Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Free medical treatment banned Network hospitals on strike in Andhra Pradesh1
‘ఆరోగ్యం’ విషమం..ఆగిన సేవలు!

సాక్షి, అమరావతి: ఆరోగ్యశ్రీకి టీడీపీ కూటమి సర్కారు రూ.3,500 కోట్ల మేర బకాయిలు చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టిన నేపథ్యంలో నెట్‌వర్క్‌ ఆస్పత్రులు సమ్మెకు దిగడంతో సోమవారం నుంచి ఉచిత సేవలు నిలిచిపోనున్నాయి. గత ఐదేళ్లూ పేద, మధ్య తరగతి వర్గాలను అపర సంజీవనిలా ఆదుకున్న ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్‌ వైద్య సేవ)ని టీడీపీ కూటమి సర్కారు అస్తవ్యస్థంగా మార్చేయడంతో వైద్యం కోసం మళ్లీ అప్పుల పాలవుతున్న దుస్థితి నెలకొంది. నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు పెద్ద ఎత్తున బకాయిలు చెల్లించకపోవడంతో నిర్వహణ కష్టంగా మారి సేవలు కొనసాగించే పరిస్థితి లేదని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్‌ అసోసియేషన్‌ (ఆశా) నెల ముందే ప్రభుత్వానికి సమ్మె నోటీస్‌ ఇచ్చింది. రూ.1,500 కోట్లు విడుదల చేస్తే గానీ సేవలు అందించలేమని పేర్కొంది. దీనిపై ఆస్పత్రులతో చర్చలు జరిపి సేవలు నిలిచిపోకుండా చూడాల్సిన కూటమి సర్కారు తీవ్ర నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించింది. ఫలితంగా పేదలకు ఉచిత వైద్య సేవలు ఆగిపోయే పరిస్థితి దాపురించింది. బకాయిల కోసం ఆశా ప్రతినిధులు ప్రభుత్వానికి ఏడాది కూడా తిరగకుండానే 26 సార్లు లేఖ రాయడం గమనార్హం. రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీని నీరుగార్చిన సీఎం చంద్రబాబు పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు బిల్లులు చెల్లించడం నిలిపివేశారు. దీంతో ఆస్పత్రులు చికిత్స కోసం వస్తున్న రోగులను వెనక్కి తిప్పి పంపుతున్నాయి. ఈ ఏడాది జనవరి ఆరో తేదీ నుంచే ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ కింద ఓపీ, ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీమ్‌ (ఈహెచ్‌ఎస్‌), అన్ని రకాల నగదు రహిత సేవలను నిలిపి వేశాయి. మూడు నెలలకుపైగా వైద్య సేవలు అందడం లేదు. ఇన్ని రోజుల పాటు సేవలను నిలిపివేయడం ఆరోగ్యశ్రీ చరిత్రలో ఇదే తొలిసారి అని యాజమాన్యాలు చెబు­తున్నాయి. ఆరోగ్యశ్రీని ట్రస్టు విధానంలో కాకుండా బీమా రూపంలో ప్రైవేట్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీల ద్వారా అమలు చేయాలని గతంలోనే సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆరోగ్య ప్రదాత..ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యశ్రీని బలోపేతం చేసి సేవలను విస్తరించడంతో ఐదేళ్లలో దాదాపు 45 లక్షల మందికి రూ.13 వేల కోట్లకు పైగా ప్రయోజనం చేకూరింది. అంతేకాకుండా శస్త్ర చికిత్సల అనంతరం రోగి కోలుకునే వరకూ ఆయా కుటుంబాల జీవన భృతికి ఇబ్బంది లేకుండా వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా ద్వారా మరో రూ.1,465 కోట్లకుపైగా ఆర్ధిక సాయం అందించి భరోసానిచ్చారు. నాడు – నేడు ద్వారా ప్రభుత్వ వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. గ్రామ స్థాయిలో విలేజ్‌ క్లినిక్స్‌ ఏర్పాటుతోపాటు పీహెచ్‌సీల నుంచి బోధనాస్పత్రుల వరకు బలోపేతం చేశారు. వినూత్న రీతిలో తెచ్చిన ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ అమలు కోసం మండలానికి రెండు పీహెచ్‌సీలు ఉండేలా 88 కొత్త పీహెచ్‌సీల నిర్మాణాన్ని చేపట్టారు. గతంలో పీహెచ్‌సీలో ఒకే ఒక వైద్యుడు ఉండగా వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇద్దరు డాక్టర్ల చొప్పున నియమించింది. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ఒకేసారి 17 ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. జీరో వేకెన్సీ విధానంలో భాగంగా వైద్య ఆరోగ్యశాఖలో రికార్డు స్థాయిలో 54 వేలకుపైగా పోస్టులను భర్తీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో నాడు దేశవ్యాప్తంగా స్పెషలిస్ట్‌ వైద్యుల కొరత 61 శాతం ఉండగా.. మన రాష్ట్రంలో కేవలం 6.2 శాతం మాత్రమే ఉండటం గమనార్హం. బకాయిలు చెల్లించి భరోసా 2014–19 మధ్య ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసిన టీడీపీ సర్కారు 2019లో దిగిపోయే నాటికి రూ.700 కోట్ల మేర బకాయిలు పెట్టింది. అనంతరం అధికారం చేపట్టిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆ బకాయిలను చెల్లించి పేదల వైద్యానికి అండగా నిలిచింది. అంపశయ్యపై ఉన్న పథకానికి వైఎస్‌ జగన్‌ ఊపిరిలూదారు. రూ.5 లక్షల్లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలకు ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేసి మధ్యతరగతి కుటుంబాలకు ఆరోగ్య భరోసా కల్పించారు. అప్పటి వరకూ పథకంలో వెయ్యి ప్రొసీజర్‌లు మాత్రమే ఉండగా వాటిని ఏకంగా 3,257కి పెంచారు. రూ.వెయ్యి దాటే చికిత్సలన్నింటినీ పథకం పరిధిలోకి తెచ్చారు. ఆరోగ్యశ్రీ ఉచిత వైద్య చికిత్స పరిమితిని రూ.25 లక్షలకు పెంచారు. దీంతో రాష్ట్రంలో 1.43 కోట్ల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ భరోసా లభించింది.

PM Narendra Modi Launches Pamban Rail Bridge In Rameshwaram2
దేశానికే తలమానికం: ప్రధాని మోదీ

తమిళనాడుకు నిధుల కేటాయింపులో ఎలాంటి వివక్ష లేదు. 2014 కంటే ముందు పదేళ్లతో పోలిస్తే గత పదేళ్లలో మూడురెట్లు ఎక్కువ నిధులు తమిళనాడుకు ఇచ్చాం. తమిళనాడుకు రైల్వే బడ్జెట్‌ ఏడు రెట్లు పెంచాం. కేంద్ర ప్రభుత్వ పథకాలతో తమిళనాడులో కోట్లాది మంది లబ్ధి పొందుతున్నారు. అయినా నిధుల విషయంలో కొందరు అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. సాక్షి, చెన్నై: తమిళనాడులోని రామేశ్వరంలో నూతన పంబన్‌ రైల్వే వంతెనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. దేశంలో మొట్టమొదటి వర్టికల్‌ లిఫ్ట్‌ రైల్వే సీ బ్రిడ్జిగా రికార్డుకెక్కిన ఈ వంతెనను జాతికి అంకితం చేశారు. ఈ వంతెన దేశానికే తలమానికం అని వ్యాఖ్యానించారు. అలాగే రామేశ్వరం–తాంబరం (చెన్నై) కొత్త రైలుకు పచ్చజెండా ఊపారు. వర్టికల్‌ బ్రిడ్జి గుండా రాకపోకలు సాగించే కోస్ట్‌గార్డ్‌ షిప్‌ను సైతం ప్రారంభించారు. అనంతరం సభలో పాల్గొన్నారు. ఈ కీలకమైన కార్యక్రమానికి తమిళనాడు సీఎం స్టాలిన్‌ గైర్హాజరయ్యారు. ఆదివారం ఉదకమండలంలో అధికారిక కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉండడంతో తాను రాలేకపోతున్నట్లు ముందుగానే సమాచారం ఇచ్చారు. నియోజకవర్గాల పునరి్వభజన విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరుపట్ల ఆగ్రహంతో ఉన్న స్టాలిన్‌ ప్రధాని మోదీ కార్యక్రమానికి వ్యూహాత్మకంగానే దూరంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. డీలిమిటేషన్‌పై ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు తొలగించాలని ఆయన ఇప్పటికే ప్రధానమంత్రిని కోరారు. తమిళంలో సంతకాలు చేయలేరా? తమిళనాడులో రూ.8,300 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. అనంతరం సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. రాముడు అందించిన సుపరిపాలన మన దేశ నిర్మాణానికి పునాది అని చెప్పారు. రాముడితో తమిళనాడుకు ఎంతో అనుబంధం ఉందంటూ సంగమ శకం నాటి సాహిత్యాన్ని ప్రస్తావించారు. శ్రీలంక నుంచి గత పదేళ్లలో 3,700 మంది తమిళ జాలర్లను వెనక్కి తీసుకొచ్చామని తెలిపారు. వీరిలో 600 మందిని గత ఏడాది కాలంలోనే తీసుకొచ్చినట్లు వెల్లడించారు. తమిళ మాధ్యమంలో వైద్య విద్య అందించాలని తమిళనాడు ప్రభుత్వానికి సూచించారు. దీనివల్ల పేదలకు లబ్ధి కలుగుతుందన్నారు. తమిళనాడుకు ఇటీవల 11 నూతన మెడికల్‌ కాలేజీలు మంజూరు చేసినట్లు వివరించారు. తమిళ భాషను, సంస్కృతి సంప్రదాయాలు, వారసత్వాన్ని ప్రపంచంలో అన్ని మూలలకూ తీసుకెళ్లడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. తమిళనాడు నాయకుల నుంచి తనకు లేఖలు వస్తుంటాయని, కానీ, వాటిపై తమిళ భాషలో సంతకాలు ఉండడం లేదని నరేంద్ర మోదీ ఆక్షేపించారు. కనీసం తమిళ భాషలో సంతకాలు చేయాలని కోరారు. నిధుల కేటాయింపులో వివక్ష లేదు తమిళనాడు మత్స్యకారులు కష్టపడి పనిచేస్తారని ప్రధానమంత్రి ప్రశంసించారు. ‘పీఎం మత్స్య సంపద యోజన’ కింద తమిళనాడుకు గత ఐదేళ్లలో భారీగా నిధులు కేటాయించామని చెప్పారు. మత్స్యకారులకు ఆధునిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. సీవీడ్‌ పార్కులు, ఫిషింగ్‌ హార్బర్లు, ల్యాండింగ్‌ సెంటర్ల కోసం రూ.వందల కోట్లు ఖర్చు చేస్తున్నామని ఉద్ఘాటించారు. తమిళనాడుకు నిధుల కేటాయింపులో ఎలాంటి వివక్ష లేదని తేల్చిచెప్పారు. 2014 కంటే ముందు పదేళ్లలో కేటాయించిన దాని కంటే గత పదేళ్లలో మూడురెట్లు ఎక్కువ నిధులు తమిళనాడుకు ఇచ్చామని వివరించారు. రాష్ట్ర ఆర్థిక, పారిశ్రామిక ప్రగతికి ఈ నిధులు ఎంతగానో తోడ్పడ్డాయని అన్నారు. నిధుల విషయంలో కొందరు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ పథకాలతో తమిళనాడులో కోట్లాది మంది లబ్ధి పొందుతున్నారని స్పష్టంచేశారు. తమిళనాడుకు రైల్వే బడ్జెట్‌ ఏడు రెట్లు పెంచామన్నారు. రాష్ట్రంలో 2014 కంటే ముందు రైలు ప్రాజెక్టులకు ఏటా రూ.900 కోట్లు మాత్రమే ఇచ్చేవారని, ఇప్పుడు ఏటా రూ.6,000 కోట్లు ఇస్తున్నామని తెలియజేశారు. 2014 తర్వాత రాష్ట్రంలో కేంద్ర నిధులతో 4,000 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం జరిగిందన్నారు. రామనాథ స్వామి ఆలయంలో పూజలు ప్రధాని మోదీ రామేశ్వరంలోని రామనాథ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సంప్రదాయ వ్రస్తాలు ధరించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు శ్రీలంక నుంచి రామేశ్వరం చేరుకున్న ప్రధానమంత్రికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. రోడ్డుకు ఇరువైపులా నిల్చొని ఆయనకు అభివాదం చేశారు. నినాదాలతో హోరెత్తించారు. నూతన పంబన్‌ వంతెనను ప్రారంభించిన అనంతరం మోదీ రామనాథస్వామి ఆలయానికి చేరుకున్నారు. అర్చకులు ఆయనకు సంప్రదాయ రీతిలో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.ఇది దైవిక యాదృచ్ఛికం హిందూ మహాసముద్రంలోని ప్రాచీన రామసేతును దర్శించుకోవడం ఒక గొప్ప ఆశీర్వచనంగా భావిస్తున్నట్లు ప్రధాని మోదీ సంతోషం వ్యక్తంచేశారు. ఈ మేరకు ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు. ‘‘కొద్ది సేపటి క్రితమే శ్రీలంక నుంచి హెలికాప్టర్‌లో వస్తూ రామసేతును దర్శించుకున్నాను. ఇదొక గొప్ప ఆశీర్వచనంగా భావిస్తున్నా. అయోధ్యలో బాలరాముడికి ఆదిత్యుడు తిలకం దిద్దిన సమయంలోనే ఇక్కడ రామసేతు దర్శనం కావడం దైవిక యాదృచి్ఛకం. రెండింటినీ ఒకేసారి దర్శించుకోవడం గొప్ప విషయం. శ్రీరాముడు మనందరినీ ఐక్యంగా కలిపి ఉంచే ఒక బలమైన శక్తి. ఆయన ఆశీస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలన్నదే నా ఆకాంక్ష’’ అని మోదీ అన్నారు.ఇంజనీరింగ్‌ అద్భుతం రామేశ్వరంలో పంబన్‌ వర్టికల్‌ సీ–లిఫ్ట్‌ బ్రిడ్జిని రూ.550 కోట్లతో నిర్మించారు. పొడవు 2.08 కిలోమీటర్లు. 99 స్పాన్లు ఉన్నాయి. మధ్యలో 72.5 మీటర్ల పొడవైన వర్టికల్‌ లిఫ్ట్‌ ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. వంతెన కిందినుంచి భారీ నౌకల రాకపోకలకు వీలుగా ఇది 22 మీటర్ల ఎత్తువరకు పైకి వెళ్లగలదు. నౌకలు వెళ్లిపోయిన తర్వాత యథాతథ స్థితికి చేరుకుంటుంది. ఎప్పటిలాగే రైళ్లు ప్రయాణం సాగించవచ్చు. ప్రధాన భూభాగంలోని మండపం రైల్వేస్టేషన్‌ను రామేశ్వరం దీవితో ఈ వంతెన అనుసంధానిస్తుంది. అత్యాధునిక ఇంజనీరింగ్‌ నైపుణ్యానికి ఈ బ్రిడ్జి ఒక ఉదాహరణ. దీర్ఘకాలం మన్నికగా ఉండేలా నిర్మాణంలో స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ ఉపయోగించారు. హై–గ్రేడ్‌ రక్షణ పెయింట్‌ వాడారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా వంతెనపై రెండు రైల్వే ట్రాక్‌లు ఏర్పాటు చేశారు. బ్రిడ్జి నిర్వహణ ఖర్చు కూడా తక్కువే. భక్తులు రామేశ్వరం ఆలయానికి చేరుకోవడం ఇక మరింత సులభతరం కానుంది. ప్రధాన భూభాగం–రామేశ్వరం దీవి మధ్య 1914లో బ్రిటిష్‌ పాలకుల హయాంలో రైల్వే వంతెన నిర్మించారు. శతాబ్దం పాటు సేవలందించిన ఈ వంతెన గడువు తీరిపోవడంతో అదేచోట కొత్త వంతెన నిర్మాణానికి 2019లో కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇదిలా ఉండగా, ఆదివారం పంబన్‌ వంతెనను ప్రారంభించిన తర్వాత గంట సేపట్లో సాంకేతిక సమస్య నెలకొంది. కోస్ట్‌గార్డు నౌక కోసం వంతెనను 17 అడుగుల మేర పైకి ఎత్తారు. తిరిగి కిందకు దించే సమయంలో 10 అడుగుల వద్ద సాంకేతిక సమస్య ఏర్పడింది. రైల్వే అధికారులు అక్కడికి చేరుకుని సమస్యను పరిష్కరించారు.

Rasi Phalalu: Daily Horoscope On 07-04-2025 In Telugu3
ఈ రాశి వారు చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: శు.దశమి రా.11.13 వరకు, తదుపరి ఏకాదశి, నక్షత్రం: పుష్యమి ఉ.10.01 వరకు, తదుపరి ఆశ్లేష, వర్జ్యం: రా.11.03 నుండి 12.43 వరకు, దుర్ముహూర్తం: ప.12.25 నుండి 1.14 వరకు, తదుపరి ప.2.54 నుండి 3.43 వరకు, అమృతఘడియలు: లేవు; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం: 5.54, సూర్యాస్తమయం: 6.10. మేషం.... వ్యయప్రయాసలు. అనుకోని ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. ఆరోగ్యభంగం. వృత్తి,వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.వృషభం... చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వస్తులాభాలు. నూతన ఉద్యోగలాభం. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.మిథునం... కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. బంధువులతో విభేదాలు. పనులు మందగిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు.కర్కాటకం... బంధువుల నుంచి కీలక సమాచారం. విద్యాయత్నాలు సానుకూలం. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆలయాలు సందర్శిస్తారు.సింహం.... ముఖ్యమైన పనులలో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. విలువైన వస్తువులు జాగ్రత్త. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. మిత్రుల నుంచి ఒత్తిడులు. .కన్య.. విద్యార్థులకు శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. కొన్ని సమస్యలు తీరతాయి. వృత్తి, వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు.తుల... వ్యవహారాలలో పురోగతి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. పెద్దల సలహాలు స్వీకరిస్తారు. ఆలయ దర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలస్థితి.వృశ్చికం... బంధువుల నుంచి విమర్శలు. పనుల్లో తొందరపాటు. ధనవ్యయం. నిరుద్యోగులకు ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.ధనుస్సు....... పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. బంధువులు ఒత్తిడులు పెంచుతారు. అనారోగ్యం. నిర్ణయాలు కొన్ని వాయిదా వేస్తారు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. దైవచింతన.మకరం... శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో విజయం. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు వీడతాయి.కుంభం... నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. పాత విషయాలు గుర్తుకు వస్తాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.మీనం... బంధువులు, మిత్రులతో తగాదాలు. ఆరోగ్యభంగం. శ్రమకు ఫలితం కనిపించదు. కొన్ని పనులు హఠాత్తుగా విరమిస్తారు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు కొంత మందగిస్తాయి.

American take to streets in protest over Trump admin policies4
ట్రంప్‌కు హ్యాండ్సాఫ్‌ సెగ

వాషింగ్టన్‌: మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగేన్‌ నినాదంతో అధ్యక్ష పీఠంపై ఆసీనులైన డొనాల్డ్‌ ట్రంప్‌ వెనువెంటనే తీసుకున్న అనూహ్య, విపరీత నిర్ణయాలతో అమెరికన్లు విసిగిపోయారు. విదేశాలపై టారిఫ్‌ల బాంబు విసిరితే అది ప్రతీకార టారిఫ్‌ల రూపంలో తిరిగొచ్చి అధిక ధరలు, ద్రవ్యోల్బణానికి బాటలు వేస్తోందన్న ఆగ్రహంతో ప్రజలు నిరసన బాటపట్టారు. ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడయ్యాక దేశవ్యాప్తంగా ఎన్నడూలేనిస్థాయిలో లక్షలాది మంది స్థానిక అమెరికన్లు ముక్తకంఠంతో నినదిస్తూ ఆందోళనకు దిగిన ‘హ్యాండ్సాఫ్‌’ ఉద్యమం శనివారం భారీస్థాయిలో కొనసాగుతోంది. అమెరికాలోని మెజారిటీ రాష్ట్రాల్లో ట్రంప్‌కు వ్యతిరేకంగా శనివారం ఉద్యమం మొదలైంది. రాష్ట్రాల అసెంబ్లీలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, సామాజిక భద్రత విభాగ ఆఫీస్‌లు, పార్కులు, సిటీ హాళ్ల వద్ద ప్రధానంగా పెద్దస్థాయిలో ర్యాలీలు జరిగాయి. అత్యంత సంపన్నుల చేతుల్లోకి వెళ్లిన పాలనాపగ్గాలను విడిపిస్తామని నినదించారు. ‘‘ మావి ప్రధానంగా మూడు డిమాండ్లు. ప్రభుత్వంపై సంపన్నుల అజమాయిషీ నశించాలి. ప్రభుత్వంలో అవినీతి అంతంకావాలి. మెడికేర్, సోషల్‌సెక్యూరిటీ నిధుల్లో కోత పెట్టొద్దు. వలసదారులు, లింగమార్పిడి వర్గాలు, ఇతరులపై నిర్బంధాల చట్రాలను తొలగించాలి’’ అని ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న సంఘాల్లో ఒకటైన ఇండివిజిబుల్‌ ప్రకటించింది. నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఫెడరల్‌ ఎంప్లాయీస్‌ సహా చాలా కార్మిక సంఘాల సభ్యులు పలు రాష్ట్రాల్లో నిరసన ర్యాలీల్లో పాల్గొన్నారు.50 రాష్ట్రాల్లో 1,400 చోట్ల..50 రాష్ట్రాల్లో పౌర హక్కుల సంస్థలు, కార్మిక సంఘాలు, ఎల్‌జీబీటీక్యూ+ మద్దతుదారులు, మాజీ ఫెడరల్‌ ఉద్యోగులు, మహిళా హక్కుల కార్యకర్తలు, ఎన్నికల సంస్కరణల కార్యకర్తలు, సాధారణ ప్రజానీకం ఈ ఆందోళనలో భాగస్వాములై ట్రంప్‌ వ్యతిరేక నినాదాలు చేశారు. ప్రధానంగా 1,400 ప్రాంతాల్లో భారీ స్థాయిలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. అయితే చాలా వరకు ర్యాలీలు శాంతియుతంగానే కొనసాగాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, అరెస్ట్‌లు జరగలేదు. మ్యాన్‌హాట్టన్‌ మిడ్‌టౌన్‌ మొదలు అలాస్కాలోని యాంకరేజ్‌దాకా ప్రతి ప్రధాన నగరం, పట్టణంలో జనం వీధుల్లోకి వచ్చి హ్యాండ్సాఫ్‌ అని రాసి ఉన్న బ్యానర్లు, ప్లకార్డులు పట్టుకుని ఆందోళనల్లో పాల్గొన్నారు. వ్యయ నియంత్రణ చర్యలు, సమూల సంస్కరణల పేరుచెప్పి హఠాత్తుగా వేల సంఖ్యలో ఫెడరల్‌ ఉద్యోగులను విధుల నుంచి తప్పించడం, జీడీపీ తగ్గిపోయేలా ఆర్థికవ్యవస్థను అస్తవ్యస్థం చేయడం, వలసలపై ఉక్కుపాదం మోపడం, మానవ హక్కులను కాలరాయడం వంటి చర్యలతో ట్రంప్, ఎలాన్‌ మస్క్‌పై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు నెలకొన్నాయి. అమెరికాలోనేకాదు బ్రిటన్‌లోని లండన్, ఫ్రాన్స్‌లోని పారిస్, జర్మనీలోని బెర్లిన్‌ నగరాల్లోనూ అమెరికా ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీలు జరిగాయి. ‘‘అమెరికాకు ఏమైంది?. ప్రజలను టారిఫ్‌లను ఇబ్బందులు పెట్టడం ఇకనైనా ఆపండి. ట్రంప్‌ పెద్ద ఇడియట్‌’’ అని రాసి ఉన్న ప్లకార్డులను లండన్‌లో ప్రదర్శించారు. నిరసనలపై స్పందించిన శ్వేతసౌధంట్రంప్‌ వ్యతిరేక ర్యాలీలపై అధ్యక్ష భవనం స్పందించింది. ‘‘ ఇన్నాళ్లూ డెమొక్రాట్ల ప్రభుత్వంలో అక్రమంగా అమెరికాలో చొరబడిన విదేశీయులు, వలసదారులు ప్రభుత్వం నుంచి ఎన్నో పథకాలు, ప్రయోజనాలను అక్రమంగా పొందారు. దాంతో ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లింది. వీళ్ల వల్ల వాస్తవిక లబ్ధిదారులైన సీనియర్‌ అమెరికన్లు ఎంతో లబ్దిని కోల్పోయారు. ఆ సంస్కృతికి చరమగీతం పాడి నిజమైన అమెరికన్లకే ప్రభుత్వం నుంచి సామాజిక భద్రత, వైద్యసాయం, వైద్యసదుపాయాలు అందిస్తున్నాం’’ అని వైట్‌హౌస్‌ ఒక ప్రకటనలో పేర్కొంది.

Flood prevention work in Amaravati as per orders of World Bank: Andhra pradesh5
వరద రాజధానిలో ప్రజాధనం వృథా

సాక్షి, అమరావతి: ఎంత మంది నిపుణులు కాద­న్నా, ఆ ప్రాంతం రాజధానికి పనికి రాదని పర్యావరణ వేత్తలు చెప్పినా.. రాజకీయ పంతంతో చెవికెక్కించుకోని చంద్రబాబు తీరు వల్ల రాష్ట్ర ప్రజలపై తీవ్ర భారం పడుతోంది. రాజధాని­లో వరద ముంపు తగ్గించేందుకు ఏకంగా 1995 ఎకరాల్లో వరద మౌలిక సదుపాయాల పనులు, పునరావాస ప్రణాళిక అమలు చేయాలని ప్రపంచ బ్యాంకు షరతు విధించింది. ఇందుకు అనుగుణంగా ఏపీ సీఆర్‌డీఏ వరద మౌలిక సదుపాయాల పనుల కోసం పునరావాస కార్యాచరణ ప్రణాళి­కను రూపొందించింది.వరద ముంపు ఉన్న చోటే రాజ­ధాని నిర్మాణం చేపట్టడం, చేయడమే చంద్రబాబు విజనా అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. వరద ముంపు నివారణ, పునరావా­సం కోసమే వేల కోట్ల రూపా­యలు వ్యయం చేయాల్సి వస్తోంది. వరద ప్రమాద తగ్గింపు పనులు చేపట్టేందుకు రూ.2,750.79 కోట్లు వ్యయం చేయను­న్నట్లు సీఆర్‌డీఏ పునరావాస కార్యాచరణ ప్రణాళికలో స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను సీఆర్‌డీఏ ప్రపంచ బ్యాంకుకు అందజేసింది.వరద తగ్గింపు పనులతో సీఆర్‌డీఏ పరిధిలోని 21 గ్రామా­ల్లోని 5,288 మందిని తరలించాల్సి ఉందని అందులో స్పష్టం చేసింది. వరద నివారణకు కొండవీటి వాగు, పాల వాగు లోతు పెంచడంతో పాటు వెడల్పు చేయనున్నారు. మూడు జలా­శయాలను నిర్మించనున్నారు. వాగులకు గ్రీన్‌ బఫర్‌తో ఉండవల్లి వద్ద వరద పంపింగ్‌ స్టేషన్‌ను, నీటి శుద్ధి కర్మాగారం నిర్మించడంతోపాటు 15 నీటి పంపిణీ కేంద్రా­లను ఏర్పాటు చేయనున్నారు. ఈ పను­ల­న్నీ పూర్త­యితేనే అమరావతిలో వరద ముప్పు తగ్గుతుంది.ప్రపంచ బ్యాంకు విధానాల మేరకే పనులుప్రపంచ బ్యాంకు, ఏడీబీ విధానాలకు అనుగుణంగా వరద తగ్గింపు పను­లకు టెండర్లు, భూ సేకరణ ఉంటుందని సీఆర్‌డీఏ పేర్కొంది. ఈ పనుల వల్ల గ్రామాల్లోని వారిని ఇతర చోట్లకు తరలించాల్సి ఉందని, వారికి పునరావాస ప్లాట్ల కోసం స్థలాలు గుర్తించడమే కాకుండా పునరా­వాస లే అవుట్ల అభివృద్ధి, రహదారులు, విద్యుత్‌ కనెక్షన్లు, తాగునీరు, డ్రైనేజీ తదితర సౌకర్యాలను కల్పించాల్సి ఉందని తెలిపింది.వరద తగ్గింపు పనుల వల్ల గ్రామాల ఉమ్మడి ఆస్తులైన ఏడు శ్మశాన వాటికలు, ఒక ఆలయ భూమి ప్రభావి­తం అవుతాయని, వీటి స్థానంలో రాజధాని నగర గ్రామాల అవసరాలను తీర్చడానికి తుళ్లూరు, నవులూరు, మందడంలో మూడు బహుళ–మత అంత్యక్రియల ప్రాంగణాలను నిర్మించాలని సీఆర్‌డీఏ ప్రతిపాదించింది. ఇళ్లు కోల్పోతున్న వారికి, అదే గ్రామా­ల్లో లేదా ఒకటి నుంచి రెండు కిలో­మీటర్ల పరిధిలో పునరావాసం కల్పించనున్నారు. వరద తగ్గింపు పనులు చేపట్టేందుకు పెనుమాక, ఉండవల్లి, వెలగపూడిలో 12.09 ఎకరాలను 165 మందితో సంప్రదింపులు జరపడం ద్వారా సేకరిస్తున్నారు.ఈ గ్రామాల్లో 70 గృహాలు, రెండు వాణిజ్య సముదాయాలు, 16 ఇతర నిర్మాణాలకు పరిహారం చెల్లించనున్నారు. మరో 100.67 ఎకరాలను 342 మంది రైతుల నుంచి ల్యాండ్‌ పూలింగ్‌ స్కీము ద్వారా సేకరిస్తారని సీఆర్‌డీఏ తెలిపింది. ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని పేర్కొంది. కాగా, వరద తగ్గింపు పనుల కోసం ప్రపంచ బ్యాంకు ఇప్పటికే రూ.1,742 కోట్లు విడుదల చేసింది.

Data Scientist, Guest Faculty Professor Venkat Ikkurthy interview with Sakshi6
టాలెంట్‌ను ట్రంప్‌ కూడా ఆపలేడు

ఇప్పుడు ఏటా 3.40 లక్షల మంది భారతీయ విద్యార్థులు వస్తున్నారు.వీళ్లల్లో ఐఐటీ, ఎన్‌ఐటీల్లో చదివేవాళ్లు చాలా తక్కువ. ఇండియాలో ఏ ఉద్యోగం రాని వాళ్లు, నాణ్యతలేని కాలేజీల్లో నైపుణ్యం లేకుండా ఇంజనీరింగ్‌ చేసినవాళ్లే వస్తున్నారు. ఇండియాలోనే ఉద్యోగం రానప్పుడు అమెరికాలో ఎలా వస్తుంది?వనం దుర్గాప్రసాద్‌అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధికారంలోకి వచ్చాక.. ఆ దేశంలోని విదేశీ ఉద్యోగులు, విద్యార్థులకు గడ్డుకాలం మొదలైందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరిమేస్తున్న ట్రంప్‌ యంత్రాంగం.. విదేశీ విద్యార్థులపై కఠిన ఆంక్షలు పెడుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే వృత్తి నిపుణులకు అమెరికా ఎప్పుడూ ఆహ్వానం పలుకుతుందని, నైపుణ్యం లేనివారు ఏ దేశంలోనూ ముందుకెళ్లలేరని చెబుతున్నారు అమెరికాలో 30 ఏళ్లుగా ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ప్రవాసాంధ్రుడు వెంకట్‌ ఇక్కుర్తి. నైపుణ్యం ఉన్న ఎవరినీ ట్రంప్‌ కాదుకదా.. ఎవ్వరూ అడ్డుకోలేరని, నైపుణ్యం లేనివారిని ఎవ్వరూ రక్షించలేరని చెబుతున్నారాయన. గుంటూరు జిల్లాకు చెందిన వెంకట్‌కు డేటా సైంటిస్టుగా, అమెరికన్‌ యూనివర్సిటీల్లో గెస్ట్‌ ఫ్యాకల్టీగా 30 ఏళ్ల అనుభవం ఉంది. ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడయ్యాక అమెరికాలో తాజా పరిస్థితి, భారత విద్యార్థుల స్థితిగతుపై ‘జూమ్‌ ఇన్‌’లో ‘సాక్షి’ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు. ట్రంప్‌ వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి? ట్రంప్‌ కొత్తగా తీసుకున్న నిర్ణయాలేమీ లేవు. అమెరికన్‌ చట్టాలనే కఠినంగా అమలు చేస్తున్నారు. తన దేశానికి మేలు చేయాలన్నదే ఆయన ఆలోచన. టారిఫ్‌లు వేయడం సర్వ సాధారణ విషయమే. కాకపోతే దీన్ని ప్రతీకార చర్యగా భావిస్తున్నారు. భారత విద్యార్థులను అక్కడ వేధిస్తున్నారా? భారత్‌ నుంచి అమెరికాకు ఏటా 3.42 లక్షల మంది చదువుకోవడానికి వస్తున్నారు. ఇందులో సగం మంది తెలుగు విద్యార్థులే. భారత విద్యార్థులంతా తెలివైన వాళ్లే. కాకపోతే నిబంధనలు వదిలేస్తారు. ఇప్పుడదే సమస్యగా మారింది. నిజానికి అమెరికావాళ్లు భారత పౌరులను గౌరవిస్తారు. గోల్డెన్‌ హ్యాండ్స్‌ అంటారు. అలాంటి వాళ్లు విద్యార్థులను ఎందుకు వేధిస్తారు. యూనివర్సిటీల్లో పార్ట్‌టైం జాబ్‌ చేసే ఎవరినీ ఏమీ అనడం లేదు. అడ్డదారిలో మాల్స్, హోటల్స్, ఇళ్లల్లో పనిచేయడాన్ని అడ్డుకుంటున్నారు. అమెరికాకు వచ్చేది దీని కోసమా? అసలు సమస్య ఏంటి? 2016లో అమెరికాకు వచ్చిన భారతీయులు 40 వేలకు మించి లేరు. వీళ్లతా ఐఐటీ, ఎన్‌ఐటీ, పేరున్న వర్సిటీల్లో చదివిన వాళ్లే. ఎంఎస్‌ పూర్తయిన తర్వాత వాళ్లల్లో సగం మందిని అమెరికా మంచి ఉద్యోగాలిచ్చి ఉంచేసుకుంది. ఇప్పుడు వీళ్లే అమెరికాకు గొప్ప ఆస్తి. నైపుణ్యం ఉన్న విద్యార్థులను అమెరికా ఎప్పుడూ వదులుకోదు. కానీ ఇప్పుడు ఏటా 3.40 లక్షల మంది భారతీయ విద్యార్థులు వస్తున్నారు. వీళ్లల్లో ఐఐటీ, ఎన్‌ఐటీల్లో చదివేవాళ్లు చాలా తక్కువ. ఇండియాలో ఏ ఉద్యోగం రాని వాళ్లు, నాణ్యతలేని కాలేజీల్లో నైపుణ్యం లేకుండా ఇంజనీరింగ్‌ చేసినవాళ్లే వస్తున్నారు. ఇండియాలోనే ఉద్యోగం రానప్పుడు అమెరికాలో ఎలా వస్తుంది? ఐఐటీ, ఎన్‌ఐటీ విద్యార్థులకే 295 జీఆర్‌ఈ స్కోర్‌ వస్తోంది. కానీ వీళ్లు 325 స్కోర్‌ తెచ్చుకుంటున్నారు. ఇది ఎలా సాధ్యం? కన్సల్టెన్సీలు తప్పుడు మార్గంలో జీఆర్‌ఈ రాయిస్తున్నాయి. వీటిని అమెరికా అధికారులు గుర్తించలేరా? మెక్సికో లాంటి ప్రాంతాల నుంచి లేబర్‌ వీసాలపై వచ్చే నల్ల జాతీయుల ఉద్యోగాలు కూడా మనవాళ్లు చేస్తామని ముందుకొస్తున్నారు. కాల్పుల ఘటనలకు ఇవే ప్రధాన కారణాలవుతున్నాయి. అమెరికా విద్యలో నాణ్యత ఉందా? అమెరికాలో 25 వేల విశ్వవిద్యాలయాలున్నాయి. దాదాపు ఇవన్నీ ప్రైవేటువే. వీటిల్లో నాణ్యత ఉన్నవి కొన్నే. మిగతా వర్సిటీలు కన్సల్టెన్సీల ద్వారా విద్యార్థులను మభ్యపెట్టి చేర్చుకుంటున్నాయి. కొన్ని వర్సిటీలు ఫీజుల్లో 40 శాతం కన్సల్టెన్సీలకు ఇస్తున్నాయి. దీంతో కన్సల్టెన్సీలు విద్యార్థులను తప్పుదారి పట్టిస్తున్నాయి. ఈ వర్సిటీలు విద్యార్థులు చదివినా చదవకపోయినా డిగ్రీలు ఇస్తున్నాయి. అమెరికాలో ఉండే ఒక వ్యక్తికి సంబంధించిన డాక్యుమెంట్లు 26 చోట్ల వాడారు. దీన్ని అమెరికా అధికారులు ప్రశ్నించారు. తన బంధువు కోసం ఇచ్చిన డాక్యుమెంట్లను కన్సల్టెన్సీలు ఇలా దుర్వినియోగం చేశాయి. నాణ్యత లేని వర్సిటీల్లో నెలకు ఒక క్లాస్‌ జరుగుతోంది. మిగతా రోజుల్లో మనవాళ్లు చట్ట విరుద్ధంగా డబ్బుల కోసం పని చేస్తున్నారు. ఒక హోటల్‌లో గంటలకొద్దీ పనిచేసే విద్యార్థి ఎంఎస్‌ ఎలా చదువుతాడు? అతడికి నైపుణ్యం ఎందుకు ఉంటుంది? అమెరికాలో ఉద్యోగం ఎందుకు వస్తుంది? అమెరికన్లు పనిచేయరు.. భారతీయులను ట్రంప్‌ అడ్డుకుంటున్నారు.. ఎలా? నిజమే.. అమెరికన్లు రెస్టారెంట్లు, ఇళ్లలో పనిచేయరు. భారతీయులూ అలా చేయరనేది అమెరికన్ల నమ్మకం. అందుకే మెక్సికన్లకు ఈవీ–1 వీసా (అగ్రికల్చర్‌ లేబర్‌) ఇస్తారు. ఆ జాబితాలో భారత్‌ లేనేలేదు. అలాంటప్పుడు నిబంధనలకు విరుద్ధంగా పనులు చేయడం మంచిదేనా? కరోనా తర్వాత యాంత్రీకరణ పెరిగింది. దీంతో హోటళ్లు, పెట్రోల్‌ బంకులు సహా అన్నింటిలోనూ రోబోలు వస్తున్నాయి. ముందుముందు మనవాళ్లు పోటీపడే పార్ట్‌టైం ఉద్యోగాలు ఉండవు. ఇంకా చెప్పాలంటే స్కిల్‌ ఉద్యోగాలు కూడా కష్టమే. ఇప్పుడు ఉద్యోగాల మాటేమిటి? నైపుణ్యం ఉన్నవాళ్లను ఎవరూ అడ్డుకోలేరు. అది లేనివాళ్లను ఎవరూ రక్షించలేరు. 2016కు ముందు వచ్చిన భారతీయుల పిల్లలకు ఇక్కడ పౌరసత్వం వచ్చింది. వాళ్లిప్పుడు ఉద్యోగాల వేటలో ఉన్నారు. కొత్తగా ఇండియా నుంచి వచ్చే పిల్లలకు అమెరికన్లు పోటీనే కాదు. పౌరసత్వం పొందిన భారత సంతతికి చెందిన వాళ్లే పోటీ. కాబట్టి నైపుణ్యం లేకుండా, డబ్బు సంపాదనే ధ్యేయంగా అమెరికా వస్తే ఇబ్బంది పడతారు. అమెరికా వచ్చే ముందు ఒక్కసారి మీ నైపుణ్యం ఏమిటో? దేనికి సరిపోతారో బేరీజు వేసుకోండి. నైపుణ్యం పెరగాలంటే ముందుగా భారత విద్యా విధానంలో మార్పులు తేవాలి. ఇది అభివృద్ధి చెందిన దేశాల అవసరాలు తీర్చేలా లేదు.

Sakshi Guest Column On Santosh Movie7
కఠిన వాస్తవాలను దాచేస్తారా?

ఆమె పేరు సూచిస్తున్నట్టుగానే సంధ్యా సూరి భారత సంతతికి చెందిన ఫిల్మ్‌ మేకర్‌. ఆమె దర్శకత్వం వహించిన ‘సంతోష్‌’ సినిమా గత ఏడాది యూకే తరఫున అధికారిక ఎంట్రీగా ఆస్కార్స్‌కు వెళ్లింది. కాన్‌ (ఫ్రాన్స్‌) చిత్రోత్సవంలో విశేష మన్ననలు అందుకుంది. ‘బాఫ్టా’ (బిఏఎఫ్‌టీఏ– ద బ్రిటిష్‌ అకాడెమీ ఆఫ్‌ ఫిలిం అండ్‌ టెలివిజన్‌ ఆర్ట్స్‌)కు నామినేట్‌ అయ్యింది. ఇందులో నటించిన షహానా గోస్వామి ఏసియన్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌లో ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్నారు. ఇంత ఖ్యాతి గడించినప్పటికీ, కోట్లాది మంది భారతీయులు మాత్రం ఈ సినిమాను ఎప్పటికీ చూడలేరు. సెన్సార్‌ బోర్డు (సీబీఎఫ్‌సీ– సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌) దీనికి దారుణమైన కత్తెరలు వేసింది. వాటికి అంగీకరిస్తేనే భారత్‌లో ప్రదర్శనకు అనుమతి ఇస్తామని చెప్పడంతో, సంధ్యా సూరి సహజంగానే అందుకు నిరాకరించారు.పూర్తిగా భారత్‌లోనే నిర్మించిన, భారతీయ నటీనటులతోనే చిత్రీకరించిన, అదీ హిందీలో తీసిన చిత్రం ఇది. ఒక్క మాటలో చెప్పాలంటే పూర్తి భారతీయ చిత్రం. కానీ భారతీయులమైన మనం దీన్ని వీక్షించలేక పోవడం మన దౌర్భాగ్యం. ఎందుకంటే, మనం కాదనలేని ఒక సత్యాన్ని ఇది ఆవిష్కరించింది. దాన్ని మనకు తెలియకుండా దాచి ఉంచగలనని సెన్సార్‌ బోర్డు అనుకుంటోంది. నేను ప్రస్తావిస్తున్న ఈ సత్యం పోలీసుల కర్కశత్వం, వారు పెట్టే చిత్రహింసల గురించి!ఈ సినిమా నేను చూశాను. ఇది అంతులేని బాధ కలిగిస్తుంది. మనసును విపరీతంగా కలవరపెడుతుంది. ఉత్తర భారత గ్రామీణ ప్రాంతాల్లో సాగే పోలీసుల దాష్టీకానికి ఇది వాస్తవ చిత్రీకరణ. అమాయక ప్రజలను పోలీసులు ఎలా టార్చర్‌ పెట్టగలరో, దళితులు, ముస్లింలు వారి చేతిలో ఎన్ని దుర్మార్గాలకు గురవుతున్నారో, మానభంగాలను ఏ విధంగా వారు వెనకేసుకొస్తారో, సాధారణ ప్రజానీకాన్ని ఎంతగా భయభ్రాంతులకు గురిచేస్తారో ఈ సినిమా కళ్లకు కడుతుంది. పుట్టుక, సంపద, పలుకుబడి... ఈ మూడింటిలో ఏ బలమూ లేకుండా పోలీసులతో వ్యవహరించే ప్రతి ఒక్కరికీ ఇది సత్యమని, ఇదే వాస్తవమని తెలుసు. ఈ య«థార్థం వారికి ఆశ్యర్యం కలిగించదు, వారిని దిగ్భ్రాంతికి అసలు గురి చేయదు. ఎందుకంటే వారికి పోలీసుల వైఖరి నిత్యజీవిత అనుభవం. కానీ సెన్సార్‌ బోర్డు దీన్ని సమ్మతించడానికి ఇష్టపడటం లేదు. గుర్తించడానికి అంగీకరించడం లేదు. పోలీసుల హింస, జవాబుదారీతనం లేకపోవడం గురించి ‘పోలీస్‌ టార్చర్‌ అండ్‌ (అన్‌) అకౌంటబిలిటీ’ పేరుతో ‘కామన్‌ కాజ్‌’, ‘లోక్‌నీతి సీఎస్‌డీఎస్‌’లు ఇటీవలే సంయుక్తంగా ప్రచురించిన ఒక నివేదిక ఈ సినిమా వాస్తవికతను ధ్రువీకరిస్తోంది. 17 రాష్ట్రాల్లో 8,000 మందికి పైగా పోలీసులను ఈ సంస్థలు సర్వే చేశాయి. వారిలో రమారమి 30 శాతం మంది చిత్రహింసలను సమర్థించారు. ప్రమాదకరమైన నేరగాళ్లను విచారణ ముగిసే వరకూ వేచిచూడకుండా చంపేయడమే మెరుగు అని దరిదాపు 25 శాతం మంది తేల్చి చెప్పారు. ప్రజల్లో భయం ఉండాలంటే కఠిన పద్ధతులు అవలంబించాల్సిందే అంటూ 20 శాతం మంది వెల్లడించారు. ముస్లింలు నేరప్రవృత్తికి లోనయ్యే అవకాశం ఉందని 50 శాతం మంది చెప్పడం ఆశ్చర్యకరం. ఇక, ‘స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్స్‌’ (ఎస్‌ఓపీ)ను పాటించడం ఎప్పుడో తప్ప జరగదని 40 శాతం కంటే ఎక్కువ మందే అంగీకరించారు. అందుకే కాబోలు... కేవలం 33 శాతం మంది భారతీయులే పోలీసులను విశ్వసిస్తారని ‘ఇప్సాస్‌’ సర్వే (యూకే) నిర్ధారించింది. వీటిలో ఏదీ మనకు ఆశ్యర్యం కలిగించదు. ఎవరూ చెప్పనవసరం లేకుండానే ఇవన్నీ నిజాలేనని మనకు సహజంగానే తెలుసు. పోలీసుల దాష్టీకాన్ని వెల్లడించే అధ్యయనాలకు కొరత లేదు. ‘నేషనల్‌ క్యాంపేన్‌ ఎగైనెస్ట్‌ టార్చర్‌’ వార్షిక నివేదిక (2019) ప్రకారం, ఆ ఏడాది 1,723 కస్టడీ చావులు వెలుగు చూశాయి. అంటే పోలీసు కస్టడీలో రోజుకు అయిదుగురు ప్రాణాలు విడిచారు. ఈ అధ్యయ నాలు బట్టబయలు చేసిన వాస్తవాలకే ‘సంతోష్‌’ సినిమా కర్కశ, వాస్తవిక దృశ్యరూపం ఇచ్చింది. అయినా సరే, భారతీయలు ఈ సినిమా ఎప్పటికీ చూడలేరు. ఏదైనా అద్భుతం జరిగి సెన్సార్‌ బోర్డు మనసు మారితే తప్ప!ముచ్చటైన విషయం ఏమిటటే, ఇండియాలో చిత్రీకరణ కోసం అనుమతి కోరుతూ సంధ్యా సూరి తన సినిమా స్క్రిప్టును అధికా రులకు సమర్పించినప్పుడు ఎలాంటి అభ్యంతరాలూ వ్యక్తం కాలేదు. ‘గార్డియన్‌’ వార్తాపత్రికకు ఆమె ఇదే చెప్పారు. ‘ఇప్పుడు చాంతాడు పొడవన్ని కట్స్‌ జాబితా ఇచ్చారు. ఈ సెన్సార్‌ కోత లన్నీ కలిపి పేజీలకు పేజీలు ఉన్నాయి’. వాటికి అంగీకరించడం ‘అసాధ్యం’. ఎందుకంటే, సినిమా ‘విజన్‌’ పూర్తిగా దెబ్బతింటుందని ఆమె వాపోయారు.నేను ఈ సినిమా చూసిన ప్రభావంతో చెబుతున్నాను. ఇది తప్పనిసరిగా చూడాల్సినది. బాలీవుడ్‌ సినిమాల్లో కూడా పోలీసు జులుం తరచూ కనబడుతూనే ఉంటుంది. అయితే, అది మృదువుగా, ప్రభావ శూన్యంగా ఉంటుంది. సానుకూల కోణం కూడా సమాంతరంగా నడుస్తుంది. కానీ ‘సంతోష్‌’ అలాకాదు.అందులో ఎలాంటి చక్కెర పూతా ఉండదు. కర్కశమైన, ఉపశమన రహితమైన వాస్తవికతను చూపిస్తుంది. చూడటం ఇబ్బందిగానే ఉంటుంది. కానీ వాస్తవాన్ని చూడకుండా మనం ఎలా కళ్లు మూసు కుంటాం? అది తగిన పని కాదు. అయినా మనం సత్యాన్ని తిరస్కరిస్తూనే పోతున్నాం. ‘సంతోష్‌’ అలాంటి తిరస్కారాల జాబితాలో తాజాగా చేరింది. చిత్రహింసలకు వ్యతిరేకంగా రూపొందించిన ఐక్యరాజ్య సమితి ఒప్పందం (యునైటెడ్‌ నేషన్స్‌ కన్వెన్షన్‌ ఎగైనెస్ట్‌ టార్చర్‌)పై సంతకం చేయని అతి కొద్ది దేశాల్లో ఇండియా ఒకటి. అలా ఆమోదించకపోవడానికి... కస్టడీ హింసను నిరోధించే సొంత చట్టం ఏమైనా ఉందా అంటే అదీ లేదు. నిజానికి ఇవి మనం ఎప్పుడూ చర్చించని యథార్థాలు. ఎప్పుడైనా ప్రస్తావన వచ్చినా, ఆ వెంటనే మర్చిపోతాం. ఒకవేళ ‘సంతోష్‌’ను మనం చూడడం జరిగితే... ఇలా ఎందుకు జరుగుతుందని ప్రశ్నించే అవకాశం అది ఇస్తుంది. ఈ దారుణాలు ఎందుకు అనుమతిస్తున్నారు? ఇది ఇంకా ఎంతకాలం కొనసాగుతుంది? అని నిలదీస్తాం. బహుశా అందుకే సెన్సార్‌ బోర్డు మనం ఎప్పటికీ ఈ సినిమా చూడకుండా జాగ్రత్త పడింది. సత్యమేవ జయతే!కరణ్‌ థాపర్‌ వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌

Sakshi Guest Column On Artificial Intelligence for India8
ఏఐలో మనం మేటి కావాలంటే...

కొత్త సంవత్సరం మొదలై మూడు నెలలే అయింది కానీ... కృత్రిమ మేధ రంగంలో ఈ స్వల్ప అవధిలోనే పలు సంచలనాలు చోటు చేసుకున్నాయి. జనవరిలో విడుదలైన డీప్‌సీక్‌ ఆర్‌–1 ఒకటైతే... ఫిబ్రవరిలో ప్యారిస్‌లో జరిగిన అంతర్జాతీయ ఏఐ సదస్సు ఇంకోటి. ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మెక్రాన్‌లు సంయుక్తంగా అధ్యక్షత వహించిన ఈ సదస్సులోనే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ ఏఐ తీసుకురాగల రాజకీయ, భద్రతాపరమైన సవాళ్లను ప్రపంచం ముందుంచారు. చివరగా మోదీ తాజా అమెరికా పర్యటనలో ఇరు దేశాల మధ్య ఏఐ వంటి కీలక రంగాల్లో సహకారానికి సంబంధించి ఒప్పందం కుదిరింది. ఏఐ రంగం నేతృత్వాన్ని ఆశిస్తున్న భారత్‌పై ఈ పరిణామాల ప్రభావం ఏమిటి?డీప్‌సీక్‌ ఆర్‌–1 సంచలనం తరువాత భారత్‌లో నడుస్తున్న చర్చ ఏమిటీ అంటే... మనదైన లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్‌ (ఎల్‌ఎల్‌ఎం) ఒకటి తయారు చేసుకోవాలని. ఇందుకు అవసరమైన ఏఐ చిప్స్‌ అందు బాటులో ఉండేలా చూసుకోవాలని! మరోవైపు ప్రభుత్వం కూడా సొంత ఎల్‌ఎల్‌ఎం అభివృద్ధిపై ప్రకటన చేసింది. కొన్ని నెలల వ్యవధిలోనే ఇది అందుబాటులోకి వస్తుందని చెప్పింది. నేషనల్‌ ఏఐ మిషన్‌ స్టార్టప్‌లు, పరిశోధకుల కోసం పది వేల జీపీయూలు అందుబాటులోకి తెచ్చినట్లు వివరించింది. అంతేకాకుండా... ఎల్‌ఎల్‌ఎంలతోపాటు స్మాల్‌ లాంగ్వేజ్‌ మోడళ్లు, ప్రాథమికమైన ఏఐ మోడళ్ల తయారీకి పిలుపునిచ్చింది.ఈ చర్యలన్నీ ఆహ్వానించదగ్గవే అయినప్పటికీ... ఇవి మాత్రమే సరిపోవు. డీప్‌సీక్‌ విజయవంతమైన నేపథ్యంలో చేపట్టాల్సిన పనుల ప్రాథమ్యాల్లోనూ ఇవి లేవనే చెప్పాలి. అతి తక్కువ ఖర్చు, శిక్షణలతోనే అద్భుతమైన ఎల్‌ఎల్‌ఎంను రూపొందించవచ్చునని డీప్‌సీక్‌ ఇప్పటికే రుజువు చేసింది. చౌక ఆవిష్కరణలకు పేరుపొందిన భారత్‌కు ఇది ఎంతో సంతోషించదగ్గ సమాచారం. అయితే దీనర్థం సొంత ఎల్‌ఎల్‌ఎం అభివృద్ధే ఏఐ ఆధిపత్యానికి తొలి అడుగు అని కాదు. అమెరికా, ఇతర దేశాల ఎల్‌ఎల్‌ఎంలకు, డీప్‌సీక్‌కు ఉన్న ప్రధానమైన తేడా ఏమిటంటే... శిక్షణకు సంబంధించి భిన్నవైఖరి తీసుకోవడం! ఈ వైఖరి కారణంగానే దాని శిక్షణకు అయిన ఖర్చు చాలా తక్కువగా ఉంది. భారత్‌లోని టెక్నాలజీ నిపుణులు గుర్తుంచుకోవాల్సిన అంశాలు స్థూలంగా మూడు. ఏఐలో సృజనను పెంచే అన్ని ప్రాథమిక అంశాల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వండి. ఇందుకు ఏఐలో అత్యున్నత నైపుణ్యం కలిగిన వారు అవసరం. అలాగే మనదైన డేటా సెట్లు, రేపటి తరం రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మంట్‌ దృష్టికోణం కావాల్సి వస్తాయి. ప్రస్తుతం భారత్‌లో అత్యున్నత స్థాయి ఏఐ నైపుణ్యం లేదు. భారతీయ మూలాలున్న ఏఐ నిపుణులు దురదృష్టవశాత్తూ సిలికాన్‌ వ్యాలీలో పనిచేస్తున్నారు. పెర్‌ప్లెక్సిటీ ఏఐ సృష్టికర్త అరవింద్‌ శ్రీనివాస్‌ భారత్‌లో చేపట్టే ఏఐ కార్యకలాపాలకు నిధులు సమకూర్చేందుకు సిద్ధమని అంటున్నాడే కానీ... ఇక్కడకు వచ్చేందుకు మాత్రం ఇష్టపడటం లేదు. అమెరికాలో పెర్‌ప్లెక్సిటీ ఏఐ బాగా పాపులర్‌ కాబట్టి ఈ నిర్ణయం సరైందే అనిపిస్తుంది. కానీ ఏఐ విషయంలో భారత్‌ నుంచి మేధా వలసను అరికట్టేందుకు ఏదైనా చేయాల్సిన అవసరాన్ని కూడా చెబుతోంది ఇది. దేశంలోని టెక్నాలజీ రంగాన్ని సమర్థంగా వినియోగించుకునేందుకు తగిన వ్యూహం కూడా కావాలిప్పుడు! యూపీఐ లాంటి వ్యవస్థల ద్వారా భారత్‌కు సంబంధించిన డేటా పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తున్నా వీటి ఆధారంగా డేటాసెట్లను ఇప్పటివరకూ ఏఐ స్టార్టప్‌లు తయారు చేయలేకపోయాయి. ఇలాంటివే అనేక డేటాసెట్లు వేర్వేరు చోట్ల పడి మూలుగుతున్నాయి. వీటన్నింటినీ ఉపయోగించడం ఎలాగో చూడాలి. అలాగే భారతీయ ఆర్‌ అండ్‌ డీ (పరిశోధన–అభివృద్ధి) రంగానికి కూడా భారీ ప్రోత్సాహకం అవసరం. మోదీ ఆ మధ్య అమె రికా పర్యటనకు వెళ్లినప్పుడు అనుసంధాన్‌ నేషనల్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ , అమెరికాకు చెందిన నేషనల్‌ సైన్‌ ్స ఫౌండేషన్ల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. అలాగే ఏఐలో పరిశోధనలకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వంతోపాటు, ప్రైవేట్‌ రంగం కూడా పెట్టుబడులు పెట్టేలా చేయాలి. ఇవన్నీ చేయడం ద్వారా మాత్రమే సుశిక్షితమైన ఎల్‌ఎల్‌ఎం లేదా ఇంకో వినూత్న ఏఐ ఉత్పత్తి ఆవిష్కృతమవుతుంది. ఇలా చేయడం ద్వారా భారత్‌ ప్రపంచస్థాయిలో తనదైన గుర్తింపు పొందగలుగుతుంది. రెండో విషయం... ఏఐలో వినూత్న ఆవిష్కరణల కోసం ఓపెన్‌ సోర్స్‌ పద్ధతిని అవలంబించడం మేలు. డీప్‌సీక్‌–ఆర్‌1, మిస్ట్రల్‌ వంటివి అన్నీ ఓపెన్‌ సోర్స్‌ పద్ధతిలో అభివృద్ధి చేసినవే. ఇలాంటివి మేలా? ఛాట్‌ జీపీటీ వంటి క్లోజ్డ్‌ సోర్స్‌ ఎల్‌ఎల్‌ఎంలు మేలా అన్న చర్చ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నడుస్తోంది. ఫ్రాన్‌ ్సకు చెందిన మిస్ట్రల్, యూఎస్‌ కంపెనీ మెటా, చైనా కంపెనీ డీప్‌ సీక్‌లు ఓపెన్‌ సోర్స్‌ బాట పట్టాయి. భారత్‌ కూడా ఇదే పద్ధతిని ఎంచుకోవాలి. ఓపెన్‌ సోర్స్‌ ద్వారా భారతీయ స్టార్టప్‌ కంపెనీలు, పరిశోధకులు మెరుగ్గా పోటీపడగలరు. అదే క్లోజ్డ్‌ సోర్స్‌ అనుకోండి... విదేశీ ఏఐలపై ఆధారపడటం మరింత ఎక్కువ అవుతుంది. ఓపెన్‌ సోర్స్‌ బాట పట్టేందుకు యూరప్‌తో పాటు దక్షిణ దేశాలు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి భారత్‌ అందరికీ మేలు చేసేలా ఆ యా దేశాలతో ఏర్పాటు చేసుకోవడం మంచిది.మూడో అంశం... ఏఐలో పోటీతత్వాన్ని పెంచేందుకు భారత్‌ తక్షణం ప్రయత్నాలు మొదలుపెట్టాలి. అంతర్జాతీయ స్థాయిలో ఏఐ నుంచి రక్షణ ఎలా అన్న అంశంపై ప్రస్తుతానికి అంత దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. ప్యారిస్‌ సదస్సులో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ ఏఐపై అమెరికా వైఖరి ఏమిటన్నది సుస్పష్టంగా చెప్పారు. ఈ రంగంలో చైనా పైస్థాయిలో ఉంది కాబట్టి... అమెరికా కూడా ఎలాగైనా ఈ రేసులో తనది పైచేయి అనిపించుకోవాలని చూస్తోంది. ఈ పోటీలో భారత్‌ కూడా తనదైన ప్రత్యేకతను నిరూపించుకోవాలి. ఎప్పటికప్పుడు మారిపోతున్న ఈ పోటీ తీరుతెన్నులను ఒడిసిపట్టుకోకపోతే కష్టమే.అందుకే ఏఐ నైపుణ్యాలను పెంచేందుకు, ఏఐ ఆర్‌ అండ్‌ డీకి సంబంధించి ఏర్పాటు చేసిన సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీల వాడకానికి తగిన వ్యూహం రూపొందించాలి. యూపీఐ వంటి భారత్‌కు మాత్రమే ప్రత్యేకమైన డేటా సాయంతో ఏఐ రంగంలో సృజనకు వీలుకల్పించే వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి. అప్పుడే ప్రపంచం ఏఐ ఆటలో మనల్ని గుర్తించగలదు.అనిరుధ్‌ సూరి వ్యాసకర్త ఇండియా ఇంటర్నెట్‌ ఫండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌

Cybercriminals new tactic targets youth9
క్లిక్‌ చేస్తే అంతే సంగతి!

మీరు సీరియస్‌గా బ్రౌజింగ్‌ చేస్తుండగానో... సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌లో మునిగిఉన్నప్పుడో... ఆకర్షించే విధంగా పాప్‌అప్స్‌ వచ్చాయా..? హఠాత్తుగా మీ ఈ–మెయిల్‌కు గుర్తుతెలియని అడ్రస్‌ నుంచి ‘ఫొటోల’తో కూడిన సందేశం వచ్చిందా..? అలాంటి వాటిని క్లిక్‌ చేసే ముందు ఒక్క క్షణం ఆగండి. ఎందుకంటే అవి మిమ్మల్ని నిలువునా బుక్‌ చేసే ప్రమాదం ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరిస్తున్నారు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు. – సాక్షి, హైదరాబాద్‌ఆ వివరాలు అత్యంత కీలకం ఓ వ్యక్తికి చెందిన సొమ్మును ఆన్‌లైన్‌లో స్వాహా చేయడానికి సైబర్‌ నేరగాళ్లకు అతడి క్రెడిట్‌/డెబిట్‌ కార్డు నంబర్, సీవీవీ కోడ్‌తోపాటు కొన్ని వ్యక్తిగత వివరాలు అవసరం. ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌కు సంబంధించి లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ కచ్చితంగా ఉండాల్సిందే. వీటితోపాటు ఓటీపీ సైతం ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. ఇవి లేకుండా ఆన్‌లైన్‌లో డబ్బు కాజేయడం సాధ్యం కాదు. సాధారణంగా ఈ వివరాల కోసంసైబర్‌ నేరగాళ్లు వివిధ పేర్లు, వెరిఫికేషన్లు అంటూ, బ్యాంకు అధికారుల పేర్లతో ఫోన్లు చేయడం, మెయిల్స్‌ పంపడంతోపాటు సూడోసైట్లు సృష్టించే వారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి అశ్లీలంతో ఎర వేస్తున్నారు. యువతే టార్గెట్‌గా వెబ్‌సైట్లు సైబర్‌ నేరగాళ్ల వలలో యువకులే ఎక్కువగా పడుతున్నారు. వీరిని టార్గెట్‌గా చేసుకుని ఆకర్షించేందుకు కొన్ని అశ్లీల వెబ్‌సైట్లను సైతం నేరగాళ్లు సృష్టిస్తున్నారు. దీని సమాచారం, అర్ధనగ్న, నగ్న చిత్రాలతో కూడిన పాప్‌అప్స్‌ను వివిధ సామాజిక నెట్‌వర్కింగ్‌ సైట్లతోపాటు వెబ్‌సైట్లకు లింక్‌ చేస్తున్నారు. వీటికి ఆకర్షితులవుతున్న యువత వాటిని క్లిక్‌ చేస్తోంది. ఆ తరువాతే అసలు అంకం ప్రారంభమవుతోంది. ఆ సైట్‌లోకి పూర్తిగా లాగిన్‌ కావాలన్నా, అందులో పొందుపరిచిన వీడియోలు, ఫొటోలు ఓపెన్‌ కావాలన్నా కొంత రుసుం చెల్లించాలంటూ ప్రత్యేక లింకు ఇస్తున్నారు. దీంతో డబ్బు చెల్లించడానికి క్రెడిట్‌/డెబిట్‌ కార్డుల వివరాలు, నెట్‌ బ్యాంకింగ్‌కు సంబంధించిన సమాచారాన్ని వినియోగదారులు అందులో పూరిస్తున్నారు. నిగూఢంగా ఉండే ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ కారణంగా ఈ వివరాలన్నీ నేరుగా సైబర్‌ నేరగాళ్లకు చేరుతున్నాయి. ఇవన్నీ వారి చేతికి చిక్కిన తర్వాత ఇక కావాల్సింది ఓటీపీ మాత్రమే. దీనికోసం సదరు వెబ్‌సైట్‌లోనే ప్రత్యేక లింకు ఏర్పాటు చేస్తున్నారు. ఓపక్క ఈ వివరాలతో ఆన్‌లైన్‌ లావాదేవీలు పూర్తి చేసి.. ఓటీపీ వచ్చేలా ఆప్షన్‌ ఎంచుకుని వేచి చూస్తున్నారు. వాళ్లు తమ వెబ్‌సైట్‌లో ఓటీపీని పొందుపరిచిన వెంటనే లావాదేవీ పూర్తి చేసి ఆన్‌లైన్‌లో ఖాతాలోని డబ్బును స్వాహా చేస్తున్నారు. ఈ నేరాలకు పాల్పడే వారు వినియోగిస్తున్న సర్వర్లు విదేశాల్లో ఉంటుండటంతో వారికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడం కూడా అసాధ్యంగా మారుతోందని సైబర్‌ క్రైమ్‌ అధికారులు చెబుతున్నారు. ఈ స్కామ్స్‌ చేయడానికి సైబర్‌ నేరగాళ్లు ప్రత్యేకంగా కొన్ని కాల్‌సెంటర్లు ఏర్పాటు చేసినట్లు అనుమానిస్తున్నారు. వారికి నైతికత ఉండదు ఆన్‌లైన్‌ షాపింగ్, చెల్లింపులను పూర్తి నమ్మకమైన సైట్ల ద్వారానే చేపట్టాలి. అశ్లీల సైట్లు నిర్వహించే వారికి నైతికత ఉండదన్నది గుర్తుంచుకోవాలి. అలాంటి వాళ్లు మీ కార్డులు, ఆన్‌లైన్‌ ఖాతాల వివరాలు తెలిస్తే కచ్చితంగా దురి్వనియోగం చేస్తారు. ఈ తరహా నేరాల్లో మోసపోవడం ఎంత తేలికో... నిందితులు చిక్కడం, నగదు రికవరీ కావడం అంత కష్టం. అప్రమత్తంగా ఉండటం ద్వారానే సైబర్‌ నేరగాళ్లకు చెక్‌ పెట్టొచ్చు. ఇలాంటి అశ్లీల వెబ్‌సైట్ల వల్ల కొన్ని సందర్భాల్లో భయంకరమైన వైరస్‌లు కూడా కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లలోకి వచ్చి చేరతాయి. ఫలితంగా అవి పాడవటంతోపాటు డేటా మొత్తం క్రాష్‌ అయ్యే ప్రమాదం ఉంటుంది. –సైబర్‌ క్రైమ్‌ అధికారులు

Sunrisers Hyderabad suffer fourth consecutive defeat10
‘నాలుగు’తో నగుబాటు

ఇన్నింగ్స్‌లో 12 ఓవర్లు ముగిసేవరకు ఒక్క సిక్స్‌ కూడా లేదు... ఒకదశలో వరుసగా 6 ఓవర్ల పాటు కనీసం ఫోర్‌ కూడా రాలేదు... విధ్వంసక బ్యాటింగ్‌తో మంచినీళ్ల ప్రాయంలా బౌండరీలతో విరుచుకుపడే సన్‌రైజర్స్‌ జట్టేనా ఇది? మొదటి మ్యాచ్‌ తర్వాత గతి తప్పిన బ్యాటింగ్‌తో హైదరాబాద్‌ అదే వైఫల్యాన్ని కనబర్చింది. ఒక్క బ్యాటర్‌ కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఆడలేకపోయారు. ఫలితంగా ఐపీఎల్‌ 18వ సీజన్‌లో వరుసగా నాలుగో ఓటమితో సన్‌రైజర్స్‌ ఆఖరి స్థానంతోనే మరింత అథమ స్థితికి చేరింది. గుజరాత్‌ టైటాన్స్‌కు ఆడుతున్న హైదరాబాదీ పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ తన సొంతగడ్డపై నాలుగు వికెట్లతో చెలరేగి సన్‌రైజర్స్‌ను కుప్పకూల్చాడు. పవర్‌ప్లేలో అతను ఓపెనర్లను అవుట్‌ చేసిన తర్వాత హైదరాబాద్‌ జట్టు కోలుకోలేకపోయింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని గుజరాత్‌ ఆడుతూ పాడుతూ అలవోక­గా ఛేదించింది. గిల్, సుందర్, రూథర్‌ఫోర్డ్‌ రాణించడంతో మరో 20 బంతులు మిగిలి ఉండగానే టైటాన్స్‌ జట్టు గెలుపు ఖాయమైంది. సాక్షి, హైదరాబాద్‌: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఉప్పల్‌ స్టేడియంలోనూ కోలుకోలేకపోయిన జట్టు వరుసగా నాలుగో మ్యాచ్‌లో ఓడింది. ఆదివారం జరిగిన ఈ పోరులో శుబ్‌మన్‌ గిల్‌ సారథ్యంలోని గుజరాత్‌ టైటాన్స్‌ 7 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌పై ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. నితీశ్‌ కుమార్‌ రెడ్డి (34 బంతుల్లో 31; 3 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ మొహమ్మద్‌ సిరాజ్‌ (4/17) పదునైన బౌలింగ్‌తో రైజర్స్‌ను దెబ్బ తీయగా... సాయికిషోర్, ప్రసిధ్‌ కృష్ణ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం టైటాన్స్‌ 16.4 ఓవర్లలో 3 వికెట్లకు 153 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ శుబ్‌మన్‌ గిల్‌ (43 బంతుల్లో 61 నాటౌట్‌; 9 ఫోర్లు), తొలిసారి టైటాన్స్‌ తరఫున ఆడిన వాషింగ్టన్‌ సుందర్‌ (29 బంతుల్లో 49; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) భాగస్వామ్యంతో జట్టు గెలుపు సులువైంది. వీరిద్దరు మూడో వికెట్‌కు 56 బంతుల్లో 90 పరుగులు జోడించారు. గిల్, షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌ (16 బంతుల్లో 35 నాటౌట్‌; 6 ఫోర్లు, 1 సిక్స్‌) కలిసి 21 బంతుల్లో 46 పరుగులు భాగస్వామ్యంతో మ్యాచ్‌ను ముగించారు. ఓపెనర్లు విఫలం... టి20 క్రికెట్‌లో తొలిసారి ట్రవిస్‌ హెడ్‌ (5 బంతుల్లో 8; 2 ఫోర్లు)కు సిరాజ్‌ బౌలింగ్‌ చేశాడు. అయితే ఈ పోరాటం ఐదు బంతులకే పరిమితమైంది. మొదటి ఓవర్లో 2 ఫోర్లు కొట్టిన హెడ్‌ను చివరి బంతికి సిరాజ్‌ అవుట్‌ చేశాడు. ఆ తర్వాత తన మూడో ఓవర్లో అభిషేక్‌ శర్మ (16 బంతుల్లో 18; 4 ఫోర్లు)ను కూడా సిరాజ్‌ వెనక్కి పంపడంతో పవర్‌ప్లే ముగిసేసరికి ఓపెనర్లను కోల్పోయిన హైదరాబాద్‌ 45 పరుగులే చేయగలిగింది. ఆ తర్వాత ఇషాన్‌ కిషన్‌ (14 బంతుల్లో 17; 2 ఫోర్లు) కూడా విఫలమయ్యాడు. ఈ దశలో నితీశ్, హెన్రిచ్‌ క్లాసెన్‌ (19 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్‌) కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే నితీశ్‌ మరీ నెమ్మదిగా ఆడాడు. భారీ షాట్లు ఆడటంలో అతను పూర్తిగా విఫలమయ్యాడు. ఐదో ఓవర్‌ నుంచి 10వ ఓవర్‌ వరకు హైదరాబాద్‌ బ్యాటర్లు ఒక్క ఫోర్‌ కూడా కొట్టలేకపోయారు. 13వ ఓవర్‌ నాలుగో బంతికి గానీ తొలి సిక్స్‌ నమోదు కాలేదు. రషీద్‌ బౌలింగ్‌లో క్లాసెన్‌ ఈ సిక్స్‌ బాదాడు. నాలుగో వికెట్‌కు నితీశ్, క్లాసెన్‌ 39 బంతుల్లో 50 పరుగులు జోడించారు. క్లాసెన్‌ అవుటైన తర్వాత తక్కువ వ్యవధిలో నితీశ్, కమిందు (1), అనికేత్‌ వర్మ (18) కూడా వెనుదిరిగారు. చివర్లో ప్యాట్‌ కమిన్స్‌ (9 బంతుల్లో 22 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌) కాస్త ధాటిగా ఆడటంతో స్కోరు 150 పరుగులు దాటింది. 15–19 ఓవర్ల మధ్య 34 పరుగులే రాబట్టిన రైజర్స్‌ ఇషాంత్‌ వేసిన ఆఖరి ఓవర్లో గరిష్టంగా 17 పరుగులు సాధించింది. భారీ భాగస్వామ్యం... ఛేదనలో టైటాన్స్‌ ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. షమీ తన తొలి ఓవర్లో సాయి సుదర్శన్‌ (5)ను వెనక్కి పంపగా, బట్లర్‌ (0)ను కమిన్స్‌ అవుట్‌ చేశాడు. అయితే సన్‌రైజర్స్‌ ఆనందం ఇక్కడికే పరిమితమైంది. గిల్, సుందర్‌ కలిసి జట్టును విజయం దిశగా నడిపించారు. ఈ క్రమంలో వారికి హైదరాబాద్‌ బౌలర్ల నుంచి ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. సిమర్జిత్‌ ఓవర్లో సుందర్‌ 2 ఫోర్లు, 2 సిక్స్‌లు బాదడంతో 20 పరుగులు వచ్చాయి. పవర్‌ప్లేలో టైటాన్స్‌ స్కోరు 48 పరుగులకు చేరింది. మరోవైపు గిల్‌ కూడా కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. 36 బంతుల్లో అతని హాఫ్‌ సెంచరీ పూర్తయింది. ఎట్టకేలకు షమీ బౌలింగ్‌లో అనికేత్‌ అద్భుత క్యాచ్‌తో వెనుదిరిగిన సుందర్‌ అర్ధ సెంచరీని చేజార్చుకున్నాడు. 41 బంతుల్లో 47 పరుగులు చేయాల్సిన స్థితిలో క్రీజ్‌లోకి వచ్చిన రూథర్‌ఫోర్డ్‌ చెలరేగిపోయాడు. అభిషేక్‌ ఓవర్లో అతను 4 ఫోర్లు బాదడం విశేషం. ఆ తర్వాత మ్యాచ్‌ ముగించేందుకు టైటాన్స్‌కు ఎక్కువ సమయం పట్టలేదు. 19 ఐపీఎల్‌ టోర్నీ చరిత్రలో 100 వికెట్లు పడగొట్టిన 19వ భారతీయ బౌలర్‌గా, ఓవరాల్‌గా 26వ బౌలర్‌గా సిరాజ్‌ గుర్తింపు పొందాడు. ఇప్పటి వరకు 97 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడిన సిరాజ్‌ మొత్తం 102 వికెట్లు పడగొట్టాడు. 4/17 ఐపీఎల్‌ చరిత్రలో సిరాజ్‌ తన అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శన నమోదు చేశాడు. 2023లో పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 21 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. స్కోరు వివరాలుసన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: అభిషేక్‌ (సి) తెవాటియా (బి) సిరాజ్‌ 18; హెడ్‌ (సి) సుదర్శన్‌ (బి) సిరాజ్‌ 8; ఇషాన్‌ కిషన్‌ (సి) ఇషాంత్‌ (బి) ప్రసిధ్‌ 17; నితీశ్‌ రెడ్డి (సి) రషీద్‌ (బి) సాయికిషోర్‌ 31; క్లాసెన్‌ (బి) సాయికిషోర్‌ 27; అనికేత్‌ (ఎల్బీ) (బి) సిరాజ్‌ 18; కమిందు (సి) సుదర్శన్‌ (బి) ప్రసిధ్‌ 1; కమిన్స్‌ (నాటౌట్‌) 22; సిమర్జిత్‌ (బి) సిరాజ్‌ 0; షమీ (నాటౌట్‌) 6; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 152. వికెట్ల పతనం: 1–9, 2–38, 3–50, 4–100, 5–105, 6–120, 7–135, 8–135. బౌలింగ్‌: సిరాజ్‌ 4–0–17–4, ఇషాంత్‌ శర్మ 4–0–53–0, ప్రసిధ్‌ కృష్ణ 4–0–25–2, రషీద్‌ ఖాన్‌ 4–0–31–0, సాయికిషోర్‌ 4–0–24–2. గుజరాత్‌ టైటాన్స్‌ ఇన్నింగ్స్‌: సాయిసుదర్శన్‌ (సి) అనికేత్‌ (బి) షమీ 5; గిల్‌ (నాటౌట్‌) 61; బట్లర్‌ (సి) క్లాసెన్‌ (బి) కమిన్స్‌ 0; సుందర్‌ (సి) అనికేత్‌ (బి) షమీ 49; రూథర్‌ఫోర్డ్‌ (నాటౌట్‌) 35; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (16.4 ఓవర్లలో 3 వికెట్లకు) 153. వికెట్ల పతనం: 1–15, 2–16, 3–106. బౌలింగ్‌: షమీ 4–0–28–2, కమిన్స్‌ 3.4–0–26–1, సిమ్రన్‌జీత్‌ 1–0–20–0, ఉనాద్కట్‌ 2–0–16–0, అన్సారీ 4–0–33–0, కమిందు మెండిస్‌ 1–0–12–0, అభిషేక్‌ శర్మ 1–0–18–0. ఐపీఎల్‌లో నేడుముంబై X బెంగళూరు వేదిక: ముంబై రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement