ విలువను ప్రదర్శించడానికి, నష్టాలను తగ్గించడానికి పెట్టుబడిదారుల ప్రాధాన్యతలకు అనుగుణంగా వ్యూహాత్మక చర్యలను అవలంబించాలి. వెంచర్ క్యాపిటలిస్టులను ఆకర్షించడానికి ఈ రంగంలోని స్టార్టప్‌లు ఎలాంటి విధానాలు అనుసరించాలో నిపుణులు సూచిస్తున్నారు.
సాంకేతిక, వ్యాపార నైపుణ్యాలను మెరుగుపరచడం
డీప్‌టెక్ రంగంలోని వీసీలు లోతైన శాస్త్రీయ లేదా సాంకేతిక పరిజ్ఞానానికి ప్రాధాన్యమిస్తారు. ఈమేరకు స్టార్టప్‌లు వ్యవస్థాపక బృందాన్ని ఏర్పాటు చేయాలి. సంబంధిత టెక్నాలజీలో నైపుణ్యం కలిగిన పీహెచ్‌డీలు, ఇంజినీర్లు లేదా శాస్త్రవేత్తలు (ఉదా.క్వాంటమ్ కంప్యూటింగ్ స్టార్టప్‌కు క్వాంటమ్ ఫిజికల్ శాస్త్రవేత్త) అవసరం. మార్కెట్ వ్యూహంలో అనుభవం ఉన్న వ్యక్తులు సృజనాత్మకతను జోడిస్తారు. అలాంటివారికి ప్రాధన్యం ఇవ్వాలి. వ్యూహాత్మక మార్గదర్శకత్వం అందించే పరిశ్రమ అనుభవజ్ఞులను కంపెనీలో చేర్చుకోవాలి.
సమస్యలకు స్పష్టమైన పరిష్కారాలు చూపేలా..
డీప్‌టెక్ స్టార్టప్‌లు తరచుగా సంక్లిష్టమైన సమస్యలను పరిష్కరిస్తుంటాయి. వీసీలను ఆకర్షించాలంటే సమస్యను స్పష్టంగా నిర్ధారించాలి. సామాజిక అవసరాలతో ముడిపడి ఉన్న సవాళ్లను స్పష్టంగా తెలియజేయాలి. ఇప్పటికే ఉన్న ప్రత్యామ్నాయాలతో సమస్యను అధిగమించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో తెలపాలి. సమస్యల పరిష్కారానికి ఇన్నోవేటివ్ సమాధానాలు ఆలోచించాలి.
కనీస ఆచరణీయ ఉత్పత్తి (ఎంవీపీ)
డీప్‌టెక్‌లో సాంకేతిక ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని వీసీలు తరచుగా స్పష్టమైన పురోగతికి పెద్దపీట వేస్తారు. స్టార్టప్‌లు ప్రతి ఇన్నోవేషన్‌లో ఎంవీపీ(మినిమమ్ వయబుల్ ప్రొడక్ట్)ని దృష్టిలో ఉంచుకోవాలి. ఉత్పత్తుల తయారీకి, సాధ్యాసాధ్యాలను ప్రదర్శించడానికి వర్కింగ్ ప్రోటోటైప్‌లను సిద్దం చేయాలి. గతంలో విజయవంతమైన ప్రయోగాలు, దాఖలు చేసిన పేటెంట్లు లేదా పీర్-రివ్యూ ప్రచురణలను హైలైట్ చేయవచ్చు.
ఇదీ చదవండి: అంబానీ ఇంటి కరెంటు బిల్లు ఎంతో తెలుసా..?
ఇంటలెక్చువల్ ప్రాపర్టీ (ఐపీ)కి రక్షణ
యాజమాన్య సాంకేతికత ప్రతి కంపెనీకి ప్రధానంగా నిలుస్తుంది. పోటీదారులకు ధీటుగా పేంటెంట్లకు రక్షణ కల్పించాలి. వీసీలకు దీర్ఘకాలిక విలువ, ప్రత్యేకతను తెలియజేడానికి పేటెంట్ల వివరాలు తెలిజేయవచ్చు. ఇప్పటికే ఉన్న ఐపీని యాక్సెస్ చేయడానికి లేదా కొత్త పేటెంట్లను అభివృద్ధి చేయడానికి విశ్వవిద్యాలయాలు లేదా ప్రయోగశాలలతో భాగస్వామ్యం కుదుర్చుకోవచ్చు.