
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో దారుణం జరిగింది. ఆదివారం రాత్రి ఫ్లోరా హెరిటేజ్ హౌసింగ్ సొసైటీ వద్ద స్థానికులు గొడవకు దిగారు. ఒకరిపై మరొకరు దాడికి దిగి చేతికి దొరికిన వస్తువుతో ఘర్షణకు దిగారు. హౌసింగ్ సొసైటీలో పార్కింగ్ వద్ద వాగ్వాదం కాస్త గొడవకు దారితీసిందని స్థానికులు తెలిపారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గొడవను సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో చొరవ తీసుకున్న పోలీసులపై కూడా నిందితులు దాడి చేశారు. ఈ వీడియో స్థానికంగా వైరల్‌గా మారింది. ఘర్షణకు దిగిన నిందితులను పోలీసు వ్యాన్‌లోకి ఎక్కించడానికి ప్రయత్నించగా.. వారు నిరాకరించారు.
పోలీసులు హౌసింగ్ సొసైటీలోకి రాకుండా నిందితులు అడ్డుకున్నారు. మరికొంత మంది స్థానికులు పోలీసులపై దాడికి ప్రయత్నించారు. పోలీసులు కూడా తమపై విచక్షణా రహితంగా దాడి చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తమ మహిళల మొబైల్ ఫోన్‌లను కూడా లాక్కెళ్లారని చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
— POLICE COMMISSIONERATE GAUTAM BUDDH NAGAR (@noidapolice) August 14, 2023
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు. ఇద్దరిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఈ ఏడాది ఆరంభంలో ఇలాంటి ఘటనే నోయిడాలో జరిగింది. పార్కింగ్ విషయంలో వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. అప్పట్లో ఈ దృశ్యాలు వైరల్‌గా మారాయి.
ఇదీ చదవండి: హిమాచల్ ప్రదేశ్‌లో జల ప్రళయం.. 29 మంది మృతి..