ఉత్కంఠభరితంగా కోడిపోరు
కారంపూడి : పల్నాటి వీరారాధన ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన కోడిపోరు సోమవారం వీరులగుడి ఆవరణలో జరిగింది. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పీఠాధిపతి తరుణ్ చెన్నకేశవ తదితరులు బ్రహ్మనాయుడు పక్షాన చిట్టిమల్లు పుంజును, నాగమ్మ వేషంలో ఉన్న ఆచారవంతుడు ముక్కంటి తదితరులు నాగమ్మ పక్షాన శివంగిడేగను పందేనికి వదిలారు. వీరవిద్యావంతులు కృష్ణమూర్తి, నరసింహ, చిన్నప్ప కోడిపోరు క థాగానాన్ని ఆలపించారు.
వేలాదిగా వీరాచారవంతులు, తిరునాళ్లకు వచ్చిన జనం కోడిపోరు ను వీక్షించారు. తొలుత గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు వస్తున్నారనే సమాచారంతో చాలాసేపు పీఠం నిర్వాహకుడు విజయ్‌కుమార్ పందేలను ఆపారు. వారు రావడం ఆలస్యమవుతుందనే సమాచారంతో ఎమ్మెల్యే పీఆర్కే, ఇతర పెద్దలతో పోటీ నిర్వహించారు.
ఈ కార్యక్రమం పూర్తయిన కొద్దిసేపటికి ఎమ్మెల్యేలు యరపతినేని, జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్ అక్కడికి చేరుకున్నారు. వీరులగుడిలో పూజలు జరిపి మళ్లీ కోడిపోరుకు సిద్ధమయ్యారు. తిరిగి పీఠాధిపతిని, ఆచారవంతులను పిలిపించి కోడిపందేలు నిర్వహించారు. సుదీర్ఘ చరిత్ర ఉన్న పల్నాటి ఉత్సవాల్లో ఇలా రెండోసారి కోడి పోరు జరపడం ఇదే ప్రథమమని ఆచారవంతులు తెలిపారు.
అరుదైన పల్నాటి వీరాచారాన్ని పరిరక్షించాలి: ఎమ్మెల్యే పీఆర్కే
పల్నాటి వీరాచారం గొప్పదని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చెప్పారు. ఏ ఉత్సవాలకు లేనివిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో ఉన్న వీరాచారవంతులు పల్నాటి ఉత్సవాలకు రావడం విశేషమన్నారు. ఈ చారిత్రక వారసత్వాన్ని భావితరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
కోడిపోరు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వపరంగా ఉత్సవాలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుత ప్రభుత్వం పల్నాటి చరిత్ర అభివృద్ధికి, ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.