
ఒబామా పర్యటనపై లెఫ్ట్ నిరసనలు
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటనను వ్యతిరేకిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో శనివారం రాష్ర్టవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి.
- రాష్ట్రవ్యాప్తంగా వామపక్షాలు, ప్రజా సంఘాల నిరసనలు
- పలుచోట్ల ఒబామా, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనం
సాక్షి నెట్‌వర్క్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటనను వ్యతిరేకిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో శనివారం రాష్ర్టవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. ‘ఒబామా గోబ్యాక్’, ‘మానవాళి శత్రువు గోబ్యాక్’ అంటూ నాయకులు పెద్ద ఎత్తున నినదించారు. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని విద్యుత్ అమరవీరుల స్తూపం నుంచి సమీపంలోని బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహం వరకు తమ్మినేని వీరభద్రం (సీపీఎం), అజీజ్‌పాషా (సీపీఐ), మురహరి (ఎస్‌యూసీఐ-యూ), దయానంద్ (ఫార్వర్డ్‌బ్లాక్), సిద్ధులు (లిబరేషన్), జానకిరాములు (ఆర్‌ఎస్‌పీ) ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు అనంతరం ఒబామా దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ ఒబామాకు తాము వ్యతిరేకం కాదని, ఆయన సామ్రాజ్యవాదానికి, అమెరికాకు అధినేతగా ఉన్నందుకే వ్యతిరేకిస్తున్నామన్నారు. నియంతృత్వవాదిగా వివిధ దేశాలపై దాడులు చేసి వారి హక్కులను హరిస్తున్నారని విమర్శించారు. సీపీఐ నేత అజీజ్‌పాషా మాట్లాడుతూ ఒబామా పర్యటన వల్ల కార్పొరేట్ సంస్థలకు లాభం తప్ప సామాన్యులకు ఏం ప్రయోజనం ఉండదన్నారు.
కాన్సులేట్ కార్యాలయం వద్ద నారాయణ, ప్రభృతుల అరెస్ట్..
ఒబామా పర్యటనను నిరసిస్తూ బేగంపేటలోని అమెరికా కాన్సులేట్ కార్యాలయం సమీపంలో ధర్నా నిర్వహించిన సీపీఐ నాయకులు కె.నారాయణ, గుండా మల్లేశ్, టి.వెంకటరాములు, ఎన్. బాలమల్లేష్, డా.సుధాకర్ తదితరులను పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడినుంచి వారిని బొల్లారం పీఎస్‌కు తరలించారు. ఆయా ఒప్పందాలతో దేశాన్ని దోచుకునేందుకు వస్తున్న ఒబామాకు కేంద్రం రెడ్‌కార్పెట్ పరచడం సిగ్గుచేటని ఈ సందర్భంగా నారాయణ ధ్వజమెత్తారు.
సామ్రాజ్యవాద అమెరికాకు మోదీ ప్రభుత్వం గులాంగిరీ చేస్తున్నదని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ర్టకార్యదర్శి రాయల సుభాష్ చంద్రబోస్ విమర్శించారు. ప్రపంచ ప్రజలను పీడిస్తున్న ఒబామాను గణతంత్ర దినోత్సవానికి ముఖ్యఅతిథిగా ఆహ్వానించడం సిగ్గుచేటన్నారు ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీని నిర్వహించి, ఆర్టీసీ క్రాస్‌రోడ్డు కూడలి వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఒబామా పర్యటనను నిరసిస్తూ తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ వామపక్షాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు, దిష్టిబొమ్మ దహనం కార్యక్రమాలు నిర్వహించారు.