
ఓ మానవుడా! భగవంతుని బ్రహ్మాండ రచనను మెచ్చుకొని దానికి శిరసు వంచి వినమ్రునిగా ఉండు. కొంచెం ఆలోచించు. ఎక్కడ నీడ ఉంటుందో అక్కడ ఒక చెట్టు; ఎక్కడ చెట్టు ఉంటుందో అక్కడ నీడ ఉంటుంది. అదే మాదిరిగా ఎక్కడైతే సంతోషం ఉంటుందో అక్కడ దుఃఖం, అది ఉన్న చోట సంతోషం ఉంటుంది. భిన్నత్వం, ఏకత్వాల కలబోతే ప్రకృతిమాత.
ఎక్కడ భగవంతుడు ఉంటాడో, అక్కడ భక్తుడూ; ఎక్కడ భక్తుడు ఉంటాడో, అక్కడనే భగవంతుడూ ఉంటాడు. ఈ ఇరువురి మధ్య భిన్నత్వం లేదు. అదే మాదిరిగా ఎచ్చట శిష్యుడు ఉంటాడో, అచ్చటనే అతని గురువు ఉంటాడు; గురువు ఉన్న చోటే అతని శిష్యుడూ ఉండవలసినదే. ఈ ద్వంద్వాలను చూచి మోసపోకూడదు. ఈ బ్రహ్మాండ మంతయూ బ్రహ్మ పదార్థమే వ్యాపించియున్నది. ఈ సత్యాన్ని గ్రహించాలి.
దేనివల్ల భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వములో భిన్నత్వం కలిగెనో అటువంటి మూలాన్ని స్తుతిస్తూ సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. మౌనమే ధ్యానం. సాధకుడికి మౌనావలంబనం ఎంతైనా ముఖ్యం. మౌనం మానవుణ్ణి ప్రశాంతపరచి, ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్లడానికి సహాయపడుతుంది. ఏ ఒక్కరూ అనవసరంగా, అధికంగా మాట్లాడకూడదు. అత్యవసరమైనదే మాట్లాడాలి. నిర్ణీత వేళల్లో మౌనంతో ఉండడమే తపస్సు. కేవలం నాలుకను కదల్చకుండా ఉంచుట మౌనం కాదు. మనసుకు కూడా పూర్తి విశ్రాంతి ఇవ్వాలి. ఈ విధంగా చేసినపుడు మనిషి ఎక్కువ శక్తినీ, ఎక్కువ నిర్మలత్వాన్నీ పొందుతాడు.
ఇందువలన మనసు అలసట తీర్చుకొంటుంది. ఏకాగ్రతా పెరుగుతుంది. నీ మనసు ఎంత ఖాళీగా ఉంటుందో, అంత ఏకాగ్రత పెరుగుతుంది. మనసును ఖాళీ చేయటానికి మౌనం చాలా ప్రభావశాలి. మహాత్ములు, జ్ఞానులు దీర్ఘకాలం మౌనం పాటిస్తారు. శ్రీకృష్ణ పరమాత్మ ‘గీత’లో తెలిపిన విషయం:‘గోప్యమైన వానిలో, నేనే మౌనమును’. అందువలన మనము కూడా మౌనాభ్యాసం చేద్దాం.
– శ్రీ గణపతి సచ్చిదానందస్వామి