
అన్నదాతలు బాబును నమ్మే స్థితిలో లేరు
పలుమార్లు హామీలు ఇచ్చి మోసం చేసిన సీఎం చంద్రబాబును నమ్మే పరిస్థితిలో అన్నదాతలు లేరని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.
రెంటచింతల: పలుమార్లు హామీలు ఇచ్చి మోసం చేసిన సీఎం చంద్రబాబును నమ్మే పరిస్థితిలో అన్నదాతలు లేరని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం స్థానిక అంబేద్కర్‌నగర్‌కాలనీలో రూ.24లక్షలతో నిర్మించే సిసి రోడ్డుకు ఆయన భూమి పూజ చేశారు. అనంతరం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ రాజధానికి బలవంతంగా రైతుల నుంచి భూములు తీసుకోవడానికి ప్రయత్నించడం అమానుషమన్నారు. ల్యాండ్ పూలింగ్‌కు చట్టబద్దత ఉందా అని ప్రశ్నించారు. సన్నకారు, పేదరైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజధానికోసం భూసేకరణకు సంబంధించి రెవెన్యూ మంత్రి కె.కృష్ణమూర్తిని పక్కనపెట్టడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. అన్నదాతలను ఆదుకొనేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా తణుకులో చేపట్టిన దీక్షను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఆచరణ సాధ్యంకాని హామీలు ఇవ్వడం వలనే రాష్ట్రప్రభుత్వం పీకలలోతు ఆర్థిక భారంతో కుంగిపోయిందన్నారు.
పలనాడుకు ప్రత్యేకప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్‌చేశారు. గురజాలను జిల్లాగా ప్రకటించడంతో పాటు భారీగా నిధులు కేటాయించాలని కోరారు. సమావేశంలో జడ్‌పిటిసి సభ్యుడు నవులూరి భాస్కర్‌రెడ్డి, సర్పంచ్ గుర్రాల రాజు, ఎంపిటిసి సభ్యుడు రోజర్ల రామారావు, పాస్టర్ ప్రభుదాసు తదితరులు పాల్గొన్నారు.