
మైసూరు: మైసూరులో ఇటీవల జిమ్ ట్రైనర్ భార్య వరకట్న వేధింపులకు బలైన ఘటనను మరువక ముందే మరో విషాదం జరిగింది. నగరంలోని ఉదయగిరిలో నివాసం ఉంటున్న తరనుం ఖాన్ (22) అనే వివాహిత అనుమానాస్పదరీతిలో చనిపోయింది. 2019 జూలైలో ఆమెకు సయ్యద్ ఉమర్ అనే వ్యక్తితో పెళ్లయింది. రూ. 7 లక్షల నగదుతో పాటు పెద్దమొత్తంలో బంగారం కట్నంగా ఇచ్చారు.
తరువాత కొద్దిరోజులకు మరింత కట్నం తీసుకొని రావాలని భార్యను వేధించడం మొదలు పెట్టారు. తరచూ గొడవలు కూడా జరిగేవి. ఈ నేపథ్యంలో మంగళవారం ఇంట్లో ఉరివేసుకున్న స్థితిలో ఆమె శవమై తేలింది. భర్త, అత్తమామలు, ఆడపడుచులపై మృతురాలి తల్లిదండ్రులు ఉదయగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
న్యానో కారు ఢీకొని చిన్నారి..
మైసూరు జిల్లాలోని పిరియా పట్టణ తాలూకాలోని హలగనహళ్లి గ్రామంలో ముతాహిర్ పాష కుమార్తె హమ్మరిన్ సహేర్ (5) కారు ఢీకొని చనిపోయింది. బాలిక అమ్మమ్మ ఇంటి ముందు ఆడుకుంటుండగా వేగంగా వచ్చిన టాటా న్యానో కారు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన చిన్నారిని పిరియాపట్టణ ఆస్పత్రికి తరలించగా మృతి చెందింది. బెట్టదపుర పోలీసులు కేసు నమోదు చేశారు.
(చదవండి: ఒకేఒక్కడు.. తొలి ఎంపీగా రికార్డులు బద్దలుకొట్టిన తేజస్వీ సూర్య)