రామడుగు ప్రాజెక్ట్ ఆయకట్టు కింద రబీ సీజన్‌కు ఐదు వేల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు రైతులకు అధికారులు భరోసా ఇస్తున్నారు
రామడుగు ప్రాజెక్ట్(ధర్పల్లి), న్యూస్‌లైన్:
రామడుగు ప్రాజెక్ట్ ఆయకట్టు కింద రబీ సీజన్‌కు ఐదు వేల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు రైతులకు అధికారులు భరోసా ఇస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ 1278.50 అడుగుల పూర్తిస్థాయి నీటి మట్టం ఉంది. ప్రాజెక్ట్ లో నీటిమట్టం పూర్తి స్థాయిలో ఉండటంతో ఆయకట్టు కింద రబీ పంటలకు ఎక్కువ మొత్తంలో సాగునీటిని అందించేందుకు ఇరిగేషన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయకట్టు పాలక వర్గం రద్దు కావటంతో ప్రాజెక్ట్ కింద గ్రామాల్లోని గ్రామకమిటీతో సమావేశం నిర్వహించి, సాగునీటి విడుదలపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. ఇరిగేషన్ అధికారులు వారం రోజుల్లో గ్రామ కమిటీ లతో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఆయకట్టు కింద ఈ రబీ కింద ఐదు వేల ఎకరాలకు సాగునీటిని అందించనున్నారు. గత రబీ కింద నాలుగు వేల ఎకరాల్లో పంటలకు సాగునీటిని అందించారు.
ఈసారి ప్రాజెక్ట్ నిండు కుండలా ఉండటంతో మరో వెయ్యి ఎకరాలకు సాగునీటిని అందిస్తామని అధికారులు భరోసా ఇస్తున్నారు. రబీ పంటలకు ఆయకట్టు కింద గ్రామాల చెరువులకు నీటి విడుదల చేసి రబీ పంటల సాగుకు భరోసా కల్పించేందుకు అధికారులు యోచిస్తున్నారు. కుడి కాలువ కింద మనోహరబాద్, ఎడుమ కాలువ కింద బడాభీంగల్ వరకు రబీ పంటలకు సాగునీటిని విడుదల చేయనున్నారు. ప్రాజెక్ట్ ఆయకట్టు మొత్తం ఏడు వేల ఎకరాలు ఉంది. ఖరీఫ్ పంటలకు పూర్తి స్థాయిలో నీటిని అందించగా, రబీలో ఐదు వేల ఎకరాలకు సాగునీటిని అందించేలా అధికారులు ప్రణాళిలు తయారు చేసుకున్నా రు. ఇప్పటికే ఆయకట్టు కింద రైతులు రబీ పంటల సాగును సిద్ధం అవుతున్నారు.
ప్రాజెక్ట్ నిండు కుండలా ఉండటంతో ఆయకట్టు రైతులు పంటల సాగుపై ఆసక్తి చూపుతున్నారు. పంటల సాగు కోసం నారుమళ్లను సిద్ధం చేసుకుంటున్నారు. ఆయకట్టు సమావేశాన్ని వెంటనే నిర్వహించి, సాగునీటి విడుదలపై స్పష్టమైన నిర్ణయాన్ని ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రాజె క్ట్ ఆయకట్టు పాలకవర్గం లేకపోవటంతో రబీ సాగుపై నిర్వహించే సమావేశం ఆలస్యం జరుగుతుందని రైతులు అంటున్నారు. రైతులుకు వెంటనే నిర్ణయాన్ని వెల్లడించాలని రైతులు కోరుతున్నారు.