
వరుసగా మూడో మ్యాచ్‌లోనూ నెగ్గిన హైదరాబాద్ టెన్నిస్ క్రీడాకారిణి
హాంకాంగ్‌పై 2–1తో గెలిచిన భారత్
పుణే: అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్న హైదరాబాద్ టెన్నిస్ క్రీడాకారిణి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక బిల్లీ జీన్ కింగ్ కప్ మహిళల టీమ్ టోర్నీలో అదరగొడుతోంది. ఆసియా ఓసియానియా గ్రూప్–1లో భాగంగా గురువారం హాంకాంగ్‌తో జరిగిన మూడో లీగ్ మ్యాచ్‌లో భారత జట్టు 2–1తో గెలుపొందింది. ఈ టోర్నీలో భారత్‌కిది రెండో విజయం. హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ సింగిల్స్‌లో ఒక మార్పు చేసింది.
న్యూజిలాండ్, థాయ్‌లాండ్ జట్లతో జరిగిన మ్యాచ్‌ల్లో బరిలోకి దిగిన హైదరాబాద్ ప్లేయర్ సహజ యామలపల్లి స్థానంలో గుజరాత్‌కు చెందిన వైదేహి చౌధరీకి అవకాశం ఇచ్చారు. తొలి మ్యాచ్‌లో పోటీపడ్డ వైదేహి 2 గంటల 3 నిమిషాల్లో 7–6 (10/8), 6–1తో హో చింగ్ వుపై గెలిచి భారత్‌కు 1–0 ఆధిక్యాన్ని అందించింది. రెండో మ్యాచ్‌లో బరిలోకి దిగిన శ్రీవల్లి రష్మిక 7–6 (8/6), 2–6, 6–3తో హాంగ్ యి కొడీ వోంగ్‌ను ఓడించి భారత్‌కు 2–0తో విజయాన్ని ఖరారు చేసింది.
2 గంటల 27 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్మిక ఎనిమిది ఏస్‌లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తొలి సర్వ్‌లో 43 పాయింట్లు సాధించిన రష్మిక రెండో సర్వ్‌లో 14 పాయింట్లు సంపాదించింది. తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయిన రష్మిక, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో, థాయ్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా రష్మిక సింగిల్స్‌లో విజయం అందుకుంది.
ఫలితం తేలిపోవడంతో నామమాత్రమైన మూడో మ్యాచ్‌లో అంకిత రైనా–ప్రార్థన తొంబారే (భారత్) జోడీ పోరాడినా చివరకు విజయానికి దూరమైంది. 2 గంటల 2 నిమిషాలపాటు జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో అంకిత–ప్రార్థన ద్వయం 7–6 (7/2), 3–6, 11–13తో ‘సూపర్ టైబ్రేక్’లో యుడైస్ చోంగ్–హాంగ్ యి కొడీ వోంగ్ జంట చేతిలో ఓడిపోయింది.