
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్నందువల్ల దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జరగాల్సిన ఉపఎన్నికలను వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. కరోనా అదుపులోకి వచ్చి, పరిస్థితులు అనుకూలించేవరకు ఉప ఎన్నికలు నిర్వహించడం సముచితం కాదని ఈసీ నిర్ణయించింది. బెంగాల్ సహా ఐదు అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల కారణంగా వైరస్ సంక్రమణ ఎక్కువగా జరిగిందన్న విమర్శల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ప్రస్తుతం దేశంలో మూడు పార్లమెంటరీ నియోజకవర్గాలకు, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు జరగాల్సిన ఉపఎన్నికలను వాయిదా వేశారు. దాద్రా – నగర్ హవేలి, మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా, హిమాచల్‌లోని మండి పార్లమెంటరీ నియోజకవర్గాలతో పాటు, హరియాణాలోని కల్కా, ఎల్లెనాబాద్, రాజస్తాన్‌లోని వల్లభనగర్, కర్ణాటకలోని సింగ్డి, మేఘాలయలోని రాజబాలా, మావరింగ్‌కెంగ్, హిమాచల్‌ప్రదేశ్‌లోని ఫతేపూర్, ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేల్ (ఎస్సీ) అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరగాల్సి ఉంది. మరికొన్ని ఖాళీ స్థానాలకు సంబంధించిన నివేదికలు రావాల్సి ఉంది. బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య మార్చి 28న అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే.