
హైదరాబాద్, సాక్షి: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో తెలంగాణ సర్కార్ తీరు దారుణంగా ఉందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు మండిపడ్డారు. ప్రభుత్వ భూమి అయితే దొంగల్లాగా ఎందుకు ముందుకు పోతున్నారు? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారాయన. గురువారం ఉదయం తెలంగాణ భవన్‌లో హెచ్‌సీయూ(HCU) భూముల ఆందోళనలపై కేటీఆర్ మాట్లాడారు.
.. పేరుకే ప్రజా పాలన.. ఎక్కడా ప్రజాస్వామ్య స్ఫూర్తి కనిపించడం లేదు. హైదరాబాద్ భవిష్యత్తు కోసం విద్యార్థులు కొట్లాడుతున్నారు. విద్యార్థుల ఆందోళనను సర్కార్ పట్టించుకోవడం లేదు. ప్రజా పాలన అంటే విద్యార్థులపై దాడి చేయడమా?. ఇంత జరుగుతున్నా రాహుల్ గాంధీ ఎక్కడున్నారు?. ఫ్యూచర్ సిటీ కోసం 14 వేల ఎకరాల భూమి ఉండగా.. హెచ్‌సీయూలో ఉన్న ఆ 400 ఎకరాలే ఎందుకు?.ఆ 400 ఎకరాల భూముల్లోమూగజీవాలు కనిపించడం లేదా? అని కేటీఆర్(KTR) ప్రశ్నించారు.
.. ఇది హైదరాబాద్ భవిష్యత్తు కోసం జరుగుతున్న పోరాటం. ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే పోరాటం ఉధృతం చేస్తాం. కంచ గచ్చిబౌలి(Kancha Gachibowli) భూములు ఎవరూ కొనొద్దు. ఆ భూమి ఎవరు కొన్నా నష్టపోతారు. మేం అధికారంలోకి రాగానే ఆ 400 ఎకరాలు తిరిగి తీసుకుంటాం. మేము వచ్చాక అతిపెద్ద ఎకోపార్క్ ఏర్పాటు చేస్తాం. అద్భుతంగా తీర్చిదిద్ది హెచ్‌సీయూకి కానుకగా ఇస్తాం’’ అని కేటీఆర్ ప్రకటించారు. బీఆర్‌ఎస్ హయాంలో కోట్ల మొక్కలు నాటి హరిత విప్లవం చేపడితే.. అప్పుడు హైదరాబాద్‌కు గ్రీన్ సిటీ అవార్డు వచ్చింది అని ఆయన గుర్తు చేశారు.
