రాష్ట్ర విభజనకు తాను వ్యతిరేకం కాదని ప్రకటన చేసిన మరుసటిరోజే టీడీపీ ఎంపీ నందమూరి హరికృష్ణ మాటమార్చారు. కాంగ్రెస్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు తాను వ్యతిరేకం కాదని ప్రకటన చేసిన మరుసటిరోజే టీడీపీ ఎంపీ నందమూరి హరికృష్ణ మాటమార్చారు. కాంగ్రెస్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామాకు ఆదివారం ఉదయం 8.46 గంటలకు ముహూర్తంగా నిర్ణయించుకున్న హరికృష్ణ సరిగ్గా అదే సమయానికి రాజీనామా పత్రాలపై సంతకం చేసి తన తండ్రి ఎన్టీఆర్ సమాధిపై ఉంచారు. అనంతరం ఎన్టీఆర్ ఘాట్ వద్దే మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజనకు నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు పేర్కొంటూ ఆ పత్రాలను రాజ్యసభ చైర్మన్, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు పంపిస్తున్నట్లు ప్రకటించారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటానని ఒక ప్రశ్నకు పరోక్షంగా జవాబిచ్చారు.
‘‘అన్నదమ్ములను విడగొట్టేందుకు విషప్రయోగం జరిగింది. ఒక్క గడ్డిపోచ ఏమీ చేయలేదు. అనేక గడ్డిపోచలు కలిస్తేనే బలంగా తయారవుతాయి. సమైక్యతలో ఉన్న మాధుర్యం, గొప్పదనం విడిపోతే ఉండదు. కొందరు స్వార్థపరుల నాటకంలో భాగస్వామ్యం అయ్యాం. సోనియాగాంధీ దుష్టశక్తిగా వచ్చి తన కొడుకును ప్రధానమంత్రి చేసేందుకు అన్నదమ్ములను విడదీశారు. ఢిల్లీ ఏసీ రూముల్లో కూర్చుని కళ్లకు గంతలు కట్టుకున్నవారు విభజనపై నిర్ణయం తీసుకున్నారు. నీటివాటాలు, ఉద్యోగాలు, రాష్ట్ర అప్పులను ఏం చేస్తారు?’ అని ప్రశ్నించారు. రాష్ట్ర విభజనకు టీడీపీ అనుకూలంగా నిర్ణయం తీసుకుందని గుర్తు చేయగా.. తన రాజీనామా గురించి మాత్రమే మాట్లాడాలని కోరారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటారా? అని ప్రశ్నించగా..‘ఎందుకు పాల్గొనకూడదు?’ అని ఎదురు ప్రశ్నవేశారు.