
కోల్‌కతా: స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్తికలను జపాన్‌లోని రెంకోజీ ఆలయం నుంచి భారత్‌కు తీసుకురావాలని అతని కుమార్తె అనితా బోస్ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఆగస్టు 18 నేతాజీ సుభాష్ చంద్రబోస్ వర్థంతి అని, ఈ సందర్భంగా ఆయన అస్తికలను భారత్‌కు తీసుకురావాలని కోరుతున్నానంటూ ఆమె ప్రధానికి లేఖ రాశారు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏకైక కుమార్తె అనితా బోస్ ప్రధానికి రాసిన లేఖలో తన తండ్రి అస్తికలను భారతదేశానికి తీసుకువచ్చి, తమకు అందించాలని వాటితో తాను తన తండ్రికి అంత్యక్రియలు నిర్వహించాలనుకుంటున్నట్లు ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ‘మా తండ్రి నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు నివాళులు అర్పించే సమయం ఇది. అతని అస్తికలను భారతదేశానికి తీసుకురావాలి. నేను నా తండ్రికి అంత్యక్రియలు నిర్వహించాలి. ఇది నా తండ్రి చివరి కోరిక. అందుకే నేను ఈ లేఖ రాస్తున్నాను. నేతాజీకి సంబంధించిన అన్ని రహస్య పత్రాలను బయటపెట్టడానికి ప్రధాని చేసిన ప్రయత్నాన్ని మేమంతా మెచ్చుకుంటున్నాం.
నేతాజీ 1945, ఆగస్టు 18న మరణించారని, ఆయన అస్తికలను జపాన్‌లోని రెంకోజీ ఆలయంలో ఉంచారని దర్యాప్తు నివేదికల్లో వెల్లడయ్యింది. నేతాజీ భారతదేశానికి చెందిన వ్యక్తి. ఇప్పుడు నా వినయపూర్వకమైన విజ్ఞప్తి ఏమిటంటే.. ఆగస్టు 18న నేతాజీ వర్థంతి. ఆరోజు నాటికి ఆయన అస్తికలను భారతదేశానికి తిరిగి తీసుకురావాలి. నేతాజీ అస్తికలను ఇంకా జపాన్‌లో ఉంచడం అవమానకరం’ అని ఆ లేఖలో ఆమె పేర్కొన్నారు.
మీడియాతో నేతాజీ మనుమడు చంద్రకుమార్ బోస్ మాట్లాడుతూ.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1945 ఆగస్టు 18న మన దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేశారన్నారు. నేతాజీ అస్తికలను జపాన్‌లోని రెంకోజీ ఆలయంలో భద్రపరిచారని, స్వతంత్ర భారతదేశాన్ని కోరుకున్న నేతాజీ అస్తికలను మన దేశంలో ఉంచడం శ్రేయస్కరమన్నారు. హిందూ సంప్రదాయాల ప్రకారం నేతాజీ కుమార్తె అనితా బోస్ తండ్రికి అంత్యక్రియలు నిర్వహించాలనుకుంటున్నారని చంద్ర కుమార్ బోస్ తెలిపారు.
కాగా రెంకోజీ టెంపుల్ అథారిటీ నేతాజీ అస్తికలను భారత ప్రభుత్వానికి అప్పగించడానికి సిద్ధంగా ఉంది. 1945, ఆగష్టు 18న తైపీలో జరిగిన విమాన ప్రమాదంలో బోస్ మృతి చెందారు. అయితే దీనిపై పలు అనుమానాలు నెలకొన్నాయి. కేంద్ర ప్రభుత్వం 2017లో ఆర్టీఐ (సమాచార హక్కు)కింద నేతాజీ విమాన ప్రమాదంలో మరణించినట్లు ధృవీకరించింది.