
సాక్షి, హైదరాబాద్: రాంచి ఎక్స్‌ప్రెస్ వే కంపెనీ బ్యాంకుల కన్సార్షియం ద్వారా రూ.1,029.39 కోట్లు రుణం పొంది, ఇందులో నుంచి రూ.264 కోట్ల నిధులు పక్కదారి పట్టించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఆర్‌ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పిలిచిన విచారణ కు హాజరుకాలేదు. అనివార్య కారణాలతో శుక్రవారం విచారణకు హాజరుకాలేక పోతున్నానని, మరింత సమయం కావాలని కోరుతూ ఈడీ అధికారులకు తన వ్యక్తిగత లాయర్ల ద్వారా ఎంపీ సమాచారం ఇచ్చారు. దీంతో మళ్లీ ఆయనకు ఈడీ సమన్లు ఇచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
రాంచి ఎక్స్‌ప్రెస్ వే లిమిటెడ్ డైరెక్టర్లయిన కె.శ్రీనివాస్‌రావు, సీతయ్య, పృథ్వీతేజ మాత్రం విచారణకు హాజరయ్యారు. వీరిని ఈడీ అధికారులు నిధుల మళ్లింపుపై పలు ప్రశ్నలు వేశారు. నిధులు ఎందుకు వేరే కంపెనీలకు మళ్లించాల్సి వచ్చింది? రోడ్డు పనుల్లో పురోగతి ఎందుకు వెనకబడ్డారు? తదితరాలపై ఆరా తీసినట్లు తెలిసింది. ఇటీవల ఎంపీ నామా, రాంచీ కంపెనీ డైరెక్టర్ల నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేసిన ఈడీ 25న విచారణకు రావాలని సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.
చదవండి: కోవిడ్ భయంతో కూతుర్ని చంపుకుంది!