అల్విదా మన్మోహన్‌జీ | Dr Manmohan Singh Cremated At Delhi Nigambodh Ghat | Sakshi
Sakshi News home page

అల్విదా మన్మోహన్‌జీ

Published Sun, Dec 29 2024 5:20 AM | Last Updated on Sun, Dec 29 2024 5:20 AM

Dr Manmohan Singh Cremated At Delhi Nigambodh Ghat

దివంగత మాజీ ప్రధానికి ఘనంగా తుది వీడ్కోలు  

నిగమ్‌బోధ్‌ ఘాట్‌లో అధికారిక లాంఛనాలతో ముగిసిన అంత్యక్రియలు  

కడసారి నివాళులర్పించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ   

హాజరైన భూటాన్‌ రాజు వాంగుచుక్, మారిషస్‌ విదేశాంగ మంత్రి ధనుంజయ్‌   

తరలివచ్చిన కేంద్ర మంత్రులు, వివిధ పార్టీల నేతలు, ప్రముఖులు, విదేశీ ప్రతినిధులు  

అంతిమయాత్రకు పోటెత్తిన నాయకులు, అభిమానులు, ప్రజలు  

మన్మోహన్‌ చితికి నిప్పంటించిన పెద్ద కుమార్తె ఉపీందర్‌ సింగ్‌  

సాక్షి, న్యూఢిల్లీ:  ఆర్థిక సంస్కరణలు, సరళీకరణ విధానాలతో భారతదేశ దశదిశను మార్చిన మహోన్నత నాయకుడు డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌(92)కు జాతి యావత్తూ ఘనంగా అంతిమ వీడ్కోలు పలికింది. ఢిల్లీలోని నిగమ్‌బోధ్‌ ఘాట్‌లో శనివారం ఆయన అంత్యక్రియలు ముగిశాయి. 

దివంగత మాజీ ప్రధానమంత్రిని కడసారి దర్శించుకొని వీడ్కోలు పలకడానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భూటాన్‌ రాజు జింగ్మే ఖేసర్‌ నంగ్యేల్‌ వాంగుచుక్, మారిషస్‌ విదేశాంగ మంత్రి ధనుంజయ్‌ రామ్‌ఫుల్‌తోపాటు పలువురు కేంద్ర మంత్రులు, వివిధ పార్టీల నాయకులు, వివిధ దేశా ల ప్రతినిధులు, ప్రముఖులు తరలివచ్చారు.

 మన్మోహన్‌కు కన్నీటి వీడ్కోలు పలికిన అనంతరం పూర్తి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, కాంగ్రెస్‌ నేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్‌ గాం«దీ, ప్రియాంక గాం«దీతోపాటు చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ అనిల్‌ చౌహాన్‌ హాజరయ్యారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి, హిమాచల్‌ ప్రదేశ్‌ సీఎం సుఖీ్వందర్‌ సింగ్‌ సుఖూ, ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ, ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వినోద్‌ కుమార్‌ సక్సేనా, వివిధ రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు భూపీందర్‌ సింగ్‌ హుడా, అశోక్‌ గహ్లోత్, భూపేష్‌ భగేల్‌ తదితరులు పాల్గొన్నారు.  

మన్మోహన్‌ సింగ్‌ అమర్‌ రహే  
శనివారం ఉదయం 9 గంటలకు మన్మోహన్‌ పార్థివ దేహాన్ని పుష్పాలతో అలంకరించిన సైనిక వాహనంలో ఆయన నివాసం నుంచి ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. ఆయనకు ఎంతో ఇష్టమైన నీలిరంగు తలపాగాను చివరి ప్రయాణంలోనూ ధరింపజేశారు. కాంగ్రెస్‌ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాం«దీ, రాహుల్‌ గాంధీతోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కడసారి నివాళులర్పించారు. 

ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో మన్మోహన్‌ భార్య గురుశరణ్‌కౌర్, ఒక కుమార్తె కూడా పుష్పాంజలి ఘటించారు. అనంతరం అంతిమయాత్ర ప్రారంభమైంది. ‘మన్మోహన్‌ సింగ్‌ అమర్‌ రహే.. జబ్‌ తక్‌ సూరజ్‌ చాంద్‌ రహేగా, తబ్‌ తక్‌ తేరా నామ్‌ రహేగా’ అనే నినాదాల మధ్య వేలాది మంది అనుసరిస్తుండగా యాత్ర ముందుకు సాగింది. ఉదయం 11.30 గంటల సమయానికి నిగమ్‌బోధ్‌ ఘాట్‌కు చేరుకుంది. మన్మోహన్‌ సింగ్‌ కుటుంబ సభ్యులతోపాటు రాహుల్‌ గాంధీ సైతం యాత్రలో చివరివరకూ పాల్గొన్నారు. పాడెను సైతం మోశారు. త్రివర్ణ పతాకం చుట్టిన మన్మోహన్‌ భౌతికకాయాన్ని ప్రత్యేక వేదికపైకి చేర్చారు.

 సిక్కు మత సంప్రదాయం ప్రకారం కుటుంబ సభ్యులు, మత గురువులు పవిత్ర గుర్బానీ కీర్తనలు ఆలపించారు. భౌతికకాయం వద్ద పలువురు ప్రముఖులు పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించారు. త్రివిధ దళాల సైనికులు 21 తుపాకులు గాల్లోకి పేల్చి గౌరవ వందనం సమర్పించారు. తర్వాత చితికి మన్మోహన్‌ పెద్ద కుమార్తె ఉపీందర్‌ సింగ్‌ నిప్పంటించడంతో అంత్యక్రియలు ముగిశాయి. 

మన్మోహన్‌ సింగ్‌ జ్ఞాపకాలతో అందరి హృదయాలు బరువెక్కాయి. అల్విదా మన్మోహన్‌జీ అంటూ కొందరు బోరున విలపించారు. సిక్కు సంప్రదాయం ప్రకారం మన్మోహన్‌ ‘అఖండ్‌ పథ్‌’ను జనవరి 1న ఢిల్లీలోని నివాసంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జనవరి 3న ‘భోగ్‌’ కార్యక్రమం ఉంటుందన్నారు. అంతిమ్‌ అర్దాస్‌(చివరి ప్రార్థనలు) జనవరి 3న ఢిల్లీలో గురుద్వారా రికబ్‌ గంజ్‌ సాహిబ్‌లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మన్మోహన్‌ సింగ్‌ శ్రద్ధాంజలి సభను సోమవారం నిర్వహించనున్నట్లు గుజరాత్‌ కాంగ్రెస్‌ నేతలు చెప్పారు.  

ఇండియా ప్రగతికి బాటలు వేసిన నేత మన్మోహన్‌: లారెన్స్‌ వాంగ్‌  
మన్మోహన్‌ సింగ్‌ మృతిపట్ల సింగపూర్‌ ప్రధానమంత్రి లారెన్స్‌ వాంగ్‌ సంతాపం ప్రకటించారు. భారత ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు మార్చిన గొప్ప నాయకుడు మన్మోహన్‌ అని కొనియాడారు. దార్శనికత, అంకితభావంతో దేశ ప్రగతికి బాటలు వేశారని, ఆయన అందించిన సేవలు ఎప్పటికీ మరువలేమని పేర్కొన్నారు.  

ఆంటోనియో గుటెరస్‌ సంతాపం  
మన్మోహన్‌ సింగ్‌ మృతిపట్ల ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ విచారం వ్యక్తంచేశారు. మన్మోహన్‌ కుటుంబ సభ్యులకు, భారతదేశ ప్రజలకు, ప్రభుత్వానికి సంతాపం ప్రకటించారు. ఇండియా ఆర్థిక వ్యవస్థను అద్భుతంగా తీర్చిదిద్దడంలో ఆయన కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు. మన్మోహన్‌ హయాంలో ఐక్యరాజ్యసమితితో భారత్‌ బంధం బలోపేతమైందని ఉద్ఘాటించారు.  

భూటాన్‌లో ప్రత్యేక ప్రార్థనలు  
భారత దివంగత మాజీ ప్రధాని మన్మోహన్‌ ఆత్మశాంతి కోసం భూటాన్‌లో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. రాజధాని థింపూలోని బౌద్ధ మందిరంతోపాటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రార్థనలు నిర్వహించారు. 20 జిల్లాల్లో ప్రార్థనలు జరిగినట్లు భూటాన్‌ ప్రభుత్వం తెలియజేసింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ రాయబార కార్యాలయా లు, కాన్సులేట్లలో తమ జాతీయ పతాకాన్ని అవనతం చేసినట్లు వెల్లడించింది. ఢిల్లీలో జరిగిన మన్మో హన్‌ అంత్యక్రియలకు భూటాన్‌ రాజు హాజరయ్యారు. మన్మోహన్‌ భౌతికకాయం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు.  

ధర్మరాజు స్థాపించిన శ్మశాన వాటిక!  
మన్మోహన్‌ అంత్యక్రియలు జరిగిన నిగమ్‌బోధ్‌ ఘాట్‌ శ్మశానవాటిక ఢిల్లీలో యమునా నది ఒడ్డునే ఉంది. నగరంలో అది అత్యంత రద్దీగా ఉండే అతిపెద్ద శ్మశానవాటిక. ప్రాచీనమైన ఈ మరుభూమిని పాండవుల అగ్రజుడు, ఇంద్రప్రస్థ పాలకుడైన యుధిష్టరుడు(ధర్మరాజు) స్థాపించాడని చెబుతుంటారు. ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. రకరకాల పక్షులు విహరిస్తుంటాయి. అందుకే పక్షులను కెమెరాల్లో బంధించడానికి ఫొటోగ్రాఫర్లు వస్తుంటారు. పక్షి ప్రేమికులకు ఇదొక చక్కటి వేదిక. కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ, జనసంఘ్‌ నేత దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ, మాజీ ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్, ఢిల్లీ మాజీ సీఎం షీలాదీక్షిత్‌ సహా పలువురు ప్రముఖుల అంత్యక్రియలు ఇక్కడే జరిగాయి.

 5,500 సంవత్సరాల క్రితం మహాభారత కాలంలో సాక్షాత్తూ బ్రహ్మ ఇక్కడ యమునా నదిలో స్నానం ఆచరించాడని, దాంతో ఆయన పూర్వస్మృతి జ్ఞప్తికి వచ్చిందని, అందుకే దీనికి నిగమ్‌బోధ్‌ అనే పేరు స్థిరపడిందని కొన్ని పుస్తకాల్లో రాశారు. నిగమ్‌బోధ్‌ ఘాట్‌ను మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఢిల్లీ(ఎంసీడీ) నిర్వహిస్తోంది. 1950వ దశకంలో ఎలక్ట్రిక్‌ దహన వాటిక, 2000 సంవత్సరం తర్వాత సీఎన్‌జీ దహన వాటిక సైతం ఏర్పాటు చేశారు. అధికారికంగా 1898లో ఈ శ్మశానవాటిక ప్రారంభమైంది. అప్పట్లో ఈ ప్రాంతం పేరు షాజహానాబాద్‌. మన్మోహన్‌ స్మారకం నిర్మించే చోటే అంత్యక్రియలు నిర్వహించాలని కాంగ్రెస్‌ కోరినప్పటికీ కేంద్రం సానుకూలంగా స్పందించలేదు. ఈ పరిణామంపై కాంగ్రెస్‌ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దేశానికి తొలి సిక్కు ప్రధానమంత్రి అయిన మన్మోహన్‌ను కేంద్రం ఉద్దేశపూర్వకంగా అవమానించిందని మండిపడుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement