Farmers' Suicides
-
పండించారు... వడ్డించారు!
రైతుకు కొత్త నిర్వచనం కావాలి. వ్యవసాయానికి కొత్త అర్థం చెప్పాలి. మహిళ సాగు చేస్తే నేల పులకిస్తుంది. గాజుల చేతిలో గరిటే కాదు... నాగలి కూడా గర్వంగా చాలుదీరుతుంది. అనంతపురంలో మహిళలు ‘ఆదర్శసాగు’ చేస్తున్నారు. ఆరోగ్యం కోసం ఏం తినాలో ఎలా తినాలో నేర్పిస్తున్నారు. దేశానికి పట్టుగొమ్మలు గ్రామాలు. వినడానికి బావుంటుంది. దేశానికి కంచంలో అన్నంగా మారేది గ్రామాల్లోని వ్యవసాయ క్షేత్రాలే... కాబట్టి గ్రామానికి, రైతుకి అంతటి గుర్తింపు వచ్చింది. మరి అదే పొలం రైతుకి సమాధి అవుతుంటే వ్యవసాయం బతికి బట్టకట్టేదెలా? నాగలి కర్రు రైతు గుండెను చీలుస్తుంటే భూమిలో బంగారం పండేదెప్పుడు? రైతు వాణిజ్య పంటల మాయలో పడి అప్పుల పాలైతే ఆ రైతుని, ఎరువులతో కలుషితమైన ఆ భూమిని కాపాడేదెవరు? పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలనే కసితో రైతు మహిళలు ఆ పనిని చేపట్టారు. భర్తను మింగేసిన పంటపొలాల్లోనే భవితను వెతుక్కుంటున్నారు. సంఘటితంగా వ్యవసాయం చేస్తూ దిగుబడితో లాభాలు కళ్ల చూస్తున్నారు. ఇది అనంతపురంలోని మహిళలు సాధించిన విజయం. వాళ్లకు దారి చూపిన భానుజ సంకల్పం. అనంతపురం జిల్లా, రూరల్ మండలం, కురుగుంట్ల గ్రామం. ఒకప్పుడు రైతుల ఆత్మహత్యలను చూసిన గ్రామం. ఇప్పుడు ఆ రైతు కుటుంబాల మహిళలు నిర్వహిస్తున్న రెస్టారెంట్‌ను చూస్తోంది. ఆ రెస్టారెంట్లో వంటకు అవసరమైన ధాన్యాలను పండిస్తున్న వ్యవసాయ క్షేత్రాలను చూస్తున్నారు. ఈ విజయాన్ని ‘చెరువు భానుజ’... సాక్షితో పంచుకున్నారు. ‘ఒంటరి’ పోరాటం! ‘‘భర్త వాణిజ్య పంటలతో నష్టాల ఊబిలో కూరుకుపోయి, అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటే... అగమ్యగోచరంగా, అచేతనంగా మిగిలిన వాళ్లకు అండగా నిలిచాను. సింగిల్ పేరెంట్‌గా పిల్లల పోషణ బాధ్యతను మోస్తున్న మహిళలే వీరంతా. భర్తను కోల్పోయిన వాళ్లకు తక్షణ సహాయం చేస్తూ, ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయం కోసం కార్యాలయాలకు వెళ్లి పని చేయించడం వరకు తోడుగా ఉంటున్నాను. అంతటితో ఆ కుటుంబం గట్టెక్కదు. ఉపాధి కావాలి, వాళ్లకు వచ్చిన పని వ్యవసాయమే. అయితే పొలం లేదు. దాంతో కలెక్టివ్ ఫార్మింగ్ కోసం పొలం లీజుకు తీసుకున్నాం. వ్యవసాయ క్షేత్రాలకు ‘పుడమి తల్లి, మన భూమి’ అని పేర్లు పెట్టుకుని సేద్యం మొదలు పెట్టాం. తక్కువ ఖర్చుతో పంట చేతికి రావడానికి మిల్లెట్స్ సాగు, ఏడాది పొడవుగా రాబడి కోసం కూరగాయలు, పండ్లు సాగు చేస్తున్నాం. మా ప్రయాణంలో అసలైన టర్నింగ్ పాయింట్ ఇక్కడే. పంటతో ఆపేయకుండా వంట కూడా మొదలుపెట్టాం. మార్కెట్ పుట్టింది! హరిత విప్లవంతో మనదైన సాగు కనుమరుగైంది. మిల్లెట్స్ సాగు మర్చిపోయాం, విత్తనాలు అంతరించే దశకు చేరుకున్నాయి. ఇక ఈ వంటల గురించి ఈ తరానికి తెలియనే తెలియదు. ప్రభుత్వ సంస్థల సహకారంతో విత్తనాలు సేకరించాను. సేద్యం తెలిసిన మహిళలు కావడంతో సాగులో పెద్దగా ఇబ్బందులు రాలేదు. కానీ వీటిని ఎలా వండాలో నేర్పించడానికి మాస్టర్ షెఫ్‌లతో శిక్షణ ఇప్పించి మరీ కురుకుంట్లలో రెస్టారెంట్ పెట్టాం. రెస్టారెంట్ పెట్టడానికి ముందు ఆ ఊరిని డయాబెటిక్ ఫ్రీ విలేజ్‌గా మార్చాలనే సంకల్పంతో ఉచితంగా వండిపెట్టాం. డైటీషియన్లు సూచించినట్లు చిరుధాన్యాల వంటలను మూడుపూటలా తినాల్సిన మెనూను వండి వడ్డించాం. నాలుగవ వారానికి షుగర్ లెవెల్స్ అదుపులోకి రావడాన్ని స్వయంగా తెలుసుకున్నారు పేషెంట్లు. మిల్లెట్స్ పట్ల గ్రామస్థుల్లో అవగాహన కోసం చేసిన ప్రయత్నం అది. అయితే ఆ భోజనం తిన్న వాళ్లు, తెలిసిన వాళ్లు రెస్టారెంట్ పెట్టమని సూచించారు. మా మహిళలు కూడా ఉత్సాహంగా ముందుకొచ్చారు. అలా రెండు నెలల కిందట ‘పుడమి తల్లి మిల్లెట్ హోటల్’ ప్రారంభమైంది. ‘ఆర్థిక భద్రత, ఆహార భద్రత, ఆరోగ్య భద్రత’ మా ట్యాగ్‌లైన్. ఊహించనంత గొప స్పందన వచ్చింది. ఆఫీసర్లు కూడా వచ్చి భోజనం చేస్తున్నారు. హోటల్ అనేక ప్రదేశాల్లో శాఖలు తెరవమని అడుగుతున్నారు. కానీ అది ఇప్పట్లో సాధ్యం కాదు. ఎందుకంటే హోటల్ మరో శాఖ ప్రారంభం కావాలంటే అందుకు తగిన వ్యవసాయ క్షేత్రాన్ని విస్తరించాలి. ఇప్పుడు మేము సాగు చేస్తున్న పొలంలో సహజమైన సేంద్రియ పద్ధతుల్లో పండినవే మా రెస్టారెంట్లో వండుతున్నాం. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ నాలుగు శాఖల్లో మొత్తం 1800 మంది రైతుమహిళలు మాతో సంఘటితమై ఉన్నారు. వారందరికీ ఉపాధిమార్గాల అన్వేషణ కోసం విస్తృతంగా పని చేయాల్సి ఉంది. వెలుగు పుట్టింది! ‘సూర్యోదయం అవుతున్నప్పుడు పుట్టింది, ఇంటికి వెలుగు తెస్తుంద’ని... మా నాన్న నాకు భానుజ అని పేరు పెట్టారు. మాది అనంతపురం జిల్లా, నల్లమాడ మండలం, బడవాండ్ల పల్లి. నాన్న చదువుకున్నది తక్కువే, కానీ కమ్యూనిస్ట్ నేపథ్యంలో చాలా నేర్చుకున్నారాయన. పాటలు రాసి పాడేవారు. చిన్నప్పుడు నాన్నతో సమావేశాలకు వెళ్లేదాన్ని. ఆ జ్ఞానమే నన్ను ఇలా తీర్చిదిద్దింది. సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకుంటున్నప్పుడు, సందర్శనకు వచ్చన అధికారులకు మా హాస్టల్లో వసతులలేమిని చెప్పే ధైర్యం ఉండేది. టెన్త్ చదువుతూనే యంగ్ ఇండియా సంస్థలో వాలంటీర్‌గా పని చేశాను. అమ్మ పట్టుపట్టి ఇంటర్లో చదువాపించి మరీ పెళ్లి చేసింది. కానీ నేను గృహిణిగా ఇంటికే పరిమితం కాకుండా సామాజిక కార్యకర్తనయ్యాను. మహిళలు, పిల్లలు, దళితుల ఉన్నతి కోసం పని చేయాలనే ఉద్దేశంతో 1996లో రెడ్స్ స్థాపించాను. ట్రాఫికింగ్‌కి గురైన మహిళలను కాపాడడం నుంచి, డ్వాక్రా సంఘాల ఏర్పాటు, ఉమ్మడి అటవీ సంరక్షణ వంటి కార్యక్రమాల్లో చురుగ్గా పని చేశాను. మహిళల అక్రమ రవాణాకు పాల్పడిన ఏజెంట్లు కదిరిలో నా ఇంటిని కాల్చేశారు. దాంతో నా నివాసం అనంతపూర్ పట్టణానికి మారింది’’ అని తన సమాజ సేవాయాత్రను వివరించారు భానుజ. – వాకా మంజులారెడ్డి -
కౌలు రైతు దంపతుల ఆత్మహత్య
వైఎస్ఆర్ జిల్లా , గాలివీడు : గోరాన్‌చెరువు గ్రామం బీసీ కాలనీకి చెందిన పందికుంట యర్రంరెడ్డి(59), రెడ్డమ్మ(50) సోమవారం అర్ధరాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు వివరాలు.. మృతుడు యర్రంరెడ్డి కౌలుకు తీసుకున్న 5 ఎకరాలతో పాటు తన తల్లిపేరుతో ఉన్న రెండు ఎకరాల భూమిలో టమాట, వేరుశనగ పంటలు సాగు చేశాడు. ఇందుకోసం రూ, 6 లక్షలు అప్పు చేశాడు. నాలుగు సంవత్సరాల నుంచి సరైన వర్షాలు లేవు. సాగు చేసిన పంట చేతికి రాలేదు. అప్పుల భారం ఎక్కువైంది. మరోవైపు రూ లక్ష వ్యయంతో రెండేళ్ల కిందట మూడు పాడి ఆవులు కొనుగోలు చేసి జీవనం సాగిస్తున్నాడు. సంవత్సరం కిందట పాడి ఆవులు మృత్యువాతపడ్డాయి. అప్పు చెల్లించాల్సిన గడువు సమీపించడంతో ఏమి చేయాలో దిక్కుతోచలేదు. దీంతో సోమవారం అర్ధరాత్రి సమయంలో ఊరిబయట చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరికి ముగ్గురు కుమారులు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ రహంతుల్లా, సీఐ యుగంధర్, ఎస్ఐ ఇనాయతుల్లా, ఏఓ మధుసూధన్ మంగళవారం సంఘటన స్ధలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం లక్కిరెడ్డిపల్లె ప్రభుత్వ ఆసుప్రతికి తరలించారు. -
మరాఠ్వాడాలో మరణ మృదంగం
సాక్షి ముంబై: మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో నెల రోజుల వ్యవధిలోనే 300 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. అసెంబ్లీ ఎన్నికల పలితాల అనంతరం అధికారం కోసం ఒకవైపు కుమ్ములాటలు కొనసాగుతున్న సమయంలోనే ఒకటీ రెండూ కాదు.. ఏకంగా 300 మంది రైతులు ప్రాణాలు తీసుకున్నారని రాష్ట్ర రెవెన్యూ యంత్రాంగం ప్రకటించింది. 2019 అక్టోబరు 14 నుంచి 2019 నవంబరు 11వ తేదీ వరకు ఒక్క మరాఠ్వాడా ప్రాంతంలోనే 68 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అయితే, 2019 నవంబరు నెలలో 300 రైతులకు ఆత్మహత్యలకు పాల్పడ్డారనే దిగ్భ్రాంతికర విషయాన్ని రెవెన్యూ శాఖ శుక్రవారం వెల్లడించింది. అక్టోబర్‌లో అకాల వర్షాల కారణంగా మరాఠ్వాడాలో 70 శాతం ఖరీఫ్ పంటలకు నష్టం వాటిల్లింది. దీంతో అక్టోబర్, నవంబర్ నెలలో ఆత్మహత్యలు 61 శాతం వరకు పెరిగినట్లు పేర్కొంది. ఇలా ఒకే నెలలో 300 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడటం 2015లోనూ చోటుచేసుకుందని తెలిపింది. -
ఏపీలో 409 మంది రైతుల ఆత్మహత్య: కేంద్రం
సాక్షి, ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన నాలుగేళ్ళ కాలంలో 409 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడినట్లు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయమంత్రి పురోషత్తమ్ రూపాల శుక్రవారం రాజ్యసభలో ప్రకటించారు. ఏపీలో రైతుల ఆత్మహత్యలపై వైఎస్సార్సీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు సమాధానం ఇచ్చారు. గడచిన నాలుగేళ్ళ కాలంలో రాష్ట్రంలో 2 వేల మందికి పైగా రైతులు బలవన్మరణానికి పాల్పడిన విషయం కేంద్ర ప్రభుత్వం దృష్టికి వచ్చిందా? రైతు రుణమాఫీ పథకం అమలులో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యంతోపాటు రుణాల ఊబిలో కూరుకుపోవడమే రైతు ఆత్మహత్యలకు కారణాలన్న విషయం వాస్తవమేనా అంటూ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. రైతు ఆత్మహత్యలపై ఏపీ ప్రభుత్వం అందించిన సమాచారాన్ని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో, జిల్లా స్థాయిలో ఏర్పాటైన త్రిసభ్య సంఘం సమర్పించిన నివేదికల ప్రకారం 409 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు మంత్రి వెల్లడించారు. ‘2014 నుంచి 2018 వరకు 409 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. బోరు బావుల వైఫల్యం, భారీ ఖర్చుతో వాణిజ్య పంటల సేద్యం, పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభ్యం కాకపోవడం, నోటిమాటతో చేపట్టే కౌలు సేద్యం, బ్యాంకు రుణాలు పొందే అర్హత లేకపోవడం, ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల నుంచి అధిక వడ్డీకి రుణాలు తీసుకోవడం, వర్షాభావం, అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలు, పిల్లల చదువుల కోసం భారీగా వ్యయం, అనారోగ్యం వంటి అంశాలే రైతుల ఆత్మహత్యకు ప్రధాన కారణాలు. ఈమేరకు వివిధ జిల్లాలకు చెందిన త్రిసభ్య సంఘాలు గుర్తించాయి. వ్యవసాయం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశం. వ్యవసాయ రంగం అభివృద్ధి ఆయా రాష్ట్రాల ప్రాధమిక బాధ్యత. అయితే తగిన విధానపరమైన చర్యలు, బడ్జెట్ మద్దతు ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలు అమలు చేసే కార్యక్రమాలకు తోడ్పాటును అందిస్తుంద’ని కేంద్ర మంత్రి తెలిపారు. -
గాంధీ భవన్ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం
-
పంట పొలాల్లో మృత్యుగీతం
సాక్షి, అమరావతి: పచ్చటి పంటలు పండాల్సిన పొలాల్లో చావు డప్పు మోగుతోంది. బ్యాంకుల్లో రుణాలు మాఫీ కాకపోవడం.. కొండల్లా పెరిగిపోతున్న అప్పుల భారం.. పంటలకు గిట్టుబాటు ధరలు దక్కకపోవడం వంటి కారణాలతో రైతన్నలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో ఇప్పటిదాకా 28 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం. కష్టాల సాగు చేయలేక అన్నదాతలు పిట్టల్లా రాలిపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం చలించడం లేదు. తనువు చాలించిన రైతుల కుటుంబాలను ఆదుకోవడం మాట అటుంచి.. కనీసం పరామర్శించేందుకైనా సీఎం, మంత్రులకు తీరిక చిక్కడం లేదు. రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో వృద్ధి నానాటికీ పెరిగిపోతోందంటూ కాకిలెక్కలు చెబుతూ కాలం గడిపేయడం క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను పాలకులు గుర్తించడం లేదు. కళ్లుండి చూడలేని కబోదుల్లా వ్యవహరిస్తూ అన్నదాతలను మరణ శయ్యలపైకి తోసేస్తున్నారు. ప్రస్తుత ఖరీఫ్‌లో వెలుగులోకి వచ్చిన ఆత్మహత్యల సంఖ్య 28. బయటపడని బలవన్మరణాలు ఇంకెన్ని ఉంటాయో ఊహించుకోవచ్చు. నాలుగున్నరేళ్లలో 2,000 మంది.. రాష్ట్రంలోని 670 రెవెన్యూ మండలాలకు గాను 394 మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కేవలం 296 మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించి చేతులు దులుపుకుంది. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో వృద్ధి రేటు విషయంలో మన రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. మరోవైపు రైతుల ఇళ్లల్లో ఆర్తనాదాలు వినిపిస్తూనే ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉరికొయ్యలకు వేలాడుతున్నారని సాక్షాత్తూ ‘నాబార్డ్’ నివేదిక తేల్చిచెప్పింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఈ నాలుగున్నరేళ్లలో 2,000 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని రైతు సంఘాలు చెబుతున్నాయి. చనిపోయిన రైతు కుటుంబాలకు ఇవ్వాల్సిన రూ.5 లక్షల పరిహారాన్ని ఎగ్గొట్టేందుకు వారి ఆత్మహత్యలను ప్రభుత్వం గుర్తించడం లేదని ఆరోపిస్తున్నాయి. యువ రైతులే అధికం ఖరీఫ్ సీజన్ అధికారికంగా జూన్ 1న ప్రారంభమైంది. అదే నెల 27న సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో అట్టహాసంగా ఏరువాకకు శ్రీకారం చుట్టారు. రైతు చనిపోతే గరిష్టంగా రూ.2 లక్షల నష్టపరిహారం ఇస్తామంటూ తన పేరిట ఓ పథకాన్ని కూడా ప్రకటించారు. ఇప్పటికి దాదాపు 80 రోజులవుతోంది. ఒక్క రైతు కుటుంబానికైనా పరిహారం ఇచ్చిన పాపానపోలేదు. ఖరీఫ్ మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా కర్నూలు, గుంటూరు, కృష్ణా, చిత్తూరు, అనంతపురం, వైఎస్సార్, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో రైతుల బలవన్మరణాలు చోటుచేసుకున్నాయి. అర్ధాంతరంగా కన్నుమూస్తున్న వారిలో యువ రైతులే అధికంగా ఉండడం గమనార్హం. హామీలు మాఫీ చనిపోయిన రైతులందరి గోస దాదాపు ఒకటే. తాను అధికారంలోకి వస్తే రైతుల రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానంటూ చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ అమలు కాలేదు. అప్పులు తీర్చాలంటూ బ్యాంకులు నుంచి నోటీసులు వస్తున్నాయి. రుణాల కోసం కుదువపెట్టిన బంగారాన్ని బ్యాంకులు వేలం వేస్తున్నాయి. కొత్త అప్పులు పుట్టే మార్గం లేక ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టాల్సి వస్తోంది. ఇంత చేసినా ఆఖరికి పంటలకు గిట్టుబాటు ధర రావడం లేదు. అప్పుల కత్తి మెడపై వేలాడుతుండడంతో దిక్కుతోచక తనువు చాలిస్తున్నారు. పరిహారం ఇవ్వకుండా మొండిచేయి ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటన ప్రకారం.. 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న రైతులు సహజంగా చనిపోయినా రైతు బీమా పథకం కింద రూ.2 లక్షలు, 51 నుంచి 60 ఏళ్ల లోపు వారు చనిపోతే రూ.30 వేల పరిహారం వస్తుంది. 18 నుంచి 70 ఏళ్ల లోపు రైతులు ప్రమాదవశాత్తూ మరణించినా, పూర్తి అంగవైకల్యానికి గురైనా రూ.5 లక్షల పరిహారం ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. రకరకాల సాకులు, నిబంధనలతో పరిహారం ఇవ్వకుండా మొండిచేయి చూపుతున్నారని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల వివరాలను ప్రభుత్వం సేకరించడం లేదు. బాబు పాలనలో రైతుల ఆత్మహత్యల్లో వృద్ధి 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు పెరిగిపోతున్నట్టు జాతీయ క్రైమ్ రికార్డుల బ్యూరో(ఎన్సీఆర్బీ) గణాంకాలు చెబుతున్నాయి. 2014తో పోలిస్తే 2015లో రైతుల ఆత్మహత్యలు 322 శాతం పెరిగాయి. 2014లో 160 మంది రైతుల ఆత్మహత్యలు నమోదు కాగా, 2015లో 516కి పెరిగినట్టు ఎన్సీఆర్బీ చెబుతుండగా అంతకు రెండు రెట్లు ఎక్కువ ఉంటాయని రైతు సంఘాల పేర్కొంటున్నాయి. 2016, 2017లో కూడా రైతు ఆత్మహత్యల పరంపర కొనసాగింది. -
చితిలో కాలని అప్పు
‘ఏమైనా సుబ్బయ్యన్న చేసినంత పనులు చేయటం మనవల్ల కాదు. తొలకరి రాలగానే ముందు దున్నే పొలం ఆయనదే. ఊళ్లో అందరి కంటే ముందే పంట వేయడం దగ్గర్నుంచి, మబ్బుతో లేచి వెళ్ళి మోటారేయటం కూడా అందరి కంటే ముందే’ అన్నాడు లక్ష్మీపతి ఇంటిముందున్న అరుగు మీద కూర్చుంటూ. ‘ఆ...నిజమే. కానీ అంత తొందరగా వెళ్ళొద్దన్నా వినడు. అందరూ నాలుగింటికెళ్తే ఈయన రెండు గంటలకే బయల్దేరుతాడు‘ విసుగ్గా అంది సుబ్బయ్య భార్య మునెమ్మ రోజూ లేపి టార్చ్, దుప్పటి, కర్ర అని అడగటం, తలుపుకు గొళ్ళెం పెట్టుకొమ్మని మంచి నిద్ర పాడుచేస్తాడన్న కోపంతో. ‘మనం రైతులం. అదున్లో పనిచెయ్యాల. నిద్ర, సుఖం చూసుకుంటే బ్రతకటం కష్టం. ఏమంటావురా లక్ష్మీపతి?‘ భార్య ఇచ్చిన కాఫీ గ్లాసు తీసుకుంటూ అన్నాడు సుబ్బయ్య. అప్పటికే మునెమ్మ ఇచ్చిన కాఫీ ఊదుకుని తాగుతూ ‘అవునక్కా. మనూళ్ళో అంతా అన్న ఈ వయసులో కూడా ఇంత హుషారుగా వుంటాడని, కొడుకులు ఇద్దరున్నా వాళ్ళకైనా ఇంత హుషారు లేదని అనుకుంటా వుంటారు’ అన్నాడు లక్ష్మీపతి. ‘ఏం హుషార్లే మామా..చీకట్లో ఎళ్ళి ఎన్ని సార్లు గతుకుల్లో పడ్డాడో, పాము కరిసిందో నీకూ తెల్సుకదా? కొంచెం ఆగితే మేమూ వస్తామన్నా ఇనడు కదా?’ అన్నాడు పెద్ద కొడుకు మాణిక్యం. ‘అంతేనా అందరి కంటే ముందే పంట అమ్మేస్తాడు. అప్పుడు ధర వుండదు. ధర పలికే సమయానికి మన దగ్గర పంట వుండదు. అంత ఆత్రం దేనికి చెప్పు. కొంచెం ఆగమంటే వినడు. అందుకే ప్రతిసారీ మనకే నష్టాలెక్కువ‘ భుజం మీది తువ్వాలు విసురుగా విదిల్చి తలకు చుట్టి ఆవు దగ్గరికి నడిచాడు చిన్నకొడుకు రాజేంద్ర పాత్రలో పాలు పిండటానికి. ఇంతలో రాజేంద్ర భార్య రమ ఉత్తరం తెచ్చి భర్త చేతికిచ్చింది. రాజేంద్ర గిన్నె పక్కన పెట్టి చదవసాగాడు. ‘ఎక్కడ్నుంచిరా ఉత్తరం రాజేంద్రా?‘ అడిగాడు సుబ్బయ్య. ‘మన ఉత్తేజ్ దగ్గర్నుంచీ నాన్నా. ఎంట్రన్స్ పరీక్షలు బాగా రాశానని రాశాడు‘ చెప్పాడు రాజేంద్ర. ‘సరే మరి మన జయరాం సంగతేందిరా?‘ పెద్దకొడుకుని అడిగాడు. ‘ఇద్దరూ అక్కడ్నే కదా కోచింగులో చేరుండేది. వాడూ బాగానే రాసినానన్నాడు నాన్నా’ చెప్పాడు మాణిక్యం. ‘ఎందుకైనా గానీ మంచి కాలేజీల్లో చేర్చడానికి డబ్బులు రెడీ చేసుకోమని అంటున్నారన్నా పిల్లోళ్ళిద్దరూ’ మాణిక్యంతో అన్నాడు రాజేంద్ర. ‘దేవుని దయవల్ల మంచి మార్కులొచ్చి ఫ్రీ సీట్లొస్తే ఇద్దరికీ బాగుండు. తిరుపతి వెంకన్న దగ్గరికి కాలినడకన వస్తానని మొక్కుకున్నా కూడా’ చెప్పింది మాణిక్యం భార్య సువర్ణ. ‘అయినా పోయినేడు మన స్వాతి పెళ్ళికి చేసిన అప్పే ఇంకా తీరలేదు’ నిట్టూర్చాడు మాణిక్యం. ‘ఈ సంవత్సరం మామిడి తోట బాగా కాసింది కదన్నా. తీర్చేద్దాం లే’ అంటూ పొలానికి బయలుదేరాడు రాజేంద్ర. మాణిక్యం కూడా టౌన్‌కి ఎరువుల కోసం బయలుదేరాడు. వరిలో సరిగా దిగుబడి రాలేదు. మామిడి ఆ సంవత్సరం మంచి ధర పలకలేదు. అప్పులు సగమే తీరాయి. ఆశాజీవిగా మరో పంట వేయడానికి మాత్రం సుబ్బయ్య కుటుంబం వెనక్కు తగ్గలేదు. మళ్లీ నాట్లు, ఎరువులు అంటూ పొలం పని ఎప్పట్లా జరుగుతోంది. ఈలోగా పెళ్లికి అప్పిచ్చిన వాళ్లు ఇంటి మీదికొస్తుంటే మునెమ్మ గాజులకు, సువర్ణ నెక్లెస్‌కు రెక్కలొచ్చి ఎగిరిపోయాయి. ఆ రాత్రి పెందలాడే భోంచేసి ముసుగుతన్నాడు సుబ్బయ్య. తొలికోడితో బాటే నిద్రలేచి ఏమనుకున్నాడో గానీ మునెమ్మను లేపకనే కర్ర, టార్చ్, దుప్పటి తీసుకుని తలుపు దగ్గరికి వేసుకుని వెళ్ళిపోయాడు. ఉదయం ఆరవుతోంది. నిద్రలేచి మునెమ్మ ముఖం కడుక్కొచ్చేలోగా వీధిలో కేకలు, గొడవ. ఇంట్లో వాళ్లంతా బయటకు పరుగుతీశారు. ఇద్దరు మనుషులు సుబ్బయ్య దేహాన్ని మోసుకొచ్చి వరండాలో పడుకో బెట్టారు. ఐదు గంటలకు పొలం వైపెళ్తున్న శివరాం గమనించాడట. హైటెన్షన్ వైరు మీద కాలేసి చచ్చిపడున్న సుబ్బయ్యను. చుట్టుపక్కల అందర్నీ కేకలేసి అంతా కలిసి పట్టుకొచ్చి చూసేసరికే ప్రాణం పోయి ఎంతసేపో అయ్యి వొళ్లు కర్రలా బిగుసుకుపోయుందట. సాయంత్రానికి సుబ్బయ్య దేహం మట్టిలో కలిసిపోయింది. మునెమ్మ అమ్మగారింటి వాళ్లు వచ్చారు. చివరిగా పసుపు కుంకుమలిచ్చి వెళ్ళారు. ‘ఒరే రాజేంద్రా! మామ ఫొటో పెద్దగా వుండి మన వాళ్లందరి పేర్లతో చుట్టుపక్కల పల్లెలందరికీ తెలిసేలా నాలుగైదు పేపర్లలో వేయించరా. అప్పుడే మన ఇంటిపేరు, మనం ఎంత ఘనంగా ఆయనకు కర్మ చేస్తున్నామో తెలిసేది‘ అన్నాడు వెనకింటి సుబ్బయ్య తమ్ముని కొడుకు నారాయణ. రాజేంద్ర, మాణిక్యం తమ కొడుకుల్ని ఆ పని చూడమని టౌనుకి పంపించారు. సాయంత్రానికి కాళ్లీడ్చుకుంటూ వచ్చారు వాళ్లు. ‘మనం అనుకున్నంత సైజుతో నాలుగైదు దినపత్రికల్లో వెయ్యాలంటే వందలు కాదు వేలు కావాలి ఏ మూలకూ సరిపోవు’ అని చెప్పారు. ‘అయితే ఏమైందిలేరా వెధవ డబ్బు ఇయ్యాళుంటుంది రేపు వుండదు. కానీ ఎప్పటికీ నిలిచేది మనం ఎంత గ్రాండ్‌గా ఆయన కర్మ చేశామన్నదే రా’ అన్నాడు నారాయణ. అప్పుడొచ్చాడు సుబ్బయ్య చిన్నతమ్ముడు ధనుంజయులు. ‘ఒరేయ్ అబ్బాయిలూ! అన్నకు సమాధి మాత్రం గ్రానైటు రాయితో బాగా కట్టించాల్రా. చుట్టుపక్కల ఏ వూళ్లో లేనంత బాగా వుండాలి’ అన్నాడు. ‘అది సరేగానీ అన్నా.. ముందు కర్మ రోజు ఏమేం వంటలనుకున్నారు? నా కూతురు వాళ్ల అత్తగారు, కోడలు వాళ్ల బంధువులు కూడా వస్తున్నారు బెంగళూరు, చెన్నైల నుంచి. మా అన్న కర్మంటే వాళ్లు భలే జరిగిందని అనుకోవాలి. లేకుంటే నాకు పరువు తక్కువ‘ అంది సుబ్బయ్య చెల్లెలు వరలక్ష్మి. ‘అదంతా రెడీనే అత్తా.. ఏమీ తక్కువ కాదు. లడ్డూ, జాంగ్రీ రెండురకాల వేపుళ్ళు, మూడురకాల పచ్చళ్ళు, రెండురకాల అన్నాలు, మామూలు అన్నం సాంబారు, అప్పడం వడియాలు, దప్పళం..’ అని మాణిక్యం చెప్తుంటే అడ్డొచ్చిందామె మళ్ళీ. ‘ఏంటీ ఇవన్నీ వంటవాళ్ళతోనా? సరుకులు సరంజామా అందిస్తూ మీరు కూర్చుంటే మా సంబంధులు మీరు బాగా రిసీవ్ చేసుకోలేదని అలుగుతార్రా. అయినా ఈ రోజుల్లో వంటవాళ్ల కన్నా కేటరింగ్‌కి ఆర్డర్ చేసేయండి. నా కొడుకు విజయ్ లేడూ వాడి ఫ్రెండ్‌ది ప్రక్క టౌన్లోనే కేటరింగ్ సర్వీస్. వాడు ఫోన్ చేస్తే చాలు వచ్చేస్తారు. డబ్బులిచ్చేయండంతే‘ అని తేల్చేసింది వరలక్ష్మి. ‘మాణిక్యం... మీరేమన్నా చేసుకోండి. కానీ మనూళ్లో పక్కూళ్లలో అంతా ఉన్న పద్ధతి ప్రకారం మర్చిపోకుండా కర్మ రోజు రాత్రి కథ చెప్పించాల్రా. ఏముంది... కథ చెప్పేవాళ్ళకు అన్నం పెట్టి ఓ పదివేలిస్తే చాలు’ అన్నాడు ఎదురింటి వెంకటేశ్వర్లు. తలలు ఊపారు గానీ మాణిక్యం, రాజేంద్రల ముఖాల్లో కళ లేకుండా పోయింది. రాత్రంతా ఇద్దరూ మల్లగుల్లాలు పడుతూనే ఉన్నారు. ఒకసారి పోతే పోయిందిలే వెధవ డబ్బులు తండ్రి కోసమే కదా! అప్పుచేసైనా ఖర్చుపెట్టి నలుగుర్లో తండ్రికి బాగా చేయాలని అనుకున్నా, మరోసారి ఎలా తీర్చాలి ఇంతప్పు? ఇప్పుడున్న అప్పునే ఇంకా తీర్చలేదన్న భయం మరోవైపు అనిపించి. తెల్లవారు జామున కలత నిద్రపోయారు. దినం రోజుకు రెండ్రోజుల ముందొచ్చాడు మునెమ్మ తమ్ముడు. ‘ఒరేయ్ అబ్బాయిలూ! మా అక్క మెడ తరువాత బోసిగా వుండకూడదు. ఒకడు మెడలోకి పగడాలు, ముత్యాలతో హారం చేయించాలి. ఇంకొకడు నాలుగు గాజులు చేయించి చేతికి రెండు చొప్పున వేయండి. లేకుంటే సుబ్బయ్య కొడుకులు తల్లిని బికారి దాన్లా వదిలేశారని అనుకుంటారు. ఎక్కడికి పోతుంది? అంతా మీకే కదా?‘ అన్నాడు. ‘అంతా సరే గానీ దినం రోజు వంటలు తిని, గ్రానైటు రాయితో సమాధి కడితే సరిపోదురా. అవన్నీ ఆయన ఆత్మను స్వర్గానికి తీసుకుపోవు. ఒక మంచి పాడి ఆవును దూడతో సహా దానమివ్వాలి, కనీసం మీ శక్తికొద్దీ బంగారం, బట్టలు, కాసంత భూదానం కూడా చేస్తే ఎకాఎకిని ఆత్మ స్వర్గానికెళ్లిపోతుందట. పెదనాయన ఆత్మ అలమటిస్తే మనకే మంచిది కాదురా రాజిగా‘ ముక్కుచీదుతూ చెప్పింది సుబ్బయ్య పెద్ద తమ్ముడు కూతురు శ్యామల. ఆ రాత్రి రాజేంద్ర కనిపించలేదు. రాత్రి పది గంటల వరకు వెతికి వెతికి అంతా భయపడిపోయారు. చివరికి మర్నాడు ఉదయం రాజేంద్ర కొడుకు ఏడుస్తూ ఒక ఉత్తరం పట్టుకొచ్చి మాణిక్యం చేతికిచ్చాడు.‘అన్నా. నాన్న దినం బాగా జరగాలి. ఇప్పుడు ఇంట్లో వున్న మన కొడుకుల కాలేజీ సీట్ల కోసం అప్పుచేసి తెచ్చిన డబ్బులు సరిపోవు. మన ఈరిగాడు ఎవరికో కిడ్నీ కావాలని చెప్తుంటే విన్నాను. రెండు మూడు లక్షలు ఇస్తారంట. మనిషికి ఒక కిడ్నీ సాలంట. నాకేమి భయం లేదు. పెద్దకొడుకువి కాబట్టి నువ్వుంటే చాలు దినాలకు. నా కొడుకుతో పంపితే నేను హాస్పిటల్లోనే పుణ్యావాసం నీళ్ళు చల్లించుకుంటా. వారం రోజులకే ఇంటికొచ్చేస్తా’ అని రాసుంది. అది విన్న మునెమ్మకు ఎక్కడలేని ఆవేశం వచ్చేసింది. ‘రేయ్ మాణిక్యం.. ఎళ్ళి ఈరిగాడ్ని పట్టుకోని తమ్ముడ్ని తీసుకురా. ఒక్కపైసా కూడా ఖర్చు చేయడానికి వీల్లేదు. కార్డులేసి అందరికి దినం పత్రికలు పంపావుకదా అది సాలు. కథలు చెప్పించాల్సిన అవసరం లేదు. ఆత్మ వచ్చి కథలు వినదు. దానధర్మాలు మనస్ఫూర్తిగా వున్నప్పుడు వున్నదాంట్లో చెయ్యాలిగానీ అప్పులు చేసి చెయ్య పనిలేదు. భర్తపోయిన దుఃఖంలో వున్న నాకిప్పుడు నగలు సింగారించుకోవాలన్న కోరికేం లేదు. అసలు చనిపోయిన ఆయనే బ్రతికుంటే అప్పు చేసిన డబ్బులతో గ్రానైట్ సమాధి కడతానంటే ఒప్పుకునేవాడు కాదు. దానికన్నా మనవళ్ల చదువే ముఖ్యం. ఎవరి పరువు కోసమో, ఎవరి గొప్పల కోసమో మనం ప్రాణాల మీదికి తెచ్చుకోవాల్సిన పనిలేదు. వెళ్ళండ్రా’ అని కోపంగా అరిచేసరికి ఎక్కడి వాళ్ళక్కడ తేలుకుట్టిన దొంగల్లా జారుకున్నారు. మాణిక్యం, కొడుకులు అంతా వెళ్ళి ఆపరేషన్ టేబుల్ ఎక్కకముందే రాజేంద్రను వారించి ఇంటికి తీసుకొచ్చారు. మర్నాడు సిమెంటుతో కట్టిన తండ్రి సమాధికి పూజలు చేశారు. పంతులుకి దక్షిణ ఇచ్చారు. వంటవాళ్ళతో రుచికరమైన భోజనం చేయించి వడ్డించారు. అంతా హాయిగా ఎవరిళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. కాలచక్రం పదేళ్లు తిరిగింది. మాణిక్యం కొడుకు ఇప్పుడు ఎందరికో కిడ్నీ వ్యాధుల్ని నయం చేసే స్పెషలిస్ట్ డాక్టరయ్యాడు. రాజేంద్ర కొడుకు ఇంజనీరై తాతకు మాంచి గ్రానైటు రాయితో, మెరిసే అక్షరాలు, సుబ్బయ్య ఫొటోతో సమాధి కట్టాడు. అంతే కాదు, ఆరోజు ముఖం తిప్పుకుంటూ వెళ్లిన వాళ్లంతా పెదవుల్లో నవ్వుల్ని సాగదీసుకుంటూ పెళ్లి సంబంధాలు చూడటానికి ఎగబడ్తున్నారు. లోకం నాలుకకు ఎన్నో చీలికలు. మనం అవసరమైనవే తీసుకోవాలి. లేదంటే ప్రతి నాలుకా విషపు కోరలతో వెంటబడుతుంది. ఆరోజు కాలిపోయిన సుబ్బయ్య కట్టె కోసం అప్పులు కూడా కరిగిపోయుంటే మిగిలిన వాళ్ళంతా కూడా జీవచ్ఛవాలయ్యేవాళ్లు. అందుకే తాహతునుబట్టి బతికినపుడే పైకెదిగే అవకాశం వుంటుంది. అనవసర గొప్పలకు పోకుంటే బాగుపడ్తారనటానికి సుబ్బయ్య కుటుంబమే ఉదాహరణైంది. - డేగల అనితాసూరి -
కాటేసిన కరువు
ఎండిపోయిన పైర్లు.. బీళ్లుగా మారిన పొలాలు.. కబేళాలకు తరలుతున్న పశువులు, వలస బాట పట్టిన రైతన్నలు.. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని గ్రామాల్లో ఇలాంటి హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. అన్నదాతలు కరువు కాటుకు చిక్కి విలవిల్లాడుతున్నారు. పంటల సాగు కోసం చేసిన అప్పులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇంతటి కరువును తమ జీవితంలో ఎప్పుడూ చూడలేదని రైతులు బోరుమంటున్నారు. దుర్భిక్షం ధాటికి పంటలు కోల్పోయి దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్న తమను ప్రభుత్వం సైతం ఆదుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసిన పంట చేతికి రాక, ఉన్న ఊళ్లో బతుకుదెరువు లేక పొట్ట చేత పట్టుకుని పక్క రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. రాయలసీమ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: పచ్చని పైర్లతో కళకళలాడాల్సిన పంట భూములు కరువు ధాటికి బీళ్లుగా మారాయి. జూన్ ఆరంభంలో అరకొర వర్షాలకు విత్తిన పైర్లు వాడిపోయాయి. కర్నూలు జిల్లాలోని పత్తికొండ, ఆలూరు, అనంతపురం జిల్లాలోని కదిరి, గుత్తి, వైఎస్సార్ జిల్లాలోని రాయచోటి, గాలివీడు, చిత్తూరు జిల్లాలోని వాయల్పాడు, పెద్దమండ్యం తదితర ప్రాంతాల్లో ఎండిపోయిన వేరుశనగ పైర్లను ట్రాక్టర్లతో దున్నేస్తున్న దృశ్యాలు కంటతడి తెప్పిస్తున్నాయి. తేమలేక ఎండిపోయిన ఉల్లిని చాలామంది రైతులు పీకకుండానే అలాగే పొలాల్లో వదిలేశారు. టమోటా, మిరప, బెండ తదితర కూరగాయల తోటలు సైతం చేతికి రాకుండా పోయాయి. అప్పులు చేసి వేసిన పంటలు కరువు కాటుకు మట్టిలోనే కలిసి పోవడంతో రైతన్నలు కుమిలిపోతున్నారు. చేసిన అప్పులు భయపెడుతున్నాయి. చాలాచోట్ల తాగడానికి గుక్కెడు నీరు దొరక్క జనం అల్లాడిపోతున్నారు. దుర్భిక్షం వల్ల మేత, నీరు సమకూర్చడం కష్టం కావడంతో చాలామంది రైతులు విధిలేని పరిస్థితుల్లో పశువులను కారుచౌకగా కబేళాలకు విక్రయిస్తున్నారు. అనంతపురం, వైఎస్సార్, కర్నూలు, చిత్తూరు జిల్లాల నుంచి ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు లారీల్లో కబేళాలకు తరలిపోతున్నాయి. ఇప్పటికే రాయలసీమ నుంచి ఎంతోమంది అన్నదాతలు పొట్ట చేత పట్టుకుని పక్క రాష్ట్రాలకు వలస వెళ్లారు. వేరుశనగ రైతులకు రూ.2,250 కోట్ల నష్టం రాయలసీమ జిల్లాల్లో వేరుశనగ పంట 90 శాతానికి పైగా ఎత్తిపోయింది. ఇప్పటికే పంట కాలం పూర్తికావడం వల్ల పశువుల మేతకైనా మొక్కలు బాగా పెరిగే అవకాశం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది రెయిన్ గన్లతో సెంటు భూమి కూడా ఎండిపోకుండా పంటలను కాపాడామని ఘనంగా ప్రచారం చేసుకున్న ప్రభుత్వం ఈ ఏడాది రెయిన్ గన్ల ఊసే మర్చిపోయింది. రాయలసీమలో 16.50 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగు కాగా, 15 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయింది దీంతో రైతులు రూ.2,250 కోట్ల మేర నష్టపోయినట్లు అనధికారిక అంచనా. మండుతున్న ఎండలు.. వట్టిపోతున్న బోర్లు రాష్ట్రంలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో అధికారిక గణాంకాల ప్రకారం 16.50 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగు కాగా, ఇందులో 90 శాతం పంట ఎండిపోయింది. కర్నూలు జిల్లాలో 50.3 శాతం, అనంతపురం జిల్లాలో 47.4 శాతం లోటు వర్షపాతం నమోదు కావడంతో పంటలన్నీ ఎండిపోయాయి. వేసవి కాలాన్ని తలపించేలా ఎండలు మండుతున్నాయి. రెండు మూడు రోజుల క్రితం రాయలసీమలో అక్కడక్కడా కొద్దిపాటి వర్షం పడింది. ఎండిపోయిన పంటలు ఈ వర్షానికి కొంచెం పచ్చగా మారినా మళ్లీ ఎండ తీవ్రత వల్ల వాడిపోతున్నాయి. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో చేతికందాల్సిన దశలో ఉల్లిపంట చాలావరకు ఎండిపోయింది. దిగుబడి 25 నుంచి 30 శాతం లోపే వచ్చిందని రైతులు వాపోతున్నారు. వర్షాధారంగా వేసిన పంటలే కాకుండా బోర్ల కింద వేసిన పైర్లు కూడా ఎండిపోతున్నాయి. వరుస కరువులతో భూగర్భ జలమట్టం పాతాళానికి పడిపోయింది. చందోలిలో నీటికి కటకట కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని చందోలి గ్రామంలో 400 ఇళ్లు ఉన్నాయి. ఈ గ్రామస్థులు తాగునీరు దొరక్క అష్టకష్టాలు పడుతున్నారు. గ్రామంలో గత నాలుగేళ్లలో 14 బోర్లు వేసినా అన్నీ ఎండిపోయాయని, ఒక బోరులో మోటారు వేస్తే కొద్దిసేపు సన్నటి ధార వచ్చి ఆగిపోతోందని సర్పంచి లక్ష్మీదేవి కుమారుడు రంగప్ప తెలిపారు. గ్రామంలోని బోర్ల నుంచి నీరు రానందున గ్రామస్థులు పొలాల్లో కొద్దికొద్దిగా బోర్ల నుంచి వస్తున్న నీరు తెచ్చుకుంటున్నారని, పంటలు ఎండిపోతున్నందున పొలాల యజమానులు అభ్యంతరం చెబుతున్నారని రంగప్ప వివరించారు. గొర్రెలు, మేకలు ఉన్న వారు ఎడ్ల బండిలో డ్రమ్ములు పెట్టుకుని దూర ప్రాంతాల నుంచి నీరు తెచ్చుకుంటున్నారు. సీమలో 51.1 శాతం వర్షంపాత లోటు రాయలసీమలో కరువు కరాళ నృత్యం చేస్తోంది. ఈ సీజన్లో ఇప్పటి (జూన్ 1 నుంచి సెప్టెంబర్ 12వ తేదీ) వరకూ రాయలసీమ జిల్లాల్లో 329.2 మిల్లీమీటర్ల సగటు సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 160.9 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. సాధారణం కంటే 51.1 శాతం తక్కువ వర్షం కురవడం వల్ల పంటలు ఎండిపోయాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోనూ కరువు తీవ్రత అధికంగానే ఉంది. వర్షాభావం వల్ల పంటలు చేతికి రాలేదు. గుంటూరు జిల్లాలో 16.1 శాతం లోటు వర్షపాతమే ఉన్నప్పటికీ పల్నాడు ప్రాంతంలో కరువు ఎక్కువగా ఉంది. ఇలాంటి కరువు ఎప్పుడూ చూడలేదు రాయలసీమ జిల్లాల్లో కరువు వల్ల పనులు దొరక్క, ఉపాధి కోసం ఇప్పటికే చాలామంది రైతులు, రైతు కూలీలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. వలస వెళ్ల లేని వారు గ్రామాల్లో రచ్చబండలు, గ్రామ చావిళుపై కూర్చుని తీవ్రంగా మథన పడుతున్నారు. పెద్దవయసు వారు పొద్దుపోక మేక–పులి ఆట ఆడుతున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని చందోలి గ్రామంలోని సుంకులమ్మ గుడి వద్ద కూర్చున్న కొందరు రైతులను ‘సాక్షి’ పలుకరించగా.. ఇంతటి కరువును తాము ఇప్పటివరకూ చూడలేదని 65 ఏళ్ల వీరన్న, 64 ఏళ్ల తిమ్మప్ప ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఇప్పటికే మా గ్రామం నుంచి చాలామంది పనుల్లేక వలస వెళ్లారు. త్వరలో పీర్ల పండుగ ఉందని ఆగాం. పండుగ తర్వాత పౌర్ణమికి మేము కూడా బెంగళూరుకు వలస వెళ్లాలని నిర్ణయించుకున్నాం’’ అని చందోలి గ్రామంలోని పలువురు రైతన్నలు చెప్పారు. చివరకు అప్పులే మిగిలాయి ‘‘రెండెకరాల్లో పత్తి, ఒకటిన్నర ఎకరాల్లో వేరుశనగ పంటలు వేశా. నీరు సరిపోదనే ఉద్దేశంతో పత్తికి డ్రిప్ పెట్టా. రూ.40 వేలు వెచ్చించి రాళ్లతో పెద్ద తొట్టి కట్టించా. బోరు నుంచి మొదట నీటిని ఈ తొట్టిలోకి మోటారు ద్వారా ఎక్కించి, తర్వాత తొట్టి నుంచి డ్రిప్ ద్వారా పొలానికి అందించి పంటలను రక్షించుకునేందుకు ప్రయత్నించా. దురదష్టవశాత్తూ పత్తి పంట రెండడుగుల ఎత్తు కూడా పెరగకముందే బోరు ఎండిపోయింది. పత్తి, వేరుశనగ పంటలు చేతికి రాలేదు. ఇన్నాళ్లూ నేను చేసిన కష్టమంతా మట్టిపాలైంది. చివరకు అప్పులే మిగిలాయి’’ – కురువ ఆనంద్, పత్తికొండ, కర్నూలు జిల్లా ప్రభుత్వం ఆదుకోవాలి ‘‘వేరుశనగ ఎండిపోవడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది. పంటలు కోల్పోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. గత నాలుగేళ్లుగా వర్షాభావంతో పంటలు పండలేదు. ఐదు ఎకరాల్లో వేరుశనగ వేస్తే పూర్తిగా ఎండిపోయింది’’ – చింతల రాయుడు,టీఎన్ పాళ్యం, అనంతపురం జిల్లా రూ.30 వేల పెట్టుబడి మట్టిపాలు ‘‘నాకున్న రెండు ఎకరాల్లో వేరుశనగ వేశా. ఇందుకోసం రూ.30 వేలు పెట్టుబడిగా పెట్టా. జూన్‌లో కురిసిన వానకు పంట వేశా. ఆ తరువాత చినుకు జాడేలేదు. దీంతో పంటంతా ఎండిపోయింది. కనీసం పశువుల మేతకు కూడా పనికిరాలేదు. పెట్టిన పెట్టుబడి అంతా మట్టిపాలైంది’’ – దుగ్గిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, దేవలంపల్లె, లక్కిరెడ్డిపల్లె మండలం, వైఎస్సార్ జిల్లా -
ఉసురు తీసిన అప్పులు
గోనెగండ్ల/ నందికొట్కూరు/ గూడూరు రూరల్/ బొమ్మనహాళ్: వరుస పంట నష్టాలు వారిని అప్పుల్లోకి నెట్టాయి. ఆదుకోవాల్సిన సర్కారు చోద్యం చూస్తూ అరచేతిలో వైకుంఠం చూపిస్తూ కాల క్షేపం చేస్తోంది. దీంతో దిక్కుతోచని రైతన్నలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఒక్క కర్నూలు జిల్లాలోనే ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకోగా.. అనంతపురంలో మరొకరు తనువు చాలించారు. అన్నదాతలపై రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి అద్దంపడుతున్న ఈ ఘటనలకు సంబంధించి పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం పెద్దనేలటూరు గ్రామానికి చెందిన బెస్త మల్లయ్యకు(58) ఐదెకరాల పొలం ఉంది. వర్షాభావంతో నాలుగేళ్లుగా పంటలు సక్రమంగా పండకపోవడంతో పాటు వాటికి గిట్టుబాటు ధర లభించలేదు. ఈ ఏడాదీ వేసిన పత్తి వర్షాల్లేక ఎండిపోయింది. దీంతో సాగుకు, కుటుంబ పోషణ నిమిత్తం చేసిన ప్రైవేట్ అప్పులు దాదాపు రూ.6లక్షలకు చేరాయి. రుణదాతల ఒత్తిళ్లు ఎక్కువ కావడంతో వీటిని తీర్చే మార్గం కానరాక ఆదివారం రాత్రి పురుగు మంది సేవించాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మల్లయ్య మరణించాడు. పంటలు పండక.. అప్పులు తీర్చలేక.. నందికొట్కూరు మండలం కొణిదేల గ్రామానికి చెందిన ఎద్దుల రాజేశ్వరరెడ్డి (26) నాలుగేళ్లుగా పంట నష్టాలను చవిచూశాడు. రెండేళ్ల క్రితం అప్పులు తీర్చేందుకు ఐదెకరాల సొంత భూమి అమ్మినా అప్పులు పూర్తిగా తీరలేదు. ఈ నేపథ్యంలో 22 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని రెండేళ్లుగా సాగు చేస్తున్నా పంటలు సక్రమంగా పండలేదు. దీంతో ప్రైవేట్ వ్యక్తుల వద్ద చేసిన అప్పులు రూ.8 లక్షలకు పైగా చేరాయి. బంగారు తాకట్టు పెట్టి రూ.2.50 లక్షలు కూడా తీసుకున్నాడు. అప్పులన్నీ తలకు మించిన భారం కావడంతో ఈ నెల 4వ తేదీ రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. కొనఊపిరితో ఉన్న రాజేశ్వరరెడ్డిని కుటుంబ సభ్యులు కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. పొలంలోనే పురుగుమందు సేవించి.. ఇదే జిల్లా గూడూరు మండలం గుడిపాడు గ్రామానికి చెందిన చాకలి చిన్న గిడ్డన్న (45) తనకున్న 2.25 ఎకరాల భూమితో పాటు మరో రెండు ఎకరాలను కౌలుకు తీసుకుని పంటలు సాగుచేసేవాడు. మూడేళ్లుగా ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ.3 లక్షల వరకు అప్పులు చేశాడు. గత ఏడాది ఆంధ్రా బ్యాంకు నుంచి రూ.50 వేలు తీసుకున్నాడు. ఈ ఏడాది తీవ్ర వర్షాభావం కారణంగా పత్తి పంట పూర్తిగా ఎండిపోయింది. అప్పులు తీర్చే పరిస్థితి కనిపించక ఈ నెల 7న పొలంలోనే పురుగుల మందు తాగాడు. రైతులు, కూలీలు అతన్ని కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ సోమవారం మరణించాడు. పంటను కాపాడుకోలేక... అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలంలోని ఉంతకల్లు గ్రామానికి చెందిన దాసరి హనుమంతప్ప కుమారుడు దాసరి నాగరాజు(24)కు 1.5 ఎకరాల పొలం ఉంది. వరి సాగు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇద్దరు అక్కల పెళ్లిళ్లు, క్యాన్సర్‌తో బాధపడుతున్న తండ్రి చికిత్సకు రూ.3.50 లక్షల దాకా అప్పు చేశాడు. బ్యాంకుల్లో పంట రుణం కింద రూ.2లక్షలు తీసుకున్నా వడ్డీలకే సరిపోయింది. దీంతో కొంతకాలం బళ్లారిలో కూలీగా, ఆ తర్వాత ఆటో డ్రైవర్‌గా పనిచేశాడు. ఇటీవల గ్రామం చేరుకుని వరి సాగు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం ఏపుగా ఉన్న పంటను కాపాడుకునేందుకు అవసరమైన డబ్బు చేతిలో లేకపోవడం.. అప్పటికే అప్పులు ఎక్కువవడంతో అప్పు దొరికే మార్గం లేక తీవ్ర మనోవేదనకు గురై పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
మౌలిక సదుపాయాల మాటేమిటి?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రైతుల ఆత్మహత్యల నివారణకు ఏర్పాటైన రైతు రుణవిమోచన కమిషన్‌కు.. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటైన రైతు సాధికార సమితికి అవసరమైన సిబ్బందితోపాటు పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ఆ రాష్ట్రాల ప్రభుత్వాలపై ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. సిబ్బంది, మౌలిక సదుపాయాలు ఇచ్చినప్పుడే ఏ లక్ష్యంతో రైతు రుణ విమోచన కమిషన్, రైతు సాధికార సమితులను ఏర్పాటు చేశారో, ఆ లక్ష్యం నెరవేరుతుందని తెలిపింది. ఈ విషయంలో ఏం చర్యలు తీసుకున్నారో వివరించేందుకు ఆ ప్రభుత్వాలకు గడువునిచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల ఉత్తర్వు లు జారీ చేసింది. రైతు ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకునేలా ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కొల్లి శివరామిరెడ్డి, పాకాల శ్రీహరిరావు మరికొందరు కోర్టులో వేర్వేరుగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై ఇటీవల ధర్మాసనం విచారణ జరిపింది. రైతు రుణ విమోచన కమిషన్‌ను ఏర్పాటు చేసినట్లు తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది చెప్పగా, తాము రైతు సాధికార సమితి ని ఏర్పాటు చేసినట్లు ఏపీ న్యాయవాది వివరించారు. వాటికి మౌలిక సదుపాయాలు, సిబ్బంది కేటాయింపుల గురించి ధర్మాసనం ఆరా తీసింది. రైతుల సమస్యల పరిష్కారానికి న్యాయ సేవాధికార సంస్థల సేవలను ఉపయోగించుకోవచ్చని అభిప్రాయపడింది. -
దిగుబడి తగ్గి.. దుఃఖం మిగిలి
కర్నూలు(అగ్రికల్చర్): ఉల్లి చేసే మేలు తల్లికూడా చేయదంటారు. అయితే ఉల్లి పండించే రైతులకు మాత్రం ఎలాంటి మేలూ జరగడం లేదు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో దిగుబడులు తగ్గినా..గిట్టుబాటు ధర లభించడం లేదు. తీవ్ర నష్టాలు వచ్చి అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వంలో చలనం లేదు. రాష్ట్రంలో ఉల్లి పంట అత్యధికంగా కర్నూలు జిల్లాలోనే సాగు అవుతోంది. ఖరీఫ్ సాధారణ సాగు 20,357 హెక్టార్లు ఉండగా.. ఇప్పటి వరకు 18,500 హెక్టార్లలో సాగైంది. దిగుబడులు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఎకరాకు కనీసం 100 క్వింటాళ్ల దిగుబడి వచ్చి.. ధర రూ.1500 లభిస్తే రైతుకు గిట్టుబాటు అవుతుంది. ఈ ఏడాది వర్షాభావంతో ఉల్లి పంట దెబ్బతిని..ఎకరాకు సగటున 50 క్వింటాళ్లు కూడా రావడం లేదు. కర్నూలు మార్కెట్లో ధర రూ.800 కూడా పలకడం లేదు. పట్టించుకోని ప్రభుత్వం.. ధరలు లేనపుడు ఉల్లి రైతులు నష్టపోకుండా టీడీపీ మంత్రులు స్పష్టమైన హామీలు ఇచ్చారు. గతంలో వ్యవసాయ మంత్రిగా ఉన్న పత్తిపాటి పుల్లారావు, పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్న పరటాల సునీత.. కర్నూలు మార్కెట్‌ను సందర్శించి గిట్టుబాటు ధర కల్పిస్తామని అన్నదాతలకు భరోసానిచ్చారు. ధరలేనప్పుడు ప్రభుత్వమే ఉల్లిని కొనుగోలు చేస్తుందని చెప్పారు. హామీ ప్రస్తుతం అమలు కావడం లేదు. ధరలు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా దక్కకపోవడంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వారం రోజుల వ్యవధిలో జిల్లాలో ఇద్దరు ఉల్లి రైతులు బలవన్మరణాలకు పాల్పడారు. ధర వచ్చింటే బాబూరావు బతికుండేవాడేమో.. సి.బెళగల్ మండలం మారందొడ్డి గ్రామానికి చెందిన బండారి బాబురావు రెండు ఎకరాల్లో ఉల్లి సాగు చేశాడు. అప్పు తెచ్చి రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టాడు. వర్షాభావ పరిస్థితుల్లో కేవలం 35 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చింది. దీనిని కర్నూలు మార్కెట్‌కు తీసుకరాగా.. క్వింటాకు రూ.600 మాత్రమే ధర లభించింది. చేతికి రూ.21 వేలు మాత్రమే రావడంతో అప్పు తీర్చే మార్గం కానరాక గత నెల 28న కర్నూలు మార్కెట్ యార్డులోనే పురుగుల మందుతాగాడు. చికిత్స పొందుతూ... శనివారం మృతిచెందాడు. గిట్టుబాటు ధర వచ్చి ఉంటే బాబురావు బతికి ఉండేవాడని కుటుంబ సభ్యులు రోదిస్తూ తెలిపారు. 90 శాతం రైతులకు అతి తక్కువ ధరే.. కర్నూలు మార్కెట్‌కు వచ్చే ఉల్లి రైతుల్లో పది శాతం మందికి క్వింటాకు రూ.300లోపే ధర లభిస్తోంది. 30 శాతం మంది రైతులకు రూ.301 నుంచి రూ.600 వరకు ధర వస్తోంది. ఎక్కువగా 50 శాతం మంది తెచ్చిన సరుకుకు రూ.601 నుంచి రూ.800 వరకు ధర లభిస్తోంది. మొత్తం 90 శాతం మంది రైతులకు గిట్టుబాటు ధర లేదనే చెప్పొచ్చు. కేవలం 10 శాతం మంది రైతులకు మాత్రమే రూ.1000 ఆపైన ధర లభిస్తోంది. నష్టాలను ఎలా భరించాలి? మూడు ఎకరాల్లో ఉల్లిసాగు చేశాను. పెట్టుబడులకు బ్యాంకులు పంట రుణాలు ఇవ్వకపోతే అప్పు తెచ్చుకున్నాను. ఎకరాకు రూ.50 వేల ప్రకారం రూ.1.50 లక్షలు పెట్టుబడి పెట్టాను. వర్షాలు పడక పంట అభివృద్ధి చెందలేదు. బోరు ఉన్నా నీరు అడుగంటి పోయింది. దిగుబడులు గత ఏడాదితో పోలిస్తే 50 శాతం తగ్గాయి. ప్రస్తుత ధరల్లో అమ్ముకుంటే రూ.60వేలు కూడా దక్కే పరిస్థితి లేదు. నష్టం రూ.90వేల వరకు ఉంటోంది. ఇంత భారీ స్థాయిలో నష్టాలను ఎలా భరించాలో తెలియడం లేదు. వెంకటేష్, పొన్నకల్ గ్రామం, గూడూరు మండలం -
ఇవి సర్కారీ హత్యలు
ఆలూరు /కర్నూలు సిటీ: సక్రమంగా అమలు కాని రుణమాఫీ రైతుల ఉసురు తీసుకుంటోంది. రుణం మాఫీ అవుతుందని ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్న కర్షకులకు మనోవేదనే మిగుల్చుతూ బలవన్మరణాలకు పాల్పడేలా చేస్తోంది. విడతల వారీగా అరకొరగా చేస్తున్న రుణ మాఫీ వడ్డీలకు కూడా సరిపోవడంలేదు. అప్పునకు వడ్డీ పెరిగిపోగా బ్యాంకు నోటీసులు పంపడంతో మనస్తాపానికి గురై ప్రాణాలు తీసుకుంటున్నారు. కర్నూలు జిల్లా ఆలూరు మండలం తుంబళబీడు గ్రామంలో మంగళవారం ఇలాంటి దుర్ఘటనే చోటుచేసుకుంది. రుణమాఫీ సక్రమంగా కాక బ్యాంకు అప్పు పేరుకుపోవడంతో గ్రామానికి చెందిన బోయ నెరణికి రామయ్య (63), అతని భార్య వండ్రమ్మ (58) బలవన్మరణానికి పాల్పడ్డారు. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు రామయ్యకు 3.75 ఎకరాల పొలం ఉంది. ఇందులో బోరు తవ్వించుకొని మిరప, పత్తి సాగు చేస్తున్నారు. పంటల సాగు నిమిత్తం 2011లో ఆలూరు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో జాయింట్ అకౌంట్లో (ఖాతా నంబర్ 19059135974) రూ.81 వేలు అప్పుగా తీసుకున్నారు.వడ్డీతో కలిపి 2014 నాటికి రూ.1,12,955 అయింది. అర్హత రావడంతో మొదటి విడత రూ.27,219, రెండో విడత రూ.23,900, మూడో విడత రూ.25,101 మాఫీ అయింది. మిగతా రెండు విడతల్లో రూ. 41,831 రైతు ఖాతాలోకి జమ కావాల్సి ఉంది. అయితే పంట సాగుకోసం 2015 సెప్టెంబర్‌లో రైతు రామయ్య రూ.41,831 చెల్లించి రూ.1,23,000 అప్పును రెన్యువల్ చేయించుకున్నారు. నాలుగేళ్లుగా పంటలు పండకపోవడంతో అప్పు చెల్లించలేపోయారు. దీంతో అప్పు వడ్డీతో కలిపి రూ.1,54,000 అయింది. ఈ నేపథ్యంలో అప్పు చెల్లించాలని ఆగస్టు 17వ తేదీన లాయర్ ద్వారా రైతు రామయ్యకు ఏపీజీబీ అధికారులు నోటీసు పంపారు. ఈ ఏడాది పంటలు పండకపోవడంతో రైతు చేతిలో చిల్లగవ్వ లేదు. బ్యాంకు అధికారులు ఇంటికి తాళాలు వేస్తారేమోననిని మనస్తాపం చెంది.. దంపతులిద్దరు సోమవారం అర్ధరాత్రి పురుగుల మందు తాగారు. మంగళవారం ఉదయం విషయాన్ని గమనించి బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పుల బాధతోనే తమ తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారని కుమారులు తిమ్మప్ప, లేపాక్షి రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సెక్షన్ ఐపీసీ 174 కింద కేసు నమోదు చేసినట్లు సీఐ దస్తగిరి బాబు తెలిపారు. రైతు దంపతుల ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్నారు. రైతుల ఉసురు ప్రభుత్వానికి తగులుతుందన్నారు. రైతు దంపతుల ఆత్మహత్యపై విచారణ రైతు దంపతుల ఆత్మహత్యపై డివిజనల్ స్థాయి కమిటీతో విచారణ చేయించామని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రుణ మాఫీ కింద మూడు విడతలు రైతు బ్యాంక్‌ఖాతాకు జమ అయిందన్నారు. మిగిలిన రెండు విడతలు రావాల్సి ఉండగా వారు ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వ దృష్టికి తీసుకపోయి ఎక్స్‌గ్రేషియా చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అవి బాబు హత్యలు – కర్నూల్ జిల్లా రైతు దంపతులకు రూ.20లక్షల పరిహారం ఇవ్వాలి – వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి సాక్షి, విశాఖపట్నం: రైతు రుణమాఫీ అమలు కాక... బ్యాంకుల నుంచి నోటీసులొస్తుంటే ఆత్మాభిమానం చంపుకోలేక రాష్ట్రంలో అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాసంకల్పయాత్రలో పాల్గొనేందుకు యలమంచిలి నియోజకవర్గం తిమ్మరాజుపేట వచ్చిన ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. కర్నూలు జిల్లా తుమ్మల గుంట గ్రామానికి చెందిన రైతు రామయ్య దంపతులు ఆత్మహత్యకు పాల్పడడం రాష్ట్రంలో రైతుల దయనీయ పరిస్థితి అద్దంపడుతోందన్నారు. ఇవి ఆత్మహత్యలు కావు.. బాబు చేసిన హత్యలని వ్యాఖ్యానించారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వం చేసిన హత్యలేనన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తరపున ఒక్కటే హామీ ఇస్తున్నాం.. ఆర్నెల్లు ఓపిక పట్టండి.. మనందరి ప్రభుత్వం వస్తుంది.. జగన్ నాయకత్వంలో రైతులకు మళ్లీ సువర్ణయుగం వస్తుందన్నారు. కర్నూలులో ఆత్మహత్యకు పాల్పడిన రామయ్య దంపతుల కుటుంబానికి రూ.20 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట రైతు విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొవ్వూరి త్రినాధరెడ్డి, అనకాపల్లి పార్లమెంటు జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు సుంకర రుద్రి తదితరులు పాల్గొన్నారు. -
వీర జవాన్, పేద కిసాన్లకు 2.5 కోట్లు
ముంబై: వీర జవాన్ కుటుంబాలు, పేద రైతులను ఆదుకునేందుకు బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ముందుకు వచ్చారు. అమరులైన వీర జవాన్ల కుటుంబాలకు రూ.కోటి, రైతుల రుణమాఫీకి మరో రూ.1.5 కోట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ‘కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్ 10’లో భాగంగా ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ వివరాల ప్రకారం 44 మంది జవాన్ల కుటుంబాలకు ఈ సహాయం అందుతుందని చెప్పారు. నిధిలో 60 శాతం జవాన్ భార్యకు, మిగిలిన 40 శాతాన్ని తల్లిదండ్రులకు కేటాయించామన్నారు. ‘ఓసారి వైజాగ్‌లో షూటింగ్లో ఉన్న సమయంలో రూ.15, 20, 30వేల అప్పు కట్టలేక రైతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలను చదివి చలించిపోయాను. రైతుల కుటుంబాలకు నా వంతు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాను. 200 కుటుంబాల రుణమాఫీకి రూ. 1.5 కోట్లు చెల్లిస్తున్నాను’అని ఆయన పేర్కొన్నారు. -
పంట మునిగిందని రైతు ఆత్మహత్య
మంచిర్యాలక్రైం : మంచిర్యాల పోలీస్‌స్టేషన్ పరధిలోని ర్యాలీగఢ్‌పూర్ గ్రామంలోని బాబానగర్‌కు చెందిన చిప్పకుర్తి రాజయ్య (55) శుక్రవారం సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలి.. ఇటీవల మూడు రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగిపొర్లడంతో ర్యాలీవాగు సమీపంలో ఉన్న రాజయ్య పత్తి సేను పూర్తిగా మునిగిపోయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై తెలిపారు. రాజయ్యకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్సై తెలిపారు. -
అన్నదాతల ఆత్మహత్యలకూ చలించరా?
అనకాపల్లిటౌన్: అన్నదాతలు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.సూర్యనారాయణ ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఇక్కడ జైల్‌భరో నిర్వహించారు. స్థానిక సీఐటీయూ కార్యాలయం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించి, అక్కడ ధర్నా చేశారు. నెహ్రూచౌక్ జంక్షన్ వద్ద మానవహారంగా ఏర్పడి ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.పోలీసులు 118 మందిని అరెస్టు చేసి, పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 555 జిల్లాలో జైల్‌భరో కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు. వ్యవసాయ భూములను కార్పొరేట్ సంస్థలకు అప్పగించి రైతులను నట్టేట ముంచుతున్నారని ఆరోపించారు. భూములను అన్లైన్లో నమోదు చేయాలంటే ఎకరాకు రూ.30వేలు లంచం తీసుకుంటున్నారని తెలిపారు. బడాబాబులు, కార్పొరేట్ సంస్థలకు రెవెన్యూ అధికారులు కొమ్ముకాస్తున్నారని తెలిపారు. బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు ఆధికారంలోనికి వచ్చిన తరువాత గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు భద్రత లేకుండా పోవడంతో వారు పట్టణాలకు వలసపోవలసి వస్తోందన్నారు. స్వామినాథన్ కమిటీ సూచనల మేరకు ఉత్పత్తి ఖర్చులకు అదనంగా 50 శాతం కలిపి అన్ని పంటలకు మద్దతు ధర ప్రకటించాలని ఆయన కోరారు. కేరళ రాష్ట్రంలో మాదిరిగా రుణవిముక్తి చట్టాన్ని అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని, 2013 భూసేకరణ చట్టాన్ని యథాతధంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ చేయడంలో చిత్తశుద్ధిలేని ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు బకాయి ఉన్న కార్పొరేట్ సంస్థలకు రుణమాఫీ చేయడం అన్యాయమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రజలకు కల్లబొల్లిమాటలు చెప్పి మరోసారి గద్దెనెక్కడానికి సిద్ధపడుతున్నారన్నారు. మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు, ఆశవర్కర్లు, తుమ్మపాల సుగర్ ఫ్యాక్టరీ రైతులను రోడ్డున పడేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతందన్నారు. 60 సంవత్సరాలు దాటిన పేద, మధ్యతరగతి రైతులకు నెలకు రూ.5వేల చొప్పున పింఛన్ అందజేయాలని కోరారు. వచ్చేనెల 5న 10 లక్షల మంది రైతులతో పార్లమెంట్ ముట్టడి కార్యక్రమం నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి డి.వెంకన్న, సీఐటీయూ డివిజన్ కార్యదర్శి మళ్ల సత్యనారాయణ, సీపీఎం డివిజన్ కార్యదర్శి ఎ.బాలకృష్ణ, ఐద్వా జిల్లా సహయకార్యదర్శి డి.డి.వరలక్ష్మి, బుగిడి నూక అప్పారావు, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. -
అన్నదాతను బలిగొన్న అప్పులు
ఆదిలాబాద్‌రూరల్: పంట సాగు కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో దిగాలు చెంది ఓ యువ రైతు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని లాండసాంగ్వి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. ఆదిలాబాద్‌రూరల్ ఎస్సై తోట తిరుపతి, కుటుంబీకుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బీరెల్లి అశోక్ (32) తనకున్న మూడెకరాలతోపాటు మరో ఐదెకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. గతేడాది ఎనిమిది ఎకరాల్లో పత్తి పంట సాగు చేయగా, గులాబీ పురుగు ఉధృతి కారణంగా పంట నష్టపోయి అప్పుల పాలయ్యాడు. పెట్టుబడి డబ్బులు సైతం రాలేదు. ఈయేడాది కూడా ఆశించిన స్థాయిలో పంట ఎదుగుదల లేక దిగాలు చెందాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. గమనించిన స్థానికులు, కుటుంబీకులు చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలిస్తుండగా మృతి చెందాడు. అశోక్‌కు భార్య గంగమ్మ ఉంది. కుటుంబ పెద్ద దిక్కు కోల్పోయిన ఆ కుటుంబీకుల రోదన చూసి గ్రామస్తులు సైతం కంటతడిపెట్టారు. అందరితో కలుపుగోలుగా ఉండే అశోక్ మృతి చెందడాన్ని గ్రామస్తులు, కుటుంబీకులు జీర్ణించుకోలేకపోతున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఉరేసుకుని ఆత్మహత్య.. ఆదిలాబాద్‌రూరల్: మండలంలోని భీంసరి గ్రామానికి చెందిన ఎస్.విఠల్ (33) ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆదిలాబాద్‌రూరల్ ఎస్సై తోట తిరుపతి తెలిపారు. విఠల్ మతిస్థిమితం సరిగాలేక గతంలో సైతం రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించాడు. మంగళవారం కుటుంబీకులు వ్యవసాయ పనులకు వెళ్లగా ఇంట్లో దూలానికి ఉరేసుకున్నాడు. మధ్యాహ్న ఇంటికొచ్చిన మృతుడి తండ్రి గణపతి విషయాన్ని గమనించి స్థానికులు, కుటుంబీకులకు సమాచారం అందించాడు. మృతుడికి భార్య మంగళ, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
నేటి నుంచి రైతు బీమా పత్రాల పంపిణీ
-
‘గులాబీ’ చీడ..అప్పుల పీడ
బోథ్ (ఆదిలాబాద్): పత్తికి సోకిన గులాబీ పురుగు ఓ గిరిజన రైతును బలిగొంది. దిగుబడి రాదనే బెంగతో మండలంలోని మందబొగడ గ్రామానికి చెందిన సెడ్మకి మారుతి(33) శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మారుతి తనకున్న 3 ఎకరాల్లో గత ఏడాది పత్తి వేశాడు. పంట కోసం రూ.లక్ష అప్పు తెచ్చాడు. ఇంతలోనే పత్తికి గులాబీ పురుగు సోకి దిగిబడి అమాంతం పడిపోయింది. కనీసం పెట్టుబడి కూడా రాలేదు. తెచ్చిన అప్పు మీదపడింది. ఈ ఏడాది మళ్లీ రూ.లక్ష అప్పు తెచ్చి పత్తి వేయగా తొలి దశలోనే పత్తి పువ్వులో గులాబీ పురుగు ఉధృతంగా ఉండటంతో దిగుబడిపై దిగులు చెందాడు. మొత్తం రెండు లక్షల అప్పు ఉండటంతో మనస్తాపం చెందాడు. శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో అప్పు విషయమై గ్రామ పెద్దలతో చర్చించేందుకు భార్య కవిత బయటికి వెళ్లింది. మూడేళ్ల కూతురు ధనలక్ష్మి, ఎనిమిది నెలల బాబు సోమేశ్వర్‌ల ముందే మారుతి పురుగుల మందు తాగాడు. హుటాహుటినా గ్రామస్తులు బోథ్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. మారుతికి భార్య, కూతుళ్లు పూజ(4), ధనలక్ష్మి(3), 8 నెలల బాబు సోమేశ్వర్ ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అబ్దుల్బాకీ తెలిపారు. జైనథ్ మండలంలో ఒకరు.. జైనథ్: మండలంలోని గూడ గ్రామానికి చెందిన రైతు అమ్ర విఠల్(42) పురుగుల మందు తాగి శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై పుల్లయ్య కథనం ప్రకారం.. విఠల్ తన భార్య వెంకటమ్మ, ఇద్దరు పిల్లలతో ఆదిలాబాద్‌లోని భుక్తాపూర్‌లో తాత్కాలికంగా నివాసం ఉంటున్నారు. పిల్లల చదువుల కోసం ఆదిలాబాద్‌లో ఉంటూ గూడలో తమకున్న 4 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నాడు. ఈ ఏడాది పత్తి వేశాడు. శుక్రవారం ఎప్పటిలాగానే భార్యాభర్తలిద్దరు చేనుకు వెళ్లారు. కాగా ఉదయం 10గంటలకు భార్య పనులు చేస్తుండగా, విఠల్ పురుగుల మందు తాగాడు. గమనించిన భార్య పక్క చేన్లో ఉన్న భగవాండ్లు అనే రైతు సహాయంతో ఎడ్లబండిపై గూడకు తీసుకొచ్చింది. అక్కడి నుంచి ఆటోలో రిమ్స్‌కు తరలిస్తుండగా చనిపోయాడు. కాగా గిమ్మ బీవోఎం బ్యాంకులో విఠల్‌కు రూ.లక్ష అప్పు ఉంది. పత్తి పంట సరిగ్గా రాలేదని, కొన్నేళ్లుగా ఆర్థిక పరిస్థితులు సరిగ్గాలేకపోవడంతో అత్మహత్యకు పాల్పడినట్లు భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మరువలేని మమకారం
కర్ణాటక : తన కష్టసుఖాల్లో భాగమైన పాడి పశువులు శాశ్వతంగా దూరమయ్యాయని తెలిసి ఆ బడుగుజీవి కన్నపిల్లలనే కోల్పోయినంతగా రోదించాడు. ధారవాడ జిల్లా హొసయెల్లాపురలో బుధవారం ఉదయం ఈ విషాదం జరిగింది. మంగళవారం రాత్రి ఈదురుగాలులు, వర్షానికి గ్రామానికి చెందిన గురుప్రసాద్‌కు చెందిన పాక కూలిపోయింది. శిథిలాల కింద చిక్కి రెండు ఎనుములు, ఒక దూడ సజీవ సమాధి అయ్యాయి. ఉదయాన్నే ఈ ఘోరాన్ని గమనించిన గురుప్రసాద్ ఎనుములను గుండెలకు హత్తుకుని విలపించాడు. ఈ దృశ్యం చూపరుల హృదయాలను పిండేసింది. -
శెభాష్ కామేగౌడ : వి.వి.ఎస్. లక్ష్మణ్
కర్ణాటక, మండ్య: ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురుచూస్తూ కాలం వృథా చేయకుండా ఆ సన్నకారు రైతు నడుంబిగించి జల సిరులను సృష్టించారు. సొంత డబ్బులతో నీటి నిల్వ కోసం సుమారు 14 చెరువులను తవ్వించిన మండ్య జిల్లాలోని మళవళ్లి తాలుకాలో ఉన్నదాసనగొడ్డి గ్రామానికి చెందిన రైతు కామేగౌడ సేవను తెలుసుకున్న బారత మాజీ క్రికెట్ దిగ్గజం వి.వి.ఎస్. లక్ష్మణ్ అభినందిస్తు ట్వీట్ చేశారు. రైతు కామేగౌడ వేసవి కాలంలోప్రజలకు, జంతువులకు తాగునీటి కొరత ఉండకూడదనే ఆశయంతో దాసనదొడ్డి గ్రామంలో సుమారు 14 నీటి కుంటలను తవ్వించాడు. దాంతో ఎప్పడు ఈ నీటి చెరువుల్లో నీరు నిల్వ ఉంటుంది. వీటిని తవ్వడానికి ఈ రైతు సుమారు 15 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఈ విషయం ఆనోటా ఈనోటా తెలుసుకున్న లక్ష్మణ్... కామేగౌడను ట్విట్టర్లో ప్రశంసించారు. వి.వి.ఎస్. లక్ష్మణ్ చేసిన ట్వీట్ -
రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు తగ్గాయి
మిరుదొడ్డి (దుబ్బాక): తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతు ఆత్మహత్యలు తగ్గిపోయాయని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలోని అందెలో రూ.1.6 కోట్ల నిధులతో నిర్మించిన విద్యుత్ సబ్ స్టేషన్‌ను దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలసి ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్ర పాలనలో ఏదో ఒక మూలన రైతుల ఆత్మహత్యలు జరిగేవని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఈ రోజుల్లో రైతుల ఆత్మహత్యలు తగ్గాయంటే తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలే కారణమని అన్నారు. తెలంగాణలో ఉన్న రైతులను రాజులను చేయాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్, వారికి బీమాతో భరోసా, పంటలకు మార్కెటింగ్ సౌకర్యం, గోడౌన్ల నిర్మాణం, ధాన్యం కొనుగోలు, కనీస మద్దతు ధర, పెట్టుబడి సాయంతో పాటు ప్రాజెక్టులతో సాగు నీరు అందిస్తున్నారని వివరించారు. ఖరీఫ్‌లో పంట సాయం అందించిన మాదిరిగానే రబీ సీజన్లో సైతం ఎకరానికి రూ.4వేలు అందించడానికి ప్రభుత్వం సిద్ధం అవుతోందన్నారు. పాలమూరు ఎత్తిపోతలు, కాళేశ్వరం ప్రాజెక్టు, సీతారామ, దిండి ప్రాజెక్టు నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చేపడుతోందన్నారు. పాలమూరు, కాళేశ్వరం ప్రాజెక్టులు వచ్చే ఏడాదిలోగా పూర్తయితే తెలంగాణలో ఉన్న కోటి ఎకరాల భూములు సస్యశ్యామలంగా మారుతాయన్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టుతో దుబ్బాక రైతుల కాళ్లను తడుపుతామన్నారు. రైతులు ఆత్మవిశ్వాసంతో ఉండాలని హరీశ్‌రావు కోరారు. ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తయితే పంటలకు తగినంత సాగు నీరు లభిస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్, దేశం కలిస్తే ఒరిగేదేమీ లేదు ‘సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలే బలం, ప్రజలే దేవుళ్లు, ప్రజల సంక్షేమం కోసం నిరంతర కృషి చేస్తాం’అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజాబలం లేని కాంగ్రెస్, తెలుగుదేశం, కోదండరాం, సీపీఎంలు ఒక్కటవుతాయట.. అంటూ ఎద్దేవా చేశారు. వీరు కలిస్తే ప్రజలకు ఒరిగేదేమీ లేదని అన్నారు. కాంగ్రెస్ పాలనలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను ఏనాడూ పట్టించుకోలేదన్నారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఉచిత కరెంట్ కాదు.., ఉత్త కరెంటే ఇచ్చింది’అని విమర్శించారు. వారి హయాంలో గంటకోసారి కరెంటు ట్రిప్పు, పంటకోసారి మోటార్లు కాలిపోయాయన్నారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం నాణ్యమైన కరెంటును ఉచితంగా అందిస్తోందన్నారు. రాష్ట్రంలో కరెంటు లేకున్నా, మోటార్లు కాలిపోయినా కాళేశ్వరం నీటితో పొలాలు సస్యశ్యామలంగా మారుతాయన్నారు. కాంగ్రెస్ పాలనలో ఎరువుల కొరత, కరెంటు కోత, విత్తనాల కొరత రైతులను పట్టి పీడించాయన్నారు. రైతులకు నాణ్యమైన 24 గంటల ఉచిత కరెంటు కోసం తమ ప్రభుత్వం రూ.16 వేల కోట్లు ఖర్చు పెడుతోందని వెల్లడించారు. విద్యకు పెద్ద పీట.. రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల విద్యకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 570 ఇంగ్లిష్ మీడియం రెసిడెన్షియల్ స్కూళ్లను మంజూరు చేసిందన్నారు. అలాగే 238 బీసీ గురుకుల పాఠశాలలను ప్రారంభించినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రతీ మండలానికి బీసీ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
ఉసురు తీసిన అప్పులు
ఆత్మకూర్.ఎస్ (సూర్యాపేట) : ఆరుగాలం శ్రమించి.. అప్పు తెచ్చి పెట్టుబడులు పెట్టినా చివరకు ఉత్తచేతులే మిగలడంతో ఆ రైతులు కలత చెందారు. ఓ వైపు పూటగడవని దైన్యం.. మరో వైపు అప్పులవారి ఒత్తిడికి తట్టుకోలేకపోయారు. ఇక చావే శరణ్యమనుకుని బలవన్మరణాలకు పా ల్పడ్డారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మం డలం రామన్నగూడెం ఆవాసం తెట్టేకుంట తండా కు చెందిన బాణోతు రాణ్య (50) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. నాలుగు సంవత్సరాలుగా ఏపూరు రైతుకు చెందిన పదెకరాల భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. సాగు పెట్టుబడులకు దాదాపు 4లక్షల రూపాయలు అప్పు చేశాడు. కాలం కలిసి రాక దిగుబడి ఆశాజనకంగా రాలేదు. దీంతో ఈ సంవత్సరం కౌలు వదిలి కోటపహాడ్‌కు చెందిన ఒక రైతు వద్ద 80వేలకు జీతం కుదిరాడు. కాగా అప్పుతీర్చే మార్గం కనిపించిక శనివారం 8గంటల సమయంలో పురుగుల తాగాడు.గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించే లోపే మృతిచెందాడు. అతడికి భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పోస్టుమార్టం నిమి త్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మృతు డి కుమారుడు శ్యామ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్ఐ తొగరు సత్యనారాయణ తెలిపారు. -
‘గులాబీ’ గుబులు..అప్పుల తిప్పలు
జైనథ్(ఆదిలాబాద్): పంట నష్టంతో మనస్తాపం చెందిన మండలంలోని పెండల్వాడ గ్రామానికి చెందిన రైతు బొల్లి రమేశ్ (40) పురుగుల మందు తాగి శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై పుల్లయ్య కథనం ప్రకారం.. రమేశ్ తల్లి పేరిట 5 ఎకరాల భూమి ఉంది. దీంతోపాటు మరో 4 ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. ఈ ఏడాది మొత్తం 9 ఎకరాల్లో పత్తి పంట వేశాడు. సాగు కోసం రూ.లక్ష బ్యాంకు అప్పు, మరో లక్ష ప్రైవేటు అప్పు ఉంది. ప్రస్తుతం పంటలో అక్కడక్కడ గులాబీరంగు పురుగు కనిపించడంతో గత కొంతకాలంగా ఆందోళన చెందుతున్నాడు. పురుగు ఉధృతి పెరిగితే పెట్టిన పెట్టుబడి కూడా తిరిగిరాదనే దిగాలుతో శుక్రవారం రాత్రి ఇంటి వద్ద పురుగుల మందు తాగాడు. దీంతో కుటుంబ సభ్యులు బాలాపూర్ వరకు ఆటోలో తీసుకొని రాగా, అక్కడి నుంచి 108లో జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించారు.చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందాడు. భార్య నామమ్మ, ఇద్దరు కుమారు ఉన్నారు. కాగా మృతుడి తండ్రి హన్మాండ్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై పేర్కొన్నారు. భీమిని(బెల్లంపల్లి): భీమిని మండలంలోని మామిడిపల్లి గ్రామానికి చెందిన రైతు చౌదరి దేవాజీ(45) శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబీకులు, పోలీసుల కథనం ప్రకారం..దేవాజీ కొన్నేళ్లుగా పత్తి పంట సాగు చేస్తున్నాడు. గతేడాది పంట దిగుబడి సరిగా రాలేదు. ఈ ఏడాది కూడా నాలుగు ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నాడు. అలాగే కుమార్తె పెళ్లికి చేసిన అప్పులు అన్ని కలుపుకొని సుమారు రూ.3 లక్షలు అప్పులయ్యాడు. దీంతో మనస్తాపం చెంది శనివారం ఇంట్లోనే పురుగుల మందు తాగాడు. దేవాజీకి భార్య లక్ష్మి, కుమార్తె, కుమారుడు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రైతులకు బేడీలు.. కార్పొరేట్లకు మాఫీలు
మన దేశంలో అప్పులు కట్టలేని రైతులను కారాగారాలకు పంపిస్తారు. అయితే, ఉద్దేశపూర్వకంగా బ్యాంకుల రుణాలు ఎగవేసే బడా కార్పొరేట్ సంస్థల యజమానులను జైళ్ల పంపిన సందర్భాలు లేవు. రుణగ్రస్తత, దివాలా నిబంధనలతో ఇలాంటి పెద్ద మనుషులను కాపాడుతున్నారు. మరి రైతులకు కూడా ఈ హెయిర్‌కట్ వంటి రాయితీ ఎందుకు ఇవ్వడం లేదు? రుణాలు తిరిగి చెల్లించలేకపోయిన పెద్ద, చిన్న రైతులకు కూడా ఇలాంటి వెసులుబాటు ఇవ్వాలి కదా! పంజాబ్‌లో రెండు లక్షల రూపాయలకు మించని వ్యవసాయ రుణాల మాఫీ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ పరిమితికి కేవలం రూ.100 దాటిన కారణంగా అనేక మంది రైతులకు రుణమాఫీ నిరాకరించారు. రుణ విధానానికి రెండు ముఖాలుంటాయి. ధనికు లకు ఓ రకంగా, పేదలకు మరో విధంగా బ్యాంకులు రుణాలిచ్చే విషయంలో వ్యవహరిస్తుంటాయి. పంజాబ్ వ్యవసాయ అభి వృద్ధి బ్యాంక్ వ్యవహారాన్నే తీసుకుందాం. రుణా లుగా తీసుకున్న రూ. 229.80 కోట్ల బకాయిలను ఒకే సారి తిరిగి చెల్లించకపోతే రైతుల పొలాలను అమ్మి వేస్తామని బెదిరిస్తూ వారికి ఈ బ్యాంక్ లీగల్ నోటీసులిచ్చింది. మరో పక్క, రుణం ఎగ్గొట్టే స్థితికి చేరిన ఆధునిక్ మెటాలిక్స్ లిమిటెడ్(ఏఎంఎల్) అనే కంపెనీకి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కోల్కత్తా శాఖ భారీ స్థాయిలో వెసులుబాటు కల్పించింది. ఈ కంపెనీ బకాయి మొత్తంలో 92 శాతం మాఫీ చేసింది. అంటే రుణంలో 8 శాతం చెల్లించి చేతులు దులు పుకునే అవకాశం ఈ కంపెనీకి ఇచ్చింది. రుణాల వసూలులో ఇలాంటి ‘రాయితీ’ని బ్యాకింగ్ పరి భాషలో ‘హెయిర్‌కట్’(క్షౌరం) అంటారు. కిందటి వారం ఇలాంటిదే జరిగింది. మానెట్ ఇస్పాత్ అండ్ ఎనర్జీ అనే కంపెనీకి తన రుణ బకా యిల చెల్లింపులో 78 శాతం మాఫీ(హెయిర్‌కట్) లభించింది. ఈ కంపెనీ రుణ బకాయిల మొత్తం రూ.11,014 కోట్లు. రుణం తీసుకుని తిరిగి చెల్లించని కారణంగా ఈ కంపెనీపై వేసిన ఖాయిలా ప్రక్రియ విచారణ పూర్తయ్యాక ఇంతటి భారీ రాయితీ కల్పిం చారు. ఈ నిర్ణయం వల్ల ఈ కంపెనీ తనకు అప్పి చ్చిన సంస్థలకు కేవలం రూ.2,457 కోట్లు చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన రూ.8,557 కోట్లను మొండి బాకీ కింద మాఫీ చేస్తారు. రుణాలు ఎగవేసే వ్యాపా రుల విషయంలో ఇంతటి ‘పెద్ద మనసు’తో వ్యవహ రించడం వల్లే అప్పులు చెల్లించని కంపెనీల యజ మానుల జీవన శైలి మారడం లేదు. రైతులకు ఇలాంటి రాయితీలు ఇవ్వకపోవడంతో వారు చివరికి చేసేదేమీ లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. బ్యాంకింగ్ వ్యవస్థ పనితీరు ఇలాగే ఉంటోంది. పరిశ్రమలు చెల్లించాల్సిన బకాయిల మొత్తంలో సాధ్యమైనంత ఎక్కువ భాగాన్ని మాఫీ చేయడానికే ప్రతి అవకాశాన్ని బ్యాంకులు వాడుకుంటున్నాయి. పైన చెప్పిన ఏఎంఎల్ కంపెనీ విషయానికి వస్తే, ఇంగ్లండ్‌కు చెందిన లిబర్టీ హౌస్‌తో రూ.410 కోట్లకు ఒప్పందం కుదిరిన తర్వాత ఖాయిలా పరిశ్రమలకు వర్తించే రుణగ్రస్తత, దివాలా నిబంధనల కింద (ఐబీసీ) ఈ కంపెనీకి 92 శాతం అంటే రూ. 4.960 కోట్ల భారీ ‘హెయిర్‌కట్’ మాఫీ లభించింది. ‘ఖాయిలా’ ముద్రతో రుణాల ఎగవేత! మళ్లీ పంజాబ్ రైతుల రుణాల విషయానికి వస్తే– 12,625 మంది రైతుల రుణాల బకాయిల మొత్తం రూ.229.80 కోట్లను పంజాబ్ వ్యవసాయాభివృద్ధి బ్యాంకు వసూలు చేయడానికి ఎలాంటి పద్ధతి అవ లంబిస్తోందో చూడండి. ఓ భారీ పారిశ్రామిక కంపె నీకి మాఫీ చేసిన మొత్తంలో ఇది చాలా మొత్తం. ఓ కంపెనీ ఖాయిలా పడిందని ప్రకటించాక రుణ చెల్లింపు పరిష్కార ఒప్పందం కింద ఇంతటి భారీ రాయితీని మాఫీ రూపంలో బ్యాంకులు అందిస్తు న్నాయి. వాస్తవానికి అప్పును మాఫీ చేయడం కన్నా ఎక్కువగా కంపెనీలకు మేలు చేయడానికి ఆడుతున్న నాటకమే దివాలా తీసినట్టు ప్రకటించడం. దీనికి ఖాయిలాపడటమనే మాట వాడుతున్నారు. రుణం తీసుకున్నాక కంపెనీ యజమాని దాన్ని తిరిగి బ్యాంకులకు చెల్లించకుండా తెలివిగా నష్టాలతో నడిచే తన కంపెనీని అమ్మేసి స్వేచ్ఛగా తిరుగుతు న్నాడు. అంటే దాదాపు రుణం మొత్తాన్ని పన్నులు చెల్లించే ప్రజలే చివరికి భరిస్తున్నారు. ఈ తరహా వ్యవహారానికి ప్రఖ్యాత అమెరికా మేధావి నోమ్ చామ్స్కీ ‘కటువు ప్రేమ’ అని పేరు పెట్టారు. అంటే ఇది పేదలకు భారంగా, ధనికులకు ప్రేమగా పరిణమిస్తుంది. కార్పొరేట్ కంపెనీల రుణా లను మాఫీచేయడం ఆర్థికాభివృద్ధికి దారితీస్తుందని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇదే నిజమైతే, రైతుల రుణాల మాఫీ ఆర్థికాభివృద్ధికి ఎందుకు దారితీయదో నాకు అర్థంకావడం లేదు. నిజానికి, రైతులు, పారిశ్రామిక కంపెనీలు ఒకే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటాయి. మరి అలాంటప్పుడు కార్పొరేట్ మొండి బాకీల మాఫీ ఆర్థికాభివృద్ధికి దారితీస్తే, వ్యవసాయ రుణాల రద్దు నైతికపరమైన ప్రమాదానికి ఎందుకు కారణమౌ తుంది? రుణాల మాఫీ కోరే రైతులను ఎందుకు ఏహ్యభావంతో చూస్తున్నారు? రుణాల చెల్లింపులో అరాచకానికి రైతుల అప్పుల మాఫీయే కారణమని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చైర్పర్సన్ గతంలో నిష్టూరంగా మాట్లాడారు. అలాగే, వ్యవసాయ రుణాల మాఫీ నైతికపరమైన ముప్పుగా మారిందని, దీనివల్ల జాతీయ ఆదాయ, వ్యయాల పట్టిక తలకిందులవు తోందని భారతీయ రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్ అభిప్రాయపడ్డారు. రుణాలు చెల్లించని 12,625 మంది రైతుల వ్యవసాయ భూములను బహిరంగ వేలం వేసే ఉద్దేశం నిజంగా తనకు లేదని, లీగల్ నోటీసు కేవలం బెదిరింపు మాత్రమేనని పంజాబ్ వ్యవసాయాభివృద్ధి బ్యాంకు ప్రకటించింది. అయితే, రూ.1363.87 కోట్ల రుణాలను బ్యాంకుకు తిరిగి చెల్లించని 71,432 మంది రైతులపై కత్తి వేళ్లా డుతూనే ఉంది. హరియాణాలో సాగునీటి పైప్‌లైన్ వేయడానికి ఆరు లక్షల రూపాయల రుణం తీసు కున్న ఓ రైతు అప్పు కట్టలేకపోయాడు. అందుకు ఫలితంగా అతను రూ.9.83 లక్షల జరిమానా చెల్లిం చాలని, రెండేళ్ల జైలు శిక్ష అనుభవించాలని జిల్లా కోర్టు తీర్పు చెప్పింది. పరిశ్రమలకు భారీ రాయితీ కోట్లాది రూపాయల రుణ బకాయిలు వసూలు చేసే సామర్ధ్యం లేకనే పైన ఉదహరించిన ఏఎంఎల్ కంపె నీకి భారీ రాయితీ (హెయిర్ కట్) కల్పించారు. సినర్జీస్ డోరే ఆటోమేటివ్ లిమిటెడ్ కంపెనీకి 94.27 శాతం భారీ రుణమాఫీ ఇవ్వడంతో దీని నుంచి ఆర్థిక సంస్థలు కేవలం రూ. 54 కోట్లు మాత్రమే వసూలు చేస్తాయన్న మాట. వాస్తవానికి ఈ కంపెనీ మొత్తం రుణ బకాయిలు రూ.972.15 కోట్లు అంటే ఏ స్థాయిలో అప్పులు ఎగవేసే అవకాశం దీనికి లభిం చిందో ఊహించుకోవచ్చు. కార్పొరేట్ కంపెనీలు రుణాలను సకాలంలో తిరిగి చెల్లించకుండా మొండి బాకీలుగా మారిపోయే పరిస్థితులు తలెత్తిన సంద ర్భాల్లో ఈ అప్పులు కట్టడానికి వాటికి తగిన వెసు లుబాటు కల్పించేలా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తగిన ఏర్పాట్లు చేస్తున్నాయి. ఎంతో కొంత మొత్తం రుణం కింద చెల్లించడానికి వీలుగా ఈ కంపెనీలకు ‘హెయిర్ కట్’లు ఇస్తున్నారు. ఇలాంటి కంపెనీల రుణాల వసూలుకు 2004లో ‘స్ట్రెస్డ్ అసెట్ స్టెబి లైజేషన్ ఫండ్’ పేరుతో ఓ నిధిని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ ఇలాంటి మొండి బకాయిలను వసూలు చేయడానికి కొన్ని కంపెనీ లకు 90 శాతానికి పైగా ‘హెయిర్‌కట్‌లు’ ఇచ్చింది. స్థిరీకరణ నిధి పేరుతో ఉన్న ఈ సంస్థ అందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది. కార్పొరేట్లకు జైలు శిక్షలుండవు అప్పులు కట్టలేని రైతులను కారాగారాలకు పంపి స్తారు. అయితే, ఉద్దేశపూర్వకంగా బ్యాంకుల రుణాలు ఎగవేసే బడా కార్పొరేట్ సంస్థల యజమా నులను జైలుకు పంపిన సందర్భాలు లేవు. రుణగ్రస్తత, దివాలా నిబంధనావళి ఈ పెద్ద మనుషులను కాపాడుతోంది. మరి రైతులకు కూడా ఈ హెయిర్ కట్ వంటి రాయితీ ఎందుకు ఇవ్వడం లేదు? రుణాలు తిరిగి చెల్లించలేకపోయిన పెద్ద, చిన్న రైతులకు కూడా ఇలాంటి వెసులబాటు ఇవ్వాలి కదా! పెద్దగా నష్టపోకుండా అప్పుల ఊబి నుంచి బయటపడటానికి రైతులకు కూడా అవకాశాలు కల్పించాలి. పంజాబ్‌లో రెండు లక్షల రూపాయలకు మించని వ్యవసాయ రుణాల మాఫీ చేస్తున్నట్టు ప్రక టించారు. ఈ పరిమితికి కేవలం రూ.100 దాటిన కారణంగా అనేకమంది రైతులకు రుణమాఫీ ప్రయో జనం నిరాకరించారు. ఇది నిజంగా అన్యాయం. మాఫీ చేసే మొత్తానికి ఇలా గరిష్ట పరిమితి విధిస్తూ ఆర్థిక న్యాయం కొందరికే పరిమితం చేస్తు న్నారు. ఈ సందర్భంగా రైతుల రుణభారం తగ్గించడానికి కేర ళలో 2007లో ఏర్పాటు చేసిన కేరళ స్టేట్ డెట్ రిలీఫ్ కమిషన్ ఎలా పనిచేస్తోందో తెలుసు కుంటే మంచిది. రైతుల వ్యవసాయ రుణాల పాత బకాయిలను సగ టున 50 నుంచి 75 శాతం వరకూ మాఫీ చేసిందని ఈ సంస్థ నివేదికలు చెబుతున్నాయి. ఫలితంగా వ్యవ సాయదారులు పాత అప్పులను వదిలించుకుని తాజాగా రుణాలు తీసుకోవడానికి వీలవుతోంది. రైతులు పేదవారు కాబట్టి వారికి ఆర్థిక స్వాతం త్య్రాన్ని నిరాకరించకూడదు. రైతన్నలను నిరంతర రుణభారం నుంచి విముక్తిచేయాల్సిన అవసరం ఉంది. భిన్న వర్గాలకు భిన్న రీతుల్లో రుణ విధానం అమలు చేయడం సబబు కాదు. దేవిందర్‌శర్మ వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
ప్రాణాలకు తెగించి అడవి పందితో రైతు పోరాటం
-
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
యాచారం: అప్పుల బాధతో మనస్తాపానికి గురైన రైతు వ్యవసాయ పొలంలోని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన యాచారం మండల పరిధిలోని నక్కర్తమేడిపల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. నక్కర్తమేడిపల్లి గ్రామానికి చెందిన మేకల సుధాకర్‌రెడ్డి(50)కి నాలుగెకరాల పొలం ఉంది. తన పొలంలో రెండేళ్లుగా రూ.4 లక్షలకు పైగా ఖర్చు చేసి బోరుబావులు తవ్వించాడు. కరువు పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయం కూడా సాగడం లేదు. దీంతో సాగుకు చేసిన అప్పులు, పెట్టుబడి అప్పులు విపరీతంగా పెరిగాయి. దీనికి తోడు ఏడాది క్రితమే సుధాకర్‌రెడ్డి భార్య యాదమ్మ మృతి చెందడంతో కొన్ని నెలలుగా తీవ్ర మనుస్తాపంతో కాలం వెల్లదీస్తున్నాడు. ఆదివారం ఉదయం తన వ్యవసాయ పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి కొడుకు, కూతురు ఉన్నారు. అప్పుల బాధతో మృతి చెందిన సుధాకర్‌రెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ బాషా డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ లిక్కి కృష్ణంరాజు తెలిపారు. -
పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
చింతపల్లి (దేవరకొండ) : పురుగుల మందు తాగి ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా మండల పరిధిలోని నసర్లపల్లిలో శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ నాగభూషణ్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. నసర్లపల్లి గ్రామానికి చెందిన నల్ల ఎల్లయ్య(35) తమకున్న 5ఎకరాల పొలంలో సంవత్సరం పత్తి పంటను సాగు చేశాడు. సాగు పెట్టుబడులకు ప్రైవేట్ వ్యక్తుల వద్ద సుమారు రూ.3లక్షల అప్పుతెచ్చాడు. దిగుబడి రాక పెట్టుబడులు కూడా వెళ్లలేదు. అప్పు తీర్చే మార్గం కనబడక మనస్తాపం చెంది శనివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స దేవరకొండ ఆస్పత్రికి తరలిస్తుండగా మా ర్గమధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు కలరు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.మృతుడి భార్య అంజమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
అనారోగ్యం, అప్పుల సమస్యలతో..
చేవెళ్ల రంగారెడ్డి : అనారోగ్యంతోపాటు, వ్యవసాయంపై చేసిన అప్పలు బాధిస్తుండటంతో ఓ రైతు మనస్థాపం చెంది చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన చేవెళ్ల మండలంలోని చనువెళ్లి గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలు.. చేవెళ్ల మండలంలోని చనువెల్లి గ్రామానికి చెందిన మంగలి బిక్షపతి (38) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇతడు గత కొంతకాలంగా కడుపులో గ్యాస్ సమస్యతో బాధపడుతున్నాడు. పలు ఆసుపత్రుల్లో చూపించినా నయం కాలేదు. ఈ గ్యాస్ సమస్య వచ్చినప్పుడు కడుపులో విపరీతమైన నొప్పి వస్తుండటంతో భరించలేక రెండు మూడుసార్లు ఆత్మహత్యాయత్నం కూడా చేశాడు. ఆ సమయంలో కుటుంబసభ్యులు ఉండటంతో ప్రమాదం జరగకుండా చూసుకున్నామని భార్య అనిత తెలిపారు. మళ్లీ ఈ సమస్య రావటంతో గురువారం రోజు మధ్యాహ్నం ఇంటి వద్దకు వచ్చి ఇంట్లోనే కాసేపు పడుకున్నాడు. అయినా బాధ ఎక్కువ కావటంతో భరించలేకపోయాడు. దీనికి తోడు పంటల కోసం చేసిన అప్పులు కూడా ఉండటంతో ఏం చేయాలో తెలియక రాత్రి 8 గంటల సమయంలో ఇంటి వద్ద ఉన్న భార్యాపిల్లలతో మాట్లాడి మళ్లీ వస్తానని చెప్పి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు గ్రామంలో వెతికినా ఎక్కడా కనిపించ లేదు. అర్ధరాత్రి సమయంలో పొలాల వద్ద ఉన్నాడేమోనని వెళ్లి చూస్తే వేప చెట్టుకు ఉరేసుకొని కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని శుక్రవారం ఉదయం మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. కుటుంబానికి ఆధారమైన వ్యక్తిని కోల్పోవటంతో కుటుంసభ్యులు బోరున విలపించారు. మృతుడికి భార్య అనిత, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. భార్య అనిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ముగ్గురిని మింగిన అప్పులు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంగళవారం అప్పుల బాధతో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాలకు చెందిన రైతు చీకోటి లచ్చయ్య(52) పురుగుల మందుతాగాడు. మానకొండూర్ మండలం కొండపల్కలకు చెందిన వీరారెడ్డి(45) ఉరివేసుకున్నాడు. వరంగల్‌రూరల్ జిల్లా పరిధిలోని భీమదేవరపల్లి మండలం మాణిక్యపూర్‌కు చెందిన తాళ్లపెల్లి రాకేశ్(32) జమ్మికుంట రైల్వేస్టేషన్ సమీపంలో రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కోనరావుపేట(వేములవాడ): అప్పుల బాధ భరించలేక రైతు చీకోటి లచ్చయ్య(52) ఆత్మహత్య చేసుకున్నాడు. కోనరావుపేట మండలం సుద్దాల గ్రామంలో ఈఘటన చోటుచేసుకుంది. గ్రామాని కి చెందిన చీకోటి లచ్చయ్య తనకున్న 1.5 ఎకరాల్లో పత్తి సాగు చేసుకుంటున్నాడు. పత్తి సాగులో దిగుబడి రాక నష్టాల పాలయ్యాడు. ఇటీవల కూతురు వివాహం చేశాడు. ఇందుకోసం కొంత అప్పు చేశాడు. మరికొంత అప్పు చేసి ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లాడు. అక్కడా సరైనపని లభించక రెండు నెలలకే ఇంటికి తిరిగొచ్చాడు. అన్ని అప్పులు కలిసి రూ. ఐదు లక్షల వరకు చేరాయి. వీటిని తీర్చేదారిలేదనే బెంగతో మంగళవారం తెల్లవారుజామున వ్యవసాయ క్షేత్రంలోనే క్రిమిసంహారక మందు తాగి చనిపోయాడు. మృతుడికి భార్య లక్ష్మి, కూతురు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కొండపల్కలలో.. మానకొండూర్: మండలంలోని కొండపల్కల గ్రామంలో అప్పులబాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. సీఐ బిల్లా కోటేశ్వర్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వీరారెడ్డి(45)కి రెండెకరాల వ్యవసాయభూమి ఉంది. మరో రెండెకరాలు కౌలుకు తీసుకుని సాగుచేస్తున్నాడు.సాగు దిగుబడి సరిగా లేకపోవడంతో రూ.ఏడు లక్షల అప్పులయ్యాయి. అప్పులెలా తీరుతాయని మనస్తాపం చెందాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం పొలం వద్దకు వెళ్లాడు. అక్కడే ఉన్న కొట్టంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అక్కడే ఉన్న రైతులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి బోరున విలపించారు. భార్య పద్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. రైలుకింద పడి యువకుడు.. జమ్మికుంట(హుజూరాబాద్): ఆర్థిక ఇబ్బందులతో ఓ యువకుడు రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జమ్మికుంట రైల్వేస్టేషన్ శివారులో మంగళవారం వెలుగులోకి వచ్చింది. మంచిర్యాల్ రైల్వే ఎస్సై జితేందర్‌రెడ్డి వివరాల ప్రకారం.. వరంగల్‌రూరల్ జిల్లా పరిధిలోని భీమదేవరపల్లి మండలంలోని మాణిక్యపూర్ గ్రామానికి చెందిన తాళ్లపెల్లి రాకేశ్(32) సోమవారం హుజూరాబాద్‌లోని బంధువుల ఇంటికి వచ్చాడు. రాత్రి ఇంటికి వెళ్తున్నానని అక్కడి నుంచి బయల్దేరాడు. నేరుగా జమ్మికుంట రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాడు. పట్టాలపై తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. గుర్తు పట్టని విధంగా శరీరం చెల్లచెదురుగా ఎగిరిపడింది. మంగళవారం రైలు పట్టాలపై మృతదేహం కన్పించడంతో రైల్వే అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సంఘటన స్థలం వద్ద లభించిన సెల్ఫోన్లో వివరాలు సేకరించారు. తమకు అప్పులు ఎక్కువ ఉన్నాయని, వేదనతోనే తమ కొడుకు ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి తల్లిదండ్రులు దుర్గయ్య,ఎల్లమ్మ పోలీసులకు తెలిపారు. -
అప్పుల బాధ తాళలేక వ్యక్తి బలవన్మరణం
నంద్యాల: అప్పుల బాధ భరించలేక ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తాలూకా ఎస్ఐ రమేష్‌బాబు వివరాల మేరకు..పట్టణంలోని రెవెన్యూ క్వార్టర్స్‌కు చెందిన నరేష్కుమార్(29) సుధన అనే మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమె నంద్యాలలోని విద్యుత్ కార్యాలయంలో ఏఈగా పని చేస్తోంది. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. నరేష్కుమార్ తెలిసిన వారి వద్ద దాదాపు రూ.35 లక్షల దాకా అప్పు చేశాడు. ఇటీవల అప్పులిచ్చిన వారు అతడిపై ఒత్తిడి తేవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. మంగళవారం ఉదయం పొన్నాపురం వద్ద ఉన్న జాతీయ రహదారి పక్కన పురుగుల మందు తాగి భార్యకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. వెంటనే అక్కడికి చేరుకున్న బంధువులు కొన ఊపిరితో ఉన్న అతడిని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స ఫలించకపోవడంతో మృతి చెందాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకున్నట్లు తాలూకా ఎస్ఐ తెలిపారు. -
మూడు నెలలు.. 639 ఆత్మహత్యలు
సాక్షి, ముంబై : దేశంలో నానాటికి రైతుల అత్మహత్యలు పెరుగుతున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర శాసన మండలిలో ప్రకటించిన ఘణాంకాలు చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఈ ఏడాది మార్చి 1 నుంచి మే 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 639 మంది రైతులు అత్మహత్య చేసుకున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, పునరావాస శాఖమంత్రి చంద్రకాంత్ పాటిల్ మండలిలో తెలిపారు. ప్రతిపక్ష సభ్యులు శనివారం అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఆత్మహత్య చేసుకున్న 639 మందిలో ఇప్పటి వరకూ 174 మందికి రాష్ట్ర ప్రభుత్వం తరుఫున నష్టపరిహారం చెల్లించినట్లు మంత్రి ప్రకటించారు. 122 మంది రైతుల ఆత్మహత్యలకు కారణాలేంటో తెలియరాలేదని ప్రభుత్వం అందించే నష్ట పరిహారానికి వారు అర్హులు కారని మంత్రి వెల్లడించారు. రుణమాఫీ, మద్దతు ధర, ఎరువులపై రాయితీలు ఇవ్వకపోవడం మూలంగానే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఎన్సీపీ సభ్యులు ఆరోపిస్తున్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని, గిట్టుబాటు ధర కల్పించాలని మహారాష్ట్ర రైతులు ఇటీవల మహా పాదయాత్రను నిర్వహించిన విషయం తెలిసిందే. రైతులు డిమాండ్లను అమలు చేస్తామని సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ప్రకటించిన.. రైతుల ఆత్మహత్యలును మాత్రం ప్రభుత్వం నివారించలేకపోతుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. -
విద్యుదాఘాతానికి రైతు బలి
నారాయణపేట: వరి నారుకు నీరు పెట్టే క్రమంలో బోరు మోటార్ ఆన్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మృతిచెందాడు. ఈ సంఘటన మండలంలోని గనిమోనిబొండలో శనివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు బొడ్డోపోళ్ల పెద్దనర్సప్ప(55) శనివారం తన పొలంలో వరి నారు పెట్టేందుకు బోరును ప్రారంభించేందుకు వెళ్లారు. కాగా పొలంలో అతి తక్కువ ఎత్తులో కట్టెకు విద్యుత్ వైర్లను అమర్చారు. అయితే కట్టె విరిగిపోవడంతో దానిని పైకి లేపేందుకు ప్రయత్నించగా అంతలోనే వైరు తెగి ఆయనపై పడటంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. పక్క పొలాల్లో ఉన్న రైతులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న గ్రామస్తులు అక్కడికి చేరుకొని పోలీస్‌స్టేషన్‌కు స మాచారం ఇచ్చారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించి కేసు నమో దు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పెద్ద నర్సప్ప కు భార్యతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. -
పోడు భూమి పోతోందని..
‘అమ్మ’ లేనిదే ఆ ‘బిడ్డ’ ఉండలేదు.. ‘తల్లి’ దూరమైతే ఏమాత్రం తట్టుకోలేదు... ఇక్కడ... ‘అమ్మ’ అంటే... భూమాత..! ‘బిడ్డ’ అంటే... రైతు..!! భూమాతను తనకు దూరం చేయడాన్ని ఆ బిడ్డ తట్టుకోలేకపోయాడు. తనకు, తన కుటుంబానికి సర్వస్వమైన ఆ భూమాతను లాక్కుంటుంటే సహించలేకపోయాడు. అడ్డుకోలేని అశక్తుడయ్యాడు. మనసు ముక్కలైంది. బతుకు లేదనుకున్నాడు. ప్రాణాలు తీసుకోబోయాడు. ఇల్లెందు: మండలంలోని రాఘబోయినగూడెం పంచాయతీ బోడియాతండా గ్రామానికి చెందిన పోడు రైతు కున్సోత్ చంద్రు, ఆత్మహత్యకు యత్నించాడు. సాగు భూమిలో అటవీశాఖ అధికారులు మొక్కలు నాటుతుండడాన్ని తట్టుకోలేకపోయాడు. భరించలేని మనోవేదనతో ఆ భూమి లోనే.. ఆ భూమాత ఒడిలోనే.. ఆ మట్టిలోనే ఐక్యమవుదామనుకున్నాడు. పురుగు మందు తాగాడు. కుటుంబీకులు వెంటనే ఇల్లెందు వైద్యశాలలో చేర్పించారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. గత 20 ఏళ్ల క్రితం కున్సోతో చంద్రు, ఆయన కుమార్తె భద్రమ్మతో కలిసి బోడియాతండా సమీపంలో పది ఎకరాల పోడు నరికి సేద్యం చేపట్టాడు. 2006లో అటవీ హక్కుల చట్టం కింద ఇతడికి ప్రభుత్వం హక్కు పత్రం కూడా ఇచ్చింది. ఇటీవల రైతుబంధు పథకం కింద పది ఎకరాలకుగాను రూ.40వేలు కూడా వచ్చాయి. ఈ భూమిలో సేద్యం చేయరాదంటూ అతడిని అటవీశాఖ అధికారులు గత మూడేళ్లుగా అడ్డుకుంటున్నారు. మరో ముగ్గురు రైతులది కూడా ఇదే పరిస్థితి. ఈ నలుగురు రైతులు కలిసి కోర్టును ఆశ్రయించారు. ఉన్నతాధికారులకు సమస్యను విన్నవించారు. అటవీశాఖ అధికారులు ఆగలేదు. చంద్రు, మరో ముగ్గురు రైతులు, పదిమంది కూలీలతో తమ పోడు భూమిని సాగు చేసేందుకు శుక్రవారం వెళ్లారు. అప్పటికే రోళ్లపాడు సెక్షన్ ఆఫీసర్ భాగ్య, కుంటల, వేపలగడ్డ, కొల్లాపురం బీట్ ఆఫీసర్లు పాపయ్య, ఎల్.శ్రీను, గౌరమ్మ, సిబ్బంది కలిసి ఆ నలుగురు రైతుల భూముల్లో మొక్కలు నాటేందుకు వెళ్లారు. ఇటు రైతులు, అటు అధికారులు. వారి మధ్య వాగ్వివా దం జరిగింది. తన కళ్లెదుటే... తన భూమాతను (భూమిని) అధికారులు లాక్కోవడాన్ని చూస్తూ చంద్రు తట్టుకోలేకపోయాడు. పురుగు మందు తాగాడు. కుటుంబీకులు వెంటనే ఇల్లెందు వైద్యశాలకు తరలించారు. డాక్టర్ నాగశశికాంత్ ప్రాథమిక వైద్యం అందించి ఖమ్మం ఆస్పత్రికి రిఫర్ చేశారు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఏమంటున్నారంటే.. చంద్రు ఆత్మహత్యాయత్నంపై ఫారెస్టు సెక్షన్ ఆఫీ సర్ భాగ్యను ‘సాక్షి’ వివరణ కోరింది. ‘‘కుంటల సెక్షన్‌లోని బోడియాతండా సమీపంలోని భూమి లో మొక్కలు నాటేందుకు ముగ్గురు బీట్ ఆఫీసర్ల తో కలిసి శుక్రవారం ఉదయం అక్కడికి వెళ్లాము. మారణాయుధాలు చేబూనిన కొంతమంది అక్కడ? ప్లాంటేషన్‌ను తొలగించేందుకు యత్నించారు. మేము గట్టిగా ప్రశ్నించటంతో వారు అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించారు. అంతలోనే, తాను మందు తాగినట్టుగా చంద్రు కేకలు వేశాడు. ఆయనను అక్కడే ఉన్న కుటుంబీకులు ఆస్పత్రికి తీసుకెళ్లారు’’ అని చెప్పారు. -
రైతును మింగిన అప్పు
కోహీర్(జహీరాబాద్): అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని సజ్జాపూర్‌లో శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు అందించిన సమాచారం మేరకు.. గ్రామానికి చెందిన రైతు విజేందర్ తన తండ్రి రామన్న పేరు మీద ఉన్న మూడెకరాల పొలంలో వ్యవసాయం చేస్తున్నాడు. వ్యవసాయం కలిసి రాక రూ. రూ. 4 లక్షల మేర అప్పులు చేశాడు. గత రెండు నెలల క్రితం గ్రామంలో ఉన్న 200 గజాల ఇంటి స్థలాన్ని రూ. లక్షకు అమ్మి కొంత మేర అప్పులు తీర్చాడు. మిగతా అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఆందోళన చెందుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో భార్య పుష్పవతితో కలిసి పొలానికి వెళ్లాడు. అనంతరం నైలాన్‌తాడును కొంత మేర కత్తిరించుకొని ఇంటి వైపు బయలుదేరాడు. అనుమానం వచ్చిన భార్య పని చేస్తున్న కూలి ఒకరికి తన భర్త విజేందర్‌ను అనుసరించమని చెప్పి పంపించింది. తాను కూడా ఇంటికి వచ్చింది. ఆ లోపే విజేందర్ ఇంటికి వచ్చి దూలానికి ఉరివేసుకున్నాడు. ఇరుగుపొరుగు సహాయంతో తాడు విప్పి కిందికి దింపి చూడగా అప్పటికే విజేందర్ చనిపోయాడు. మృతిడికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
నారు నాటడం, పాదులు కట్టడం నేర్చుకున్నాను..
టీ.నగర్ : పసంగ పాండిరాజ్‌దర్శకత్వంలో కార్తి నటించిన కడైకుట్టి సింగం శుక్రవారం తెరపైకి వచ్చింది. ఈ చిత్రం గురించి, ఇతరవిషయాల గురించివిలేకరులతో కార్తిమాట్లాడారు. ప్రశ్న: కడైకుట్టి సింగం ఏ తరహా చిత్రం? జ: దర్శకుడు పాండిరాజ్ మూడేళ్ల క్రితం ఈ కథను వివరించారు. అయితే, ఇరువురికి అవకాశం కుదరలేదు. ప్రస్తుతం సరైన సమ యం కుదిరింది. పెద్ద కుటుంబ కథా చిత్రం లో నటించాలన్న చిరకాల వాంఛ నెరవేరింది. ప్రశ్న: చిత్రంలో మీ క్యారెక్టర్ గురించి? జ: ఇది కుటుంబ కథాచిత్రం. నేను చదువును మధ్యలోనే అపేసి వ్యవసాయం చేసే క్యారెక్టర్లో నటించాను. సామాజిక విషయాలపై శ్రద్ధ కలిగిన రైతుగా నటించాను. ప్రశ్న: ఈ చిత్రం కోసం ఎలా కష్టపడ్డారు? జ: ‘ధీరన్ అధికారం ఒన్రు’ చిత్రం కోసం శరీర బరువును కష్టపడి తగ్గించుకున్నాను. ‘కడైకుట్టి’ చిత్రం కోసం మళ్లీ కష్టపడి బరువును పెంచుకున్నాను. నారు నాటడం, పాదులు కట్టడం వంటివి సక్రమంగా నేర్చుకుని నటించాను. ప్రశ్న: రైతుల కోసం రూపొందిన చిత్రమా? జ: ఒక రైతుకు ఉన్న యథార్థమైన సమస్యల గురించి ఈ చిత్రంలో ప్రశ్నించాం? మిగతా పనులకు విశ్రాంతి ఉన్నప్పటికీ వ్యవసాయానికి విశ్రాంతే లేదు. ఏ వయసులోనైనా వ్యవసాయం చేయవచ్చు. ఉన్నదాంట్లో సంతోషంగా జీవించేవాళ్లే రైతులు. ఈ జీవన సిద్ధాంతాన్ని మిగతా వారికి తెలియజేయాలి. ప్రశ్న: తిరుమయంలో రెక్లా రేస్ అనుభవం ఎలావుంది? జ: తిరుమయంలో రెక్లా రేస్ నిర్వహించే వారి ఆధారంగా పందెపు సన్నివేశాలు రూపొందించాం. గుర్రపు స్వారీ శిక్షణ పొందడంతో ఎడ్లబండి నడపడం కొంత సులభంగా అనిపించింది. ఎడ్ల బండిలో నేను మాత్రమే కూర్చునే వీలుంది. వెంట పరుగెత్తిన వ్యక్తి ఒక దశలో పరుగుతీయలేక నేను మాత్రమా ఎడ్లబండిలో వెళ్లి తిరిగి రావాల్సి వచ్చింది. అథ్లెటిక్స్‌లో ఎలా శిక్షణ పొందుతామో, అలాగే ఎడ్లబండి పందెంలో ఎద్దులకు శిక్షణ ఇస్తారు. ప్రశ్న: చిత్రంలో ముగ్గురు హీరోయిన్లను ఎలా డీల్ చేశారు? జ: ముగ్గురు హీరోయిన్ల విషయంలో నాకెలాంటి కష్టం కనిపించలేదు. అయితే డాన్స్ సీన్లలో కొంత శ్రమ అనిపించింది. నా కోసం వారు కొంత అడ్జెస్ట్ అయ్యారు. ప్రశ్న:దర్శకత్వం చేసే ఉద్దేశం ఉందా? జ: దర్శకులు పడే బాధలు నాకు బాగా తెలుసు. ఎందుకు ఆ రంగంలోకి దిగాలి? ప్రస్తుతానికి నటనపైనే దృష్టి ఉంచాను. 17వ చిత్రం నటించాను. దర్శకత్వం వహించే అలోచన లేదు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేయడానికి సిద్ధం. నాకు తోచింది దర్శకునికి చెబుతాను. దాన్ని అంగీకరించడం, లేకపోవడం వారిష్టం. ప్రశ్న:తండ్రి నుంచి ఏం నేర్చుకున్నారు? జ: కష్ట సుఖాలను సమానంగా చూడాలనే వంటి పలు విషయాలు తండ్రి నుంచి నేర్చుకోవచ్చు. వృత్తి పైన గౌరవం ఆయన నుంచి నేర్చుకున్నదే. -
8 ఏళ్లనాటి కల.. 88 ఏళ్ల వయసులో సాకారం.!
-
8 ఏళ్లనాటి కల.. 88 ఏళ్ల వయసులో సాకారం.!
సాక్షి, చెన్నై: కలలు కనండీ.. వాటిని సాకారం చేసుకునేందుకు కష్టపడండీ అని మాజీ రాష్ట్రపతి, స్వర్గీయ అబ్దుల్ కలాం చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఓ వ్యవసాయదారుడు రూపాయి రూపాయి కూడబెట్టి తన ఎనిమిదేళ్లనాటి కళను 88 ఏళ్ల వయసులో సాకారం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు కాంచీపురానికి చెందిన రైతు పేరు దేవరాజన్. ప్రస్తుతం ఆయన వయసు 88 సంవత్సరాలు. అయితే ఆయన 8 ఏళ్ల వయసులో ఉండగా తొలిసారి ఓ బెంజ్ కారుని చూసి, ఎలాగైనా దానిని కొనాలనుకున్నారు. అప్పుడు అతనికి కనీసం ఆ కారు పేరు కూడా తెలియకపోవడంతో లోగోను మనసులో పదిలపరుచుకున్నారు. ఇటీవల దేవరాజన్ చెన్నైలోని బెంజ్ కారు డీలర్ అయిన ట్రాన్స్ కార్ ఇండియాలో ఈ మధ్యే రూ.33 లక్షలు పెట్టి మెర్సిడీజ్ బెంజ్ బీ క్లాస్ కారును కొన్నారు. దేవరాజన్ కథ తెలిసిన ట్రాన్స్ కార్ ఇండియా దీనిని ఓ వీడియో తీసి యూట్యూబ్‌లో షేర్ చేసింది. ఆయనతో ఓ కేక్ కూడా కట్ చేయించారు. ‘దేవరాజన్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్’ అంటూ ఈ స్ఫూర్తిదాయకమైన స్టోరీని రూపొందించింది. ఆశయం గొప్పదైతే ఎప్పటికైనా విజయం వరిస్తుందని ఈ రైతు నిరూపించారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
అప్పుల బాధతో రైతు బలవన్మరణం
లక్సెట్టిపేట(మంచిర్యాల): అప్పుల బాధతో మండలంలోని ఊత్కూరు గ్రామానికి చెందిన రైతు కాసు పాపయ్య(55) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డట్టు స్థానిక ఎస్సై మదుసుధన్‌రావు తెలిపారు. పాపయ్య సుతారి పనితోపాటు వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి పొందుతుండేవాడు. తనకున్న ఎకరం పొలంతోపాటు మూడెకరాలు కౌలుకు తీసుకుని నాలుగేళ్లుగా సాగుచేస్తున్నాడు. రెండేళ్ల నుంచి పత్తి, వరి దిగుబడి తక్కువ రావడంతో సుమారు నాలుగు లక్షల రూపాయల వరకు అప్పులయ్యాడు. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. దీంతో ఆర్థిక ఇబ్బందులకు తట్టుకోలేక పిల్లల వివాహాలు ఎలా చేసేదని మనస్తాపానికి గురై గురువారం ఉదయం ఇంట్లో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబీకులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స కోసం మంచిర్యాలకు తీసుకెళ్లుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. భార్య సత్తవ్వ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. -
పశ్చిమలో విస్తారంగా వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం
సాక్షి, ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. చింతలపూడి పరిసర ప్రాంతాల్లో నాలుగు రోజులుగా భారీ వర్షం కురుస్తోంది. దీంతో ఇక్కడ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మల్లయగూడెం, పోతునువు, రాఘవాపురం, పరిసర ప్రాంతాల్లో వరదల కారణంగా నాట్లు వేసిన పొలాలు పూర్తిగా నీట మునిగాయి. నారుమళ్లు మునిగిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చింతకపూడిలోని పలు రహదారులు, గ్రామాలను కలిపే రోడ్లు జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ నివాస ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకొరిగాయి. ముఖ్యంగా చింతలపూడి బస్టాండ్‌లోకి వర్షపునీరు వచ్చిచేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చింతలపూడి ప్రభుత్వ పాఠశాలలోకి వరదనీరు వచ్చిచేరింది. దీంతో విద్యార్థులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే చింతలపూడి బస్టాండ్‌లోకి వర్షపు నీరు చేరిందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో పలుచోట్ల చెట్లు కూలి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విస్తారంగా వర్షాలు.. జిల్లాలోని దెందులూరు, ఉంగుటూరు, గణపవరం, అత్తిలి, తణుకు, ఉండి, ఆకివీడు, భీమవరం, వీరవాసరం, పాలకొల్లు, నరసాపురం, ఆచంట తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా వేలాది ఎకరాల్లో నారుమళ్లు నీటమునిగాయి. నాట్లు ఆలస్యంగా ప్రారంభమవ్వడం.. ఇంతలోనే వర్షాలు రావడంతో చాలా ప్రాంతాల్లో నారుమళ్లు నీటమునిగి రైతులు ఆందోళన చెందుతున్నారు. 20 వేల ఎకరాల్లో నారుమళ్లు నీట మునిగిపోయినట్టు అంచనా వేస్తున్నారు. దీంతో ఎకరానికి 3 వేల రూపాయల వరకు నష్టం ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజా వర్షాలకు జిల్లాలో రూ. 6 కోట్ల వరకు పంట నష్టం వాటిల్లి ఉంటుందని భావిస్తున్నారు. నారుమళ్లు నీటమునగడంతో మళ్లీ విత్తనాలు కొనేందుకు ఎకరానికి మూడు వేల రూపాయిల వరకు పెట్డుబడి పెట్టాల్సి ఉందని రైతులు ఆవేదనకు లోనవుతున్నారు. గత నాలుగు రోజులగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఆక్వా రైతు ఆందోళన నెలకొంది. తాజా వాతావరణ మార్పులతో రొయ్యల చెరువులకు తీవ్రంగా నష్టంగా వాటిల్లుతోందని, ప్రధానంగా ఆక్సీజన్ అందక రొయ్యలు చెరువుల్లోనే చనిపోతున్నాయని రైతులు అంటున్నారు. దీంతో కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోందని ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
నాకెప్పుడు ప్రజల మధ్యనే ఉండటం ఇష్టం
-
రాహుల్, మోదీలకు ఓ సర్పంచ్ సవాల్
గోవా : సోషల్ మీడియా వేదికగా కేంద్ర క్రీడాశాఖ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ తీసుకొచ్చిన ఫిట్నెస్ చాలెంజ్‌కు విశేష స్పందన లభించిన విషయం తెలిసిందే. అటు ప్రధాని నుంచి సామాన్యుడి వరకు ఈ చాలెంజ్‌ను స్వీకరించి ఫిట్‌నెస్‌పై విస్తృత ప్రచారం కల్పించారు. అయితే ఈ తరహాలోనే గోవాలోని ఓ గ్రామ సర్పంచ్ ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీలకు ‘అగ్రికల్చర్ చాలెంజ్’ అని సవాల్ విసిరి వార్తల్లో నిలిచాడు. దక్షిణ గోవాలోని అకెమ్ బయిసో గ్రామ పంచాయతీ సర్పంచ్ సిద్దేశ్ భాగత్ మంత్రులు, క్రీడాకారులు, వీఐపీలు.. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక అయిన రైతు కన్నా తక్కువే అని తెలిపాడు. ప్రతి ఒక్కరు పొలంలోకి దిగి.. ట్రాక్టర్‌తో పొలం దున్ని.. విత్తనాలు వేస్తే రైతు పడే కష్టం ఎంటో తెలుస్తోందన్నాడు. ఇదేదో తన పాపులారిటీ కోసం చేయడం లేదని, రైతు కష్టం ప్రతి ఒక్కరికి తెలియజేసేందుకే ఈ చాలెంజ్ తీసుకొచ్చినట్లు స్పష్టం చేశాడు. తన దృష్టిలో మంత్రులు, ఎమ్మెల్యేలు వీఐపీలే కాదని, దేశానికి అన్నం పెట్టే రైతన్ననే వీఐపీ అని చెప్పుకొచ్చాడు. తన చాలెంజ్‌ను మోదీ, రాహుల్‌తో పాటు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధా మోహన్ సింగ్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిలు స్వీకరించాలన్నాడు. సవాల్‌ను స్వీకరించిన గోవా ప్రజాప్రతినిధులు ఈ సర్పంచ్ విసిరిన సవాల్‌కు అనేక మంది మద్దతుగా నిలుస్తున్నారు. ఈ ఛాలెంజ్‌ను ఇప్పటికే గోవాలోని పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు స్వీకరించి పొలాల్లోకి దిగుతున్నారు. ఈ సర్పంచ్ సవాల్‌ను తొలుత దక్షిణ గోవా నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అలెక్సో రెజినాల్డో స్వీకరించారు. ఆయన ట్రాక్టర్‌తో వరి నాట్ల కోసం పొలాన్ని సిద్దం చేసి ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. రెవిన్యూ శాఖ మంత్రి రోహన్ కాంటే సైతం ఈ చాలెంజ్‌ను స్వీకరించి తన వ్యవసాయ భూమిలో పొలాన్ని సిద్దం చేశాడు. మరోవైపు గోవా వ్యవసాయశాఖ మంత్రి విజయ్ సర్దేశాయ్ కూడా తన నియోజకవర్గ పరిధిలోని వ్యవసాయ క్షేత్రంలో నాట్లు వేశారు. అయితే, ఈ చాలెంజ్‌ను మాత్రం ఆయన తప్పుబట్టారు. రాష్ట్రంలోని బంజరు భూములను సాగులోకి తేవడమే నిజమైన అగ్రికల్చర్ ఛాలెంజ్ అని వ్యాఖ్యానించారు. వ్యవసాయ యంత్రాంగం చాలా ముఖ్యమైందని, అందుకే తమ ప్రభుత్వం రైతులకు ఆర్థిక సాయం కింద ఎకరాకు రూ.19,500 అందజేస్తుందని తెలిపారు. పడించే పంటలకు సరైన గిట్టుబాటు ధర లభించకపోవడంతో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో రైతులు ఆందోళన బాటపట్టడంతో ఈ చాలెంజ్‌కు ప్రాధాన్యత ఏర్పడింది. అలాగే రైతుల ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం సైతం పంటలకు మద్దతు ధర పెంచుతూ రెండు రోజుల కిందట నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. #FarmingChallenge Goan MLAs and Ministers seen in fields . Time to take to agriculture and farming at different level. Challenge still continues. Farmers are backbone of this country and state . Time to get MLAs and Ministers in fields. @PMOIndia pic.twitter.com/MFxVhWqf4B — Siddesh Bhagat (@SiddeshBhagat01) July 3, 2018 -
అన్నదాత బలవన్మరణం
తొండూరు : తొండూరు మండల పరిధిలోని బోడివారిపల్లె గ్రామానికి చెందిన మార్తల గురివిరెడ్డి(48) అనే రైతు అప్పుల బాధతో బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గురివిరెడ్డి వ్యవసాయమే జీవనాధారంగా చేసుకుని కుటుంబాన్ని పోషించేవాడు. ఆయనకు భార్య గుర్రమ్మ, కుమారుడు వెంకట్రామిరెడ్డి, తల్లి బాలమ్మలు ఉన్నారు. బోడివారిపల్లె గ్రామంలో తన తల్లి బాలమ్మ పేరుమీద 2.50ఎకరాల పొలం ఉంది. ఆ పొలంలో రెండేళ్ల క్రితం బోరు వేశాడు. అప్పట్లో బోర్లు, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్, విద్యుత్ మోటారు కోసం దాదాపు రూ.2లక్షల దాకా అప్పు చేశాడు. ఏడాదైన తర్వాత ఉన్న బోరుబావిలో నీరు రాకపోవడంతో ఏడాది క్రితం మరోచోట బోరు వేశాడు. అందులో నీరు పుష్కలంగా పడటంతో మరింత అప్పు చేసి వ్యవసాయ పంటలు సాగు చేశాడు. సాగు చేసిన పంటలు అంతంత మాత్రంగా దిగుబడి రావడం.. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో చేసిన అప్పుకు వడ్డీ కలుపుకుని దాదాపు రూ.6లక్షలకు చేరుకుంది. తల్లి బాలమ్మ, గురివిరెడ్డిలు కలిసి వ్యవసాయం చేసుకుంటూ వచ్చారు. అప్పులు రోజు రోజుకు పెరుగుతుండటంతో నిరాశకు గురయ్యాడు. దీంతో తన తల్లి బాలమ్మ పేరుతో 2014లో బ్యాంక్‌లో రూ.40వేల రుణం ఉండటంతో ఒకేసారి రూ.40వేలు రుణమాఫీ అయ్యింది. ఈ ఏడాది తిరిగి మల్లేల ఏపీజీబీలో 19180045480 అనే అకౌంట్ నెంబర్లో రూ.66వేలు పత్తి పంట సాగు కోసం తన తల్లి పేరు మీద అప్పు చేశాడు. ఐదేళ్లుగా కరువు పరిస్థితులు నెలకొనడంతో పండించిన పంటలకు గిట్టుబాటు ధరలేక, అప్పులు తీర్చలేక అష్టకష్టాలు పడ్డాడు. రూ.6లక్షలకు చేరిన అప్పులు ఎలా తీర్చాలని ఆలోచిస్తూ.. అప్పులు ఇచ్చిన వారు ఒత్తిడి చేస్తారేమోనని మనోవేదనకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసి అందరూ కలిసి ఆరు బయట పడుకునేందుకు వచ్చారు. ఆ సమయంలో వంకాయ పంట కోసం తెచ్చిన పురుగుల మందు తాగడంతో గమనించిన కుటుంబ సభ్యులు 108 వాహనంలో పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. గురివిరెడ్డి కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. మృతుని కుటుంబ సభ్యులకు పరామర్శ బోడివారిపల్లెకు చెందిన రైతు గురివిరెడ్డి మృతదేహం పులివెందుల ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీ గదిలో ఉండటంతో తొండూరు ఎస్ఐ వెంకటనాయుడు పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేశారు. విషయంతెలుసుకున్న వైఎస్సార్సీపీ మండల నాయకుడు భూమిరెడ్డి రవీంద్రారెడ్డి, సర్పంచ్ గురుమోహన్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు రామకృష్ణారెడ్డి, రాజశేఖరరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, రామనాథరెడ్డి, జయరామిరెడ్డి తదితరులు మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
నిజాం పాలనను తలపిస్తున్న కేసీఆర్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెడుతూ ప్రధాని నరేంద్ర మోదీ రైతుబంధుగా మారితే.. ఆ రైతుల ప్రయోజనాలను విస్మరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు రాబందుగా మారారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. రైతుల కోసం అనేక రాయితీలు, పథకాల కోసం కేంద్రం రూ.కోట్లు వెచ్చిస్తుండగా.. ఆ సొమ్ముతో కేసీఆర్ తానే చేస్తున్నట్లు పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. బీజేపీ చేపట్టిన జన చైతన్య యాత్ర బుధవారం కరీంనగర్ జిల్లా శంకరపట్నం చేరుకుంది. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో లక్ష్మణ్ మాట్లాడారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని ప్రకటించిన కేసీఆర్.. ఆ వర్గాన్ని దగా చేయడం ప్రారంభించారని దుయ్యబట్టారు. నిజాం పాలనను మరిపించేలా కేసీఆర్ పాలనను కొనసాగిస్తున్నారని చెప్పారు. కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకు మిషన్ కాకతీయ, భగీరథ లాంటి పథకాలు ప్రవేశపెట్టారని ఆరోపించారు. రగులుతున్న తెలంగాణ బిడ్డలు అమరవీరుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కుటుంబ పాలన సాగుతోందన్ని లక్ష్మణ్ ఆరోపించారు. కేసీఆర్ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడే వరకు అక్కాచెల్లెళ్లు ఎత్తిన బోనం దించవద్దని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ పాలన పట్ల తెలంగాణ బిడ్డలు రగిలిపోతున్నారని పేర్కొన్నారు. ప్రధాని మోదీ నిత్యం 18 గంటలు పని చేస్తుంటే.. కేసీఆర్ మాత్రం ప్రగతిభవన్, ఫామ్‌హౌజ్‌లు కేంద్రంగా పరిపాలన సాగిస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తి ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. దేశాన్ని సుదీర్ఘ కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ,, బోరు బావులు ఉచితంగా వేయించడం, అప్పుల మీద వడ్డీ మాఫీ చేస్తామని పురుద్ఘాటించారు. కౌలు రైతుకు ప్రత్యేక కౌలుదారు చట్టాన్ని అమల్లోకి తెస్తామని లక్ష్మణ్ హామీ ఇచ్చారు. పంటలకు మద్దతు ధర ప్రకటించిన రూపాల కరీంనగర్ జిల్లా శంకరపట్నం వేదికపై ‘రైతులకు తీపికబురు’అంటూ కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి పురుషోత్తం రూపాల 14 పంటలపై పెరిగిన కనీస మద్దతు ధరలను ప్రకటించారు. రైతులు, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కాగా, పంటలకు కనీస మద్దతు ప్రకటించినందుకు కేంద్ర మంత్రికి లక్ష్మణ్ మిఠాయి తినిపించారు. -
ఆత్మహత్యలకు రుణమాఫీ పరిష్కారం కాదు
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీ, ఉచిత విద్యుత్ రైతు ఆత్మహత్యలకు శాశ్వత పరిష్కారాలు కావని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ఇతర మార్గాలను అన్వేషించాలని, ప్రస్తుతం అమలు చేస్తున్నవి తాత్కాలిక ఉపశమనాలేనన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని కొనియాడారు. వ్యవసాయంచేస్తూ పాడి పశువులు, నాటు కోళ్లు పెంచే రైతులెవరూ ఆత్మహత్యలు చేసుకోవడం లేదన్నారు. మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థలో (సీఆర్ఐడీఏ)లో తెలంగాణ, అనుబంధ ప్రాంతాలలో రైతుల ఆదాయం రెట్టింపుపై సంప్రదింపుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికి ఎన్నో పథకాలు తీసుకువచ్చారన్నారు. ఏటా రూ.11 లక్షల కోట్ల రుణాలు ఇవ్వాలని కేంద్రం ప్రతిపాదిస్తుందని, అయితే సకాలంలో రుణాలు అందడం లేదన్నారు. మౌలిక సదుపాయాలు, విద్యుత్, సాగునీరు, మేలైన విత్తనాలు ఇస్తేనే రైతుకు భరోసా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఎస్ఆర్ఎం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అలసుందరం, వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. -
అప్పు.. ఆయువు తీసింది!
బాలానగర్ (జడ్చర్ల): అప్పులబాధతో ఓ యువరైతు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండల పరిధిలోని పెద్దాయపల్లి గ్రామ పంచాయతీ చెన్నంగులగడ్డతండాలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం... బాబునాయక్ (33) తన వ్యవసాయ పొలంలో నాలుగుబోర్లు వేసి అప్పులపాలయ్యాడు. అప్పు తీర్చే స్తోమత లేక భార్య లీలను ఆమె పుట్టింటికి పంపాడు. మూడురోజుల తర్వాత కూడా డబ్బు సర్దుబాటు కాలేదు. ఇదే విషయాన్ని ఆమె ఫోన్లో తెలిపింది. అప్పిచ్చిన వారికి ఏం సమాధానం చెప్పాలంటూ మదనపడిన బాబునాయక్ శనివారం రాత్రి తన ఇంట్లో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం ఎంతకూ తలుపులు తీయకపోవడాన్ని తండ్రి హేమ్య నాయక్ గమనించాడు. ఎంత పిలిచినా పలకకపోవడంతో ఇరుగుపొరుగు వారితో కలిసి తలుపులు పగులగొట్టాడు. కొడుకు ఉరేసుకోవడాన్ని చూసి, పోలీసులకు, భార్యకు సమాచారం అందించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. -
తొగాడియా కొత్త హిందూ పార్టీ
న్యూఢిల్లీ: విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) బహిష్కృత నేత ప్రవీణ్ తొగాడియా అంతర్రాష్ట్రీయ హిందూ పరిషత్ (ఏహెచ్‌పీ) పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. వీహెచ్‌పీ నుంచి బహిష్కరణకు గురైన తొగాడియా మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ‘హిందూ ప్రత్యామ్నాయం’గా తమ పార్టీ పనిచేస్తుందని చెప్పారు. ‘2014 ఎన్నికల్లో బీజేపీ వెన్నంటి ఉండి గెలిపించిన హిందువులను మోదీ ప్రభుత్వం వంచించింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం లేదు. యువతకు మాట ఇచ్చినట్లు 10 కోట్ల ఉద్యోగాలు రాలేదు. రైతులు రోజూ ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు’ అంటూ బీజేపీ, మోదీపై విరుచుకుపడ్డారు. -
టీఆర్ఎస్పై భ్రమలు పోతున్నాయి: కోదండరాం
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ పాలనపై అన్నివర్గాలకు భ్రమలు పోయినట్టేనని తెలంగాణ జన సమితి అధినేత ప్రొఫెసర్ ఎం.కోదండరాం అన్నారు. ఆర్టీసీ జేఏసీ నేత ఆనందం నేతృత్వంలో పలువురు నేతలు శనివారం టీజేఎస్‌లో చేరారు. జన సమితిలో చేరిన వారికి కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ ఎన్నో త్యాగాలు చేసి సాధించుకున్న రాష్ట్రంలో ఉద్యమ ఆకాంక్షలను విస్మరించారని విమర్శించారు. వ్యవసాయం సంక్షోభంలోకి కూరుకుపోయిందని, రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు. యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడంలో విఫలమైందన్నారు. విద్య, వైద్యం వంటి మౌళికరంగాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, ఉద్యమంలో అగ్రభాగాన ఉండి, రాష్ట్ర సాధనకోసం ఎన్నో త్యాగాలు చేసిన ఉద్యోగులను సీఎం కేసీఆర్ అవమానిస్తున్నారని కోదండరాం విమర్శించారు. రైతులు, యువకులు, విద్యార్థులు, ఉద్యోగులతోసహా ఏ వర్గం అయినా తమ సమస్యల పరిష్కారంకోసం విన్నవించే అవకాశం, నిరసనను వ్యక్తం చేసే వేదిక కూడా లేకుండా పోయిందన్నారు. ఇంత నియంతృత్వంగా ప్రభుత్వం, పాలన ఉంటుందని ఎవరూ ఊహించలేదన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు ప్రొఫెసర్ పి.ఎల్.విశ్వేశ్వర్రావు, డి.పి.రెడ్డి, వెంకటరెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు. -
ఉసురుతీసిన పెద్దమనుషుల తీర్పు
మహబూబాబాద్ రూరల్: పక్కనున్న వ్యవసాయ భూములకు వెళ్లే దారి తీసేందుకు తన వ్యవసాయ భూమిలో నుంచి పెద్దమనుషులు 17 గుంటల భూమి తీశారని మనోవేదనకు గురైన ఓ రైతు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మహబూబాబాద్ మండలం మాధవాపురం గ్రామశివారు దారావత్‌తండాలో శుక్రవారం జరిగింది. కురవి ఎస్సై ఎన్.నాగభూషణం, మృతుడి భార్య దారావత్ లక్ష్మి, స్థానికుల కథనం ప్రకారం... మహబూబాబాద్ మండలం మాధవాపురం శివారు దారావత్‌తండాకు చెందిన దరావత్ లచ్చిరాం(50)కు రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. పక్కనే ఇదే తండాకు చెందిన అతడి దాయాదులు దరావత్ లింగన్న, మోహన్, రమేష్, కస్నాకు వరుసగా భూములు ఉన్నాయి. వారి భూముల మధ్య లచ్చిరాం భూమి కూడా కొంత ఉంది. అయితే ఆయా భూములకు వెళ్లేందుకు దారి కోసం భూమి ఇవ్వాలని వారు రెండేళ్లుగా కోరుతున్నారు. ఈ విషయంలో పలుమార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీలు కూడా జరిగాయి. మొదటిసారి పంచాయితీలో పెద్దమనుషులు లచ్చిరాం భూమిలో నుంచి ఒక గుంటకు బదులు నాలుగు గుంటల భూమిని లింగన్న భూమికి వెళ్లే దారి కోసం కేటాయించారు. ఇటీవల పంచాయితీలో మళ్లీ లచ్చిరాంకు చెందిన 17 గుంటల భూమిని దారి కోసం తీశారు. దీంతో తన భూమిని ఎక్కవగా దారి కోసం కేటాయిస్తూ పెద్ద మనుషులు అన్యాయం చేశారంటూ మనోవేదనకు చెంది శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గతంలో పురుగుల మందు తాగి... దరావత్ లచ్చిరాం గతంలో కూడా ఇదే విషయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. దాయాదులు, ఇతర రైతులైన దరావత్ మోహన్, దరావత్ లింగన్న, దరావత్ రమేష్, దరావత్ కస్నా, దరావత్ వీరన్నతోపాటు పెద్ద మనుషులైన దరావత్ హరియా, దరావత్ శంకర్ ఏడుసార్లు పంచాయితీలు నిర్వహించి లచ్చిరాంకు రూ.60 వేల వరకు ఖర్చు చేయించినట్లు స్థానికులు తెలిపారు. దీంతో అప్పట్లో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగాడు. ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకున్నాడు. ఇందుకు రూ.80 వేలు ఖర్చయ్యింది. దారి కోసం భూమి కోల్పోవడం, పెద్ద మనుషుల తీరుతో మనోవేదనకు గురై ఇప్పుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుడి భార్య లక్ష్మి వాపోయింది. తమ భూమిలోకి వెళ్లకుండా కావాలని దారావత్ మోహన్, దారావత్ బీక్యా దారిలో ముళ్లకంప, ఇనుప కంచె వేశారని ఆవేదన చెందింది. లచ్చిరాం భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కురవి ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. -
వలస బతుకులకు.. చెరువు ఆదరువు!
సాక్షి, హైదరాబాద్: పాలమూరు అంటేనే ఆకలి చావులు.. రైతు ఆత్మహత్యలకు అడ్డా. పసిపిల్లలను, పండుటాకులకు వదిలేసి వలసపోయే కూలీల గడ్డ. నాగర్‌కర్నూలు జిల్లా కోడేరు మండలం పసుపుల గ్రామ పంచాయతీలోని గ్రామం ఖానాపురం కూడా అలాంటిదే. తూర్పున ఈడిగోనికుంట.. పడమరన పల్జోనికుంట.. దక్షిణాన కటికోనికుంట, ఉత్తరాన నడిపోనికుంటలతో ద్వీపం లాంటి ఈ ఊరు తరతరాలుగా నీళ్లు లేక తల్లడిల్లింది. 85 కుటుంబాలు, 360 ఎకరాల సాగు భూమి ఉన్న ఖానాపురంలో 2016 వరకు పుట్టెడు ధాన్యం పండిందిలేదు. ఊరు ఊరంతా వలసలతోనే కాలం వెళ్లదీసింది. అలాంటి పల్లెకిప్పుడు మంత్రి హరీశ్‌రావు కృష్ణమ్మనే పట్టుకొచ్చారు. ఎండిన కుంటల్లో నీళ్లు నింపి వలసపోయినోళ్లందరినీ పల్లెకు రమ్మని పిలిచి కృష్ణా జలాలతో రైతన్నల పాదాలు కడిగారు. వలసే ఉపాధి: 150 ఏళ్ల చరిత్ర ఉన్న ఖానాపురంలో వ్యవసాయం చేసుకుంటూ బతికిన ఒక్క కుటుంబమూ లేదు. అందరూ మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరాధి రాష్ట్రాల్లో ఎక్కడ పని దొరికితే అక్కడికి వలసపోయి బతికేటోళ్లే. వలస పోకపోతే ఆకలి చావులే. 2001లో అసెంబ్లీని కుదిపేసిన గాదం పురుషోత్తం ఆకలి చావు సంఘటన జరిగింది ఇక్కడే. 2016లో మిషన్ కాకతీయ కింద నడిపోనికుంటకు రూ.16 లక్షలు, కటికోనికుంటకు రూ.17.50 లక్షలు, ఈడిగోనికుంటకు రూ.8.50 లక్షలు ఖర్చు చేసి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పూడిక తీయించారు. పల్జోనికుంటలో ఉపాధిహామీ కింద మట్టి తీయించారు. ఈ కుంటలను కల్వకుర్తి లిఫ్టు ఇరిగేషన్ కాల్వకు అనుసంధానం చేశారు. ఒకేసారి కుంటలు నిండాయి. గూటికి చేరిన వలస పక్షులు చెరువుల్లోకి నీళ్లు రావటంతో వలస పక్షులన్నీ సొంత గూటిని చేరుకున్నాయి. నీళ్లు పుష్కలంగా ఉండటంతో ముక్కారు పంటలు పండు తున్నాయి. ‘నాకున్న ఐదున్నర ఎకరాల్లో ఎన్న డూ ఇత్తు పండలే. మహారాష్ట్ర, గుజరాత్.. ఎక్కడ పనిదొరికితే అక్కడికేపోయి బతికిన. రెండేళ్ల నుంచి కాల్వ నీళ్లు సెరువులకు మళ్లి పంటలు పండుతున్నాయి. పోయినేడు 8 పుట్ల వరి పండింది. ఐదు బస్తాల బుడ్డలైనయి’అని 52 ఏళ్ల రైతు కుర్మయ్య అన్నాడు. ‘కరువులనే పుట్టిన.. కరువులనే పెరిగిన. నాకు 14 మంది పిల్లలు పుట్టి.. తిండి సరిగా లేక 11 మంది చనిపోయిండ్రు. ఈ రెండేళ్ల నుంచి పంటలు పండుతున్నయి. ఎకరం వరి పెట్టిన. రెండు పుట్ల వరి గింజలు వచ్చినయి. చిన్నబిడ్డను బడికి పంపు తున్న. వరి అన్నమే తింటున్నం. అప్పుడప్పుడు ఇంత కూర (మాంసం) కూడ తింటున్నం’అని 70 ఏళ్ల రైతు ఆదే స్వామి చెప్పుకొచ్చాడు. ప్రతి గ్రామం ఖానాపురం కావాలె వలసపోయిన ఊరు మళ్లీ తిరిగొచ్చి వ్యవసాయం చేసుకుంటుదంటే చాలా ఆనందంగా ఉంది. 85 కుటుంబాల్లో 81 కుటుంబాలు ఇప్పుడు ఊరిలోనే ఉన్నాయి. కోటి ఎకరాల మాగాణికి నీళ్లు ఇచ్చి ప్రతి పల్లెను ఖానాపురం చేయాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం. ఈ క్రతువు నా ద్వారా జరగటం చాలా సంతోషాన్నిస్తోంది. – హరీశ్‌రావు, నీటిపారుదల శాఖ మంత్రి అమ్మొళ్లు పొలానికి..నేను, తమ్ముడు బడికి అమ్మానాయిన వలసపోతుంటే వాళ్లతో కలిసి మహారాష్ట్రకు పోయిన. అమ్మొళ్లు పనికి పోతే నేను తమ్మున్ని పట్టుకొని ఉండేదాన్ని. అప్పుడప్పుడు భివండీలో తెలుగోళ్ల బడికి పోయేదాన్ని. రెండేళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నం. అమ్మొళ్లు పొలా నికి పోతే నేను, తమ్ముడు బడికి పోతున్నం. – గాయత్రి -
మోదీది రైతు వ్యతిరేక పాలన
ఖమ్మంమయూరిసెంటర్ : దేశంలో మోదీ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతు వ్యతిరేక విధానాలతో పాలన సాగిస్తోందని, దీం తో రైతుల హత్యలు, ఆత్మహత్యలు పెరిగాయని అఖిల భారత రైతు కూలీ సంఘం జాతీయ నాయ కులు రాయల చంద్రశేఖర్, తెలంగాణ రైతు సం ఘం జిల్లా అధ్యక్షుడు మాదినేని రమేశ్ ఆరోపిం చారు. బుధవారం అఖిల భారత రైతు సంఘాల పోరాట సమన్వయ కమిటీ(ఏఐకేఎస్‌సీసీ) ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్‌లోని మందసోర్లో రైతాంగ సమస్యలపై ఉద్యమిస్తున్న రైతాంగంపై పోలీసు లు కాల్పులు జరిపి ఏడాదైన సందర్భంగా నగరంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ గద్దెనెక్కిన నాటి నుంచి రైతు వ్యతిరేక విధానాలను అ నుసరిస్తోందని, దీంతో వ్యవసాయ రంగం సంక్షోభాన్ని ఎదుర్కుంటోందని పేర్కొన్నారు. మంద సోర్‌లో రైతాంగ సమస్యలు పరిష్కరించాలని రైతులు రోడ్డు ఎక్కితే పోలీసులచే ప్రభుత్వం ఆరుగురు రైతులను హత్య చేయించిందని ఆరోపించారు. మందసోర్లో జరిగిన హత్యలతో రైతాంగం దేశవ్యాప్తంగా ఐక్య కార్యాచరణగా ఏర్ప డి రైతుల అప్పులను రద్దు చేయాలని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని బలమైన ఉద్యమాలు నిర్వహిస్తోందని తెలిపారు. మందసోర్లో అమరులైన రైతులను స్ఫూర్తిగా తీసుకొని రైతు సమస్యలు పరిష్కారమయ్యే వర కు రైతులంతా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు గోకినేపల్లి వెంకటేశ్వరరావు, పొన్నం వెంకటేశ్వరరావు, మలీదు నాగేశ్వరరావు, ఆవుల వెంకటేశ్వర్లు, బండి రమేశ్, తాతా భాస్కర్‌రావు, కట్టా గాంధీ, సిద్దినేని కోటయ్య, బోడెపూడి వీరభద్రం, బి.రామ్మూర్తి, మల్లయ్య, శ్రీనివాస్, హనుమంతరావు, సంఘయ్య తదితరులు పాల్గొన్నారు. దిష్టిబొమ్మ దహనం చేస్తున్న నాయకులు -
సులైమాన్ (అలై) తీర్పులు
వేల సంవత్సరాల పూర్వం ఇద్దరు రైతుల మధ్య వివాదం రాజుకుంది. అందులో ఒకరు పాడిరైతు కాగా, మరొకరు పంటరైతు. ఒకసారి పంటరైతు పొలంలో పాడిరైతు మేకలమంద పడి కాపుకొచ్చిన పంటనంతా పాడు చేసేసింది. మేకల రైతు తన మేకల దొడ్డి ద్వారాన్ని మూసివేయకుండా నిర్లక్ష్యం వహించడంతో మేకలన్నీ రైతు పొలాన్ని ఆ విధంగా నాశనం చేశాయి. భూమి రైతుకు తీవ్ర నష్టం జరిగింది. రైతు సులైమాన్ (అలై) అనే ప్రవక్త దగ్గరకొచ్చి ఫిర్యాదు చేశాడు. ఇద్దరి వాదనల్ని విన్న సులైమాన్ (అలై) ఈ మేకల మందను పంట యజమాని, పంటను మేకల యజమాని మార్చుకోవాల్సిందిగా తీర్పు చెప్పారు. ‘‘మేకల యజమాని పంటను పుష్కలంగా పండించి వచ్చిన ధాన్యాన్ని పంట యజమానికి అప్పగించాలి. పంట యజమాని మేకల పాలు పిండుకుని తనకు జరిగిన నష్టాన్ని పూడ్చుకోవాలి. భూమి రైతుకు జరిగిన నష్టం తీరాక తిరిగి ఎవరివి వాళ్లు తిరిగి ఇచ్చేయాలి’’ అని ఇద్దరికీ ఆమోదయోగ్యమైన తీర్పు చెప్పారు. ఓసారి ఇద్దరు మహిళలు ఒక చంటి పిల్లాడి కోసం కొట్లాడుతున్నారు. పిల్లాడు తన కొడుకు అంటే తన కొడుకు అని వాదులాడసాగారు. ఈ వివాదం సులైమాన్ (అలై) ముందుకెళ్లింది. ఇద్దరూ సులైమాన్ (అలై) ముందు తమ సమస్యను ఏకరువుపెట్టారు. సులైమాన్ (అలై) ఆ ఇద్దరు మహిళల్ని ఎదురుబొదురుగా నిల్చోబెట్టి చంటి పిల్లాడిని చేతుల్లో పట్టుకున్నారు. ఒరలో నుంచి ఖడ్గాన్ని తీసుకుని ‘‘ఈ పిల్లాడిని రెండు ముక్కలు చేసి సమానంగా పంచుతాను’’ అని చెప్పారు. దీనికి ఒక మహిళ సరేనని సంతోషంగా ఒప్పకుంది. ఇంకో మహిళ మాత్రం తల్లడిల్లిపోయింది. ‘‘చక్రవర్తి గారూ అంతపని చెయ్యకండి. ఆ పిల్లాడిని ఆమెకే అప్పగించండి’’ అని ప్రాధేయపడసాగింది. సులైమాన్ (అలై) ఆ చంటిపిల్లాడు ఆ మహిళ బిడ్డే అని గ్రహించారు. పిల్లాడిని అసలు తల్లికి అప్పజెప్పారు. ఈ రెండు గాథల్ని ఖుర్ఆన్ పరోక్షంగా ప్రస్తావించింది. – ముహమ్మద్ ముజాహిద్ -
రైతుకు మరో కానుక
ఆర్మూర్ : దేశ చరిత్రలో మొట్ట మొదటిసారిగా పంటల సాగుకు పెట్టుబడి సాయం అందజేసిన ప్రభుత్వం.. అన్నదాతలకు తాజాగా రైతు బీమా పథకం పేరిట మరో కానుక తీసుకొచ్చింది. పగలు, రాత్రనే తేడా లేకుండా పంటపొలాల వెంట తిరిగే రైతులకు ‘బీమా’ ధీమా కల్పించాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ నాయకత్వంలోని మంత్రిమండలి రైతు బీమా పథకానికి ఆమోదముద్ర వేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల జిల్లాలోని 2 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ పథకం ద్వారా రైతు సహజంగా మరణించినా, ప్రమాదవశాత్తు మరణించినా అతని కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల బీమా సొమ్ము అందనుంది. రైతుబంధు పథకంలో జిల్లాలో 2,39,718 మంది రైతులకు పెట్టుబడి రూపంలో లబ్ధి చేకూరగా, బీమా సంస్థల నిబంధనల ప్రకారం జిల్లాలో సుమారు 2 లక్షల మంది రైతులకు రైతు బీమా పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. రాష్ట్ర ప్రభుత్వం, ఎల్ఐసీ సంయుక్తంగా ఈ రైతుబంధు పథకాన్ని అమలు చేయనున్నాయి. బీమా సంస్థకు చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏటా బడ్జెట్లో కేటాయించనుంది. రాష్ట్రంలోని ప్రతీ రైతు ఈ పథకం పరిధిలోకి వస్తాడు. కానీ, బీమా సంస్థల నిబంధనల ప్రకారం 18 సంవత్సరాల నుంచి 59 ఏళ్ల లోపు ఉన్న రైతులకు మాత్రమే ఈ పథకం వర్తించనుంది. దీంతో 18 సంవత్సరాల లోపు, 60 సంవత్సరాల పైబడిన రైతులను తొలగించగా జిల్లాలోని సుమారు 2 లక్షల మంది రైతులు ఈ పథకంలో లబ్ధిదారులుగా మారనున్నారు. గుంట విస్తీర్ణంలో వ్యవసాయ భూమి ఉన్న రైతు కూడా రైతు బీమా పథకానికి అర్హుడుగా పేర్కొంటున్నారు. రైతు ప్రమాదవశాత్తు కానీ, సహజ మరణం గాని పొందిన సమయంలో అతను ఇదివరకే నామినీగా చూపించిన కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల బీమా మొత్తం అందనుంది. ఇందుకు గాను మృతి చెందిన రైతు కుటుంబ సభ్యులు పది రోజుల్లోగా డెత్ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. వ్యవసాయాధికారులు క్లస్టర్ల వారీగా రైతు బీమాకు అర్హుల జాబితాను తయారు చేయడమే కాకుండా ప్రతీ నెల అప్డేట్ చేయాల్సి ఉంటుంది. వ్యవసాయ భూముల అమ్మకం, కొనుగోలు చేసిన సమయంలో కొత్తగా భూమి కొన్న రైతుల వివరాలను వ్యవసాయాధికారులు రైతు బీమా పథకంలో చేర్చాల్సి ఉంటుంది. ఈ పథకాన్ని ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి అధికారికంగా అమలు చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. 24 గంటల పాటు వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను పొందుతున్న రైతులకు ఎకరానికి రూ.4 వేల పెట్టుబడి అందించడమే కాకుండా తాజాగా రైతు బీమా పథకాన్ని తీసుకొస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
విద్యుత్ షాక్‌తో రైతు మృతి
సాక్షి, అనంతపురం : జిల్లాలోని సింగనమల మండలం తరిమెల గ్రామంలో సోమవారం ఉదయం విద్యుత్ షాక్కొట్టి ఓ రైతు మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే.. తరిమెల గ్రామానికి చెందిన సాయినాథ్ వ్యక్తి వ్యవసాయంతోపాటు మోటర్ మెకానిక్‌గా కూడా పని చేస్తున్నాడు. అందులో భాగంగా ఈ రోజు వారి పొలంలో ఉన్న విద్యుత్తు స్తంభం ఎక్కి విద్యుత్తు వైర్ల మరమ్మత్తు చేస్తుండగా, షాక్ గురై అక్కడికక్కడే మృతి చెందారు. అతనికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. సంఘటన తెలిసిన వెంటనే విద్యుత్ అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. -
చెట్టుకు ఉరేసుకుని రైతు ఆత్మహత్య
సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లాలోని జడ్చర్ల మండలంలో విషాదం చోటుచేసుకుంది. జడ్చర్ల మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన మల్లయ్య అనే రైతు సోమవారం ఉదయం చెట్టుకి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మల్లయ్య ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకం కింద ఇచ్చిన ఇచ్చిన డబ్బులు డ్రా చేసుకుని పోగొట్టుకున్నాడు. దీనికి మనస్తాపానికి గురైన రైతు చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో మల్లయ్య కుటుంబం కన్నీరుమున్నీరైంది. -
అప్పుల బాధ భరించలేక రైతు ఆత్మహత్య
సిరికొండ(బోథ్): అప్పులు పెరిగిపోవడం..రైతుబంధు సాయం రాకపోవడంతో మనస్థాపం చెందిన సిరికొండ మండల కేంద్రంలోని బోయవాడకాలనీకి చెందిన రైతు గోగుల నారాయణ (56) శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. నారాయణ తనకున్న రెండెకరాల పరంపోగు భూమితోపాటు మరింత భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. గతేడాది సక్రమంగా పంటలు పండకపోవడం, తనకున్న ముగ్గురు కూతుర్ల వివాహాలు చేయడంతో అప్పులు అధికమయ్యాయి. అవి ఎలా తీర్చాలోనని తీవ్ర మనస్థాపానికి గురయ్యేవాడు. అప్పులు ఇచ్చిన వారు ఒత్తిడి పెంచడం, ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న పెట్టుబడి సహాయం చిల్లిగవ్వ రాకపోవడంతో తీవ్ర మనస్థాపం చెంది శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరులేని సమయంలో ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఇంటి తలుపులు తీసి చూడగా నారాయణ మృతిచెంది ఉన్నాడు. నారాయణకు భార్య, ముగ్గురు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపారు. -
రైతుబంధు చెక్కులివ్వలేదని రైతుల ఆత్మహత్యాయత్నం
-
రైతులకు పాదాభివందనం చేసిన ఎమ్మెల్యే
తరిగొప్పుల : అన్నం పెట్టే రైతు దేవుడితో సమానమని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలోని అంకుషాపూర్ గ్రామంలో మంగళవారం ఎమ్మెల్యే రైతులకు రైతు బంధు చెక్కులు, పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన రైతులు గుర్జకుంట ఎల్లయ్య, లకావత్ రాములు, కొండ సాయిలు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే రైతులకు పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మాట్లాడుతూ అన్నం పెట్టే రైతు, సరిహద్దుల్లో కాపలా కాసే జవాన్ దేశంలో గొప్పవారని అన్నారు. రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎల్లప్పుడు కృషిచేస్తారని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు ఎర్రోజు భిక్షపతి, నాంబాలయ్య, ముడికె సంపత్, వైస్ ఎంపీపీ నూకల కృష్ణమూర్తి, పీఏసీఎస్ చైర్మన్ ఇమ్మడి శ్రీనివాస్‌రెడ్డి, వైస్ చైర్మన్ పెద్దిరాజిరెడ్డి, సమితి మండల కోఆర్డినేటర్లు జుంలాల్ నాయక్, చింతకింది సురేష్, ఉపసర్పంచ్ ముక్కెర బుచ్చిరాజు, చిలువేరు లింగం, అర్జుల సుధాకర్‌రెడ్డి, బీరెడ్డి జార్జిరెడ్డి, పోగుల మల్లేషం, ఎం.భిక్షపతి, ప్రమోద్‌రెడ్డి, తాళ్లపల్లి పోషయ్య, కొండం మధుసూదన్‌రెడ్డి, జయ్‌పాల్‌రెడ్డి, అంకం వెంకటేష్, వంగ రామరాజు, గొలుసుల రామరాజు, రవీందర్‌చారి, బొగం శ్రీనివాస్, తహసీల్దార్ మహ్మద్ సలీం, ఏడీఏ కల్పన పాల్గొన్నారు. -
ఫార్మాసిటీతో రియల్ వ్యాపారమా?
యాచారం(ఇబ్రహీంపట్నం) : కేసీఆర్ ప్రభుత్వం ఫార్మాసిటీ పేరుతో రియల్ వ్యాపారం చేస్తుందని కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ముదిరెడ్డి కోదండరెడ్డి ఆరోపించారు. మండల పరిధిలోని కుర్మిద్దలో మంగళవారం ఫార్మాసిటీ భూబాధితులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కేసీఆర్ ప్రభుత్వం ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఫార్మాసిటీని నెలకొల్పుతుందని మండిపడ్డారు. భూసేకరణ చట్టం మేరకు రైతులకు పరిహారం అందజేయలేదు, వర్షాలు కురిస్తే ఫార్మాకిచ్చిన భూముల్లో సాగుచేసుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు. ఫార్మాసిటీని రద్దుచేసే వరకు పోరాటం.. ఫార్మా ఏర్పాటైతే ఈ ప్రాంతం నష్టపోతుందన్నారు. నింబంధనలకు విరుద్ధంగా, రైతులను భయపెట్టి, ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీని కోర్టును ఆశ్రయించి రద్దు చేయిస్తామన్నారు. ఫార్మాసిటీ పేరుతో గ్రామాలకు ఏ అధికారి వచ్చినా తిరగబడాలని రైతులకు సూచించారు. కేసీఆర్ రైతుబంధు పథకం తప్పుల తడక అన్నారు. పథకంలో పాసు పుస్తకాలు, చెక్కుల్లో తప్పులు దొర్లుతున్నాయన్నారు. జిల్లా కలెక్టరే స్వయంగా పర్యవేక్షణ చేసి అడ్డుకోవాలని కోరారు. రైతులు తిరగబడక ముందే రికార్డులు సరిచేయాలన్నారు. 20న ఫార్మా టూర్.... డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఫార్మా కంపెనీలతో ఆ ప్రాంతాల్లో పర్యావరణం, వాతావరణ , నీటి కాలుష్యం ఏ మేరకు సర్వనాశనమవుతుందో , ఆ ప్రాంత ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో ఈ ఫార్మా బాధితులకు తెలపడానికి ఫార్మాటూర్ ఏర్పాటు చేసినట్లు డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ తెలిపారు. ఫారా>్మ కంపెనీల వల్ల జరిగే నష్టాలను నక్కర్తమేడిపల్లి, కుర్మిద్ద, నానక్‌నగర్, తాడిపర్తి గ్రామాల ప్రజలకు చూపిస్తే తీవ్రత తెలుస్తుందని అన్నారు. పర్యావరణవేత్త నర్సింహరెడ్డి మాట్లాడుతూ ఫార్మాసిటీ వద్దని ప్రతి రైతు అధికారులకు ఫిర్యాదులు చేయాలని సూచించారు. ఫార్మాసిటీ ఏర్పాటయితే 750కి పైగా కంపెనీలు ఒకే చోట ఏర్పాటు అవుతాయని , వాటితో ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కల్వకుర్తి నియోజకవర్గాలు నష్టపోతాయన్నారు. కాంగ్రెస్ యాచారం మండల అధ్యక్షుడు దెంది రాంరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పర్యావరణవేత్తలు ఇంద్రసేనరెడ్డి, సరస్వతి, కుర్మిద్ద మాజీ ఎంపీటీసీ యాదయ్య చారి, యాచారం మండల కిసాన్ కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి లిక్కి పాండురంగారెడ్డి, నాయకులు సిద్దంకి కృష్ణరెడ్డి, శంకర్‌గౌడ్, మంకాల దాసు పాల్గొన్నారు. -
సింగరేణి కార్మికులను మోసం చేశారు
మంచిర్యాల టౌన్: సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీల్లో సీఎం కేసీఆర్ ఒక్కటి కూడా నెరవేర్చలేదని, వారిని మోసం చేసారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. డిస్మిస్ అయిన కార్మికులకు మళ్లీ ఉద్యోగాలు, కార్మికుల పిల్లలకు వారసత్వ కొలువులు, కాంట్రాక్టు కార్మికుల పర్మినెంట్, మంచిర్యాల జిల్లాలో మెడికల్ కాలేజీ, ఆసుపత్రి ఏర్పాటు, కార్మికులకు ఐటీ మినహాయింపు ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మంచిర్యాల, కుమ్రం భీం జిల్లాలో ఆదివారం నుంచి ఐదు రోజులపాటు నిర్వహించనున్న ప్రజా చైతన్య బస్సు యాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఉత్తమ్ మాట్లాడారు. ‘‘2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తప్పకుండా విజయం సాధిస్తుంది. గతంలో టీఆర్ఎస్ ఇచ్చిన హామీలన్నింటినీ మేం నెరవేర్చుతాం. ఇప్పటికైనా కేసీఆర్‌ను ఆ పార్టీని సింగరేణి కార్మికులు నమ్మవద్దు. మా ప్రభుత్వం సింగరేణి కార్మికుల సంక్షేమం, అభివృద్ధికి కృషి చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం జైపూర్ పవర్‌ప్లాంట్‌ను నిర్మిస్తే.. అది తామే చేసినట్లుగా కేసీఆర్ చెప్పుకోవడం విడ్డూరం. ఎల్లంపల్లి ప్రాజెక్టును నిర్మించింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను కేసీఆర్ ప్రారంభించి ఆ పనులన్నింటినీ వారే చేసినట్లుగా చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారు’’అని ఆరోపించారు. రైతుబంధుకు వందల కోట్ల ప్రచారమా? రైతుబంధు పథకం ద్వారా రైతులకు ఏ మేర లబ్ధి చేకూరుతుందో తెలియదని, కానీ ప్రచారం పేరిట ప్రభుత్వం కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న అన్ని రాష్ట్రాల్లో కోట్ల రూపాయలతో యాడ్స్‌కు ఖర్చు చేసిందని ఉత్తమ్ పేర్కొన్నారు. నాలుగేళ్లుగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవుగానీ, ప్రచారానికి ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు? విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి డబ్బులు లేవన్న సీఎం మరి వందల కోట్ల ప్రజాధనాన్ని ఎందుకు వృథా చేశారో ప్రజలకు చెప్పాలన్నారు. రైతుబంధు కింద రైతులకు సాయం చేయడానికి తమ పార్టీ వ్యతిరేకం కాదన్నారు. నాలుగేళ్లలో కనీసం ఒక్క ఏడాది కూడా రైతులను పట్టించుకోకుండా ఎన్నికలు వచ్చే సమయంలో వారిని ప్రసన్నం చేసుకునేందుకు ఈ పథకాన్ని ప్రారంభించారని ఎద్దేవా చేశారు. వరి, జొన్నలు, సజ్జలకు కేంద్రం మద్దతు ధర ఎంత ఇచ్చి నా, తమ కాంగ్రెస్ ప్రభుత్వం అదనంగా డబ్బులు కలిపి రూ.2 వేలు, పత్తికి రూ.6 వేలు, మిర్చికి రూ.10 వేలు ఇస్తుందని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే లక్షకు పైగా ఉద్యోగాలను ఇస్తామని, నిరుద్యోగులకు రూ.3 వేల నిరుద్యోగ భృతిని కల్పిస్తామన్నారు. జర్నలిస్టులకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని, అక్రెడిటేషన్ల మంజూరు, ఇళ్లు, ఇళ్ల స్థలాలు, హెల్త్‌కార్డులు, జర్నలిస్టులకు సంక్షేమ నిధి వంటివి అధికారంలోకి రాగానే విస్మరించిందని అన్నారు. సభలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, మల్లు రవి, జిల్లా వ్యవహారాల నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి, పార్టీ నేతలు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, గడ్డం అరవిందరెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు పాల్గొన్నారు. -
‘రైతుబంధు’ దేశానికే ఆదర్శం
మహబూబ్‌నగర్ రూరల్ : రైతుబంధు పథకం దేశానికే ఆదర్శం అని, ప్రభుత్వం చేపడుతున్న రైతుబంధు పథకంలో రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తుందని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్ అర్బన్ మండ లం మహాత్మాగాంధీ రోడ్ హైస్కూల్లో రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. అదేవిధంగా రూరల్ మండలంలోని ధర్మాపూర్, మాచన్పల్లిలో ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై చెక్కులను పంపిణీ చేశారు. మహాత్మాగాంధీ రోడ్ హైస్కూల్లో అర్బన్ మండల తహసీల్దార్ ఎంవీ ప్రభాకర్‌రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. రైతులు పెట్టుబడులకు ఇబ్బంది లేకుండా దేశంలో ఏ రాష్ట్రంలో ఏ సీఎం అమలు చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఎకరానికి రూ.4వేల చొప్పున రెండు పంటలకు రూ. 8వేలు ఇస్తున్నారని అన్నారు. ఆంధ్ర మాదిరిగానే ఇక్కడ కూడా రెండు పంటలు పండిస్తామని అన్నారు. అందుకోసం శ్రీశైలం నుంచి ప్రభుత్వం నీళ్లు తెస్తుందని అన్నారు. మండలాల వారీగా నిర్ధేశించిన తేదీల్లో చెక్కులు అందజేస్తారని అన్నారు. ప్రభుత్వం అందించిన సొమ్మును విత్తనాలు, కూలీలకు, పురుగుల మందులు తదితర ఖర్చుల కు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్పర్సన్ రాధా అమర్, వైస్ చైర్మన్ రాములు, ఎంపీపీ సావిత్రి, జెడ్పీటీసీ వై.శ్రీదేవి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్వర్, డైరెక్టర్ పి.రవీందర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్లు రాజేశ్వర్‌రెడ్డి, వెంకటయ్య, మండల రైతు సమన్వయ సమి తి కన్వీనర్లు మల్లు నర్సింహారెడ్డి, రాములు, తహ సీల్దార్లు ఎంవీ ప్రభాకర్‌రావు, శంకర్, ఎంపీడీఓ మొగులప్ప, ఏఓలు నాగరాజు, అష్రత్ సుల్తాన, కౌన్సిలర్ పద్మజా గోపాల్‌యాదవ్, సర్పంచ్‌లు పసుల వసంత, విజయ, ఎంపీటీసీలు నాగమణి, కళమ్మ, టీఆర్ఎస్ నాయకులు సుధాకర్‌రెడ్డి, శాంతయ్యయాదవ్, శివరాజ్, వై.శ్రీనివాసులు, వెంకటేష్‌యాదవ్, వెంకట్రాములు, యాదయ్య, గూడెం తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. -
చెక్కు ఇవ్వలేదని రైతు ఆత్మహత్యాయత్నం
జనగామ: రైతు బంధు పథకంలో మంజూరైన చెక్కు ఇవ్వడంలేదని మనస్తాపానికి గురైన ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జనగామ జిల్లా అడవికేశ్వాపూర్‌లో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొడియాల జెన్నయ్యకు 11 ఎకరాల భూమి ఉంది. గ్రామానికి చెందిన కొందరు తన భూమిని లాక్కుంటారనే భయంతో జెన్నయ్య కొద్ది రోజుల క్రితం కోర్టుకు వెళ్లి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకున్నాడు. దీనిపై విచారణ పూర్తయినా అధికారులు చెక్కు ఇవ్వడం లేదని మనస్తాపానికి గురైన అతడు తన వ్యవసాయ బావి వద్ద కిరో సిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. చుట్టు పక్కల రైతులు అతడిని అడ్డుకుని తహసీల్దార్ కార్యాలయానికి తీసుకురాగా, అక్కడ గంట పాటు ధర్నా చేశారు. కోర్టు పరిధిలో కేసు నడుస్తున్న క్రమంలో చెక్కు ఇవ్వరాదని, అయినా ఆందోళన వద్దని తహసీల్దార్ చెప్పారు. కోర్టు సమస్య సద్దుమణిగిన తర్వాత చెక్కు అందజేస్తామని చెప్పడంతో అక్కడి నుంచి జెన్నయ్య వెళ్లిపోయాడు. -
శాశ్వత రుణభారం రైతుకు శాపం
అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నమూనాను అమలుచేస్తూ ఆహార ధరలను తక్కువ స్థాయిలో ఉంచడమే ప్రస్తుత వ్యవసాయ దుస్థితికి కారణమని రైతులు గుర్తించలేకపోతున్నారు. అందుకే వారు ఇప్పటికీ వ్యవసాయంపై తమ ఆశలను చంపుకోలేకపోతున్నారు. డబ్బు, శ్రమశక్తి అధికంగా అవసరమయ్యే తరహా వ్యవసాయంలో మరింతగా ఆత్మహత్యలు పెరిగే ప్రమాదముంది. పైగా అప్పు పెరిగే కొద్దీ రైతు రుణభారంలో కూరుకుపోయే అవకాశం ఎక్కువ అవుతుంది. పంజాబ్‌లోని ఒక సన్నకారు రైతు జస్వంత్ సింగ్ మాటల్లో చెప్పాలంటే, ‘‘ఇది జీవితం కానేకాదు. జీవితకాలం పొడవునా అప్పుల ఊబిలోనే చిక్కుకుపోవడం నిజంగానే శాపం’’. దేశంలో రైతులు బంగాళాదుంపలను గిట్టుబాటు ధరలు లేక వీధుల్లో రాశులుగా పోస్తుండటం.. తాము నిల్వచేసిన ఆలుదుంపలను వదిలించుకోవడం శీతలీకరణ కేంద్రాల యజ మానులకు కూడా కష్టమైపోతుండటం ఒక వైవు దృశ్యం కాగా, మరోవైపున ఈ దేశంలోనే కొన్ని పాపులర్ బ్రాండ్ కంపెనీలు 50 గ్రాముల బంగాళా దుంపల చిప్స్ ప్యాకెట్‌ని రూ.20లకు అమ్ముతూ లాభాలు గుంజుకుంటున్నారు. మరోమాటలో చెప్పాలంటే, ఒక కిలో బంగాళాదుంపలకు ధర బాగా పలుకుతున్న సీజన్లో కూడా రైతుకు కేజీకి 5 నుంచి 7 రూపాయలకు మించి రావటం లేదు. అదే బంగాళా దుంపలను ప్రాసెస్ చేసి చిప్స్‌గా మార్చితే కిలోకు రూ.400లు ధర పలుకుతోంది. ధరల నిర్ణయంలో జిత్తులమారితనం అదేవిధంగా టమాటా ఉదంతాన్ని పరిశీలిద్దాం. ఛత్తీస్‌గఢ్‌లో టమాటాల ధర సీజన్ మొత్తంమీద చాలావరకు రైతులకు కిలోకి 2 రూపాయలకు మించి ధర పలకటం లేదు. అదే టమాటా దేశ రాజధాని న్యూఢిల్లీలో, ముంబైలో, చండీగఢ్‌లోనూ కిలోకి 18 నుంచి 25 రూపాయల వరకు పలుకుతోంది. మరోవైపున ఆన్లైన్ స్టోర్ అమెజాన్ లేక ఫ్లిప్‌కార్ట్‌లలో టమాటా పేస్ట్ ధర ఎంత ఉందో శోధించి చూడండి. అక్కడ కిలో టమాటా పేస్ట్ రూ.399లకు అమ్ముతున్నారు. పరిశ్రమ డేటా ప్రకారం కిలో టమాటా పేస్ట్ తయారీకి 5.6 కిలోల టమాటాలు అవసరమవుతాయి. టమాటా చట్నీ సైతం కిలో రూ.68లకు అమ్ముతున్నారు. ఆర్థిక శాస్త్రం నిజాన్ని బయటపెట్టకపోవచ్చు కానీ, ధరల నిర్ణయంలో ప్రాథమికంగా పన్నుతున్న జిత్తులమారితనం వల్లే ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల ధరలు చుక్కలంటుతున్నాయి. ఆహార విలువకు సంబంధించిన గొలుసు చక్రం ఎంత చెడ్డగా ఈ దేశంలో పనిచేస్తోందో, అమలవుతోందో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. అంతర్జాతీయంగా కూడా ఆహార పదార్థాల విలువకు చెందిన చట్రం ఇదేరీతిలో క్రూరంగా కొనసాగుతోంది. ఈక్వెడార్‌లో పెంచుతున్న ఒక డాలర్ విలువైన అరటిపళ్లను సప్లయ్ చైన్ ద్వారా ఎలా పంపిణీ చేస్తున్నారో పరిశీలిస్తే మీరు షాక్‌కు గురికావడం తథ్యం. సూపర్మార్కెట్లు 40 శాతం లాభాలతో నడుస్తుండగా అరటిపళ్లను పండించే ప్రధాన రైతు మాత్రం ఈక్వెడార్‌లో చివరి రిటైల్ ధరలో 0.02 శాతం రాబడిని మాత్రమే పొందుతున్నాడు. ఇక మార్కెట్లో అమ్ముతున్న డెయిరీ పాల విషయాని కొస్తే, ప్రతి డాలర్ విలువైన పాలకుగానూ అమెరికన్ రైతు 11 సెంట్లను మాత్రమే పొందుతున్నాడు. అమెరికాలో, ఇంగ్లండ్‌లో, యూరప్‌లో గత కొన్ని సంవత్సరాల కాలంలో వందలాది డెయిరీ ఫారంలు మూసివేతకు గురయ్యాయంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఈ వివరాలు సరిపోవు అనుకుంటే, రాబోయే నెలల్లో పాల ధరలు కూడా పతనం చెందవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ మొత్తం పరిస్థితి అత్యంత స్పష్టంగా ఒక సందేశాన్ని ఇస్తోంది. అదేమిటంటే, ‘భారీగా వ్యాపారం సాగించి లేదా మూసుకుని వెళ్లు’. సూపర్ మార్కెట్ల నీడలో నయా దళారులు ఇంగ్లండ్‌లో అన్ని రకాల ఆహార పదార్థాల అమ్మకాలపై రైతులకు 4.5 శాతం మాత్రమే వస్తోంది. చాలా దశాబ్దాలుగా ఆహారం, వ్యవసాయ రంగాలపై విశేషంగా కృషి చేస్తున్న ప్రొఫెసర్ టిమ్ లాంగ్ ఇటీవల జరిగిన ఒక సదస్సులో ఈ విషయం తెలిపారు. వంద సంవత్సరాల క్రితం అమ్ముడైన ఆహార ఉత్పత్తుల ధరలో ప్రతి డాలర్‌కు రైతుకు 70 సెంట్ల దాకా ఆదాయం వచ్చేది. ప్రస్తుతం మార్కెట్లో అమ్ముడయ్యే ప్రతి డాలర్ విలువైన వ్యవసాయ సరుకులో రైతుకు దక్కే వాటా కేవలం 4 శాతానికి పడిపోయింది. రైతుల రక్తం తాగుతున్నారనే ఆరోపణలకు గురవుతున్న మధ్య దళారీ వర్గాన్ని తొలగించి సూపర్ మార్కెట్లు వ్యాపారాన్ని కైవసం చేసుకుంటున్న సమయంలో కూడా రైతు నికరాదాయం ఇంత దారుణంగా పతనం కావడం వ్యవసాయ రంగ నిపుణులకే దిగ్భ్రాంతి కలిగిస్తోంది. సూపర్మార్కెట్లు బాగా అభివృద్ధి చెందుతున్న కాలంలోనే రైతు ఆదాయం ఇంతగా క్షీణించి పోతోందన్నది వాస్తవం. అదే సమయంలో గుర్తుంచుకోవలసిన మరొక చేదువాస్తవం ఏమిటంటే సూపర్ మార్కెట్ల ఆవిర్భావ, వికాస క్రమంలోనూ వ్యవసాయంలో మధ్యదళారుల సంఖ్య తగ్గిపోవడానికి బదులుగా పెరుగుతోంది. గతానికీ, ప్రస్తుతానికీ వ్యత్యాసం ఏమిటంటే, క్వాలిటీ కంట్రోలర్, సర్టిఫై ఏజెంట్, ప్రాసెసర్, డిజైనర్ వంటి పనుల రూపంలో మధ్యదళారుల వ్యవస్థను పెంపొందించే భారీ గొడుగుగా మల్టీ బ్రాండ్ రిటైల్ వర్తకం కొనసాగడమే. స్తంభించిన వ్యవసాయరంగ ఆదాయం గత నాలుగు దశాబ్దాలుగా, ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయ క్షేత్రాలలో పండిస్తున్న ఆహార పదార్ధాల ధరలు స్తబ్దతకు గురయ్యాయి. ద్రవ్యోల్బణంతో సర్దుబాటు తర్వాత దాదాపు అన్ని రకాల ఆహార పదార్ధాలపై రైతులకు లభిస్తున్న ధర కాస్త ఎక్కువగా, లేదా తక్కువగా ఉంటూ స్తంభించిపోయింది. వాణిజ్య అభివృద్ధిపై ఐక్యరాజ్య సమితి సదస్సు –యుఎన్సిటిఎడి– అంచనా ప్రకారం, 1985–2005 మధ్య కాలంలో 20 సంవత్సరాల కాలానికి గాను ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేసిన తర్వాత, రైతులకు దక్కిన వ్యవసాయ ధరల్లో పెద్దగా మార్పు లేదని తెలుస్తోంది. ఇక భారతదేశంలో 2011–2016 మధ్య అయిదేళ్ల కాలంలో రైతుల నిజ ఆదాయం కేవలం 0.44 శాతం మాత్రమే పెరిగినట్లు నీతి అయోగ్ అధ్యయనం తెలిపింది. మరోమాటలో చెప్పాలంటే వ్యవసాయ ఆదాయం స్తంభించిపోయింది. అమెరికాలోనూ ఇది వాస్తవమే. మైక్ కలిక్రేట్ తన బ్లాగులో రాసిన కథనంలో ఇలా పేర్కొన్నారు. ‘‘1974 డిసెం బర్ 2న ఒక బుషెల్ (25.40 కిలోలకు సమానం) జొన్నల ధర 3.58 డాలర్లగా ఉండేది. 2018 జనవరిలో అదే బుషెల్ జొన్నల ధర 3.56 డాలర్లు పలికింది. అంటే ఈ 44 ఏళ్లలో ధర రెండు సెంట్లు తగ్గింది. 1974లో తొలిసారి జొన్న పంట వేసిన రైతు తాను రిటైర్ అయ్యేనాటికి కూడా అదే ధరలను స్వీకరిస్తున్నాడు. అదే సమయంలో విత్తనాలు, భూమి, వ్యవసాయ సామగ్రి, ఎరువులు, ఇంధన ధరలు అసాధారణంగా పెరుగుతూ వచ్చాయి’’. చారిత్రకంగా వ్యవసాయ ధరలు స్వల్ప స్థాయిలో ఉంటూండటంతో, ఈ పరిస్థితి రైతులను అగమ్యగోచర స్థితిలోకి నెడుతోంది. అయినప్పటికీ మనుగడకోసం వారు చేస్తున్న ప్రయత్నాన్ని నేను ప్రశంసించకుండా ఉండలేను. వారు తమ కాడిని దింపదలుచుకోలేదు. కనుచూపుమేర కనిపించని ఆశాభావం మీద ఇప్పటికీ వారు ఆశాభావంతో బతుకుతున్నారు. గిట్టుబాటు ధరలకు, కాస్త అధిక ధరలకు తాము చేస్తున్న డిమాండును ప్రభుత్వం త్వరలో లేక తర్వాతైనా ఆమోదిస్తుందని, తమకు అచ్చే దిన్ తీసుకురాగల మార్కెట్ యంత్రాంగాన్ని ఏర్పర్చగలదని వారు విశ్వసిస్తున్నారు. ఆహార ధరలను తక్కువ స్థాయిలో ఉంచేందుకు అంతర్జాతీ యంగా ఆర్థిక వ్యవస్థల నమూనాను అమలు చేస్తూం డటమే దేశంలో వ్యవసాయ దుస్థితి కొనసాగింపునకు కారణమనే విషయం గుర్తించని రైతులు ఆశలు చంపుకోకుండానే బతికేస్తున్నారు. ఆర్థిక సంస్కరణలు చెల్లుబాటు అయ్యేందుకు దేశంలో రైతులను ఉద్దేశపూర్వకంగానే దారిద్య్రంలో ఉంచుతున్నారు. దీని ఫలితంగా గత కొన్ని దశాబ్దాలుగా వ్యవసాయం అత్యంత ఒత్తిడితో కూడుకున్న కార్యక్రమంగా మారిపోయింది. అందుకే వ్యవసాయదారుల్లో పెరుగుతున్న మానసిక ఒత్తిడికి వ్యతిరేకంగా పోరాటంలో సహాయపడటానికి అమెరికాలోని పలు రాష్ట్రాల్లో నూతన చట్టాలను తీసుకొచ్చారు. రైతు జీవితమే ఓ శాపగ్రస్తం భారతదేశంలోనూ వ్యవసాయరంగంలో తీవ్ర ఒత్తిడితో కూడిన వాతావరణం స్పష్టంగానే కనబడుతోంది. దేశంలోని నలు మూలలనుంచి ప్రతి రోజూ రైతుల ఆత్మహత్యలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే మెట్ట భూముల్లో సాగు కంటే మాగాణి భూముల్లో సాగు చేస్తున్న రైతుల్లోనే ఆత్మహత్యల రేటు ఎక్కువ కావడం వాస్తవం. అంటే డబ్బు, శ్రమశక్తి అధికంగా అవసరమయ్యే రకం వ్యవసాయ రకంలో మరింతగా ఆత్మహత్యలు పెరిగే ప్రమాదముంది. అప్పు పెరిగే కొద్దీ రైతు రుణభారంలో కూరుకుపోయే అవకాశం ఎక్కువ అవుతుంది. పంజాబ్‌లోని ఒక సన్నకారు రైతు జస్వంత్ సింగ్ మాటల్లో చెప్పాలంటే, ‘‘ఇది జీవితం కానేకాదు. జీవితకాలం పొడవునా అప్పుల ఊబిలోనే చిక్కుకుపోవడం నిజంగానే శాపం’’. వ్యాసకర్త: దేవిందర్‌శర్మ, వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
భూమి పట్టా కాదేమోనని రైతు ఆత్మహత్య
మేడిపల్లి (వేములవాడ): భూమి తన పేరు మీద పట్టా కాదేమోననే బెంగతో బుధవారం ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం వల్లంపల్లికి చెందిన ఎస్.మల్లేశం(45)కు వల్లంపల్లి శివారులో 325 సర్వే నంబర్లో 3.38 ఎకరాల భూమి ఉంది. అది ఆన్లైన్లో నమోదు కాకపోవడంతో 2015లో ఇక్కడ పనిచేసిన వీఆర్వోను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఆయన తన భూమిని పట్టా చేయకుండా మోసం చేశాడని, ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోలేదని వాపోయేవాడు. తన భూమి ఇతరుల పేరిట అవుతుందేమోనని మనస్తాపానికి గురై.. బుధవారం పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మల్లేశం పేరిట భూమి ఉంది: కలెక్టర్ జగిత్యాల అగ్రికల్చర్: రెవెన్యూ రికార్డులు సరిగ్గా లేకనే మల్లేశం ఆత్మహత్య చేసుకున్నట్లు వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని జగిత్యాల కలెక్టర్ శరత్ చెప్పారు. మల్లేశంకు 7.16 ఎకరాలు, ఆయన పెద్ద కొడుకు మధు పేరిట 2.8 ఎకరాలు, చిన్న కొడుకు గణేశ్ పేరిట 2.10 ఎకరాలు భూమి ఉందన్నారు. భూముల వివరాలు ఆన్లైన్లో నమోదయ్యాయని.. పాసుపుస్తకాలు వచ్చాయని తెలిపారు. రైతుబంధు పథకం కింద మల్లేశంకు రూ.29,600, మధుకు రూ.8,850, గణేష్‌కు రూ.9,050 సంబంధించిన చెక్కులు సైతం వచ్చాయని వివరించారు. మల్లేశం మృతిపై పోలీసులు విచారణ చేపడుతున్నారని తెలిపారు. -
రైతులను ఆదుకోవడంలో సర్కార్ విఫలం: ఉత్తమ్
శాలిగౌరారం (నకిరేకల్): రైతులను ఆదుకోవడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం రామగిరికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు చామల యాదగిరిరెడ్డి సంతాప సభకు ఉత్తమ్ హాజరై మాట్లాడారు. గడిచిన నాలుగేళ్ల కాలంలో రాష్ట్రంలో రైతుల ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా మారిందన్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు చేతికి వచ్చిన పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. కష్టాల్లో ఉన్న కర్షకులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రాకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. రైతుల ఆత్మహత్యల నివారణకు టీఆర్ఎస్ సర్కార్ కనీస చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, రైతులకు ఏ కష్టం రాకుండా వారి కళ్లలో సంతోషాన్ని చూడటమే ధ్యేయంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి నూక కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నాకు చావే గతి
కేసముద్రం (మహబూబాబాద్): మార్కెట్లో 10 రోజులుగా పడిగాపులు పడుతున్న ఓ మక్క రైతు ఆవేదనకు గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలోని వ్యవసాయ మార్కెట్లో శనివారం చోటుచేసుకుంది. నెక్కొండ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన బానోతు రాజ్యానాయక్ తను పండించిన 170 బస్తాల మక్కలను మార్కెట్‌కు తీసుకొచ్చాడు. 10 రోజులు గడుస్తున్నా మక్కలను కొనుగోలు చేయకపోవడంతో మనోవేదనకు గురయ్యాడు. శనివారం బలరాం నాయక్, జెన్నారెడ్డి భరత్‌చంద్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బృందం మార్కెట్‌ను సందర్శించింది. యార్డులో రాశులను పరిశీలిస్తూ రైతు రాజ్యానాయక్ వద్దకు రాగా, అతడు ఒక్కసారిగా ఆవేదనకు లోనయ్యాడు. తనకు చావే గతి అంటూ కండువాను మెడకు బిగించుకోవడంతో ఊపిరాడక ఒక్కసారిగా స్పృహతప్పి మక్కలరాశిపైనే పడిపోయాడు. కంగుతిన్న కాంగ్రెస్ నేతలు, సిబ్బంది అతడి మెడకున్న కండువాను తొలగించి.. నీళ్లు చల్లి లేపారు. ఆ తర్వాత సీఈవో మల్లారెడ్డిని పిలిపించి ప్రశ్నించడంతో, ఆ మక్కలను ఎంపిక చేసి చిట్టీ ఇచ్చాడు. -
బంగారు తెలంగాణ టీఆర్ఎస్తోనే సాధ్యం
అర్వపల్లి (తుంగతుర్తి) : బంగారు తెలంగాణ నిర్మాణం టీఆర్ఎస్తోనే సాధ్యమని తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. బుధవారం మండలంలోని కొత్తగూడెంలో వివిధ పార్టీల నాయకులు లింగంపల్లి రమణ, పెద్ది శంకర్, పాక గోవర్ధన్, పెద్ది నాగయ్య, రావుల రఘు, ఎల్. సుమన్, మేడి నరేష్, సత్యనారాయణ, ఎం. చంటి, కె. రాజు, ఎం. రాంమ్మూర్తి, ఎం. నర్సయ్య, నవీన్‌లతో పాటు కొంత మంది టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి పార్టీలోకి చేర్చుకుని మాట్లాడారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం దేశంలో ఎక్కడలేని విధంగా సీఎం కేసీఆర్ రైతులకు రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. పంట పెట్టుబడి కింద సీజన్‌కు ఎకరాకు రూ.4వేల చొప్పున ప్రభుత్వం సాయమందిస్తుందని చెప్పారు. ఈపథకాన్ని రైతులు సద్విని యోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని టీఆర్ఎస్కు తప్ప మరో పార్టీకి స్థానం లేకుండా చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు దావుల వీరప్రసాద్, మొరిశెట్టి ఉపేందర్, మండల అధ్యక్షుడు కుంట్ల సురేందర్‌రెడ్డి, దేవస్థాన ఛైర్మన్ బొడ్డు రామలింగయ్య, కందుల తిరుమల్‌రావు, కళెట్లపల్లి శోభన్‌బాబు, సర్పంచ్‌లు మన్నె లక్ష్మినర్సయ్య, జీడి వీరస్వామి, వల్లపు గంగయ్య, పద్మ, ఎంపీటీసీ రేఖల రాణి, సోమిరెడ్డి, పొట్టెపాక సైదులు, రేఖల సైదులు, దండ వీరారెడ్డి, మేడిపల్లి వేణు, లింగంపల్లి రాములు, వి. సుధాకర్, చిర్రబోయిన వెంకన్న, రాంబాబు, వి. నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఒకే ఒక్కడు!
అన్నదాతకు అండగా ఉండేందుకు ప్రభుత్వం ఏటా రెండు పంటలకు పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.. ఈ సాయాన్ని వదులుకునేందుకు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ముందుకువచ్చారు. జిల్లాలో ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న రైతులు ఎందరో ఉన్నారు. ఇందులో మంత్రి బాటలో నడిచేది ఎందరో.. – సాక్షి, కామారెడ్డి సాక్షి, కామారెడ్డి : రైతుబంధు పథకంలో భాగంగా పంటల సాగు కోసం ఎకరాకు రూ. 4 వేల చొప్పున పెట్టుబడి సాయం అం దించేందుకు ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని తీసుకువచ్చింది. ఈనెల 10వ తేదీనుంచి ఈ పథకం ప్రారంభం కా నుంది. వారం రోజుల పాటు గ్రామాల్లో సభలు నిర్వహించి, రైతులకు చెక్కులు అందించనున్నారు. అయితే ప్రజాప్రతినిధులు, పెద్ద రైతు లు, ఆర్థికంగా ఉన్నతంగా ఉన్న వాళ్లు పెట్టుబడి సాయా న్ని వదులుకుంటే ఆ మొత్తాన్ని రైతు సమ న్వయ సమితుల ఖాతాల్లో జమ చేస్తా మని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. సీఎం ప్రకటనతో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ముందు కు వ చ్చారు. తన కుటుంబానికి 30 ఎకరాల వ్యవసాయ భూములున్నాయని, వాటి కి ఒక పంటకు రావాల్సిన పెట్టుబడి సాయం రూ. 1.20 లక్షలను వదులుకుంటానని ప్రకటించారు. రెండు పం టలకు కలిపితే రూ. 2.40 లక్షలు వదులుకోవడానికి మంత్రి సిద్ధమయ్యారు. ఉమ్మడి జిల్లాలో రూ. 400 కోట్ల సాయం... రైతుబంధు పథకం ద్వారా ఉమ్మడి జిల్లాలో 10,02,424 ఎకరాల వ్యవసాయ భూములకుగాను రూ. 400.97 కోట్ల పెట్టుబడి సాయం అందనుంది. కామారెడ్డి జిల్లాలో 2,44,920 మంది రైతులకు 4,91,303 ఎకరాల భూమి ఉంది. రైతుబంధు పథకం ద్వారా రూ.196.52 కోట్లు పంపిణీ చేయనున్నారు. అలాగే నిజామాబాద్ జిల్లాలో 2,39,712 మంది రైతులకు సంబంధించి 5,11,110 ఎకరాల భూములు ఉన్నాయి. వీరికి రూ.204.45 కోట్లు అందించనున్నారు. మంత్రి తర్వాత ఎవరో.. ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం పంపిణీ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తున్న వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి.. తాను పెట్టుబడి సాయాన్ని వదులుకుంటానని ప్రకటించారు. అయితే ఆయన తరువాత ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు ఏ ఒక్కరూ ముందుకురాలేదు. ఉమ్మడి జిల్లాలో మంత్రి పోచారంతో కలిపి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు ఉన్నారు. జడ్పీ, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, ఇంకా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు వందలాది మంది ఉన్నారు. పదెకరాలకుపైగా భూములు ఉన్న వారు ఉమ్మడి జిల్లాలో దాదాపు 2 వేల మంది రైతులున్నారు. కానీ ఏ ఒక్కరూ పెట్టుబడి సాయం వదులుకోవడానికి ముందుకు రావడంలేదు. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి బాటలో ఎంత మంది నడుస్తారో వేచి చూడాలి. 10 నుంచి పంపిణీ.. రైతుబంధు చెక్కుల పంపిణీ కార్య క్రమం ఈనెల 10న ప్రారంభం కానుంది. 17 వ తేదీ వరకు గ్రామసభల్లో రైతులకు చెక్కులను అందిం చనున్నారు. నిజామాబాద్ జిల్లాలో 452, కామారెడ్డి జిల్లాలో 473 రెవెన్యూ గ్రామాల్లో వారం రోజుల్లో పంపిణీని పూర్తి చేయడానికి అధికారులు ప్రణాళిక రూపొందించా రు. ఇందుకోసం ఆయా జిల్లాల్లో ప్రత్యేక బృందాలను తయారు చేశా రు. ఏరోజు ఏ గ్రామంలో పంపిణీ కార్యక్రమం ఉంటుందన్న విషయ మై ముందుగానే షెడ్యూల్ ప్రకటించనున్నారు. రెండు రోజుల ముం దు నుంచి గ్రామంలో టాంటాం ద్వారా ప్రజలకు వివరిస్తారు. చెక్కులతో పాటు పాసుపుస్తకాలను కూడా పంపిణీ చేస్తారు. -
బూడిద.. ఆ రైతు జీవితాన్నే మార్చేసింది!
ఈ ఫొటోలో ఉన్న రైతు శాస్త్రవేత్త పేరు నువిమన. అతను ఆఫ్రికా దేశం బురుండిలోని కబుయెంగె కొండ ప్రాంతంలో తన తోటి రైతులతో పాటు టమాటాలను ఎక్కువగా పండిస్తుంటారు. సీజన్లో కొనే వారే లేక పండించిన సగం టమాటాలను పారబోస్తుంటారు. ఆ తర్వాత ధర బాగా పెరుగుతుంది. కోల్డ్ స్టోరేజ్ సదుపాయం లేదు. అటువంటి పరిస్థితుల్లో టమాటాలను ఏవిధంగా నిల్వ చేయగలమని అనేక పద్ధతుల్లో ప్రయత్నిస్తూనే ఉండగా.. ఒకానొక రోజు చక్కని పరిష్కారం దొరికింది. అనుకోకుండా చెట్టు కింద బూడిదలో ఉండిపోయిన టమాటాలు నెలల తరబడి చెడిపోకుండా ఉండటాన్ని గుర్తించి ఎగిరి గంతేశాడు. టమాటాలను అట్టపెట్టెల్లో నింపి.. ఆపైన బూడిద పోసి నిల్వ చేశాడు. ఐదు, ఆరు నెలల పాటు చెడిపోకుండా అలాగే ఉంటున్నాయి! ఈ ఆవిష్కరణ రైతు నువిమన జీవితాన్నే మార్చేసింది. పండించిన ప్రతి టమాటానూ అమ్ముకోగలుగుతున్నాడు. అన్‌సీజన్‌లో టమాటాలను హోటళ్లకు సరఫరా చేస్తున్నాడు. తానే ఒక చిన్నపాటి హోటల్ నడుపుతున్నాడు. ట్రక్కు కొని నలుగురికి ఉపాధి కల్పిస్తానని గర్వంగా చెబుతున్నాడు రైతు శాస్త్రవేత్త. ఈ టెక్నిక్‌ను టమాటా సాగుకు ప్రసిద్ధిచెందిన సిబిటొకె ప్రాంతంలో రైతులు చాలామంది ఉపయోగిస్తున్నారు. నువిమనకు జేజేలు పలుకుతున్నారు. విత్తనాలను బూడిదలో భద్రపరుచుకోవడం తరతరాలుగా తెలిసిందే. బూడిదలో ఉంచిన టమాటాలు ఆరోగ్యానికి మంచిదేనా? బురుండికి చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త జీన్ నివ్యబండిని అడిగితే.. ‘ఏం పర్వాలేదు. బూడిద వల్ల టమాటాలపై ఎటువంటి దుష్ప్రభావం ఉండదు. నిస్సంకోచంగా తినొచ్చు. అయితే, ప్రభుత్వ వ్యవసాయ విభాగం లోతైన అధ్యయనం చేయటం మంచిది’ అన్నారు. -
రైతు కుటుంబానికి కూలి పనులే గతా?
గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడుకు చెందిన కోనంకి రమేష్ తనకున్న నాలుగు ఎకరాలతో పాటు మరో ఆరు ఎకరాలను కౌలుకు తీసుకొని పత్తి, మిరప, తమలపాకు తోటలను సాగు చేసేవాడు. గిట్టుబాటు ధరలేక అప్పులపాలయ్యాడు. అప్పు రూ. 6 లక్షలకు పెరిగింది. రుణ మాఫీ కాలేదు. దీంతో 4 ఎకరాలను అమ్మి కొంత అప్పు తీర్చాడు. మళ్లీ ఎనిమిది ఎకరాలు కౌలుకు తీసుకుని పంట వేస్తే అప్పు మరో రూ. 4 లక్షలు పెరిగింది. అప్పుల వాళ్ల ఒత్తిడితో కౌలు రైతు రమేష్ గతేడాది మార్చి 15న తన పొలంలోనే పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రమేష్ భార్య అంజమ్మ, కుమార్తె కల్పన(ఇంటర్), కుమారుడు అనిల్‌కుమార్ (8వ తరగతి) నిస్సహాయులుగా మిగిలారు. భర్త ఆత్మహత్య చేసుకున్న తర్వాత అంజమ్మ కూలి పనులు చేస్తూ పిల్లలతో పాటు రమేష్ నాయనమ్మ కోటమ్మనూ పోషిస్తున్నారు. ఉంటున్న ఇల్లు కూడా తాకట్టులో వుంది. మొత్తం అప్పు రూ. 13 లక్షలకు చేరింది. ఏమి చేయాలో అర్థంకావడం లేదని అంజమ్మ కుమిలిపోతున్నారు. ప్రభుత్వం ఆదుకొని ఎక్స్‌గ్రేషియా ఇవ్వకపోతే.. వచ్చే ఏడాది నుంచి పిల్లల చదువులు అపేసి తనతో పాటు కూలి పనులకు తీసుకువెళ్లడం తప్ప మరో దారి లేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని నమ్మి మోసపోయామన్నారు. ఓ. వెంకట్రామిరెడ్డి, అమరావతి బ్యూరో -
రైతు శ్రేయస్సే ధ్యేయం
బోనకల్ : రైతు శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయమని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మండంలోని లక్ష్మీపురం సహకారం సంఘంలో ఆదివారం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. అన్నదాతలను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తోందని తెలిపారు. బోనకల్ మండలంలో గతంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినప్పటికీ రైతుల ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని లక్ష్మీపురం సహకార సంఘంలో మరో కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. రైతులు ప్రభుత్వ మద్దతుధర క్వింటాకు రూ.1425 నిర్ణయించామన్నారు. దళారుల మాటలు విని మోసపోవద్దన్నారు. అనంతరం ఎంపీ పొంగులేటి మొక్కజొన్న కల్లాల వద్దకు వెళ్లి రైతులతో మాట్లాడారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్రవిత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, డీసీసీబి చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు, మండలాధ్యక్షుడు ఏమూరి ప్రపాద్, జెడ్పీటీసీ బాణోతు కొండ, సొసైటీ అధ్యక్షుడు ఉమ్మనేని కోటయ్య, టీఆర్‌ఎస్‌జిల్లా నాయకులు లింగాల కమల్‌రాజు, పార్టీ మధిర నియోజకవర్గ ఇన్చార్జ్ బొమ్మెర రాంమూర్తి, పార్టీ మండలాధ్యక్షుడు బంధం శ్రీనివాసరావు, ఉమ్మనేని కృష్ణ, యనిగండ్ల మురళి, తమ్మారపు బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
పది ఫలితాల్లో సత్తా చాటిన రైతు బిడ్డ
లక్నో: సాధారణ రైతు బిడ్డ ఉత్తరప్రదేశ్ పదో తరగతి ఫలితాల్లో దుమ్మురేపారు. మొత్తం 600 మార్కులకుగాను 578 మార్కులు (96.3%) సాధించి టాపర్‌గా నిలిచింది. ఆదివారం యూపీఎంఎస్‌పీ విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో అలహాబాద్‌కు చెందిన రైతు బిడ్డ అంజలి వర్మ స్టేట్ టాపర్‌గా నిలిచారు. ఫలితాలు వెలువడిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. టాపర్‌గా నిలిచినందుకు సంతోషంగా ఉందన్నారు. ‘మా నాన్న రైతు. చాలా కష్టాలు ఉన్నప్పటికీ నన్ను చదివించాడు. టీచర్లు ప్రతి విషయంలో సహాయం చేశారు. ఈ ఫలితాన్ని ముందే ఊహించాను. ప్రతి విషయంలో సపోర్టుగా నిలిచిన నా తల్లిదండ్రులకి, టీచర్లకి థ్యాక్స్. నేను గొప్ప ఇంజనీర్ అయి దేశానికి సేవ చేయాలనుకుంటున్నాను’ అని అంజలి తెలిపారు. యూపీలో పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 6 నుంచి 22 వరకు నిర్వహించారు. దాదాపు 37 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు రాశారు. -
రైతు ఆదాయాన్ని పెంచండి
విజయనగరం ఫోర్ట్ : రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ కమిషన్‌రేట్ జాయింట్ డైరెక్టర్ రామరాజు, విశ్రాంత అడిషనల్ డైరెక్టర్ నారాయణ చౌదరి అన్నారు. స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయంలో గురువారం వ్యవసాయ శాఖ అధికారులతో వారు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల ఆదాయం రెట్టింపు అయ్యే విధంగా కార్యచరణ ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. వర్షాధార భూములు కాబట్టి చెరువులను అభివృద్ధి చేయించాలన్నారు. వ్యవసాయ శాఖ జేడీ జి.ఎస్.ఎన్.లీలావతి, డీడీ పి.అప్పలస్వామి పాల్గొన్నారు. -
పగడ్బందీగా చెక్కుల పంపిణీ
సాక్షి, పెద్దపల్లి : జిల్లాలో రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ శ్రీదేవసేన అధికారులను ఆదేశించారు. రైతుబంధు పథకంలో భాగంగా చెక్కుల పంపిణీ, పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీపై గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ప్రత్యేక అధికారులు, రైతు సమన్వయ సమితి సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ అత్యంత పారదర్శకంగా ‘రైతుబంధు’ నిర్వహించాలన్నారు. జిల్లాలోని 208 గ్రామాల్లో 1,27,733 మంది రైతుల వద్ద ఉన్న 2,56,730 ఎకరాలకు రూ. 100కోట్లకు పైగా విలువ గల 1,28,280 చెక్కులు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు మే 10న చెక్కుల పంపిణీ, పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ప్రారంభించి 17వ తేదీకల్లా వారంరోజుల్లో పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వం ముద్రించిన పాస్ పుస్తకాలు అత్యంత భద్రత ప్రమాణాలతో ఉన్నాయన్నారు. చెక్కుల పంపిణీలో రైతు సమన్వయ సమితి సభ్యుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వం అందించే పెట్టుబడి పథకం ప్రతి రైతుకి అందుతుందని, ఈ విషయంపై రైతులకు అవగాహన కల్పిస్తూ వారిలో విశ్వాసం పెంచాలన్నారు. పంపిణీ సమయంలో వచ్చే సమస్యలను అధిగమించాలన్నారు. పంపిణీ కేంద్రం వద్ద హెల్ప్‌డెస్క్, గ్రీవియెన్స్ సెల్ ఏర్పాటు చేయాలన్నారు. రైతులు తమ సందేహాలను, సమస్యలను గ్రీవియెన్స్ సెల్లో అందిస్తే రెండురోజుల్లో వారి సమస్య పరిష్కారమవుతుందన్నారు. అధికారులు వారికి వెంటనే సమాధానాలు అందించాలని, గ్రీవియెన్స్ సెల్లో విధులు నిర్వర్తించే వారికి ఉన్నతాధికారులు శిక్షణ ఇవ్వాలన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలని, టెంట్లు, కుర్చీలు వేయాలని, తాగునీరు, మజ్జిగ పాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. చెక్కుల పంపిణీ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యేలు, అధికార ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండేలా సమన్వయం చేసుకోవాలన్నారు. ఆర్డీవోలు వ్యక్తిగతంగా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని, గ్రామాల్లో చెక్కుల పంపిణీ కోసం అనువైన వేదికలను అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి గుర్తించాలన్నారు. చెక్కుల పంపిణీ కార్యక్రమ తేదీ, సమయం, వేదిక, తదితర అంశాలతో కూడిన కరపత్రాలు ముద్రించి రైతులకు పంపిణీ చేయాలని, ఏ గ్రామంలో చెక్కులు పంపిణీ చేసేది వారికి ముందస్తుగా తెలియజేయాలన్నారు. సుదీర్ఘ అనుభవమున్న అధికారుల సేవలు వినియోగించుకోవాలన్నారు. 300 మంది రైతులకు చెక్కులు పంపిణీ చేసేందుకు ఒక బృందం ఏర్పాటు చేసుకున్నామని, ఆ బృందాల్లోని సభ్యులకు బాధ్యతలు అప్పగించి ఒక నమూనా తయారు చేయాలన్నారు. దాని ప్రకారం అంతా సవ్యంగా సాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. పట్టాదార్ పాస్ పుస్తకం నంబరు చెక్కుపై ఉంటుందని, ఆ వివరాలు, రైతుల ఆధార్ వివరాలు సరిచూసుకోవాలన్నారు. అధికారులు చెక్కు, పాస్ పుస్తకం పంపిణీ చేసేటపుడు లబ్ధిదారుని వద్ద నుంచి రెండు ప్రింటెడ్ రశీదులపై సంతకాలు తీసుకోవాలని, రూ. 50వేలలోపు వరకు ఒక్క చెక్కు, ఆపై పెట్టుబడి సాయానికి రెండు చెక్కులు అందిస్తామన్నారు. ప్రభుత్వం అందించే సహాయం వదులుకునే వారి చెక్కులను రైతు సమన్వయ సమితుల అకౌంట్‌కు అందజేయాలన్నారు. రైతుబంధు పథకం అమలుకోసం రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతగా బ్యాంకులకు రూ. 6వేల కోట్లు విడుదల చేసిందన్నారు. చెక్కుల అకౌంట్ బుక్‌ను బ్యాంకులు నిర్వహించాలన్నారు. చెక్కులపై ఉన్న పేర్లలో పొరపాట్లను పాస్‌పుస్తకం పరిశీలించి నగదు అందించాలని, లోన్, క్యాష్ కటింగ్ వంటివి పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని బ్యాంకర్లను హెచ్చరించారు. తహసీల్దార్లు ఆధార్ సీడింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని, సాదా బైనామా దరఖాస్తులు ఈనెల 28లోగా పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో జేసీ వనజాదేవి, రెతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు కోట రాంరెడ్డి, ఇన్చార్జి డీఆర్వో బైరం పద్మయ్య, ఆర్డీవో అశోక్‌కుమార్, డీఏవో తిరుమల్‌ప్రసాద్, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, బ్యాంకు ప్రతినిధులు, ప్రత్యేక అధికారులు, సభ్యులు పాల్గొన్నారు. -
అన్నదాత ఉసురు తీసిన అప్పులు
అన్నం పెట్టే అన్నదాతే అప్పులపాలై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గల్ఫ్ దేశానికి వెళ్లినా కలిసి రాలేదు. పుడమి తల్లినే నమ్ముకున్న ఆయనకు ఎక్కడా సహకరించక బలన్మరణానికి ఒడిగట్టాడు. చివర కు తన కుటుంబాన్ని విషాదంలోకి నింపి వెళ్లాడు. ధర్పల్లి(నిజామాబాద్ రూరల్): నమ్ముకున్న భూమిపై పెట్టి పంటల సాగుపై చేసిన అప్పులు పెరిగి పోవటంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకు పోయిన రైతు తన పొలంలోనే మామిడి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ పూర్ణేశ్వర్ వివరాలు తెలిపారు. మండలంలోని దుబ్బాకకు చెందిన సదు బక్కన్న(61) అనే రైతు పంటల సాగు కోసం చేసిన అప్పులు పెరిగి బుధవారం ఉదయం బలన్మరణానికి పాల్పడ్డాడు. 10 ఎకరాల సాగుభూమిలోని పంటల సాగు కోసం ఆరు బోర్లు వేసి నీళ్లు పడక పోవటంతో అప్పులు చేశాడు. దీంతో అప్పులు సుమారు రూ.25 నుంచి 30లక్షల వరకు పెరిగి 5 ఎకరాల సాగుభూమిని ఇటీవలే అమ్మివేశాడు. అయినా అప్పులు తీరడం లేదని కొన్ని రోజులుగా మదనపడ్డాడు. రోజు సదు బక్కన్న ఉపాధిహామీ పథకం కింద కూలీగా పని చేస్తున్నాడు. బుధవారం ఇంట్లో నుంచి కూలి పనులకు వెళ్లుతున్నానని వెళ్లి నేరుగా సొంత పొలంలోకి వెళ్లి చెట్టుకు వైరుతో ఉరేసుకున్నాడు. సంఘటన స్థలాన్ని తహసీల్దార్ రమేశ్, ఎస్ఐ పూర్ణేశ్వర్ వెళ్లి పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం జిల్లా కేంద్ర అస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య సుశీల, ఇద్దరు కొడుకులు ఉన్నారు. వ్యవసాయంపై చేసిన అప్పులు తీరక కుటుంబ పెద్ద కానరాని లోకాలకు వెళ్లాడని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. జీవితంపైవిరక్తి చెంది ఒకరు... పెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ మండలంలోని అంకాపూర్‌లో తోకల మురుగేశ్ అలియాస్ దండుగుల మురుగేశ్(30) అనే వ్యక్తి మంగళవారం అర్ధరాత్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్‌హెచ్‌వో సీతారాం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అంకాపూర్‌కు చెందిన మురుగేశ్ కూలీగా పని చేస్తున్నాడు. కొద్ది రోజులుగా పనికి వెళ్లకుండా తాగుడుకు బానిసయ్యాడు. జీవితంపై విరక్తి చెంది మంగళవారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఇంట్లో రేకుల షెడ్డుకు గల పైపునకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నా డు. ఎస్ఐ గోపి సంఘటన స్థలానికి చేరు కుని ఘటనపై ఆరా తీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య యశోద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు. ఓ విద్యార్థి కూడా.. తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలం లోని చిట్యాల గ్రామానికి చెందిన మంగళి శ్రీనాథ్(11) అనే విద్యార్థి బుధవారం ఉరేసుకొని ఆత్మహ త్య చేసుకున్నట్లు ఎస్ఐ అంజయ్య తెలిపారు. మంగళి భీమయ్య కుమారుడైన శ్రీనాథ్ గ్రామంలోని పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. శ్రీనాథ్‌కు తరుచూ మూత్రం వస్తుండడంతో వైద్యచికిత్సలు చేయించారు. శస్త్రచికిత్సలు చేయించినా మూత్రం నెమ్మదిగా వచ్చేదన్నారు. దీంతో జీవితంపై విరక్తి చెందిన విద్యార్థి తన కుటుంబీకులు ఉపాధిహామీ పనులకు వెళ్లాక ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని శవ పంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ వివరించారు. -
కరువు అంచనా...అంతా వంచన
కరువు పరిశీలనకు కేంద్ర అధికారుల బృందం వస్తుందని రైతులు, కూలీలు సంతోషించారు. తమ కష్టాలు విని ఉపశమనం కలిగిస్తారని భావించారు. తీరా వచ్చాక కనీసం ఒకచోట పది నిమిషాలు కూడా గడపలేదు. రైతులు వ్యవసాయంలో ఇబ్బందులు, కష్టాలు వారికి తెలుపుకుందామని వారి వద్దకు వెళ్లగా చివరకు నిరాశే మిగిలింది. తూతూమంత్రంగా వారితో మాట్లాడారు. కనీసం వివరాలు కూడా నమోదు చేయకుండానే వెనుదిరిగారు. దీంతో కరువు బృందం పరిశీలన తమకు ఎంతమేర ఉపశమనం కలిగిస్తుందో అని రైతులు ఆందోళన చెందుతున్నారు. బద్వేలు : రబీ సీజనుకు సంబంధించి కేంద్ర కరువు పరిశీలన బృందం బుధవారం కాశినాయన, పోరుమామిళ్ల మండలాల్లో పర్యటించింది. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో రైతులు, ప్రజలతో ముఖాముఖీ నిర్వహించారు. పంటనష్టం, తాగునీటి సరఫరా, ఉపాధి పనుల తీరు తదితరాలను పరిశీలించారు. ఈ బృందంలో హైదరాబాద్‌కు చెందిన డీఓడీ డైరెక్టర్ బీకే శ్రీవాత్సవ, ఎఫ్‌సీడీ ఫైనాన్స్ డిప్యూటీ డైరెక్టరు ముఖేష్‌కుమార్, అగ్రి ఇన్పుట్స్ పరిశోధనాధికారి అనురాధ బటానా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ డీజీఎం విజయకుమార్ ఉన్నారు. ఒకరోజు పరిధిలో రెండు మండలాల్లో ఆరు ప్రాంతాల్లో కరువు బృందం పర్యటన ఏర్పాటు చేయడంలోనే అధికారుల చిత్తశుద్ధిలోపం కనిపిస్తోంది. గుంతలతో కూడిన మట్టి రోడ్లపై దాదాపు 150 కిలోమీటర్లు ప్రయాణించడం, నాలుగు ప్రాంతాల్లో రైతులు, కూలీలతో ముఖాముఖి, మూడు ప్రాంతాల్లో చెరువుల పరిశీలన ఎలా సాధ్యమనే విషయాన్ని కూడా పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. చివరకు ఒక రోజు వ్యవధిలో వీటన్నింటిని పూర్తి చేసుకుని తూతూమంత్రంగా తమ పర్యటనను ముగించారు. ఉపాధి కష్టాలకు గంతలు కరువు పరిశీలన బృందం మొదట సావిశెట్టిపల్లె సమీపంలో జరుగుతున్న ఉపాధి పనులను పరిశీలించారు. అక్కడ కొండవాలున తవ్విన కందకాలను పరిశీలించారు. అనంతరం ఉపాధి కూలీలతో ముఖాముఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా డ్వామా అధికారులు కూలీలతో పనులు బాగున్నాయని, కూలీ నగదు అందుతున్న రీతిలో చెప్పించారు. దీంతో పాటు పని వద్ద నీడ ఏర్పాట్లు, మజ్జిగ అందజేత, మెడికల్ కిట్లు అందించామని చెప్పుకుంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వందరోజులు పని కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అక్కడ దాదాపు వందమంది కూలీలు ఉండగా వారిలో కేవలం నలుగురో ఐదుగురో వంద రోజులు పనిచేశారు. కేవలం వీరిని మాత్రమే అధికారులతో మాట్లాడించారు. మెడికల్ కిట్లు అందజేసి నాలుగేళ్లు అవుతోంది. ఈ ఏడాది నీడ కోసం టెంట్లు అందించలేదు. అలాగే ఎండలకు నీటి వసతి, మజ్జిగ సౌకర్యం కల్పించలేదు. కానీ ఇవన్ని కూలీలు చెప్పకుండా కేవలం పనులు బాగున్నట్లు మాత్రమే చెప్పించారనే విమర్శలు వస్తున్నాయి. ఈ ఏడాది నెలల తరబడి ఉపాధి వేతనం రాకున్నా ఆ సమస్యను మాత్రం కేంద్రం బృందం దృష్టికి మాత్రం తీసుకురాలేదు. చెరువుల పరిశీలన అంతకుమునుపు ఇటుకలపాడు చెరువును పరిశీలించారు. చెరువు ఆయకట్టు, నీటి ఒరవ, పంటల సాగు వంటి వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. బాలాయపల్లెలో కూడా చెరువును పరిశీలించారు. చెరువు 45ఎకరాల విస్తీర్ణంలో ఉండగా చాలావరకు ఆక్రమణకు గురైంది. ఈ విషయాన్ని కూడా పరిశీలించలేదు. చెరువుకు ఒరవ తక్కువగా ఉందని. రైతులు ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు చెప్పారు. ఇటుకలపాడు, బాలాయపల్లె చెరువులకు తెలుగుగంగ ఎడమ కాలువ నుంచి ఎత్తిపొతల పథకం ఏర్పాటు చేసి నీటిని అందించాలని విన్నవించారు. ఆర్డీఓ వీరబ్రహ్మం, జేడీఏ ఠాకూర్‌నాయక్, ఏడీ క్రిష్ణమూర్తి, డ్వామా పీడీ హరిహరనాథ్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సంజీవరావు, డీడీ మురళి, వెటర్నరీ ఏడీ డాక్టరు రెడ్డమ్మ, కాశినాయన తహసీల్దార్ మల్లికార్జున, పోరుమామిళ్ల తహసీల్దార్ సీసీఎస్ వర్మ, ఎంపీడీఓలు ఆయూబ్, రామక్రిష్ణయ్య, ఆర్ఐలు మోహనరాజు, దక్షిణమూర్తి, ఎఓలు రామాంజనేయరెడ్డి, షరీఫ్ పాల్గొన్నారు. రైతులకు గోడు వినకుండానే.. అనంతరం కాశినాయన మండలంలోని చిన్నాయపల్లెలో శెనగ రైతులతో కరువు బృందం సమావేశమైంది. కానీ ఇక్కడ కూడా ఇద్దరు రైతుల అభిప్రాయాలు మాత్రమే తెలుసుకున్నారు. కేవలం పది నిమిషాల సమయం కూడా కేటాయించలేదు. వ్యవసాయాధికారులు కూడా దీనికి సంబంధించి పూర్తిస్థాయి నివేదికలు ఇవ్వలేదు. మండలంలోని అధికశాతం మంది రైతులు నష్టపోయినా రైతుల సంఖ్య తక్కువ చేసి చూపారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం రైతులు చెప్పిన విషయాన్ని నమోదు చేసే సమయం కూడా అధికారులకు లేదనే ఆవేదన వ్యక్తం చేశారు. చాలామంది రైతులు తాము వేసిన పంట విస్తీర్ణం, వచ్చిన దిగుబడి, కలిగిన నష్టం వివరాలను తెలుపుదామని ఎదురుచూసినా వారికి అవకాశం లభించలేదు. సాయంత్రం మూడు గంటలకు బాలాయపల్లెలో జొన్న రైతులతో సమావేశమయ్యారు. ఇద్దరు రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మిగతా రైతులు తమ కష్టాలను చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నా పట్టించుకోకుండా వెళ్లిపోయారు. అలాగే గ్రామంలోని పలువురు తాగునీటి ఇబ్బందులను వారి దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించినా పట్టించుకోలేదు. ఇక్కడ పది నిమిషాల కంటే తక్కువ సమయం కేటాయించారు. -
హృదయ విదారకం
మల్లన్నా..ఓ రైతన్నా..ఆరుగాలమూ..ఎవుసమే అంటివి..స్వేదం చిందించి పైరును కాపాడితివి.ప్రకృతి పగబడితే పదిలం జేసుకుంటివి..భూ తల్లిని నమ్ముకునికుటుంబాన్ని సాకుతుంటివి..ధాన్యపు రాశుల పంట మురిపెం తీరకపాయే..కష్టార్జితం ఇంటికి చేరకపాయే..అలుపెరుగని కౌలు చాకిరీచి‘వరి’కి ఉసురు తీసుకునే..బతికున్నోళ్లకు ‘పుట్టెడు’ దుఃఖాన్ని మిగిల్చే. నేలకొండపల్లి:స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో నేలకొండపల్లికి చెందిన చెక్కల మల్లయ్య(55) అనే కౌలురైతు ధాన్యం ఆరబోస్తూ..గుండెపోటుతో సోమవారం హఠాన్మరణం చెందాడు. యాసంగి (రబీ) సీజన్‌కు సంబంధించి తాను సాగు చేసిన కౌలు భూమిలోని వరిపంటను యంత్రంతో కోయించగా..వడ్లు కాస్త తేమగా ఉన్నాయని ఆరబోస్తుండగా..ఎండ తీవ్రతకు నీరసించి..ఒక్కసారిగా గుండెపోటుతో ఆ వడ్ల రాశిపైనే కుప్పకూలి ప్రాణాలొదిలాడు. తోటి రైతులు చూసి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకురాగా..అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. నిరుపేద కుటుంబానికి చెందిన ఈ రైతు..కొన్నేళ్లుగా భూములను కౌలుకు తీసుకుని..జీవనం సాగిస్తున్నాడు. కాయకష్టం చేసి..పంటలను కాపాడుకుని..ఇంటిని నెట్టుకొస్తున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు కొడుకులు, ఓ కూతురు. పెద్ద కుమారుడు శ్రీను హమాలీగా..రెండో కొడుకు నాగరాజు మెకానిక్‌గా పనిచేస్తున్నారు. కుమార్తె వెంకటలక్ష్మి భర్త చనిపోగా..ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి తల్లిదండ్రి వద్దనే ఉంటోంది. అందరికీ అభయంగా ఉంటూ..ఇటు వ్యవసాయం, అటు వంట మాష్టారుగా పనులు చేస్తూ..మంచి వ్యక్తిగా పేరొందిన చెక్కల మల్లయ్య ఇలా మరణించడంతో స్థానికంగా విషాదం నెలకొంది. మృతదేహాన్ని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, టీడీపీ జిల్లా అధ్యక్షుడు తుళ్లూరి బ్రహ్మయ్య, నాయకురాలు బేబి స్వర్ణ కుమారి, సర్పంచ్ వంగవీటి నాగేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యురాలు శీలం వెంకటలక్ష్మి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మైశా శంకర్, వార్డు సభ్యురాలు గడ్డం చంద్రకళ, దేవస్థానం చైర్మన్ బాజా నాగేశ్వరరావు, వంట మాష్టార్ల సంఘం నాయకులు చట్టు ధనమూర్తి, సాలయ్య, పెద్ధరాజు నర్సయ్య తదితరులు సందర్శించి నివాళులు అర్పించారు. -
అప్పులే యమపాశాలై..
ఆ దంపతులు బాగా బతకాలని కలలు కన్నారు. అప్పు తెచ్చి వ్యాపారం మొదలు పెట్టారు. శక్తివంచన లేకుండా కష్టపడుతున్నా వారికి వ్యాపారం కలిసి రాలేదు. తెచ్చిన అప్పులకు వడ్డీ పెరిగిపోయింది. తీర్చే దారి లేకపోయింది. చావే శరణ్యమని భావించారు. పిల్లలకు విషం తాగించి.. వారూ తాగారు. భర్త మృతిచెందగా.. భార్య, ముగ్గురు పిల్లలు మృత్యువుతో పోరాడుతున్నారు. కర్నూలు మండలం దిన్నెదేవరపాడు గ్రామంలో చోటుచేసుకున్న ఈ విషాదకర సంఘటన పలువురిని కలచివేసింది. కర్నూలు హాస్పిటల్/సి.క్యాంపు : దిన్నెదేవరపాడు గ్రామానికి చెందిన మధు(30), లింగేశ్వరమ్మ(25) దంపతులు దాణా వ్యాపారంతో పాటు కొంత పొలాన్ని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి చిట్టెమ్మ(7), మౌనిక(5), వంశీ(3) సంతానం. ఎంతో అన్యోన్యంగా జీవించే వారి కుటుంబంలో ఇటీవల ఆర్థిక సమస్యలు అధికమయ్యాయి. దాణా వ్యాపారం కోసం రూ.25లక్షలు పెట్టి ఐదు బొలెరో వాహనాలు కొనుగోలు చేశారు. వ్యాపారంలో రోజుకు రూ.25వేలు ఆదాయం రావాల్సి ఉండగా రూ.3వేలు కూడా వచ్చేది కాదు. వస్తున్న ఆదాయానికీ చేస్తున్న ఖర్చుకు పొంతన లేకపోవడంతో అప్పులు ఎక్కువయ్యాయి. ఏడాది నుంచి నష్టంతో వ్యాపారం కొనసాగిస్తున్నారు. మరోవైపు తెచ్చుకున్న అప్పులకు వడ్డీ పెరిగిపోయింది. ఈ అప్పులకు సంబంధించి మూడు నెలల నుంచి భార్యాభర్తలు ఇంట్లో గొడవపడేవారని తెలుస్తోంది. ఇదే సమయంలో ఆస్తి తగదాలు ప్రారంభమయ్యాయి. మధుకు ముగ్గురు సోదరులు. వీరికున్న మూడిళ్లను నలుగురూ పంచుకునే విషయంలో గొడవలు మొదలైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం ఇంటికి గడియపెట్టుకుని ముందుగా పురుగుల మందును పిల్లలకు తాగించి, అనంతరం భార్యాభర్తలిద్దరూ తాగారు. చిన్నారి బిగ్గరగా ఏడవటంతో.. విషం తాగిన వెంటనే ఐదుగురూ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. అయితే కొద్దిసేపటికి చిన్నారి మౌనిక వాంతులు చేసుకుంటూ బిగ్గరగా ఏడ్వడంతో ఇరుగుపొరుగు వారు అనుమానించి తలుపులు బద్దలు కొట్టారు. పోలీసులకు, అంబులెన్స్‌కూ సమాచారం ఇచ్చి అందరినీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరుకునేలోపు మధు మృతి చెందాడు. భార్య లింగేశ్వరమ్మతో పాటు చిట్టెమ్మ(లక్ష్మి) పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో ఉంచి వైద్యం అందిస్తున్నారు. ఆదాయానికి మించి అప్పులు చేయొద్దు –ఏఎస్పీ షేక్షావలి జీవితంలో చిన్న చిన్న సమస్యలు సాధారణమని, ఆ సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలే తప్ప ఆత్మహత్య చేసుకోవడం పరిష్కారం కాదని అడిషనల్ ఎస్పీ షేక్షావలి చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాన్ని ఆయన కర్నూలు డీఎస్పీ ఖాదర్‌బాషాతో కలిసి సందర్శించి, వారికి అందుతున్న వైద్యం, వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అప్పులు చేసే పరిస్థితికి ఎవ్వరూ రాకూడదని, ఆదాయానికి తగ్గట్లు జీవించాలని సూచించారు. కుటుంబం ఆత్మహత్యాయత్నానికి సంబంధించి విచారణ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
చంపేశారు!
‘‘భూమి ఉంది... భయం లేదు... కూతుళ్లకు పెళ్లిళ్లు ఘనంగా చేయాలని రోజూ అనేవాడివి.. ఇప్పుడు కదలకుండా పడి ఉన్నావు... మాకు దిక్కెవరయ్యా’’ మార్చురీ వద్ద ఇద్దరు కూతుళ్లు త్రివేణి, భారతిని పట్టుకుని కేశవనాయక్ భార్య శాంతమ్మ విలపించిన తీరు అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు రెచ్చిపోయారు. ఓ గిరిజన రైతు ఆరేళ్లుగా సాగుచేసుకుంటున్న పొలాన్ని కాజేసేందుకు ప్రణాళిక రచించారు. ఆన్లైన్లో వేరొకరి పేరు కూడా ఎక్కించారు. న్యాయం చేయాలని బాధిత రైతు కాళ్లావేళ్లాపడినా...అధికారులు కనికరం చూపలేదు. ఆందోళన చెందిన ఆ గిరిజనుడు పురుగుల మందు తాగి ప్రాణం తీసుకోగా.. అతనిపైనే ఆధారపడిన ఇద్దరు కూతుళ్లు, భార్య దిక్కులేని వారయ్యారు. ఆత్మకూరు : తమ భూమిని అధికార పార్టీకి చెందిన వ్యక్తి పేరుపై ఆన్లైన్లో నమోదు చేయడంతో మనస్తాపానికి గురైన ఆత్మకూరు మండలం వేపచెర్లతండాకు చెందిన రైతు కేశవనాయక్ (45) ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే... వేపచెర్ల తండాకు చెందిన కేశవనాయక్, శాంతమ్మ దంపతులు కూలీలు. వీరికి ఇంటర్, పదో తరగతి చదువుతున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 2012లో కాంగ్రెస్ ప్రభుత్వం భూ పంపిణీ కింద 507–2 సర్వే నంబర్లో 3.21 ఎకరాల పొలాన్ని శాంతమ్మ పేరు మీద పంపిణీ చేసింది. అప్పటి నుంచి ఆ పొలంలో పంట సాగుచేసుకుంటున్నారు. ఆత్మకూరు సిండికేట్ బ్యాంకులో రూ.70 వేల పంట రుణం పొందారు. ఇదిలా ఉండగా నెల రోజుల కిందట శాంతమ్మ పేరిట ఉన్న 3.21 ఎకరాల భూమిని అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన కృష్ణానాయక్ పేరిట ఆన్లైన్లో నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న కేశవనాయక్ రెవెన్యూ అధికారులను సంప్రదించి, తన గోడు వెల్లబోసుకున్నాడు. కానీ న్యాయం జరగలేదు. మరోవైపు పంట రుణం రెన్యూవల్ సమయం దగ్గరపడింది. రెన్యూవల్ చేయాలంటే బ్యాంకు అధికారులు రికార్డులు పరిశీలిస్తారు. అప్పుడు వేరే పేరు కనిపిస్తే ఇబ్బంది అవుతుందని ఆందోళనకు గురైన రైతు కేశవనాయక్ ఆదివారం ఇంటి దగ్గరే పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. చక్రం తిప్పిన మారెక్క శాంతమ్మ భూమిని కృష్ణానాయక్ పేరిట మార్పు చేయించడంలో ఎంపీపీ మారెక్క హస్తం ఉన్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తమ పార్టీకి చెందిన కృష్ణా నాయక్ పేరుమీద మార్చాలని ఎంపీపీ రెవెన్యూ అధికారులపై తీవ్రంగా ఒత్తిడి తెత్తినట్లు తెలుస్తోంది. పోలీసుల జోక్యంతో అంత్యక్రియలు ఆదివలారం సాయంత్రం పొలంలోనే అంత్యక్రియలు చేయటానికి సిద్ధమవగా కృష్ణానాయక్ బంధువులు అడ్డుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో కేశవనాయక్ అంత్యక్రియలు సజావుగా జరిగాయి. వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ బాలపోతన్న, మాజీ సర్పంచు యల్లప్ప తదితరులు రైతు కుటుంబాన్ని పరామర్శించి, ధైర్యం చెప్పారు. నోటీసులు ఇచ్చాం: తహసీల్దార్ నారాయణ సర్వే నంబర్507–2లోని 3.21 ఎకరాల భూమికి సంబంధించి ఆర్డీఓ ఉత్తర్వులు ప్రకారమే నోటీసులు ఇచ్చామని తహసీల్దార్ నారాయణ చెప్పారు. సాగులో కృష్ణానాయక్ ఉండటం వల్ల వారికే ఆన్లైన్ చేశామన్నారు. ఈ భూమిని రద్దు చేసినది తాను కాదని, గతంలో పనిచేసిన తహసీల్దార్ నాగరాజు అని స్పష్టం చేశారు. తహసీల్దార్‌ను సస్పెండ్ చేయాలి అనంతపురం న్యూసిటీ: రైతు కేశవనాయక్ (45) మృతికి కారణమైన ఆత్మకూరు తహసీల్దార్ నారాయణను తక్షణం సస్పెండ్ చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం సర్వజనాస్పత్రిలోని మార్చురీలో కేశవనాయక్ మృతదేహాన్ని ఆయన సందర్శించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. రైతు కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోస్టుమార్టం చేయవద్దని కేశవనాయక్ కుటుంబీకులు, వైఎస్సార్ సీపీ నేతలు మార్చురీలో ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ వెంకటరావ్, ఆర్డీఓ మలోల మార్చురీ వద్దకు చేరుకుని న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు. అనంతరం ప్రకాశ్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. తమ భూమి పోతే ఇద్దరు ఆడపిల్లల పెళ్లి చేయలేనని, తనకు ఆత్మహత్యే శరణ్యమని రైతు కేశవనాయక్ మొరపెట్టుకున్నా తహసీల్దార్ కనికరం చూపలేదన్నారు. రైతు మృతికి కారణమైన తహసీల్దార్‌పై చర్యలు తీసుకుని, బాధితులకు భూమిని అప్పగించేలా చర్యలు తీసుకోకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. -
బొంద పెట్టాలంటే నన్ను పాతేయండి
నవాబుపేట (జడ్చర్ల): నా పట్టా పొలంలో ఎవరినీ పూడ్చిపెట్టవద్దని, ముందుగా తనను పూడ్చిపెట్టి అంత్యక్రియలు నిర్వహించుకోవాలని ఓ రైతు తేల్చిచెప్పాడు. దీంతో రెవెన్యూ అధికారులు వచ్చి సమస్యను పరిష్కరించడంతో వివాదం సద్దుమణిగింది. ఈ సంఘటన మండలంలోని యన్మన్గండ్లలో గురువారం చోటుచేసుకుంది. అధికారుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మాల ఎల్లమ్మ బుధవారం రాత్రి మృతిచెందింది. ఆమె అంత్యక్రియలు గురువారం చేసేందుకు వెళ్తే అక్కడ భూమి తన పట్టాలో ఉందని, అంత్యక్రియలకు తీసిన గతిలో పడుకుని ఓ రైతు ఆందోళన చేయడంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కాగా సర్వే నం.402 తన పట్టా అంటూ రైతు వాదిస్తుండగ గ్రామంలో మాలబావిగడ్డగా పిలిచే భూమిలో తమ వర్గంవారు చనిపోతే అంత్యక్రియలు చేసేందకు కేటాయించారని కొన్నేళ్లుగా.. ఇక్కడే నిర్వహిస్తున్నామని వారు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలకు సర్దిచెíప్పి అంత్యక్రియలు జరిగేలా చేశారు. కాగా భూమిని సర్వే చేసి అందరికీ న్యాయం చేస్తామని రెవెన్యూ అధికారులు హామీ ఇవ్వడంతో సమస్య సద్దుమణిగింది. -
టవరెక్కిన రైతన్న
రేగోడ్(మెదక్): వేలు పెట్టుబడి పెట్టి సాగుచేసిన పంటలు బోర్లలో నీళ్లు లేక ఎండిపోతున్నాయంటూ ఓ రైతు ఆవేదనతో బీఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కిన సంఘటన మెదక్ జిల్లా రేగోడ్ మండలంలోని చౌదర్పల్లిలో గురువారం సాయంత్రం జరిగింది. వివరాల్లోకి వెళితే.. చౌదర్పల్లి గ్రామానికి చెందిన అబ్దుల్లా తనకున్న ఐదెకరాకు మూడెకరాల్లో వరి, రెండెకరాల్లో మొక్కజొన్న పంటలు సాగు చేశాడు. ఉన్న బోరు ద్వారా పంటలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. అంతా బాగానే ఉన్నా ప్రస్తుత ప్రస్తుం మండుతున్న ఎండలకు బోరులో నీరు అడుగంటి పోయాంది. చేసేది లేక పదిహేను రోజుల క్రితం సుమారు రూ.లక్ష వెచ్చించి మూడు బోర్లు వేశాడు. అందులో ఒక్క చుక్క కూడా నీరు పడలేదు. దీంతో ఆవేదనకు గురైన రైతు బీఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కి మూడు గంటల పాటు హల్చల్ చేశాడు. గ్రామస్తులు కిందికి దిగాలని నచ్చచెప్పినా అబ్దుల్లా వినలేదు. విషయం తెలుసుకున్న ఎస్సై జానయ్యకు ‘సాక్షి’ సమాచారం అందించింది. స్పందించిన ఎస్సై వెంటనే చౌదర్పల్లి గ్రామానికి తన సిబ్బందితో హుటాహుటిన చేరుకున్నారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పడంతో రైతు అబ్దుల్లా టవర్‌పై నుంచి రాత్రి కిందికి దిగాడు. అప్పుడు అందరూ ఊపరి పీల్చుకున్నారు. -
సీఎం క్యాంపు కార్యాలయం వద్ద రైతు ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: అప్పుల బాధ తాళలేక ఓ యువ రైతు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ముందు మంగళవారం ఆత్మహత్యకు యత్నించాడు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గంపల తిరుమలగిరికి చెందిన సైదులు(24) కౌలురైతు. గ్రామంలో 11 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వరి పంట వేశాడు. సోదరి వివాహం, పంట పెట్టుబడి నిమిత్తం సుమారు రూ.9 లక్షల వరకు అప్పులు చేశాడు. బోర్లు ఎండిపోవడంతో నీరు రాక పంట మొత్తం పోయింది. అప్పుల వారి వేధింపులు ఎక్కువ కావడంతో తన బాధను ముఖ్యమంత్రికి చెప్పుకుని సాయం కోరేందుకు క్యాంపు కార్యాలయం వద్దకు వచ్చాడు. లోనికి వెళ్లేందుకు యత్నించగా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన సైదులు తన వెంట తెచ్చుకున్న క్రిమిసంహారక మందు తాగాడు. అక్కడే నురగలు కక్కుకుని పడిపోవడంతో సెక్యూరిటీ సిబ్బంది గమనించి అతన్ని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. కాగా, కలెక్టర్ ఆదేశాల మేరకు సైదులు వరి పొలాన్ని, ఇళ్లను వ్యవసాయ, రెవెన్యూ అధికారులు పరిశీలించారు. తుది నివేదికను కలెక్టర్‌కు అందించనున్నట్లు తెలిపారు. -
పంట పొలాలను పాడుచేస్తున్నా పట్టించుకోరా..?
రేపల్లె: పంట పొలాలను పందులు పాడు చేస్తున్నాయని పలుమార్లు ఫిర్యాదు చేసినా మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ రైతు పురుగు మందు డబ్బా తీసుకుని ఆత్మహత్య చేసుకుంటానంటూ మున్సిపల్ కార్యాలయం గేటు వద్ద బైఠాయించిన సంఘటన సోమవారం పట్టణంలో కలకలం రేపింది. పట్టణంలోని 8వవార్డు సమీపంలో ఉన్న పంట పొలంలో ఖరీఫ్ సాగు వరిని పందులు పాడు చేశాయని, ప్రస్తుతం జొన్న పంటను నాశనం చేస్తున్నదని, మూడేళ్లుగా ఇదేవిధంగా జరుగుతుండడంతో నష్టాలబారిన పడుతున్నానని రైతు దేవగిరి శివశంకర్ అనే రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణానికి చెందిన పందుల పెంపకందారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో తాము నష్టపోవాల్సివస్తోందని వాపోయాడు. ఈ విషయమై మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తక్షణం చర్యలు తీసుకుని మిగిలి ఉన్న పంటనైనా కాపాడాలని, లేకుంటే పురుగుల మందు తాగి తాను చనిపోతానని హెచ్చరించాడు. విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ మారుతీ దివాకర్ హుటాహుటిన మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని శివశంకర్ సమస్యపై సానుకూలంగా స్పందించారు. తక్షణం పందుల నివారణకు పటిష్ఠమైన చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. పందులను తరలించే కార్యక్రమానికి శ్రీకారం పట్టణంలో పందులను తరలించే కార్యక్రమానికి మంగళవారం నుంచే శ్రీకారం చుడుతున్నట్టు మున్సిపల్ కమిషనర్ మారుతీ దివాకర్ ప్రకటించారు. పట్టణంలో జనావాసాల మధ్య పందుల పెంపకం నిషిద్ధమని ఆయన స్పష్టం చేశారు. పందులు పంటలను పాడు చేసినా, పట్టణ రహదారుల్లో సంచరించినా సహించేది లేదని, పందుల పెంపకందారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ప్రతి గ్రామానికి సేవ చేస్తా
టేకుమట్ల: పల్లెల అభివృద్ధే నా ఎజెండా.. ప్రతీ పల్లె అభివృద్ధి చెందేవరకూ విశ్రమించనని స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. మండలంలోని వెంకట్రావుపల్లి(బి) గ్రామంలో పల్లె ప్రగతి నిద్ర ముగింపు సందర్భంగా ప్రతి వాడలో తిరుగుతూ ప్రజల అవసరాల ను తెలుకున్నారు. శనివారం రాత్రి కురిసిన వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులకు భరోసానిచ్చారు. గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన బండి రాజు ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఎవరూ చేయలేని అభివృద్ధి పనులను చేశానని, అందుకు ప్రజలే సాక్ష్యమన్నారు. కరీంనగర్ నుంచి టేకుమట్ల మండలం మీదుగా భూపాలపల్లి జిల్లా కేంద్రానికి జాతీయ రహదారి, ఓడేడు మానేరుపై అంతర్జిల్లా వంతెనతో గోదావరిఖని నుంచి హన్మకొండకు డబుల్ రోడ్డుతో ప్రయాణికుల రవాణాను త్వరలో మెరుగుపర్చే కార్యక్రమం ముందుకు సాగుతుందన్నారు. రైతుల సాగు నీటికి ఇబ్బంది కలుగకుండా భారీ బడ్జెట్‌తో మానేరులో చెక్‌డ్యామ్ నిర్మాణానికి ప్రతిపాదనలు సైతం సిద్ధం చేశానన్నారు. చెరువు శిఖం భూమిని కొందరు అక్రమంగా కబ్జా చేస్తున్న తీరును గ్రామస్తులు స్పీకర్‌కు తెలపడంతో స్పందించిన ఆయన వెంట నే తహసీల్దార్‌తో మాట్లాడి అక్రమార్కుల నుంచి భూమిని స్వాధీనం చేసుకోవాలని ఆయన సూచించారు. ఆయన వెంట నాయకులు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కత్తి సంపత్, మండల ప్రధాన కార్యదర్శి ఆకునూరి తిరుపతి, ఏకు మల్లేష్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు ఒరంగంటి సధాకర్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ కూర సురేందర్‌రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు నేరేళ్ల శ్రీనివాస్‌గౌడ్, నాయకులు కొలిపాక రాజయ్య, వంగ కుమారస్వామి, రాంరెడ్డి, డాక్టర్ ఏకు నవీన్, సంగి రవి, కమురోద్ధిన్, పైడిపెల్లి సతీష్, మామిండ్ల ఎల్లస్వామి, వర్థాచారి, బందెల శ్రీనివాస్ యువజన నాయకులు అభిరాజు, తోట సాగర్, అందె కుమార్, బీనవేని ప్రభాకర్‌గౌడ్, దొడ్ల కోటి, బండమీది అశోక్, గునిగంటి మహేందర్, మల్లికార్జున్, శ్రీపతి రాకేష్, నాంపెల్లి వీరేశం, బొజ్జపెల్లి తిరుపతి, గంధం సురేష్, కిష్టస్వామి, తదితరులు పాల్గొన్నారు. -
అప్పుల బాధతో ఆగిన రైతు గుండె
రాప్తాడు: వ్యవసాయం కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలోనని ఆందోళనకు గురైన రైతు గుండెపోటుతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. రాప్తాడు మండలం పాలవాయి గ్రామానికి చెందిన రైతు హనుమంతు నాయక్ (67)కు నాలుగు ఎకరాల పొలం ఉంది. నాలుగైదేళ్లుగా వేరుశనగ సాగుచేసినా పంట చేతికందలేదు. వ్యవసాయ పెట్టుబడులతోపాటు ఇద్దరు కూతుళ్లు, కుమారుల వివాహాల కోసం బయటి వ్యక్తులతో అప్పులు చేశాడు. ఇటీవల పొలంలో నాలుగు బోర్లు వేయించి అరకొర నీటితోనే టమాట, బెండ, అనుము పంటలు సాగు చేసినా ఆశించినస్థాయిలో దిగుబడులు రాలేదు. భూగర్భజలాలు అడుగంటిపోవడంతో పంటలు ఎండుముఖం పట్టాయి. ఎలాగైనా పంటను కాపాడుకోవాలని మరో బోరు వేయించినా నీరు పడలేదు. ఈ క్రమంలో అప్పులు రూ.8లక్షలకు చేరుకున్నాయి. పెరిగిన రుణదాతల ఒత్తిళ్లు వరుస పంట నష్టాలతో కుదేలైన హనుమంతునాయక్‌కు రుణదాతల నుంచి ఒత్తిళ్లు పెరిగాయి. శనివారం రాత్రి కూడా రుణదాతలు ఇంటి దగ్గరకు వచ్చి అప్పు తీర్చాలని పట్టుబట్టారు. నాలుగైదు రోజుల్లో అప్పు తీర్చేస్తానని చెప్పి వారిని పంపించేశాడు. మానసిక వేదనకు గురైన రైతు ఆ పూట అన్నం కూడా తినకుండా అలాగే పడుకున్నాడు. అప్పులపై చర్చిస్తూ కుప్పకూలిపోయాడు వ్యవసాయం కలసిరాకపోవడం, అప్పులు పెరిగిపోవడంపై భార్య దస్లీబాయితో హనుమంతునాయక్ ఆదివారం మధ్యాహ్నం చర్చించాడు. తర్వాత భోజనం తినకుండానే ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. గ్రామస్తులతో అప్పుల విషయమై చర్చిస్తుండగా ఒక్కసారిగా గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచాడు. రైతు కుటుంబాన్ని ఆదుకోవాలి అప్పులబాధ తట్టుకోలేక గుండెపోటుకు గురై రైతు హనుమంతునాయక్ మృతిచెందిన విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పాలవాయి గ్రామాన్ని సందర్శించారు. మృతదేహాన్ని పరిశీలించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. రుణదాతల నుండి ఒత్తిళ్లు అధికం కావడంతోనే హనుమంతు నాయక్ మృతి చెందాడన్నారు. మృతుని కుటుంబానికి వెంటనే ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలన్నారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. ఆయన వెంట జెడ్పీటీసీ సభ్యుడు వెన్నపూస రవీంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ బోయ రామాంజినేయులు, యూత్ మండల కన్వీనర్ చిట్రెడ్డి సత్య నారాయణరెడ్డి, నాయకులు రామచంద్రారెడ్డి, పోతన్న, పాలవాయి పుల్లయ్య, మురళినాయక్, గొవింద నాయక్ పాల్గొన్నారు. -
‘కాగ్’ నివేదిక చెంపపెట్టు లాంటిది
స్టేషన్ మహబూబ్‌నగర్ : ఇతర రాష్ట్రాల కంటే తనపాలనే మెరుగు అని చెప్పుకుంటున్న సీఎం కేసీఆర్‌కు కాగ్‌నివేదిక చెంపపెట్టులాంటిదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు తడక జగదీశ్వర్‌గుప్తా విమర్శించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన, స్థానిక పార్టీ జిల్లా అధ్యక్షురాలు బీస మరియమ్మ నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణలో 10శాతం పెట్టుబడి వ్యయం ఎక్కు వ అని కాగ్ తెలిపిందన్నారు. కేటాయించిన రూ. 10వేల కోట్లు ఖర్చులేని స్థితిలో ఈ రాష్ట్ర ప్రభు త్వం ఉందన్నారు. మిషన్ కాకతీయ పథకం పూర్తి గా అక్రమాల పుట్ట అని ఆరోపించారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయాంలో రైతురుణమాఫీని ఒకేసారి చేశారని, కాని ఈ ప్రభుత్వం నాలుగుసార్లు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రైతులపై వడ్డీభా రం పడిందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజ లు తగిన బుద్ధిచెబుతారన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు బీస మరియమ్మ, నేత శశిధర్ పాల్గొన్నారు. -
పంట నష్టంతో రైతు ఆత్మహత్య
పినపాక: ఈ నెల 4న కురిసిన వడగండ్ల వానతో వరి పంట పూర్తిగా దెబ్బతినడంతో అప్పులు తీర్చే మార్గం లేక ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం తోగ్గూడెంలో శని వారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బండ సమ్మిరెడ్డి(45) అప్పులు తెచ్చి వరిసాగు చేశాడు. పంట బాగానే పండినప్పటికీ అకాలవర్షంతో పంట పూర్తిగా దెబ్బతింది. దీంతో అప్పులు తీర్చలేననే మనోవేదనతో పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు భద్రాచలం ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతి చెందాడు. -
854 ఎకరాలా.. ఎవరా రైతు?
సాక్షి, హైదరాబాద్ : వంద కాదు.. రెండొందలు కాదు.. అక్షరాలా 854 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్న ఆసామి ఆ రైతు! రైతుబంధు పథకం కింద ఆయనకు ఖరీఫ్‌లో అందించాల్సిన సొమ్ము ఎంతో తెలుసా? రూ.34.16 లక్షలు!! రబీలో మరో రూ.34.16 లక్షలు. అంటే ఏడాదికి ఏకంగా రూ.68.32 లక్షలు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన ఈ రైతు ఊరు, పేరును వ్యవసాయ వర్గాలు రహస్యంగా ఉంచాయి. ఆయనకు నిజంగా అంత భూమి ఉందా? లేదా ఎక్కడైనా పొరపాటు జరిగిందా? అని రికార్డులు తిరగేస్తున్నాయి. పక్కా సర్వే నంబర్, పట్టా భూమి కావడంతో ఏం చేయాలన్న అంశంపై తర్జనభర్జన పడుతున్నాయి. ప్రస్తుతానికైతే రైతుబంధు పథకం లబ్ధిదారుల తుది జాబితాలో ఈ రైతు వివరాలను తాత్కాలికంగా పక్కన పెట్టేశారు. నిర్ణయాన్ని ప్రభుత్వానికే వదిలేశారు. పథకం కింద పెట్టుబడి సొమ్మును అందజేసేందుకు వ్యవసాయశాఖ కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భూప్రక్షాళన రికార్డుల సమాచారాన్ని రెవెన్యూ శాఖ ఇటీవల వ్యవసాయ శాఖకు అందజేసింది. ఆ సమాచారంతో రైతు వివరాలను, భూములను పరిశీలించి తుది జాబితా తయారు చేసేపనిలో ఆ శాఖ నిమగ్నమైంది. వ్యవసాయ భూములు కాని వాటిని తొలగిస్తోంది. ఇప్పటికే 80 శాతం పరిశీలన పూర్తయింది. ఈ క్రమంలోనే భూపాలపల్లి జిల్లాకు చెందిన రైతు వద్ద 854 ఎకరాలున్న సంగతి వెలుగులోకి వచ్చింది. సీలింగ్‌పై నిర్ణయమేది? అధికారులు రూపొందిస్తున్న జాబితాల్లో వంద ఎకరాలకు మించిన వారు కూడా ఉన్నారు. అయితే భూసీలింగ్ యాక్ట్ ప్రకారం వ్యవసాయ భూమి 50 ఎకరాలే ఉండాలి. అంతకుమించి ఉంటే అక్రమంగా ఉన్నట్టే! యాభై ఎకరాలకు మించి భూమి ఉన్న వారి విషయంలో సర్కారు ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రెండ్రోజుల క్రితం విడుదల చేసిన రైతుబంధు పథకం మార్గదర్శకాల్లోనూ దీనిపై స్పష్టత ఇవ్వలేదు. అవేవీ పట్టించుకోకుండా అందరికీ ఇస్తున్నారు. అయితే ‘పెట్టుబడి పథకం సొమ్ము వదులుకోండి..’అని మాత్రమే పిలుపునిచ్చారు. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ పేరిట 37 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్టు తమ పరిశీలనలో వెల్లడైందని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. అనేకమంది ప్రజాప్రతినిధులకు మాత్రం సీలింగ్ యాక్ట్ కంటే అధికంగానే భూమి ఉన్నట్లు గుర్తించారు. పెట్టుబడి వదులుకోండి.. ప్లీజ్! ‘పెట్టుబడి సొమ్ము వదులుకోండి..’అని పెద్దలకు పిలుపు ఇచ్చినా, స్వయానా తానే వదులుకుంటున్నట్లు సీఎం ప్రకటించినా ఇప్పటికీ అనేకమంది మంత్రులు, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 20 నుంచి గ్రామసభల్లో ప్రారంభమయ్యే చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పెట్టుబడి సొమ్ము వదులుకునేలా హామీ పత్రాలను పంచాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. అప్పటికప్పుడు సభలో వద్దనుకునే వారుంటే ఆయా పత్రాలపై హామీ సంతకం ఇవ్వాలని విజ్ఞప్తి చేయనున్నారు. సొమ్ము వదులుకునే వారి చెక్కులను నేరుగా రైతు కార్పొరేషన్ కార్పస్ ఫండ్ కింద జమచేస్తారు. -
రానున్న రోజుల్లో గుణపాఠం తప్పదు...
మొగుళ్లపల్లి : టీఆర్ఎస్ పాలనకు రైతులు, అన్ని వర్గాల ప్రజలు చరమగీతం పాడాలని మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు.గురువారం మండలంలోని రంగాపురం, మేదరమెట్ల, అంకుషాపూర్ గ్రామాల్లో రైతు భరోసా యాత్ర జరిగింది. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర చేస్తే కేసీఆర్, కేటీఆర్‌లు విజ్ఞానయాత్ర, విహారయాత్ర అంటూ ఎద్దేవా చేయడం సరికాదన్నారు. మహానేత వైఎస్ఆర్ పాలనలో రైతులకు న్యాయం జరిగిందన్నారు. అనంతరం మేదరమెట్లకు చెందిన సూమారు 30 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేశారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పోల్నేని రాజేశ్వర్‌రావు, నాయకులు లింగారావు, సంపెల్లి నర్సింగరావు, యార మల్లారెడ్డి, నరహరి వెంకట్‌రెడ్డి, బెల్లంకొండ శ్యాంసుందర్‌రెడ్డి, గుండారపు తిరుపతి, కుమార్, పులి విప్లవరెడ్డి. తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్కు గుణపాఠం తప్పదు. టేకుమట్ల: రైతులను విస్మరిస్తున్న టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వానికి రానున్న రోజుల్లో గుణపాఠం తప్పదని మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. రైతు భరోసా పాదయాత్ర గురువారం మండలంలోని సుబ్బక్కపల్లికి చేరుకుంది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులు పండించిన వరి, మొక్కజొన్నలకు రూ.2వేలు, మిరప రూ.10వేలు, ప్రత్తి రూ.6వేల మద్దతు ధర చెల్లిస్తామని హామీ ఇచ్చారు. నాయకులు దొమ్మటి సాంబయ్య, మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గండ్ర జ్యోతి, మండల అధ్యక్షుడు రెడ్డి మల్లారెడ్డి, ఎంపీపీ బందెల స్నేహలత, వైస్ ఎంపీపీ సట్ల కొమురయ్య, ఎంపీటీసీ సభ్యుడు భీంపెల్లి సంధ్యారామస్వామి, మండల ప్రధాన కార్యదర్శి బిక్కినేని సంపత్‌రావు, పెరుమాండ్ల మొగిళి, బాబురావు, రవీందర్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు సట్ల రవిగౌడ్, కొండ్ర ఓదెలు, గువ్వాడి లక్ష్మణ్, పిన్నింటి విజేందర్‌రెడ్డి, దాసారపు సతీష్, ఎండీ అక్రం, ఆడెపు సంపత్, సతీష్‌గౌడ్, నానవేని కుమార్‌యాదవ్, శ్రీకాంత్, రామస్వామి, శ్రీనివాస్, రాజిరెడ్డి, లింగారెడ్డి, పాల్గొన్నారు. చిట్యాల(భూపాలపల్లి) : రైతు భరోసా యాత్రలో భాగంగా మండలంలోని నవాబుపేటకు వచ్చిన గండ్ర వెంకటరమణారెడ్డికి మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈసందర్భంగా ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. కాంగ్రెస్ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు గండ్ర జ్యోతి, మండల అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు గొర్రెసాగర్, పర్లపల్లి భద్రయ్య, ఆరెపల్లి సమ్మయ్య, కాల్వ సమ్మిరెడ్డి, పెరుమాండ్ల రవీందర్, కొక్కుల రాజు, సారంగం, ఓదెలు, ప్రభాకర్, దామెర రాజు, దేవేందర్‌రెడ్డి, ఉపేందర్,పాండ్రాల స్వామి, తౌటం సుదర్శన్, లాండె సాంబశివరావు పాల్గొన్నారు. -
కేసీఆర్ వైఫల్యంతోనే రైతుల ఆత్మహత్యలు
భూపాలపల్లి/మొగుళ్లపల్లి : రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వైఫల్యాల మూలంగానే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా చైతన్య బస్సుయాత్ర మంగళవారం రాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చేరుకుంది. పెద్దపల్లి జిల్లా మంథని నుంచి జిల్లాలోని కాటారం, భూపాలపల్లి, రేగొండ, చిట్యాల మీదుగా యాత్ర మొగుళ్ళపల్లికి చేరింది. మొగుళ్లపల్లిలో పీసీసీ అధికార ప్రతినిధి గండ్ర వెంకటరమణారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తిరుమలగిరి గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రఘుపతి కుటుంబాన్ని చూస్తే తనకు చాలా బాధ కలిగిందన్నారు. గత ఏడాది మిర్చి, ఈ ఏడాది పత్తి వేయగా గిట్టుబాటు ధర లేక అప్పుల పాలయ్యామని మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారన్నారు. 24 గంటల కరెంటుతో బోర్లలో నీరు అడుగంటి పంటలు ఎండుతున్నాయన్నారు. కాంగ్రెస్ కట్టించిన ఇందిరమ్మ ఇళ్లు అగ్గిపెట్టేల్లా ఉన్నాయని, తాను డబుల్ బెడ్రూం కట్టిస్తానని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా తాను పర్యటించిన జిల్లాల్లో ఒక్క డబుల్‌బెడ్ రూం ఇల్లు కూడా కనిపించలేదన్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగను సీఎం కేసీఆర్ చంపించేందుకు కుట్ర పన్నుతున్నాడని ఆరోపించారు. అతడికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచిందన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ చేసిన పాపాలు అన్నీఇన్ని కావని, అవి యాసిడ్ పోసి కడిగినా పోవన్నారు. స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి పాలాభిషేకాలు చేసినా, గోలీలాడినా వచ్చే ఎన్నికల్లో గెలవడన్నారు. అనంతరం ప్రతిపక్ష నేత జానారెడ్డి మాట్లాడుతూ.. బంగారు తెలంగాణను నాలుగేళ్ల కాలంలో టీఆర్ఎస్ భ్రష్టు పట్టించిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. పీసీసీ అధికార ప్రతినిధి గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనన్నారు. ఇందుకు సీఎం కేసీఆర్‌ను మొదటి నిందితుడిగా, రెండో నిందితుడిగా వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మూడో నిందితుడిగా మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్‌రావుపై పోలీసులు కేసు నమోదు చేయాలన్నారు. లేదంటే ఆత్మహత్య చేసుకున్న రైతుల ఆత్మలకు శాంతి చేకూరదన్నారు. నియోజకవర్గంలోని పంటలు ఎండుతున్నాయని, ఐదు రోజులు దేవాదుల నీటిని వదిలి చెరువులను నింపాలని తాను కోరితే శాసనసభాపతి మధుసూదనాచారి పట్టించుకోలేదన్నారు. తాను నియోజకవర్గంలో చేపడుతున్న పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, వారి సహకారంతో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పతనం చేసేందుకు పోరాడుతానన్నారు. గణేషుడికి చేసినట్లుగానే పాలాభిషేకం చేసి, చివరికి నిమజ్జనం చేయడం ఖాయమన్నారు. ఆయా కార్యక్రమాల్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, కాంగ్రెస్ పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకులు ఎస్.జైపాల్‌రెడ్డి, , డీకే అరుణ, మల్లు రవి, దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు, గండ్ర జ్యోతి, పొదెం వీరయ్య, సీతక్క, దొమ్మాటి సాంబయ్య, వేం నరేందర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, ఆరెపెల్లి మోహన్, జనక్‌ప్రసాద్, విజయరామారావు, కొమురయ్య పాల్గొన్నారు. -
అన్నదాతల ఆత్మహత్యలపై చోద్యం
గజ్వేల్ రూరల్: దేశంలో నాలుగేళ్లలో 40 వేల మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయని సీపీఎం నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని మార్చి 24న ప్రారంభమైన బస్సుయాత్ర మంగళవారం రాత్రి సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో నిరుద్యోగ సమస్య, మహిళలు, ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు గోపాల్, ఆశయ్య, స్కైలాబ్ బాబు, సీపీఎం జిల్లా కార్యదర్శి ఆముదాల వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కలర్‌ఫుల్..కంచె
సిద్దిపేట : రైతులు అడవి జంతువుల నుంచి కాపాడుకోవడానికి వినూత్నంగా ఆలోచిస్తున్నారు. సిద్దిపేటరూరల్ మండలంలోని లక్ష్మిదేవిపల్లి, చింతమడకలో ఇలా రంగు రంగు చీరలను పంట చుట్టూ కడుతున్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా పాత చీరలను కొనుగోలు చేస్తున్నారు. ఇలా చీరలు కట్టడం వల్ల అడవి జంతువులు భయపడి చేనులోకి రావట్లేదని రైతులు ఆనందంగా చెబుతున్నారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
రేగొండ(భూపాలపల్లి): అప్పుల బాధ భరించలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరిలో ఈ సంఘటన జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. తిరుమలగిరికి చెందిన రైతు గంటా రఘుపతి(45)కి మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. గత రెండేళ్లుగా మరో రెండు ఎకరాలను కౌలుకు తీసుకుని పత్తి, మిరప, మొక్కజొన్న పంటను సాగు చేస్తున్నాడు. అయితే సకాలంలో వర్షాలు కురవక, తెగుళ్లబారినపడి పత్తి, మిరప, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. ఇప్పటికే పెట్టుబడుల కోసం రూ.10 లక్షల మేర అప్పులయ్యాయి. ఆశించిన ఆదాయం రాకపోవడంతో అప్పులు ఎలా తీర్చాలని మనోవేదనకు గురైన రఘుపతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. గుండెపోటుతో రైతు మృతి ఎల్లారెడ్డిపేట (సిరిసిల్ల): రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగొల్లపల్లి గ్రామానికి చెందిన దళిత రైతు అందె సత్తయ్య(55) గుండెపోటుతో మృతి చెందాడు. పంటలు సరిగా పండకపోవడం, గల్ఫ్‌లో పనులు లభించక కుమారుడు ఇంటికి తిరిగిరావడం, ఇటీవల ఇద్దరు కూతుళ్ల వివాహం చేయడంతో రూ.5 లక్షల వరకు అప్పు అయింది. అప్పు తీర్చేదారిలేకపోవడంతో కొద్దిరోజులుగా మనస్తాపంతో ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆదివారం గుండెపోటుకు గురై మృతి చెందాడు. -
పురుగుల మందే పెరుగన్నమాయె..
గొల్లపల్లి(ధర్మపురి) : వ్యవసాయమే తన కుటుంబానికి జీవనాధారం. తనకున్న నాలుగెకరాలు సాగుచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇద్దరు బిడ్డలను ఇంటర్ వరకు చదివించి వివాహాలు చేశాడు. కొడుకును డిగ్రీ చదివిస్తున్నాడు. కొన్నేళ్లుగా కాలం కరుణించకపోవడంతో అనుకున్న స్థాయిలో పంట చేతికందడం లేదు. అయినా భగీరథ ప్రయత్నం చేశాడు. అప్పుచేసి బావిలో పూడిక తీయించాడు. ఈ సారిసాగు చేసిన పంట కూడా ఎండిపోయింది. అప్పు తీర్చేదారి కనిపించక తన వ్యవసాయ పొలం వద్దనే క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం బొంకూర్ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కనపర్తి కమలాకర్‌రావు (48)కు భార్య విజయ, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. రెండేళ్ల క్రితం కూతుళ్ల వివాహం చేశారు. కుమారుడు డిగ్రీ చదువుతున్నాడు. తనకున్న నాలుగెకరాల్లో సాగు చేస్తున్నాడు. ఈ సారి నీళ్లు తక్కువగా ఉండడంతో ఎకరంన్నరలో వరి, 30 గుంటల్లో ఆరుతడి పంటలు వేశాడు. ఎస్సారెస్పీ నీరు చివరి ఆయకట్టుకు అందకపోవడంతో పంట ఎండిపోయే స్థితికి చేరింది. దీంతో మూడున్నర లక్షలు అప్పుతెచ్చి తన వ్యవసాయబావిని 12గజాల వరకు తవ్వించాడు. ఆ నీళ్లు సరిపోకపోవడంతో వరిపొలం ఎండిపోయింది. వ్యవసాయానికి, కూతుళ్ల పెళ్లిళ్లకు చేసిన అప్పు రూ. 10లక్షలు దాటింది. వాటిని తీర్చే మార్గం కనిపించకపోవడంతో కొన్నిరోజులుగా మనస్తాపంతో ఉంటున్నాడు. శనివారం ఉదయం పొలం వద్దకు వెళ్లాడు. ఉదయం 11 అయినా ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లారు. అప్పటికే కమలాకర్ పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విగతజీవిగా పడిఉన్న కమలాకర్‌రావు మృతదేహం వద్ద కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. సీఐ లక్ష్మిబాబు, ఎస్సై శ్రీకాంత్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్నారు. ఆయన కుటుంబాన్ని మాజీ జెడ్పీచైర్మన్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పరామర్శించారు. -
ఉసురుతీసిన అప్పులు
సాక్షి, జనగామ: అన్నం పెట్టే చేతులకు జీవం లేదు.. భూమినే నమ్ముకొని జీవనం సాగిస్తున్న ఆ రైతు దంపతుల గుండె ఆగిపోయింది. సాగు కోసం చేసిన అప్పులు చివరికి వారి ప్రాణాల మీదకు తెచ్చాయి. తడిసిమోపెడైన అప్పులను తీర్చలేమని మనోవేదనకు గురై సొంత వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. జనగామ మండలం సిద్ధేంకి గ్రామానికి చెందిన ఆవుల నర్సిరెడ్డి(55), లక్ష్మి(51) దంపతులకు ఆరెకరాల వ్యవసాయ భూమి ఉంది. కూతుళ్ల పెళ్లి కోసం నాలుగెకరాల భూమిని అమ్ముకోగా ప్రస్తుతం రెండు ఎకరాల భూమిని సాగు చేస్తున్నారు. పెట్టుబడి కోసం రూ. 10 లక్షల వరకు అప్పులు చేశారు. అయితే ఆశించిన పంట దిగుబడి రాకపోవడం.. మరోవైపు అప్పులు భారంగా మారడంతో నర్సిరెడ్డి, లక్ష్మీ దంపతులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. అప్పు తీర్చే మార్గం కానరాక గురువారం పొలం వద్దకు వెళ్లి చెట్టుకు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పెద్దకుమార్తె స్వాతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మృతదేహాలను పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సందర్శించి నివాళులర్పించారు. రైతు కుటుంబానికి ప్రభుత్వం రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మృతుల కుటుంబసభ్యులను పరామర్శించి అంతిమయాత్రలో పాల్గొన్నారు. -
కౌలు రైతు ఆత్మహత్య
కూసుమంచి : మండలంలోని గట్టుసింగారం గ్రామ కౌలు రైతు బొజ్జ లచ్చయ్య(50), బుధవారం పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, కుటుంబీకులు తెలిపిన వివరాలు... ఇతడు తనకున్న కొద్దిపాటి వ్యవసాయ భూమితోపాటు మరో ఏడు ఎకరాలను కౌలుకు తీసుకుని నాలుగేళ్లుగా పంటలు సాగు చేశాడు. పంటలు సరిగ్గా పండకపోవడం, అప్పులు తీరకపోవడంతో తీవ్ర మనోవేదనలకు లోనయ్యాడు. ఈ నేపథ్యంలో, తన ఇంట్లో బుధవారం పురుగు మందు తాగాడు. కుటంబీకులు ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. అక్కడే మృతిచెందాడు. ఇతడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పొలం ఎండింది.. గుండె ఆగింది
ఇందల్వాయి/చండూరు(మునుగోడు)/సిద్దిపేట రూరల్: అప్పుల బాధలు తాళలేక ఇద్దరు రైతులు వేర్వేరు చోట్ల ఆత్మహత్య చేసుకున్నా రు. నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి మండలం లోలం గ్రామంలో పంట ఎండిపోవడంతో గుండెపోటుతో పెద్ద గంగారాం అనే రైతు మృతిచెందాడు. గంగారాం సాగు కోసం రూ.3 లక్షల వరకు అప్పులు చేశాడు. పంట ఎండిపోవడంతో మనస్తాపానికి గురై గుండె పోటుతో మృతిచెందాడు. నల్లగొండ జిల్లా చండూరు మండలం బంగారిగడ్డకు చెందిన రైతు బోయపల్లి యాదయ్య (35) పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సాగు కోసం రూ.11 లక్షల వరకు అప్పు చేశా డు. దిగుబడులు సరిగా రాకపోవడంతో మనస్తాపానికి గురై మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పొలంలో తెగి పడిన విద్యుత్ వైర్లు కాలికి తగలడంతో ఓ రైతు మృతిచెందిన ఘటన సిద్దిపేట అర్బన్ మండలంలోని తడ్కపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. -
బలిపీఠంపై బడుగు రైతు
సాక్షి, హైదరాబాద్: బడుగు రైతు బలిపీఠం మీదున్నాడు. వ్యవసాయం నష్టాలు మిగిల్చి రైతులను కష్టాల పాలుచేస్తోంది. ఆశలు ఆవిరై అన్నదాతలు అసువులుబాస్తున్నారు. ఆత్మహత్య చేసుకుంటున్న రైతుల్లో అత్యధికులు బలహీనవర్గాల రైతులే. ఇది కేంద్రం జరిపిన ఓ అధ్యయనంలో తేలింది. రైతు ఆత్మహత్యలు జరిగిన రాష్ట్రాల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉందని వెల్లడించింది. తెలంగాణలో రైతు ఆత్మహత్యలపై కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ సహా అర్థగణాంకశాఖల ఆధ్వర్యంలో ఆంధ్రా యూనివర్సిటీకి చెందిన ఆగ్రో–ఎకనామిక్ రీసెర్చ్ సెంటర్ అధ్యయనం చేసింది. నివేదికను తెలంగాణ వ్యవసాయ శాఖకు అందజేసింది. సరాసరి భూమి 2.24 ఎకరాలు... 2015–16లో జరిగిన ఆత్మహత్యలపై ఆగ్రో–ఎకనామిక్ రీసెర్చ్ సెంటర్ అధ్యయనం చేసింది. పూర్వ వరంగల్ జిల్లాలో మూడో వంతు ఆత్మహత్యలు జరిగాయి. తర్వాత పూర్వ నల్లగొండ జిల్లాలో 12 శాతం, కరీంనగర్ జిల్లాలో 10 శాతం ఆత్మహత్యలు జరిగాయి. అత్యంత తక్కువగా నిజామాబాద్ జిల్లాలో 3.67 శాతం, ఆదిలాబాద్ జిల్లాలో 3.99 శాతం జరిగాయి. 2015 ఖరీఫ్‌లో కరువు కారణంగా పెద్ద ఎత్తున రైతు ఆత్మహత్యలు జరిగాయి. ఆత్మహత్యలు ప్రతి ఏడాది అధికంగా సెప్టెంబర్–డిసెంబర్ నెలల మధ్యే జరుగుతున్నాయి. ఈ కాలం ఖరీఫ్ ముగిసిన దశ, రబీ సీజన్ మొదలయ్యే దశ. ఈ సమయంలో ఖరీఫ్ పంటలు కోత దశ నుంచి మార్కెట్లోకి వచ్చి చేరుతాయి. పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో రైతులు రుణాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఆత్మహత్య చేసుకున్నవారిలో ఎక్కువ మంది బడుగు బలహీనవర్గాలకు చెందినవారే. అందులో 62 శాతం మంది నిరక్షరాస్యులే. ఆత్మహత్య చేసుకున్న రైతుల వద్ద ఉన్న సరాసరి భూమి 2.24 ఎకరాలు మాత్రమే. బోరు బావులను అధికంగా తవ్వడం వల్ల రైతులపై ఆర్థిక భారం పడింది. దానికింద సాగు చేస్తే నీరు రాక నష్టాలే మిగిలాయి. బోరు బావుల కింద సాగు చేసిన పత్తికి తీవ్ర నష్టం జరిగి రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రభుత్వ సాయం అవసరం ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలు సాగునీటి వనరులు కల్పించాలని, పాడిరంగాన్ని అభివృద్ధి చేయాలని, తక్కువ వడ్డీకి పెట్టుబడి ఖర్చులు ఇవ్వాలని, సాగు ఖర్చు తగ్గించేలా ప్రభుత్వమే ఉచితంగా బోరుబావులు తవ్వించాలని కోరుతున్నారని అధ్యయన నివేదిక తెలిపింది. దాంతోపాటు అధ్యయన బృందం కూడా పలు సూచనలు చేసింది. పత్తి కొనుగోలుకు గ్రామాల వారీగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. వ్యవస్థీకృత రుణ పద్ధతికి అవకాశం కల్పించాలి. వ్యవసాయ, వ్యవసాయేతర ఉపాధి అవకాశాలు కల్పించేందుకు డెవలప్మెంట్ సెల్‌ను ఏర్పాటు చేయాలి. గ్రామస్థాయిలో స్వచ్ఛంద సంస్థలతో కౌన్సెలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించింది. సాగునీటి వసతి... పాడి అభివృద్ధి పంటలు నష్టపోవడం, సరైన ధర రాకపోవడం తదితర కారణాలతో రైతులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. పేదరికం కూడా ఆత్మహత్యలకు దారితీస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు, కరువు పరిస్థితులు కూడా రైతును కుదేలు చేశాయి. కుటుంబ సమస్యలు, మద్యానికి బానిసగా మారడం 22 శాతం ఆత్మహత్యలకు కారణంగా ఉన్నాయి. వడ్డీ వ్యాపారుల ఒత్తిళ్ల వల్ల కూడా అనేకమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. సన్న, చిన్నకారు రైతులు ప్రధానంగా వడ్డీ వ్యాపారుల వద్ద 89 శాతం అప్పులు చేశారు. 11 శాతం బ్యాంకుల్లో తీసుకున్నారు. ఒక్కో రైతు సరాసరి రూ.3.63 లక్షల అప్పులు తీసుకున్నారు. బడుగు, బలహీన వర్గాల రైతుల్లో ప్రధానంగా కుటుంబం సభ్యుల్లో ఇంకెవరూ పనిచేయకపోవడం, వ్యవసాయ సంబంధ కార్యకలాపాలు నిలిచిపోవడం, పిల్లలు స్కూలు మానేయడం వంటి కారణాలతో ఆత్మహత్యలు జరిగాయని అధ్యయనంలో వెల్లడైంది. -
కోతల కాలం
ఒక రైతు కష్టపడి పనిచేసేవాడు. రోజంతా పొలంలోనే ఉండేవాడు. ఆ రైతు కష్టాన్ని ఆ పొలంలోనే గూడు కట్టుకుని ఉన్న ఒక పిచ్చుకల కుటుంబం చూస్తూ ఉండేది. కొన్నాళ్లకు రైతు కష్టం ఫలించింది. పంట కోతకొచ్చింది. ఊళ్లో మిగతా రైతులు కూడా కోతలకు సిద్ధం అయ్యారు. ‘‘ఇరుగు పొరుగును తీసుకొచ్చి రేపే నేను కూడా కోతలు మొదలు పెట్టాలి’’ అని ఆ రైతు ఎవరితోనో అంటుంటే పిల్ల పిచ్చుకలు విన్నాయి. వెంటనే వెళ్లి తల్లికి చెప్పాయి. ‘‘అమ్మా.. ఇవాళే మనం ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి. కోతలు మొదలైతే మన గూడును కూడా పడగొట్టేస్తారు’’ అన్నాయి.‘‘తొందరేం లేదు. రేపు మన రైతు కోతలు మొదలవ్వవు’’ అంది పిచ్చుకల తల్లి నమ్మకంగా. అన్నట్లే మర్నాడు కోతలు మొదలవ్వలేదు. పిచ్చుకలు ఆశ్చర్యపోయాయి.రైతు మళ్లీ.. ‘‘రేపే దగ్గరి బంధువుల్ని తీసుకొచ్చి కోతలు మొదలు పెట్టాలి’’ అని అంటుంటే విని, ఆ విషయాన్ని తల్లికొచ్చి చెప్పి, ‘‘వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోదాం’’ అన్నాయి పిచ్చుకలు. ‘‘తొందరేం లేదు. రేపు కూడా మన రైతు కోతలు మొదలవ్వవు’’ అంది తల్లి పిచ్చుక. అన్నట్లే ఆ రేపు కూడా కోతలు మొదలవ్వలేదు! పిల్ల పిచ్చుకలు మళ్లీ ఆశ్చర్యపోయాయి.ఈసారి రైతు.. ‘‘రేపు నేనే కోతలకు సిద్ధమౌతున్నాను’’ అని ఎవరితోనో అంటుంటే పిచ్చుకలు విని, తల్లికి చెప్పాయి కానీ, ‘మనం వెళ్లిపోదాం’ అని అనలేదు! అయితే ఈసారి తల్లే ఆ మాట అంది.. ‘‘మనం వెంటనే గూడును ఖాళీ చేసి వేరే చోటుకు వెళ్లిపోవాలి’’ అని! పిచ్చుకలు తల్లి వైపు ఆశ్చర్యంగా చూశాయి. ‘‘అవును. మన రైతు రేపు కోతలు మొదలు పెట్టేస్తాడు. తన కష్టాన్ని నమ్ముకున్నవాడు ఎవరి కోసమూ ఎదురు చూడడు’’ అంది పిచ్చుకల తల్లి. -
ప్రభుత్వ విధానాల వల్లే ఆత్మహత్యలు తగ్గుముఖం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వ విధానాల కారణంగానే తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని టీఆర్ఎస్ ఎంపీ బి.వినోద్‌కుమార్ పేర్కొన్నారు. 2015తో పోల్చితే 2016లో తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు 54 శాతం తగ్గాయని కేంద్ర వ్యవసాయ మంత్రి బుధవారం పార్లమెంట్లో ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ మేరకు స్పందించారు. 24 గంటల విద్యుత్‌తో పాటు నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సరఫరా రైతులకు ప్రయోజనకారిగా నిలిచాయన్నారు. ఈ ఖరీఫ్ నుంచి ఎకరాకు రూ. 8 వేల చొప్పున పెట్టుబడి సాయం, కొత్త సాగునీటి ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తాయన్నారు. దీంతో ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
పైసలివ్వనందుకు పట్టామార్చారు
సిరిసిల్ల టౌన్: ‘సారూ.. నాకు భార్య, ముగ్గురు ఆడపిల్లలు. ఊరు శివారులో 27 గుంటల భూమి ఉంది. దాన్ని ఆధారంగానే కుటుంబాన్ని సాకుతున్న.. కానీ, వీఆర్వో ఆ భూమిని వేరేవాళ్ల పేరు మీద రాసిండ్రు.. ఆయన అడిగిన పైసలు ఇయ్యలేదని గిట్ల జేసిండ్రు.. ఇగ నాకు ఆధారం ఎట్లా? గందుకోసమే పురుగుల మందు తాగుతున్న..’ అని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్‌కు చెందిన బొమ్మెన తిరుపతి సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ కృష్ణభాస్కర్ ఎదుట ఆత్మహత్యకు యత్నించాడు. అధికారు లు అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. బొమ్మెన తిరుపతి తండ్రి ఎల్లయ్యకు గ్రామ శివారులోని సర్వేనంబర్ 20లో 1.29 ఎకరాల భూమి ఉంది. దీనిని 2015 డిసెంబర్లో తన కుమారుడు తిరుపతి పేరిట రిజిస్ట్రేషన్ చేయించి, రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయించారు. దీని పట్టాదారు పాసుపుస్తకం ఆధారంగా బ్యాంకులో రుణం తీసుకున్నాడు. ఇటీవల వీఆర్వో ఒకరు 1.29 ఎకరాల్లోని 27 గుంటలను ఇతరుల పేరిట పట్టా చేశారు. తన భూమిని ఇతరులకు ఎలా పట్టా చేస్తావని బాధితుడు ఆ వీఆర్వోను నిలదీయ గా.. అవతలి పార్టీ వారు రూ.30 వేలు ఇచ్చారని, నువ్వు రూ.50 వేలు ఇస్తే.. పట్టా నీ పేరిట చేస్తానన్నాడు.దీంతో మనస్తాపానికి గురైన తిరుపతి కుటుంబ సభ్యులతో కలసి సోమవారం జిల్లాకేంద్రంలో నిర్వహించే ప్రజావాణికి హాజరయ్యాడు. తన భూమిని ఇతరుల పేరిట పట్టా చేసి, లంచం అడుగుతున్న వీఆర్వోపై చర్య తీసుకోవాలని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. వెంటనే తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగేందుకు యత్నించగా కలెక్టర్ కృష్ణభాస్కర్, ఆర్డీవో పాండురంగ అడ్డుకున్నారు. ఘటనపై విచారణ జరిపించి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం తగు చర్యలు తీసుకోవాలని ఆర్డీవో పాండురంగను కలెక్టర్ ఆదేశించారు. -
బీసీ డిక్లరేషన్ ఏమైంది?: ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 4 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లేదు. బీసీ డిక్లరేషన్ ఏమైందని ప్రశ్నించారు. బడ్జెట్‌పై ఆయన స్పందిస్తూ.. ‘215 డిమాండ్లు ప్రభుత్వం ముందు పెట్టాం. ఒక్కటీ పట్టించుకోలేదు. ఎంబీసీకి ఇచ్చిన రూ.వెయ్యి కోట్లలో రూపాయి ఖర్చు పెట్టలేదు. బీసీ కార్పొరేషన్ రూ.10 వేల కోట్లు, బీసీ డిక్లరేషన్ చేసి రూ.20 వేల కోట్లు ఇవ్వాలి’ అని అన్నారు. బీసీలకు ఒక్క కొత్త పథకమూ లేదు: జాజుల సాక్షి, హైదరాబాద్: బడ్జెట్లో బీసీలకు కేటాయింపులు అంతంతే అని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. ‘బీసీల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని తూతూమంత్రంగా కేటాయింపులు చేశారు. సబ్ ప్లాన్ తీసుకొస్తామన్నారు. కానీ బడ్జెట్లో ఆ ఊసే ఎత్తలేదు. బీసీ కార్పొరేషన్లకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఈ విద్యా సంవత్సరం 119 బీసీ గురుకులాలు ఏర్పాటు చేస్తామన్నారు. కానీ నిధులు కేటాయించలేదు. బడ్జెట్లో బీసీలకు ఒక్క కొత్త పథకమూ లేదు. ఇప్పటికైనా సీఎం స్పందించి బీసీలకు నిధులు రూ.5,920 కోట్ల నుంచి రూ.10 వేల కోట్లకు పెంచాలి’ అని అన్నారు. -
కొడుకు పరీక్ష కోసం ఓ తండ్రి ఏం చేశాడంటే..?
కోల్‌కతా : ప్రతీ తల్లిదండ్రులు తమ పిల్లలు బాగా చదువుకొని ప్రయోజకులు కావాలని ఆశిస్తారు. అందుకోసం వారి జీవితాలను కూడా త్యాగం చేసేందుకు సిద్ధమవుతారు. మరికొందరు తాము పొందలేని అవకాశాలు పిల్లలకు కల్పించి వారి భవిషత్తులో ఆనందాన్ని వెతుక్కుంటారు. అలాంటి కోవకు చెందిన వారే.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన రజబ్ అలీ. ఆయన కథేంటో ఓసారి చూద్దాం. పశ్చిమ బెంగాల్‌లోని ముషీరాబాద్‌కు చెందిన అలీ పేదరైతు. వంశపారంపర్యంగా వచ్చిన భూమి తప్ప తనవద్ద ఇంకేమీ లేదు. చిన్ననాటి నుంచి అతనికి డాక్టర్ కావాలనే కోరిక ఉండేది. కానీ ఆరుగురు పిల్లలు ఉండటంతో కుటుంబ పోషణ తండ్రికి భారమైంది. అందుకే మూడో తరగతిలోనే డ్రాపౌట్‌గా మిగిలిపోవాల్సి వచ్చింది. అలా పదేళ్ల వయస్సుకే పొలం పనులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారి కుటుంబంలో ఇంతవరకు ఎవరూ కూడా పదో తరగతి వరకు చదివిన దాఖలాలు లేవు. అందుకే కొడుకు ద్వారా ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలని అలీ కోరుకుంటున్నాడు. పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న తన కొడుకు షమీమ్ షేక్‌ను దీవించాలంటూ ఏకంగా 700 మందికి విందు ఏర్పాటు చేశాడు. తమ కుటుంబంలో పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న మొదటి వ్యక్తి కనుక తాహతుకు మించిన ఈ పనికి సిద్దపడ్డానని తెలిపాడు. కొన్నాళ్ల కిందట ‘నాకు తారసపడిన కొందరు వ్యక్తులు.. గ్రామస్తుల దీవెనలుంటే మీ కొడుకు తప్పక ఉత్తీర్ణుడవుతాడని చెప్పారు. అందుకే సంవత్సర కాలంగా ఈ విందు కోసం డబ్బు పొదుపు చేస్తున్నా’ని తెలిపాడు. అంతేకాకుండా ఒక అడుగు ముందుకేసి ఆహ్వాన పత్రిక కూడా అచ్చువేయించి అందరికీ పంచాడు. అతిథులను ఆనందపరిచేందుకు తన స్థోమతకు తగ్గట్టుగా చికెన్, పప్పు, కూరగాయలు, స్వీట్లతో విందు ఏర్పాటు చేశాడు. ఆ అతిథులు కూడా పెన్నులు, పెన్సిళ్లు, పుస్తకాలను షమీమ్‌కు కానుకలుగా ఇచ్చారు. కానీ వారిచ్చిన బహుమతుల కన్నా వారి దీవెనలే మహాభాగ్యమని మురిసిపోతున్నాడు అలీ. తన కొడుకు పరీక్షలో ఉత్తీర్ణుడైతే ఊరంతా స్వీట్లు పంచుతానని చెబుతున్న అలీ వంటి తండ్రిని తామెక్కడా చూడలేదని స్థానిక స్కూల్ టీచర్ సుశాంత చౌదరీతో పాటు గ్రామస్తులంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
చంద్రబాబును కోర్టుకీడుస్తా..
నక్కపల్లి (పాయకరావుపేట): ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పూర్తిగా రుణమాఫీ చేయకుంటే న్యాయ పోరాటం చేస్తానని పాయకరావుపేటకు చెందిన రైతు చిట్టూరి గోపీమఠాల్ పేర్కొన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రెండు రోజుల క్రితం నక్కపల్లికి చెందిన ఒక బ్యాంకు వారు తనకు ఫోన్ చేసి వ్యవసాయ రుణం పూర్తిగా మాఫీ కాలేదని, తక్షణం బకాయి చెల్లించకుంటే భూములను వేలం వేస్తామని హెచ్చరించారని చెప్పారు. రైతు రుణాలన్నీ మాఫీ చేస్తానని అప్పట్లో చంద్రబాబునాయుడు ప్రకటించడం వల్లే రుణబకాయిలు చెల్లించలేదన్నారు. తాను ఆ బ్యాంకులో రూ.50 వేలు రుణం తీసుకున్నానన్నారు. చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు విడుదల చేసిన రుణవాయిదాలు వడ్డీకి సరిపోయాయన్నారు. మూడో విడత రుణమాఫీ సొమ్ము ఇంకా జమ కాలేదన్నారు. అసలు అలాగే ఉండిపోయిందన్నారు. చంద్రబాబు హామీ వల్లే రైతులంతా అసలు, వడ్డీ చెల్లించడం మానేశారన్నారు. మాఫీ ఆశతో రైతులంతా చంద్రబాబుకు ఓట్లేసి గెలిపిస్తే ఇప్పుడు మోసం చేసి చేతులెత్తేశారన్నారు. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకపోతే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలంటూ కోర్టును ఆశ్రయిస్తానన్నారు. రుణమాఫీ చేయకపోవడం నమ్మక ద్రోహమేనని, దీనిని న్యాయస్థానంలో సవాల్ చేస్తానన్నారు. బీజేపీ, టీడీపీల మధ్య భేదాభిప్రాయాలు వచ్చి మంత్రుల రాజీనా మాల తర్వాత బ్యాంకర్ల నుంచి ఒత్తిడి ఎక్కువవుతోందన్నారు. -
ఇది ‘వంగపండు’ వరి?
తూర్పుగోదావరి జిల్లా మండల కేంద్రమైన కొత్తపల్లిలో ఓ రైతు పొలంలో వరి వంగపండు రంగులో పండి అబ్బు రపరుస్తోంది. ఈ వరి ఏ రకానికి చెందిందో తెలుసుకునేందుకు వ్యవసాయ శాఖ అధికారులు శాంపిల్స్ సేకరించారు. కొత్తపల్లికి చెందిన గణేశుల వీరవెంకట సత్యనారాయణ అనే రైతు.. పొలంలో వరి విత్తనాలను నాటాడు. కలుపు తీసే సమయంలో కొన్ని వరి దుబ్బులు వంగపండు రంగులో ఉండటంతో అలాగే వదిలేశాడు. పంట కోత కోసేట ప్పుడు మాత్రం వేర్వేరుగా నూర్చాడు. వంగపండు రంగులో వరిని నూర్పి చూడగా బియ్యం ఎరుపు రంగులో ఉన్నాయి. వరి విత్తనాలలో కొత్త వంగడం ఏదైనా కలసి ఉంటుందని అధికారులు చెప్పారు. –పిఠాపురం -
మహారాష్ట్రలో రోడ్డెక్కిన రైతన్నలు
-
ఎందుకు ‘మహా’ రైతులు కన్నెర్ర చేస్తున్నారు?
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో రైతన్నలు రోడ్డెక్కారు. నాసిక్ నుంచి ముంబై వరకు లాంగ్ మార్చ్ నిర్వహిస్తున్నారు. ఈనెల 12న ముంబైలో అసెంబ్లీ ముట్టడికి సన్నాహాలు చేస్తున్నారు. అన్నదాతల ఆక్రందనలకు కారణాలేంటి ? ఎందుకు రైతులు ఫడ్నవీస్ సర్కార్‌పై కన్నెర్ర చేస్తున్నారు ? ఏమిటీ మార్చ్ భారతీయ కిసాన్ సభ ఆధ్వర్యంలో 30 వేల మంది రైతులతో మార్చి 6న నాసిక్‌లో మహా పాదయాత్ర మొదలైంది. మొత్తం 180 కిలోమీటర్లు సాగే ఈ యాత్ర ఆదివారం ముంబై చేరుకుంటుంది. 12న జరగనున్న అసెంబ్లీ ముట్టడిలో 70 వేల మందివరకు రైతులు పాల్గొంటారని అంచనాలున్నాయి. ముంబై ఆగ్రా జాతీయరహదారి మీదుగా ఈ లాంగ్ మార్చ్ కొనసాగుతోంది. వేలాది మంది రైతులు రోడ్లపైనే తింటున్నారు.. ఎక్కడ కాస్త జాగా కనిపిస్తే అక్కడే నిద్రపోతున్నారు. తమ డిమాండ్లు తీర్చాలంటూ నినదిస్తున్నారు. ఈ మహా పాదయాత్రలో మహిళా రైతులు, 90 ఏళ్ల పై బడిన వృద్ధులు కూడా ఉన్నారు. ఎందుకీ పాదయాత్ర ఈ ఏడాది అకాల వర్షాలు రైతన్నలను నిండా ముంచేశాయి. వడగండ్ల వానలు కడగండ్లను మిగిల్చాయి. పింక్ బాల్ వార్మ్ పత్తి రైతుల్ని పీల్చిపిప్పి చేసింది. ఫిబ్రవరిలో కురిసిన వడగళ్లవానలకు లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. మొత్తం 19 జిల్లాల్లో రబీ పంట తుడిచిపెట్టుకుపోయింది. అమరావతి, మరఠ్వాడ, నాగపూర్, నాసిక్ ప్రాంతాల్లో రైతులు దారుణంగా నష్టపోయారు. ఇక మహారాష్ట్రలో గత ఏడాది 84 శాతం వ్యవసాయ భూముల్లో పత్తి పంట సాగు చేశారు. అయితే ఈ పంటకు సోకిన పింక్ బాల్ వార్మ్ కారణంగారైతులు తీవ్రంగా నష్టపోయారు. అప్పుల్లో కూరుకుపోయారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు చూస్తూ ఉంది.. గత ఏడాది మహారాష్ట్ర సర్కార్ 34 వేల కోట్ల రైతు రుణాల మాఫీకి హామీ ఇచ్చింది. కానీ అమలు సరిగా జరగలేదు. దీంతో అన్నదాతల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తమ సమస్యల తీరేవరకు పోరాటాన్ని కొనసాగిస్తామని అన్నదాతలు హెచ్చరిస్తున్నారు. రైతులు చేస్తున్న డిమాండ్లు ఏంటి ? ఫడ్నవీస్ సర్కార్ ఇచ్చిన మాట నిలబెట్టుకొని రైతు రుణాలన్నీ మాఫీ చేయాలి. విద్యుత్ బిల్లుల్ని రద్దు చేయాలి. స్వామినాథన్ కమిటీ సిఫారసులన్నీ అమలు చేయాలి కనీస మద్దతు ధరతో రైతులకు ఒదిగేదేమీ లేదు. చట్టబద్ధమైన ధరను కల్పించాలి. అకాల వర్షాలు, పింక్ బాల్ వార్మ్ కారణంగా పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం పెంచాలి. బుల్లెట్ రైళ్లు, సూపర్‌హైవేలు వంటి అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో పంటభూముల్ని బలవంతంగా స్వాధీనం చేసుకోవడాన్ని నిలిపివేయాలి. ఆదివాసీలకు అటవీ భూములపై యాజమాన్య హక్కులు కల్పించాలి. నాసిక్, థానే, పాల్ఘడ్ ప్రాంతాలను కలుపుతూ ప్రతిపాదించిన నదుల అనుసంధానం ప్రాజెక్టు కారణంగా ఎన్నో ఆదివాసీ గ్రామాలు నష్టపోతాయి.. అందుకే ఆ రూట్ మ్యాప్‌ను మార్చాలి. ఆగని అన్నదాతల ఆత్మహత్యలు రైతు సమస్యల పరిష్కారానికి గత ఏడాది ప్రభుత్వం రుణ మాఫీని ప్రకటించినా ఎలాంటి ప్రయోజనం కనిపించలేదు. క్షేత్రస్థాయిలో దీని అమలు జరగలేదు. దీంతో అన్నదాతల ఆత్మహత్యలు ఆగలేదు. గత ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు 1753 మంది రైతన్నలు బలవన్మరణానికి పాల్పడ్డారు. విదర్భ, మరఠ్వాడ, నాసిక్ ప్రాంతాల్లో ఎక్కువ మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. చేసేదంతా చేస్తున్నాం: సర్కార్ మరోవైపు మహారాష్ట్ర సర్కార్ రైతులకు చేయాల్సినదంతా చేస్తున్నామని చెబుతోంది. 35 లక్షల 68 వేల మంది రైతులకు లబ్ధి చేకూరేలా రుణమాఫీ పథకం కింద ఇప్పటివరకు 13, 782 కోట్లు నిధులు విడుదల చేశామని చెబుతోంది. అంతేకాదు ఈ ఏడాది బడ్జెట్లో వ్యవసాయ రంగానికే అత్యంత ప్రాధాన్యతనిస్తూ 15వేల కోట్ల రూపాయలను కేటాయించారు. రైతు సమస్యల పరిష్కారానికి కేంద్రం నుంచి 2,400 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని కూడా ప్రభుత్వం కోరింది. . అయితే ఇప్పటివరకు కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందలేదు. -(సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
‘మహా’ మార్చ్
ముంబై: చరిత్రలో రైతు ఉద్యమాలు ఎన్నో చూశాం. కానీ రికార్డు స్థాయిలో వేలాది మంది అన్నదాతలు 180 కి.మీ మేర పాదయాత్ర చేపట్టడం బహుశా ఇదే తొలిసారేమో! ఇప్పుడు మహారాష్ట్రలో జరుగుతోంది ఇదే. రుణ మాఫీ అమలు సహా ఇతర సమస్యలు పరిష్కరించాలని సుమారు 30 వేల మంది రైతులు మార్చి 6న నాసిక్ నుంచి ముంబైకి మహా యాత్రగా బయల్దేరారు. మార్గ మధ్యలో వారికి థానె, పాల్ఘడ్ తదితర జిల్లాల రైతులు జతకలిశారు. 12న ర్యాలీ ముంబై చేరుకునే సరికి రైతుల సంఖ్య 70 వేలకు పెరగొచ్చు. అదే రోజు రాష్ట్ర అసెంబ్లీని ముట్టడించే వీలుంది. భారతీయ కిసాన్ సభ ఈ పోరాటానికి నేతృత్వం వహిస్తోంది. ముంబై–ఆగ్రా జాతీయ రహదారి మీదుగా మార్చ్ కొనసాగుతోంది. రైతులు భోజనాలు, నిద్ర లాంటి అవసరాలను రోడ్లపైనే తీర్చుకుంటున్నారు. ఈ మహా పాదయాత్రలో మహిళా రైతులు, 90 ఏళ్లకు పై బడిన వృద్ధులు కూడా ఉన్నారు. అసంతృప్తిని రగిల్చిన పంట నష్టం.. ఈ ఏడాది అకాల వర్షాలు రైతన్నలను నిండా ముంచాయి. పింక్ బాల్ వార్మ్ చీడ పత్తి పంటను దెబ్బతీసింది. ఫిబ్రవరిలో కురిసిన వడగళ్ల వానలకు లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. 19 జిల్లాల్లో రబీ పంట తుడిచిపెట్టుకుపోయింది. ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు చూస్తూ ఉంది. గత ఏడాది మహారాష్ట్ర సర్కార్ రూ. 34 వేల కోట్ల రుణాల మాఫీకి హామీ ఇచ్చినా అది క్షేత్రస్థాయిలో సరిగా అమలు కాలేదు. దీంతో అన్నదాతల్లో అసంతృప్తి కట్టలు తెంచుకుని ఉద్యమానికి దారి తీసింది. ఆగని ఆత్మహత్యలు.. రుణ మాఫీ పథకం అమలులో ప్రభుత్వం వైఫల్యం చెందడం వల్ల రైతుల ఆత్మహత్యలు ఆగలేదు. గత ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు 1753 మంది రైతన్నలు బలవన్మరణానికి పాల్పడ్డారు. విదర్భ, మరఠ్వాడ, నాసిక్ ప్రాంతాల్లో ఎక్కువ మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మరోవైపు, రైతులకు చేయాల్సినదంతా చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. 35 లక్షల 68 వేల మంది రైతులకు లబ్ధి చేకూరేలా రుణమాఫీ పథకం కింద ఇప్పటివరకు రూ. 13, 782 కోట్లు విడుదల చేశామని తెలిపింది. రైతు సమస్యల పరిష్కారానికి రూ. 2,400 కోట్ల ఆర్థిక సాయం కోరగా కేంద్రం నుంచి స్పందన రాలేదు. రైతుల డిమాండ్లు ఇవీ.. ► ఫడ్నవీస్ సర్కార్ ఇచ్చిన మాట నిలబెట్టుకొని రైతు రుణాలన్నీ మాఫీ చేయాలి ► విద్యుత్ బిల్లుల్ని రద్దు చేయాలి ళీ స్వామినాథన్ కమిటీ సిఫారసులన్నీ అమలు చేయాలి ► కనీస మద్దతు ధరతో రైతులకు ఒరిగేదేమీ లేదు. చట్టబద్ధమైన ధరను కల్పించాలి. ► అకాల వర్షాలు, పింక్ బాల్ వార్మ్ కారణంగా పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం పెంచాలి ► బుల్లెట్ రైళ్లు, సూపర్‌హైవేలు వంటి అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో పంటభూముల్ని బలవంతంగా స్వాధీనం చేసుకోవడాన్ని నిలిపివేయాలి. -
ఆమెను వ్యభిచారి అన్నారు.. కేసు పెట్టాం
-
ఆమెను వ్యభిచారి అన్నారు.. కేసు పెట్టాం
సాక్షి, చెన్నై : బీజేపీకి చెందిన మహిళా నేత ఒకరు ఆలయంలో అనుచితంగా ప్రవర్తించారు. కరపత్రాలను పంచుతున్న కొంతమంది రైతులపైనా, వారి నాయకుడిపైనా చెప్పుతో దాడికి పాల్పడ్డారు. ఈ దృశ్యాలు కెమెరా కంటికి చిక్కారు. పైగా ఆమె దాడి చేయడమే కాకుండా తనకు ఇబ్బంది కలిగించిన వారిపై కేసులు నమోదు చేయాలంటూ చిర్రుబుర్రులాడారు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలోగల ఆలయానికి నెళ్లయమ్మాల్ అనే ఆ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు వచ్చారు. అదే సమయంలో కొంతమంది రైతుల అసోసియేషన్ అదే ఆలయంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కరపత్రాలు పంచుతున్నారు. జన్యుపరమైన మార్పులు చేసే వ్యవసాయాన్ని కేంద్రం ఆధరించడంపై వారు నిరసన వ్యక్తం చేస్తూ కరపత్రాలు ఇస్తున్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న నెళ్లయమ్మాల్ వారితో వాగ్వాదానికి దిగారు. వారిపై దుర్భాషలాడారు. ఆ రైతులంతా కూడా పెద్ద వయసులో ఉన్నారని కూడా చూడకుండా తన చెప్పును తీసుకొని వారిపై దాడికి పాల్పడ్డారు. అంతేకాదు.. మున్ముందు భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటావని కూడా ఆమె ఆ రైతు నాయకుడిని బెదిరించారు. అయితే, ఆ రైతులపై కేసులు నమోదు చేసినట్లు బీజేపీ రాష్ట్ర విభాగం చెప్పింది. రైతుల అసోసియేషన్ అధ్యక్షుడు అయ్యకన్ను ఆమెను వ్యభిచారి అంటూ దుర్భాషలాడారని, అందుకే అక్కడ పరిణామాలు చోటు కేసుకున్నాయని, దర్యాప్తు చేయాలని పోలీసులను కోరినట్లు వెల్లడించింది. -
రైతుల్ని ముంచిన నకిలీ విత్తనాలు
మల్దకల్ (గద్వాల): జోగుళాంబ గద్వాల జిల్లాలోని మల్దకల్ మండలానికి ర్యాలంపాడు రిజర్వాయర్ నుంచి చెరువులు, కుంటలకు నీరు సరఫరా అవుతోంది. దీంతో తాటికుంట, నాగర్‌దొడ్డి రిజర్వాయర్లతోపాటు గ్రామాల్లో ఉన్న చెరువులు, కుంటలు, వ్యవసాయ బోరు బావుల వద్ద రైతులు రబీలోనూ వరి పంటలు వేల ఎకరాల్లో సాగు చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన వరి పంటకు కాపు వచ్చినా గింజ పట్టక తాలు రావడంతో పంటలు సాగు చేసిన రైతులు నట్టేట మునిగిపోయామంటూ లబోదిబోమంటున్నారు. మండలంలోని ఉలిగేపల్లికి చెందిన రైతులు దాదాపు వెయ్యి ఎకరాల్లో తులసి, ధనలక్ష్మి, వినాయక, ఓంకార్, టాటా, ధర్మరాజ్ పల్లి కంపెనీకి చెందిన ఆర్ఎన్ఆర్ 15048 రకం వరి విత్తనాలతో నాటు వేశారు. 25 కిలోల వరి విత్తనాల ప్యాకెట్ రూ.850 నుంచి రూ.900 వరకు వెచ్చించి గద్వాల, రాయచూరు పట్టణ ప్రాంతాల్లోని డీలర్ల వద్ద కొనుగోలు చేశారు. పంట సాగు కోసం ఎకరాకు రూ.30 వేల వరకు పెట్టుబడులు పెట్టినా ఆశించిన మేరకు వరి పంట రాకపోవడంతోపాటు, వరి గింజలు పట్టక తాలుపోయింది. దీంతో వరి పంటలు సాగు చేసిన రైతులు చిన్న సవారన్న, తిమ్మారెడ్డి, తిమ్మప్ప, జైపాల్, లక్ష్మన్న, రాములతోపాటు మరో 80 మందికి పైగా రైతులు కంపెనీలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని బాధిత రైతులు మండల వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో మండల వ్యవసాయాధికారిణి శ్రీలత బుధవారం గ్రామానికి వెళ్లి వరి పంటలను పరిశీలించారు. పంటకాలం పూర్తికావస్తున్నా గింజలు పట్టకుండా తాలుపోవడంతో తమ పరిస్థితి ఏమిటని రై తులు ప్రశ్నించారు. వరి నాటు పెట్టి ఐదు నెలలు కావొస్తుందని, గింజలు పట్టక మొత్తం తాలు గింజలు పట్టినట్లు రైతులకు ఆవేదన వ్యక్తం చేశారు. నిరక్షరాస్యులైన తమకు కంపెనీలు నకిలీ వరి విత్తనాలను అంటగట్టారని, వరి పంటలకు కంపెనీలే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులకు వివరిస్తాం.. ఈ సందర్భంగా ఏఓ మాట్లాడుతూ గ్రామంలో రైతులు సాగుచేసిన వరి పంటలను పరిశీలించామని, వరికి ఇంత వరకు గింజ పట్టక తాలుపోయిందన్నారు. ఈ విషయమై శాస్త్రవేత్తలకు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులకు తెలియజేస్తామన్నారు. ఇదిలా ఉండగా గతంలో కూడా మల్దకల్ మండలంలోని బిజ్వారం, కుర్తిరావుల్‌చెర్వు గ్రామాల రైతులకు నకిలీ మిరప విత్తనాలు అంటగట్టడంతో రైతులు తీవ్రం గా నష్టపోయారు. దీనిపై అప్పట్లో రైతులు కలెక్టర్ రజత్‌కుమార్‌సైనికి ఫిర్యాదు చేయగా, కంపెనీ అధికారులు పంట పొలాలను పరిశీలించినా ఫలితం లేకపోవడంతో నకిలీ మిరప పంటలను రైతులు స్వచ్ఛందంగా తొలగించారు. ప్రస్తుతం నష్టపోయిన రైతులకైనా నష్టపరిహారం కంపెనీ నిర్వాహకులు చెల్లిస్తుందో.. లేదో వేచి చూడాల్సిందే. పంటలను పరిశీలిస్తాం : డీఏఓ ఈ విషయమై జిల్లా వ్యవసాయాధికారి గోవింద్‌నాయక్ స్పందిస్తూ ఉలిగేపల్లి రైతులతోపాటు కేటీదొడ్డి, గట్టు మండలాలకు చెందిన రైతులు కూడా ఫిర్యాదు చేశారన్నారు. వారి ఫిర్యాదు మేరకు బుధవారం శాస్త్రవేత్తలతో మాట్లాడి వారికి లేఖ రాశామన్నారు. వారు పంటలను పరిశీలించిన అనం తరం ఏ విషయమనేది తెలుస్తుందని ఆయన చెప్పారు. -
విత్తన కేటుగాళ్లు వస్తున్నారు..!
సాక్షి,ఆదిలాబాద్: జిల్లాలో ప్రతి యేడాది నకిలీ విత్తనాల బారినపడి వేలాది మంది రైతులు మోసపోతున్నారు. ఆర్థికంగా చితికిపోతున్నారు. కంపెనీలు, డీలర్లు మాయమాటలు చెప్పి రైతులను వలలో వేసి నాణ్యత లేని విత్తనాలను అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు. కొన్ని ప్రభుత్వ అనుమతి పొందిన కంపెనీలు కూడా డిమాండ్ పెరగడంతో అప్పటికప్పుడు నకిలీ సీడ్స్‌ను సృష్టించి రైతులకు అంటగడుతున్నాయి. అమాయక రైతులు వారి మోసానికి గురై సాగులో పెట్టుబడిని కూడా తిరిగి రాబట్టుకోలేని పరిస్థితుల్లో ఆర్థికంగా నష్టపోయి అప్పుల పాలవుతున్నారు. ప్రభుత్వం ప్రతి యేడాది నకిలీ విత్తనాల దందాను అరికడతామని చెప్పడమే కానీ క్షేత్రస్థాయిలో ఇలాంటి మోసాలను మొదటినుంచే అదుపు చేయడంలో విఫలమవుతోంది. తాజాగా బుధవారం బెల్లంపల్లిలో నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతుండగా పోలీసులు పట్టుకోవడం సంచలనం కలిగించింది. జిల్లాలోనూ గ్రామాల్లోకి ఇలాంటి కేటుగాళ్లు మళ్లీ చొరబడుతున్నారు. రైతుల దగ్గర డబ్బులు తీసుకొని విత్తనాలకు సంబంధించి ముందే బుకింగ్ చేసుకుంటున్నారు. పత్తి విత్తన రకానికి సంబంధించి బడా భూస్వాముల చేలలో ఆ రకం విత్తనాలను సాగు చేయడం ద్వారా ఇంత కాత, పూత వస్తుందని డీలర్లు రైతులకు చూపించి ఎరవేయడం వారికి ఈ దందాలో అందవేసిన చెయ్యి. ఆ తర్వాత నకిలీ, నాసిరకం విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. పోలీసు, రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులు వానకాలం పంటల సాగుకు ముందే ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే సంయుక్తంగా తనిఖీలు చేపడితే దీన్ని అరికట్టవచ్చు. అయితే జిల్లాలో ఇప్పటివరకు ఈ టాస్క్ ప్రారంభం కాకపోవడం చోద్యమే. గతేడాది వేల ఎకరాల్లో నష్టం.. గతేడాది ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల కారణంగా వేల ఎకరాల్లో రైతులు పంట నష్టం చవిచూశారు. ప్రభుత్వ అనుమతి పొందిన ఒక రకం పత్తి విత్తనాలను దాదాపు 3500 మంది రైతులు 8800 ఎకరాల్లో సాగు చేశారు. బేల, జైనథ్, ఆదిలాబాద్, తలమడుగు, తాంసి, ఇచ్చోడ మండలాల్లో ఈ ప్రభావం కనిపించింది. ఈ విత్తనం సాగు చేసిన రైతుకు ఎకరానికి రెండు క్వింటాళ్ల లోపే పత్తి దిగుబడి వచ్చింది. సగటున ఎకరానికి ఐదున్నర క్వింటాళ్ల పైబడి దిగుబడి రావాలి. దీంతో నష్టపోయిన రైతులందరు అప్పట్లో అధికారులను ఆశ్రయించారు. దీంతో శాస్త్రవేత్తలతో పంట చేలల్లో పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. 2007 కాటన్‌సీడ్ యాక్ట్ ప్రకారం విత్తనం కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు నష్టపరిహార కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో జిల్లా వ్యవసాయ అధికారి, శాస్త్రవేత్త, ఎక్కువ పంట నష్టపోయిన గ్రామానికి సంబంధించి ఒక ప్రతినిధి, విత్తన కంపెనీ ప్రతినిధి సభ్యులుగా ఈ కమిటీ పలు దఫాలుగా సమావేశమై ఒక నిర్ధారణకు రావడం జరిగింది. ఇతర విత్తనాల పరంగా సగటున ఎకరానికి ఐదున్నర క్వింటాళ్ల దిగుబడి రాగా, ఈ నాసిరకం పత్తి విత్తనాల కారణంగా రెండు క్వింటాళ్లలోపే పత్తి దిగుబడి వచ్చినట్లు నిర్ధారించారు. మిగతా మూడున్నర క్వింటాళ్ల పత్తిని నష్టపోయినందునా దాని పరిహారం కనీస మద్దతు ధర ఆధారంగా చెల్లించాలని ఆదేశించారు. గతేడాది పత్తి కనీస మద్దతు ధర రూ.4320 కాగా, 3500 మంది రైతులకు 8800 ఎకరాల్లో సుమారు రూ.13 కోట్లు రైతులకు చెల్లించాలని ఇటీవల స్పష్టం చేశారు. దానికి మార్చి 16లోగా చెల్లించాలని కంపెనీ ప్రతినిధులకు గడువు విధించారు. అయితే ఆ కంపెనీ చెల్లిస్తుందా లేదో తెలియదు. ప్రభుత్వం నకిలీ విత్తనాల మోసాలను అరికట్టేందుకు పీడీ యాక్ట్‌ను అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో దాని ప్రభావం కనబడటం లేదు. పీడీ యాక్ట్‌ను కఠినంగా అమలు చేయాలి ప్రభుత్వం పీడీ యాక్ట్‌ను కఠినంగా అమలు చేసి నకిలీ విత్తన మోసాలను అరికట్టాలి. దీనికి సంబంధించి అసెంబ్లీలో బిల్లును కూడా పాస్ చేయడం జరిగింది. రైతులను మోసం చేసేవారిని వదలకూడదు. ఖమ్మంలో మిర్చి సీడ్స్ నకిలీవి విక్రయించిన కంపెనీపై పీడీ యాక్ట్ పెట్టాలని డిమాండ్ చేశారు. జిల్లాలోనూ గతేడాది నకిలీ పత్తి విత్తనాలతో నష్టపోయిన రైతులను ఏకం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. నష్టానికి సంబంధించి ప్రభుత్వం నియమించిన కమిటీ నిర్ధారణ చేసింది. వారికి పరిహారం ఇచ్చి ఆదుకోవాలి. – బాలూరి గోవర్ధన్‌రెడ్డి, టీఆర్ఎస్ రైతు సంఘం అధ్యక్షుడు సంయుక్తంగా తనిఖీలు రెవెన్యూ, పోలీసు, వ్యవసాయ శాఖలు సంయుక్తంగా దాడులు చేసేందుకు బృందాలను మండల వారీగా ఏర్పాటు చేస్తున్నాం. ఇలాంటి నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్లు దృష్టికి వస్తే కిసాన్ కాల్ సెంటర్‌కు ఫోన్‌చేసి తెలియజేయాలి. రైతులు అప్రమత్తంగా ఉండాలి. నకిలీ విత్తనాల బారిన పడకూడదు. కంపెనీలు, డీలర్లు చెప్పే మాయమాటలను నమ్మవద్దు. – ఆశకుమారి, జిల్లా వ్యవసాయ అధికారి, ఆదిలాబాద్ -
కాటేసిన లంచం
లంచం అడిగితే చెప్పుతో కొట్టండని రెండ్రోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చినా.. అధికారుల తీరులో మాత్రం మార్పు కానరావడం లేదు.ఇదే లంచం ఓ రైతు కుటుంబాన్నిబలి తీసుకుంది. కాసిపేట (బెల్లంపల్లి): రుణం మంజూరు కోసం లంచం ఇచ్చుకోలేక ఓ రైతు భార్యా ఇద్దరు పిల్లలకు విషం తాగించి, అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య మృతి చెందగా.. పిల్లలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన గురువారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చొప్పరిపల్లిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తిరుపతి తనకున్న రెండు ఎకరాల పొలంతో పాటు మరో ఐదెకరాలు కౌలుకు తీసుకొని కూరగాయలు, ఇతర పంటలు సాగు చేస్తున్నాడు. వ్యవసాయంలో ఆశించిన మేరకు లాభాలు రాకపోవడంతో అప్పుల పాలయ్యాడు. దీంతో వ్యవసాయం వదిలి టెంట్‌హౌస్ కోసం ఎస్సీ కార్పొరేషన్లో రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఇటీవల కలెక్టర్ ఆర్వీ.కర్ణన్‌ను కలసి తన దీనస్థితిని వివరించగా.. స్పందించిన ఆయన యూనిట్ మంజూరుకు సిఫారసు చేశారు. అయితే ఎంపీడీఓ కార్యాలయంలో విధులు నిర్వహించే జూనియర్ అసిస్టెంట్ ప్రణయ్ రుణం మంజూరుకు రూ.20 వేలు లంచం అడగడంతో ఇప్పటికే అప్పుల పాలైన తాను లంచం ఇచ్చుకునే స్థితిలో లేనని, ఇక రుణం రాదని తీవ్ర మనస్తాపం చెందాడు. ఈ నేపథ్యంలో కుటుంబంతో సహా చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఫిబ్రవరి 27న రాత్రి భార్య భూదేవి (31), కుమార్తె కీర్తన (14), కుమారుడు శిశాంత్ (12)లకు నిద్రమాత్రలు ఇచ్చి తానూ వేసుకున్నాడు. అందరూ తీవ్రమైన మత్తులోకి జారుకున్నారు. కానీ అదృష్టవశాత్తు వారికి ప్రాణాపాయం జరగలేదు. అప్పటి నుంచి ఆందోళనగా ఉన్న తిరుపతి.. బుధవారం రాత్రి భార్యాపిల్లలకు యాపిల్ జ్యూస్‌లో క్రిమిసంహారక మందు తాగించాడు. పిల్లలు అపస్మారక స్థితిలోకి చేరుకోగా, భార్య మృతి చెందింది. ముగ్గురూ చనిపోయినట్లు భావించిన తిరుపతి.. తన అన్నయ్య శంకర్‌కు ఫోన్ చేయగా.. అతను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఇంట్లో చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం శంకర్ తిరిగి ఫోన్ చేయగా కొద్దిగా స్పృహలోకి వచ్చిన పిల్లలు ఫోన్ లిఫ్ట్ చేసి అమ్మానాన్నలు చనిపోయినట్లు విలపిస్తూ చెప్పారు. దీంతో శంకర్ హుటాహుటిన వచ్చి పిల్లలను బెల్లంపల్లి ఆసుపత్రికి.. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పిల్లలిద్దరూ కోలుకుంటున్నారు. వాయిస్ రికార్డు.. సూసైడ్‌నోట్ తిరుపతి ఆత్మహత్య చేసుకునే సూసైడ్ నోట్, ఫోన్లో వాయిస్ రికార్డు చేశాడు. తాను ఆత్మహత్యకు గల కారణాలను వివరించాడు. వ్యవసాయంలో నష్టాలు రావడంతో రూ.6.5 లక్షల వరకు అప్పులు అయ్యాయని, ఎస్సీ కార్పొరేషన్ నుంచి రూ.5 లక్షల రుణం మంజూరైనా దానిని ఇప్పించేందుకు బెల్లంపల్లి ఎంపీడీవో కార్యాలయంలో పనిచేసే ప్రణయ్ సార్ (జూనియర్ అసిస్టెంట్) రూ.20 వేలు లంచం అడుగుతున్నాడని పేర్కొన్నాడు. రుణం మంజూరు కాకపోవడం, అప్పులబాధ భరించలేక కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటున్నట్టు వివరించాడు. గ్రామస్తుల రాస్తారోకో: లంచం అడిగి దంపతుల మృతికి కారకుడైన జూనియర్ అసిస్టెంట్ ప్రణయ్‌పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు చొప్పరిపల్లి వద్ద రహదారిపై రాస్తారోకో చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయా లని కోరారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మందమర్రి సీఐ రాంచందర్‌రావు భరోసా ఇవ్వడంతోఆందోళన విరమించారు. నాన్ బెయిలబుల్ కేసు పెడతాం: ఏసీపీ అప్పుల విషయంలో ఒత్తిడి తెచ్చిన వారి వివరాలు సేకరించి వారిపై, లంచం అడిగిన ఉద్యోగిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేస్తామని బెల్లంపల్లి ఏసీపీ బాలుజాదవ్ తెలిపారు. మంజూరైన రూ.5 లక్షల రుణాన్ని కలెక్టర్‌తో మాట్లాడి తిరుపతి కుటుంబానికి అందించేలా చూస్తామన్నారు. పిల్లలు చదువుకునేందుకు సహకరిస్తామని, వారిని అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. డబ్బులు అడగలేదు: ఎంపీడీఓ బెల్లంపల్లి రూరల్: తిరుపతిని ఎస్సీ కార్పొరేషన్ రుణం మంజూరు కోసం ఎవరూ డబ్బులు అడగలేదని బెల్లంపల్లి ఎంపీడీఓ వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతికి రూ.5 లక్షల రుణం మంజూరు చేసి గతనెల 11న ఆన్లైన్లో అఫ్రూవల్ ఇచ్చామని పేర్కొన్నారు. రుణం మంజూరయ్యాక ఆ డబ్బులు అప్పులు కట్టుకోకుండా యూనిట్ పెట్టుకోవాలని చెప్పామే తప్ప కార్యాలయంలో ఎవరూ డబ్బులు అడగలేదని ఆయన స్పష్టం చేశారు. రుణం మంజూరు చేశాం ఎస్సీ కార్పొరేషన్ రుణం కోసం దరఖాస్తు చేసుకోగా బెల్లంపల్లి ఎంపీడీఓ కార్యాలయం నుంచి వచ్చిన జాబితాలో తిరుపతి పేరు ఉంది. అతడి దరఖాస్తును పరిశీలించి కలెక్టర్ సిఫారసుతో రూ.5 లక్షల రుణం మంజూరు చేస్తూ ఆన్లైన్లో అప్రూవల్ ఇచ్చాం. రుణం మంజూరు అయిన విషయాన్ని రెండు రోజుల క్రితమే బెల్లంపల్లి ఎంపీడీఓ ద్వారా లబ్ధిదారుడికి తెలియజేశాం. రూ.5 లక్షల రుణంలో రూ.2 లక్షలు బ్యాంకు రుణం కాగా.. మిగతా రూ.3 లక్షలు సబ్సిడీని వర్తింప చేశాం. రుణం మంజూరు కోసం డబ్బులు ఎవరడిగారో నాకు తెలియదు. రుణం మంజూరు చేసినట్లు సమాచారం ఇచ్చాక కూడా తిరుపతి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఎందుకు ఏర్పడిందో అర్థంకావడం లేదు. – హరినాథ్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ -
రైతుకు సీఆర్డీఏ అధికారుల వేధింపులు
-
రైతు ఆత్మహత్యాయత్నం
శాయంపేట(భూపాలపల్లి): వారసత్వంగా వచ్చిన భూమిని రికార్డుల్లో నమోదు చేయడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఓ రైతు ఆర్డీఓ ఎదుటే ఆత్మహత్యాయత్నానికి యత్నించిన సంఘటన సోమవారం వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట తహసీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కొత్తగట్టుసింగారం 114 సర్వే నంబర్లో ఎనిమిది మందికి కలిపి 14.30 ఎకరాల పట్టాభూములున్నాయి. అందులో కర్రు ఆదిరెడ్డి వారసత్వంగా తండ్రి నుంచి పొందిన 2.21 ఎకరాల భూమి ఉంది. 2008 వరకు రికార్డుల్లో వివరాలు సరిగ్గానే ఉండగా.. 2010 తరువాత 1.31 ఎకరాలు మాత్రమే ఉంది. దీంతో బాధిత రైతు ఆరు నెలలుగా రెవెన్యూ అధికారులు చుట్టూ, గ్రీవెన్స్ ద్వారా ఫిర్యాదు చేసినా స్పందనలేదు. ఇదే విషయమై సోమవారం ఆదిరెడ్డి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చాడు. ఆ సమయంలో మండలంలో డబుల్ బెడ్రూం నిర్మాణ పనులను పరిశీలించడానికి వచ్చిన ఆర్డీఓ మహేందర్‌జీ ఎమ్మార్వోతో మాట్లాడి బయటకు వెళ్తున్న క్రమంలో.. ఆదిరెడ్డి తన సమస్యను ఆర్డీఓ దృష్టికి తీసుకొచ్చాడు. ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోవడంలేదు.. ఇక నా భూమి నాకు దక్కదంటూ.. అప్పటికే సంచిలో తెచ్చుకున్న పురుగుల మందు డబ్బా తీసిన ఆదిరెడ్డి తాగేందుకు ప్రయత్నించగా గమనించిన ఆర్డీఓ వెంటనే డబ్బాను లాక్కుని వారించాడు. రెండు రోజుల్లో తహసీల్దార్, సర్వేయర్ మోఖాపైకి వచ్చి విచారణ చేపట్టి సమస్య పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. ఒక వేళఅధికారులు రాకుంటే తనకు నేరుగా ఫోనుచేయాలని తన ఫోన్‌నంబర్ సైతం ఇవ్వడంతో బాధిత రైతు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం సంబంధిత అధికారులపై ఆర్డీఓ మండిపడ్డారు. సకాలంలో విచారణ పూర్తి చేసి రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు. -
కొడుకు వెంటే తండ్రి
సాగుకు చేసిన అప్పులు యమపాశాలయ్యాయి. వ్యవసాయాన్నే నమ్ముకుని బతికిన రైతు కుటుంబం చితికిపోయింది. పంటలకు చేసిన అప్పులే ఆ కుటుంబాన్ని రోడ్డునపడేలా చేశాయి. భూమిని నమ్ముకొని పంటకు పెట్టుబడిగా పెట్టిన అప్పులు కుప్పలుగా మారడంతో మనోవేదనతో పత్తి రైతు రాజమౌళి సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు మృతితో తీవ్ర మనోవేదనకు గురైన తండ్రి శంకరయ్య సైతం ఇంటి ఎదుట ఉన్న చెట్టుకు ఉరివేసుకున్నాడు. ఈ ఘటన సైదాపూర్ మండలం బొమ్మకల్‌లో విషాదం నింపింది. సైదాపూర్(హుస్నాబాద్): అప్పుల బాధతో పత్తి రైతు రాజమౌళి ఆత్మహత్య చేసుకోగా.. కొడుకు చనిపోయాడనే బెంగతో అతని తండ్రి శంకరయ్య ప్రాణాలు తీసుకున్న హృదయ విదారకర ఘటన మండలంలోని బొమ్మకల్‌లో జరిగింది. ఒకేరోజు తండ్రీకొడుకుల మృతితో ఆ కుటుంబం రోడ్డునపడింది. మండలంలోని బొమ్మకల్‌కు చెందిన గొల్లప ల్లి రాజమౌళి(42) తనకున్న రెండెకరాల్లో పత్తి సాగు చేస్తున్నాడు. సాగునీటి కోసం బావి తవ్వినా, బోర్ వేసినా సాగునీరు లేక ఆశించినస్థాయిలో పంట ది గుబడి రాక అప్పులు పెరిగాయి. గతేడాది కూతురు వివాహం చేశాడు. దీంతో అప్పులు రూ.5లక్షలకు చే రాయి. అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడం తో కొద్ది రోజులుగా మనోవేదనకు గురవుతున్నా డు. సోమవారం వేకువజామున వ్యవసాయబావి వద్దకు వెళ్లి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఎంతకూ ఇంటికి రాకపోవడంతో తెల్లవారి బావి వద్దకు వెళ్లగా ఉరివేసుకుని కనిపించాడు. కొడుకు మృతిని తట్టుకోలేక.. సాగుకు చేసిన అప్పులు మీదపడడంతో మనోవేదనకు గురై కొడుకు ప్రాణాలు తీసుకుంటే.. అది భరించలేని తండ్రి సైతం ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు అంత్యక్రియలు ముగించుకుని ఇంటికి వచ్చేసరికి తండ్రి గొల్లపల్లి శంకరయ్య(75) ఇంటి ఎదు రుగా చెట్టుకు ఉరేసుకొని మృతిచెందాడు. శంకరయ్య(75)కు ముగ్గురు కుమారులు. పెద్దకొడుకు బ్రహ్మచారి, రెండో కొడుకు శ్రీనివాసాచారి మంచిర్యాల జిల్లా మందమర్రిలో కార్పెంటర్లుగా పనిచేస్తున్నారు. చిన్నకుమారుడు రాజమౌళి బొమ్మకల్లోనే వ్యవసాయం చేసుకుంటున్నాడు. శంకరయ్య భార్య ఐదేళ్ల క్రితం మృతిచెందింది. శంకరయ్యకు చూపు సరిగ్గా లేదు. కొడుకు రాజమౌళి మృతితో తనను సాదేవారు లేదనే మనోవేదనకు గురైన శంకరయ్య సైతం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒకే రోజు తండ్రీకొడుకుల మృతితో ఆ కుటుంబం రోడ్డున పడింది. ఉదయం కొడుకు, సాయంత్రం తండ్రి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. రైతు రాజమౌళి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
నా భూమి దక్కదేమో!
శాయంపేట (భూపాలపల్లి): వారసత్వంగా వచ్చిన భూమిని రికార్డుల్లో నమోదు చేయడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఓ రైతు ఆర్డీఓ ఎదుటే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఘటన సోమవారం వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట తహసీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకుంది. మండలంలోని కొత్తగట్టు సింగారం 114 సర్వే నంబరులో కర్రు ఆదిరెడ్డి వారసత్వంగా తండ్రి నుంచి పొందిన 2.21 ఎకరాల భూమి ఉంది. 2008 వరకు రికార్డుల్లో వివరాలు సరిగ్గానే ఉండగా.. 2010 తరువాత 1.31 ఎకరాలు మాత్రమే ఉంది. దీంతో బాధిత రైతు ఆరు నెలలుగా రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందనలేదు. ఇదే విషయమై సోమవారం ఆదిరెడ్డి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చాడు. ఆ సమయంలో డబుల్ బెడ్రూం నిర్మాణ పనులను పరిశీలించడానికి ఆర్డీఓ మహేందర్‌జీ వచ్చారు. ఆదిరెడ్డి తన సమస్యను ఆర్డీఓ దృష్టికి తీసుకొచ్చాడు. వెంటనే సంచిలో తెచ్చుకున్న పురుగుల మందు డబ్బా తీసి తాగేందుకు యత్నించాడు. గమనించిన ఆర్డీఓ డబ్బాను లాక్కుని వారించాడు. రెండు రోజుల్లో విచారణ చేపట్టి సమస్య పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. ఒకవేళ అధికారులు రాకుంటే తనకు నేరుగా ఫోన్ చేయాలని తన నంబర్ ఇవ్వడంతో బాధిత రైతు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం సంబంధిత అధికారులపై ఆర్డీఓ మండిపడ్డారు. విచారణ పూర్తి చేసి రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు. -
సీఆర్డీఏ చెప్పిందే తప్ప నేను చెప్పేది వినలేదు
-
రాజధాని రైతులపై పోలీసుల దౌర్జన్యం
-
రాజధాని రైతులపై పోలీసుల దౌర్జన్యం
తుళ్లూరురూరల్ : రాజధాని అమరావతి ప్రాంతం రైతులకు తాత్కాలిక సచివాలయం సాక్షిగా అణచివేతకు గురవుతున్నారు. వెలగపూడికి చెందిన గద్దే మీరాప్రసాద్ అనే రైతు తన పొలంలో రహదారి నిర్మాణం జరపడానికి వీలులేదని అడిగినందుకు రైతును పోలీసులు దారుణంగా బట్టలు చిరిగేలా కొట్టారు. సీఐ సుధాకర్ బాబు రైతుపై చేయికూడా చేసుకున్నాడు. అనంతరం బలవంతంగా అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో రైతు సొమ్మసిల్లి పడిపోవడంతో, రైతు వద్ద నుంచి పోలీసులు వెళ్లిపోయారు.. బాధిత రైతుకు మద్దతు తెలిపిన సీపీఎం, వైఎస్సార్ సీపీ నాయకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజధానికి ఇవ్వని పొలంలో రోడ్డు ఎలా వేస్తారంటూ రైతు మీరా ప్రసాద్ నిలదీశారు. తాత్కాలిక సచివాలయం వెనుకనున్న సీఆర్డీఏ నిర్మిస్తున్న ఎన్9 రహదారి నిర్మాణ పనులు నిలిపి వేయాలని సర్వేనెంబర్ 214/ఏ లో గద్దే మీరాప్రాద్ అనే రైతు భూమిలో రహదారి నిర్మాణం జరుగుతుందని, నిర్మాణాలను నిలిపివేయాలని హైకోర్టును ఆశ్రయించారు. అయితే సీఆర్డీఏ అధికారులు మాత్రం హైకోర్టు ఉత్తర్వులను తుంగలో తొక్కి పోలీసులను అడ్డుపెట్టి రైతులను భయభ్రాంతులకు గురిచేశారు. సంఘటనా స్థలానికి వచ్చిన సీఆర్డీఏ డెప్యూటీ కలెక్టర్ విజయకుమారిని వివరణ కోరగా తాము పోలీసులకు భద్రత మాత్రమే కల్పించమని అడిగినట్లు తెలిపారు. -
అప్పు తీర్చలేక...పత్తి రైతు ఆత్మహత్య
కొండ కోనల్లో జీవన ప్రయాణాన్ని సాగించిన ఆ గిరిజనుడికి అప్పు రూపంలో తీర్చలేనంత కష్టమొచ్చింది. పంట సాగు కోసం చేసిన అప్పులు తడిపిమోపిడయ్యాయి. పంట దిగుబడులు బాగా వస్తే తీర్చేయవచ్చన్న ఆయన ఆశలు అడియాశలయ్యాయి. పంట దిగుబడులు చూసి అప్పు తీర్చలేనని మనస్తాపానికి గురైన ఆ పత్తి రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే... పార్వతీపురం/కొమరాడ: కోండపోడునే నమ్ముకొని రెండు దశాబ్దాలుగా వ్యవసాయం చేసుకొని జీవిస్తున్న గిరిజన రైతుకు పెద్ద కష్టమొచ్చింది. కొండపోడు ఎనిమిది ఎకరాల్లో లాభం వస్తుందని ఆశించిన కొమరాడ మండలం మసిమండ గ్రామానికి చెందిన గిరిజన రైతు జీలకర్ర చంద్రయ్య(55) పత్తి పంట వేశాడు. ఏపుగా పెరుగుతున్న మొక్కలను చూసి ఆనందించాడు. చేసిన అప్పులు తీరిపోతాయని పంట దిగుబడి కోసం ఆత్రంగా ఎదురుచూశాడు. కానీ ఆయన అంచనాలు తప్పాయి. మొక్కలైతే ఏపుగా పెరిగాయి కాని పత్తికాయలు మాత్రం కాపునకు రాలేదు. దీంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలే తెలియని స్థితిలో తీవ్ర మనస్తాపానికి గురైన చంద్రయ్య శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పత్తి పంటలో పురుగుల నివారణకు కొనుగోలు చేసిన మందునే తాగి ఆత్మహత్య చేసుకొని తనువు చాలించాడు. ఈ ఏడాది బాగా మదుపులు పెట్టి దిగుబడులపై కొండంత ఆశలు పెట్టుకున్నాడు. మదుపుల కోసం అప్పులు చేసి దిగుబడి రాకపోవడంతో ఆందోళనకు గురై ఆత్మహత్యకు పాల్పడినట్టు భార్య జమ్మలమ్మ రోదిస్తూ చెప్పింది. ఈ ఏడాది పంట బాగా వస్తుందని, అప్పులన్నీ తీరిపోతాయని చెప్పేవాడని కన్నీరుమున్నీరైంది. అంతకు ముందు ఉదయం తొమ్మిది గంటల సమయంలో ఇంట్లోనే పురుగుల మందును తాగిన చంద్రయ్యను చికిత్స కోసం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతునికి భార్యతో పాటు కుమార్తె అన్నాలు, కొడుకులు ముత్యాలు, పాపారావు ఉన్నారు. కొమరాడ ఎస్ఐ దినకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పల్లిరైతుల కన్నెర్ర
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్) : పాలమూరులో పల్లికి మద్దతు ధర ఇవ్వడం లేదని రైతులు కన్నెర్రజేశారు. కనీస మద్దతు ధర ఇవ్వడం లేదని ఆగ్రహించిన రైతులు మార్కెట్ యార్డు కార్యాలయంలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. శుక్రవారం మార్కెట్ యార్డుకు రికార్డు స్థాయిలో 29,819 బస్తాల పల్లి వచ్చింది. దీంతో ట్రైడింగ్కు చాలా ఆలస్యమైంది. ఆగ్రహించి న రైతులు ఒక్కసారిగా మార్కెట్ యా ర్డు కార్యాలయంలోకి దూసుకువెళ్లి బీరువాలు, ఫర్నీచర్, అద్దాలును ధ్వం సం చేశారు. అనంతరం రైతులు కా ర్యాలయం ఎదుట బైఠాయించి మద్ద తు ధర ఇవ్వాలని నినాదాలు చేశారు. అక్కడితో శాంతించని వారు బోయ పల్లిగేట్ చౌరస్తాలో రోడ్డుపై సుమారు అరగంటల పాటు బైఠాయి ంచడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఎంపీ, ఎమ్మెల్యే వచ్చే వరకు రోడ్డుపై నుంచి లేవమని భీష్మించి కూర్చున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు డీఎస్పీ భాస్కర్ నేతృత్వంలో సీఐ రాజు, ఎస్ఐలు తమ సిబ్బందితో వచ్చి పరిస్థితిని అదుపు చేశారు. మార్కెట్ చైర్మన్ రాజేశ్వర్, మహబూబ్‌నగర్ అర్బన్ తహసీల్దార్ ప్రభాకర్ రైతులను శాంతింపజేశారు. మూడురోజులుగా పడిగాపులు పల్లికి మద్దతు ధర రాకపోవడంతో రైతులు మూడు రోజులుగా మార్కెట్ యార్డులోనే పడిగాపులు కాస్తున్నారు. ప్రభుత్వం ప్రకారం నాణ్యత ఉన్న ధాన్యానికి కూడా ధర ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రాత్రి చలికి ధాన్యం పక్కలే పడుకుంట్టున్నామని చెప్పుకొస్తున్నారు. రైతుల ఆందోళన కు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఎన్పీ వెంకటేశ్, సీపీఐ (ఎం ఎల్ న్యూడెమోక్రసీ) జిల్లా నాయకు డు వెంకటేశ్ మద్దతు తెలిపారు. రైతులకు ప్రభుత్వం ప్రకటించిన రూ. 4,459 ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు నష్టం రానివ్వం రైతులకు మద్దతు ధర విషయంతో నష్టం రానివ్వమని మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్వర్ అన్నారు. 30 వేల పల్లి మార్కెట్‌కు వచ్చిందని, దీంతో కొనుగోలుకు కొంత ఆలస్యమైందన్నా రు. ఇందులో రూ.2 వేల ధర వచ్చిన బస్తాలు కేవలం 17 మాత్రమేనని చె ప్పారు. ఎక్కువ శాతం రైతులకు మ ద్దతు ధర వచ్చిందని రైతులు ఆందో ళన చెందవద్దన్నారు. ధర రాని రైతుల కు శనివారం మంచి ధర వచ్చేలా ట్రెడర్లతో మాట్లాడుతామని మార్కెట్ యార్డు చైర్మన్ పేర్కొన్నారు. -
సీఎం టూర్.. అనంతలో నిర్బంధకాండ!
సాక్షి, అనంతపురం: జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రత్యేక హోదాతోపాటు, రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ సాగుతున్న నిరసనల సెగలు సీఎంను తాకే అవకాశముండటంతో జిల్లా అంతటా పోలీసులు పెద్ద ఎత్తున అరెస్టులు చేపడుతున్నారు. అడుగడుగునా న్యాయవాదులు, ప్రజాసంఘాల నేతలు, హక్కుల కార్యకర్తలు, రైతులను నిర్బంధిస్తున్నారు. సీమలో ప్రత్యేక హైకోర్టు కోసం నెల రోజులుగా ఉద్యమిస్తున్న లాయర్లు చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు సమయాత్తం కావడంతో అనంతపురం, పెనుకొండ, హిందూపురం తదితర ప్రాంతాల్లో వారిని పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. పెనుకొండ ఎమ్మిగనూరులో పది మంది లాయర్లను అదుపులోకి తీసుకున్నారు. క్రిమినల్స్ తరహాలో వారిని పదేపదే స్టేషన్లను మారుస్తూ తిప్పారు. పోలీసుల తీరుపై న్యాయవాదులు మండిపడుతున్నారు. సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో వైఎస్ఆర్ సీపీ పెనుకొండ సమన్వయకర్త శంకర్ నారాయణను పోలీసులుస హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో సీఎం చంద్రబాబు తీరుపై శంకర్ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రజల ముందుకు వచ్చెందుకు భయపడుతున్నారని మండిపడ్డారు. అందుకే ఈ విధంగా అక్రమ అరెస్టులు చేస్తున్నారని, చంద్రబాబు ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని ఆయన ధ్వజమెత్తారు. రైతులపైనా పోలీసుల జులుం సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో రైతులపైనా పోలీసులు నిర్బంధాన్ని ప్రయోగించారు. అమ్మవారిపల్లిలో ఆందోళనకు దిగిన 10 మంది రైతులను అరెస్ట్ చేశారు. పరిహారం ఇవ్వకుండానే తమ భూముల్లో కార్ల పరిశ్రమ ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుండటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు రైతులను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. యర్రమంచి గ్రామ సమీపంలో కియా ఫ్రేమ్ ఇన్స్టలేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు ఇక్కడికి వస్తున్న సంగతి తెలిసిందే. నిన్నటి నుంచి కొనసాగుతున్న ముందస్తు అరెస్టులు అనంతపురం: సీఎం పర్యటనకు ప్రత్యేక హోదా నిరసన సెగ తగలకుండా ఉండేందుకు పోలీసులు అరెస్టులకు దిగారు. బుధవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకూ పలు రాజకీయ, ప్రజాసంఘాలు, న్యాయవాదుల ఇళ్ల వద్ద, వారి కార్యకలాపాలపై రహస్య నిఘా వేశారు. రాత్రి పొద్దుపోయిన తరువాత అదుపులోకి తీసుకుని స్టేషన్లకు తరలించారు. రాయలసీమలో హైకోర్టు సాధనకై తీవ్రస్థాయిలో ఉద్యమం చేస్తున్న జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు తరిమెల భరత్ భూషణ్‌రెడ్డి, వైఎస్సార్సీపీ లీగల్ సెల్ కన్వీనర్ నారాయణరెడ్డి, న్యాయవాదులు జయరామిరెడ్డి తదితరులను వారి కార్యాలయాల వద్ద అరెస్ట్ చేసి టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పెనుకొండకు వెళ్తున్న న్యాయవాదులు హరినాథ్‌రెడ్డి, రామ్‌కుమార్, రాజారెడ్డి, ప్రసాద్‌రెడ్డి, బాలకృష్ణ తదితరులను అదుపులోకి తీసుకుని ఇటుకలపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వీరితో విద్యార్థి నేత ప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని కూడేరు పోలీస్‌స్టేషన్‌కు పంపించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ ఇంటి వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సీపీఎం నగర కార్యదర్శి నాగేంద్రకుమార్, డీవైఎఫ్ఐ నాయకులు సంతోష్, ఆలం, రామన్నను అదుపులోకి తీసుకున్న త్రీటౌన్ పోలీసులకు అప్పగించారు. -
ప్రమాదంతోనే స్పందిస్తారా?
కేటీదొడ్డి : మండలంలో చాలా చోట్ల విద్యుత్ స్తంభాలు శిథిలావస్థకు చేరుకొని వంగిపోవడం, వాటి తీగలు కిందకు వేలాడుతూ ప్రమాదకరంగా మారాయి. ఎప్పుడో దశాబ్దాల క్రితం వేసిన విద్యుత్ స్తంభాలను అధికారులు పట్టించుకోకపోవడంతో అవి ఎప్పుడు నేల కూలుతాయో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదకరంగా మారిన స్తంభాలను వేలాడుతున్న తీగలను బాగుచేయాలని అధి కారులకు ఎన్నిమార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు. గతంలో విద్యుత్‌స్తంభాలు నేలకొరిగి ప్రమాదాలు కూడా జరిగాయని, అంతజరిగినా.. అధికారులు మాత్రం తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని వాపోతున్నారు. తీగలు తెగిపడి.. కొన్ని రోజుల క్రితం ఎర్సందొడ్డిలో విద్యుత్ తీగలు తెగిపడి రెండు ఎద్దులు మృతిచెందాయి. మండలంలోని కొండాపురం, కేటీదొడ్డి, గువ్వలదిన్నె, నందిన్నె, కుచినెర్ల, గ్రామాల శివారులో విద్యుత్ తీగలు వేలాడుతూ విద్యుత్‌స్తంభాలు ప్రమాదకరంగా మారాయి. గువ్వలదిన్నె స్టేజీ సమీపంలో రోడ్డు పక్కన విద్యుత్‌స్తంభం శిథిలావస్థకు చేరుకొని ప్రమాదకరంగా మారాయి. స్తంభానికి మధ్యలో ఇనుపచువ్వలు పైకితేలాయి. బలమైన గాలులు వీచినప్పుడు విద్యుత్‌స్తంభం కూలిపోయే అవకాశం ఉందని రైతులు భయాందోళన చెందుతున్నారు. కొండాపురం గ్రామ శివారులో స్తంభాలకు విద్యుత్ తీగలు కింద నిలబడితే చేతికందేలా ఉన్నాయి. బలమైన గాలులు వీచినప్పుడు విద్యుత్‌తీగలు ఒకదానికి ఒకటి తగిలి నిప్పురవ్వలు ఎగసిపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అదికారులు చర్యలు తీసుకుని ప్రమాదకరంగా మారిన విద్యుత్ స్తంభాలను తొలగించి వాటి తీగలను సరిచేయాలని రైతులు కోరుతున్నారు. భయంగా ఉంది... పొలం వద్ద విద్యుత్ తీగలు చేతికందేలా ఉన్నాయి. పొలం పనులు చేసుకునేటప్పుడు భయమేస్తుంది. బలమైన గాలులు వీస్తే వైర్లు ఒకదానికి ఒకటి తగిలి నిప్పురవ్వలు పడుతున్నాయి. పొలం పనులు చేసుకోవాలంటే భయంగా ఉంది. తీగలు సరిచేయాలి. – యాదవరాజు, ఎర్సందొడ్డి సమస్య పరిష్కరిస్తాం.. సమస్య ఉన్న మాట వాస్తవమే. ఎర్సందొడ్డి సర్పంచ్ స్తంభాలు కావాలని మా దృష్టికి తీసుకొచ్చారు. త్వరలోనే స్తంభాలు వేయిస్తాం. అలాగే కేటీదొడ్డి, నందిన్నె శివారు పొలాల్లో వేలాడుతున్న విద్యుత్ తీగలను మా లైన్మెన్కు చెప్పి తీగలు లాగేలా చూస్తాం. – పరశురాం, విద్యుత్ ఏఈ -
భీకర పోరాటం: చిరుత హతం
దూరం నుంచి జూలో పులిని చూడాలంటేనే మనకు చాలా భయం. అది గాండ్రించింది అంటే ఒక్కసారిగా వణుకుపుడుతుంది. అలాంటిది ఓ రైతు పెద్ద సాహసమే చేశాడు. ఓ రైతు, చిరుతల మధ్య భయంకరమైన పోరాటం జరిగింది. ఆ భీకర యుద్ధంలో చిరుత పులి ఓడిపోయింది. క్రిష్ణగిరి జిల్లా మహారాజగడ సమీపంలోని మేలుపల్లి గ్రామానికి చెందిన రామమూర్తి(62). పశువులను పోషిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం ఉదయం పశువులను మేపడానికి అటవీ ప్రాంతానికి వెళ్లిన సమయంలో ఓ చిరుత రామమూర్తిపై దాడి చేసింది. దీంతో ఆయన ఏమాత్రం వెనుదిరగకుండా ఎదురుదాడికి దిగి, ధైర్యంగా ఎదుర్కొని తన చేతిలో ఉన్న వేటకొడవలితో దాడి చేసి చిరుతను చంపాడు. స్వల్ప గాయాలైన రామమూర్తిని స్థానికులు చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన అటవీ శాఖ అధికారులు రామమూర్తిని విచారణ జరపారు. తన ప్రాణాలను కాపాడుకోవడాకి చిరుతపై దాడి చేయవలసి వచ్చిందని అధికారులతో తెలిపాడు. -
ముగ్గురు రైతుల ఆత్మహత్య
మఠంపల్లి (హుజూర్నగర్)/కొడంగల్ రూరల్/తొగుట(దుబ్బాక): అప్పులబాధతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం భోజ్యాతండాకు చెందిన అజ్మీరా బాలు (40) సాగు పెట్టుబడులు, కుటుంబ అవసరాల కోసం రూ.6 లక్షల వరకు అప్పు చేశాడు. దిగుబడులు ఆశాజనకంగా లేక అప్పు తీర్చే మార్గం కనిపించక శనివారం ఇంట్లోనే ఉరివేసుకున్నాడు. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం పెద్దనందిగామకి చెందిన వెంకటయ్య(45) బోర్లు పడక పోవడం, పంటల దిగుబడి రాకపోవడంతో అప్పుల పాలయ్యాడు. మనస్తాపం చెందిన వెంకటయ్య శనివారం ఇంట్లో పురుగుల మందు తాగాడు. సిద్దిపేట జిల్లా పెద్ద మాసాన్‌పల్లికి చెందిన దుద్దెడ మల్లేశంగౌడ్ (35) వర్షాల్లేక మొక్కజొన్న పంట దెబ్బతింది. రూ.5 లక్షల అప్పు అయింది. దీంతో విషపు గుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్నాడు. -
రైతులకు వరం ఆపరేషన్ గ్రీన్
హన్వాడ : ప్రధాన ఆహార పంటలకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తుంది. మార్కెట్లో ధర తగ్గిన సమయంలో అన్నదాతలు పండించిన పంటలను కనీస మద్దతు ధరతో ప్రభుత్వ రంగ సంస్థలు కొనుగోలు చేస్తున్నాయి. కాని రైతులు ప్రధానంగా సాగుచేసే కూరగాయ పంటలైన ఉల్లి, టమాటలకు మాత్రం ఒక్కోసారి ధరలేకపోవడంతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. ఎక్కువగా ధరల్లో హెచ్చు తగ్గులుండే ఈ పంటలకు మద్దతు ధర కల్పించాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం వీటిని మద్దతు ధరలో చేర్చింది. మద్దతు ధరకు, మార్కెట్లో లభించే ధరకు మధ్య వ్యత్యాసం ఉండి రైతులు నష్టపోతున్న సందర్భంలో ఈ పథకం కింద ప్రభుత్వం ఆదుకుంటుంది. మద్దతు ధర కన్నా దిగువ స్థాయికి మార్కెట్లో ధరపడిపోయినప్పుడు ఆ రెండింటికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రభుత్వం రైతులకు చెల్లించే విధంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ పంటల ధరల్లో హెచ్చుతగ్గుల సమస్యల పరిష్కారానికి ఇటీవలే తమ బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో టమాట, ఉల్లి సాగు చేసిన రైతులకు ఇక ఢోకా ఉండదు. కూరగాయ తోటలే.. హన్వాడ మండల కేంద్రంతోపాటు పెద్దర్పల్లి, కొత్తపేట, టంకర, దాచక్‌పల్లి, సల్లోనిపల్లి, గుడిమల్కాపూర్, కొనగట్టుపల్లి, నాయినోనిపల్లి తదితర గ్రామాల్లో అత్యధికంగా కూరగాయల పంటలే సాగు చేస్తారు. అయితే ఆయా గ్రామాల్లో ఎక్కువగా ఉల్లి, టమాట పంటలు సాగుచేసి గతంలో చాలామంది రైతులు నష్టపోయిన దాఖలాలు కోకొల్లలు. దీంతో సాగుచేసిన ప్రతిసారి ఏదో ఓసారి నష్టాలబారిన పడాల్సి వచ్చేది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘ఆపరేషన్ గ్రీన్’ పథకం ఆయా పంటల రైతులకు ఇక వరంగా మారనుంది. ఇక మండలంలో మరిన్ని గ్రామాల్లో సైతం వీటి సాగుపై దృష్టి సారిస్తున్నారు. రైతులకు మేలుచేసే ఈ పథకంతో చాలామంది అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తీవ్రంగా నష్టపోయా.. ఇటీవల టమాట సాగుచేసి మార్కెట్లో ధరలు రాక తీవ్రంగా నష్టపోయాను. ఉల్లి, టమాట పంటలకు సరైన ధర రాక వృథాగా పారబోశాను. పెళ్లిళ్లు, పండగల సీజన్లకు ముందుగా అందరూ ఇదే పంటల సాగుపై దృష్టిసారించడంతో ఈ సమస్య తలెత్తేది. కేంద్ర ప్రభుత్వం ఉల్లి, టమాటపై మద్దతు ధర ప్రకటించడం సంతోషంగా ఉంది. – నర్సింహులు, రైతు, హన్వాడ -
అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రాదేమోనని..
గుంటూరు : అప్పు తీర్చలేక రైతు ఆత్మహత్యాయత్నం చేసుకుంటే, అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రాదేమోన్న బెంగతో రిటైర్డ్ ఉద్యోగి గుండెపోటుతో మృతిచెందారు. నాదెండ్ల మండలం సంకురాత్రిపాడులో అప్పుల బాధ తట్టుకోలేక నాగేశ్వరరావు అనే రైతు పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. కుటుంబసభ్యులు నాగేశ్వరరావును ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, అప్పు ఇచ్చిన రిటైర్డ్ ఉద్యోగి సూర్యనారాయణకు ఈ విషయం తెలియడంతో గుండెపోటుతో మృతి చెందారు. సూర్యనారాయణ రూ. 8 లక్షలు నాగేశ్వరరావుకు అప్పుగా ఇచ్చారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
దస్తూరాబాద్(కడెం) : అప్పుల బాధతో దస్తురాబాద్ మండలం బుట్టాపూర్ పంచాయతీ పరిధి చెన్నూర్‌కు చెందిన రైతు కొట్టె వేణు (32)మంగళవారం సాయంత్రం వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యవసాయంలో తీవ్రంగా నష్టపోగా, ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. అక్కడా పని దొరకక పోవడంతో తిరిగి స్వగ్రామానికి చేరుకుని ఖరీఫ్‌లో వరి సాగు చేశాడు. దోమపోటుతో దిగుబడి తగ్గి మళ్లీ నష్టపోయాడు. రూ.5లక్షలు అప్పులుండడంతో తీర్చే మార్గంలేక మనస్తాపంతో మంగళవారం బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలున్నారు. -
సేంద్రియం కంటే ప్రకృతి సాగే మేలు
సాక్షి, హైదరాబాద్: రైతుల ఆదాయం పెరగాలన్నా.. వ్యవసాయం అభివృద్ధి చెందాలన్నా.. రూపాయి పెట్టుబడి అవసరం లేని, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తే చాలని ప్రముఖ ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్త సుభాష్ పాలేకర్ సూచించారు. సేంద్రియ వ్యవసాయం వల్ల రైతులకు పెద్దగా ప్రయోజనం ఉండబోదని, దీని వల్ల ఐదేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందనేది అపోహ మాత్రమేనని అన్నారు. శుక్రవారం రామకృష్ణమఠంలో ప్రారంభమైన మూడు రోజుల విత్తనోత్సవానికి పాలేకర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విత్తనోత్సవం ప్రారంభ వేడుకల్లో కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత జానారెడ్డి, సీనియర్ ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్, సినీనటుడు తనికెళ్ల భరణి, మాతా నిర్మలానంద, మాతా విజయేశ్వరీదేవి, సేవ్ సంస్థ వ్యవస్థాపకుడు విజయ్‌రామ్ తదితరులు పాల్గొన్నారు. రూపాయి పెట్టుబడి అవసరం లేదు.. కేంద్ర బడ్జెట్లో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం వల్ల 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు కావడం అసాధ్యమని పాలేకర్ అన్నారు. రసాయన ఎరువులు, పురుగు మందుల్లాగే వర్మికంపోస్టు వంటి రకరకాల సేంద్రియ ఎరువులపైనా రైతులు భారీగా ఖర్చు చేయాల్సి వస్తుందని, పైగా దిగుబడి కూడా ఆశించిన స్థాయిలో రాదని చెప్పారు. దేశీ విత్తనాలు, దేశీ ఆవు, ప్రకృతి సాగు ద్వారా అద్భుతమైన దిగుబడి సాధించవచ్చని, ఒక్క ఆవు ద్వారా ప్రకృతి సాగుతో 30 ఎకరాల భూమిలో పంట పండించవచ్చని పాలేకర్ పేర్కొన్నారు. దేశీ విత్తనం, దేశీ ఆవు, మన మాతృభాష, మన ఆధ్యాత్మికతను సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. జన్యుపరివర్తన విత్తనాలు, సంకర విత్తనాలు రసాయనాలు, పురుగుమందులు వినియోగించినప్పుడే దిగుబడిని ఇస్తాయని, దాంతో నేల పూర్తిగా పాడవుతుందని, ప్రజారోగ్యం కూడా దెబ్బతింటుందని అన్నారు. రైతుల ఆత్మహత్యలు ఆందోళనకరం.. ఎరువులు, పురుగుమందుల కోసం భారీగా ఖర్చు చేసి, సరైన దిగుబడి రాక, అప్పులపాలై లక్షలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మాతా విజయేశ్వరీదేవి ఆందోళన వ్యక్తం చేశారు. రూపాయి కూడా పెట్టుబడి అవసరం లేని ప్రకృతిసాగు రైతులకు మేలు చేస్తుందన్నారు. అన్నం తినే ప్రతి ఒక్కరూ ప్రకృతి సాగును తమ జీవితంలో భాగం చేసుకోవాలని తనికెళ్ల భరణి కోరారు. కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన వంద మందికిపైగా రైతులు, సహజ సాగు పట్ల ఆసక్తి ఉన్న నగరవాసులు, సేవ్ స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆకట్టుకున్న విత్తన ప్రదర్శన.. ఆదివారం వరకు కొనసాగనున్న విత్తనోత్సవంలో తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమబెంగాల్, ఒడిశా, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల రైతులు ప్రదర్శించిన వివిధ రకాల వరి విత్తనాలు ఆకట్టుకున్నాయి. సహజ పద్ధతుల్లో పండించిన తృణధాన్యాలు, పప్పుదినుసులు, ఆకుకూరలు, కూరగాయల విత్తనాలను ప్రదర్శించారు. విత్తనోత్సవానికి వచ్చిన రైతులకు అర కిలో చొప్పున రెండు రకాల వరి విత్తనాలను ఉచితంగా అందజేశారు. కొన్ని రకాల వరి విత్తనాల ప్రత్యేకతలు ఇవీ.. - తమిళనాడుకు చెందిన ‘మా పిళ్లై సాంబ’ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న వరి. తమిళనాడులోని చాలా ప్రాంతాల్లో కొత్త అల్లుడికి ఈ బియ్యంతో వండిన అన్నాన్ని వడ్డిస్తారు. 180 రోజుల్లో ఇది చేతికొస్తుంది. - తమిళనాడు, కర్ణాటకలో విరివిగా పండించే ‘కులాకార్’రకం బియ్యం గర్భిణులకు వరప్రదాయిని. ఈ అన్నం తిన్న గర్భిణిలకు సాధారణ కాన్పు అవుతుందని, పండంటి బిడ్డకు జన్మనిస్తుందని ప్రజల నమ్మకం. 130 నుంచి 140 రోజుల్లో ఇది పండుతుంది. - కేన్సర్ నివారణకు దివ్యౌషధంగా పనిచేసే ‘కర్పుకౌని’(నల్ల బియ్యం) వరిని తమిళనాడులోనే పండిస్తున్నారు. ఇది ఊబకాయాన్ని తగ్గిస్తుంది. పోషకాలు అధికంగా ఉంటాయి. 140 రోజుల్లో పంట చేతికొస్తుంది. - అధిక దిగుబడినిచ్చే మరో రకం వరి ‘బహురూపి’. ప్రకృతి సాగు భూమిలో 3 ఏళ్ల తర్వాత ఎకరాకు 40 నుంచి 50 బస్తాలు దిగుబడి సాధించవచ్చు. పంట కాలం 140 రోజులు. పశ్చిమ బెంగాల్లో వీటిని పండిస్తున్నారు. - మధుమేహాన్ని అదుపులో ఉంచే ‘నవ్వారా’రకం కేరళ, తమిళనాడులో పండిస్తున్నారు. మామూలు బియ్యంతో పోలిస్తే ఈ రకంలో 17.5 రెట్లు పీచుపదార్థం అధికంగా ఉంటుంది. పంటకాలం 120 రోజులు. - ప్రపంచంలోనే అతి చిన్న వడ్లగింజగా పేరొందిన ‘తులసీబాసో’బియ్యం సుగంధ భరితంగా ఉంటాయి. పోషకాలు ఎక్కువ. 130–140 రోజుల్లో పంట చేతికొస్తుంది. ఒడిశాలో వీటిని పండిస్తున్నారు. - పశ్చిబెంగాల్‌లో ‘నారాయణ కామిని’వరి విత్తనాలను పండిస్తున్నారు. ఈ బియ్యంతో వండే అన్నం రుచిగా ఉంటుంది. పంటకాలం 140 రోజులు. చిరుధాన్యాలకు డిమాండ్ ఈ ప్రదర్శనకు చిరుధాన్యాలు తెచ్చా ను. చాలామంది కొనుగోలు చేశారు. ప్రజ ల్లో ఆరోగ్యం పట్ల, సహజ పంటల పట్ల అవగాహన పెరగడం చాలా సంతోషం. – మహేష్, అరకు కూరగాయలు,ఆకుకూరలు పండిస్తున్నాం సహజ పద్ధతుల్లో కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నాం. ఆ విత్తనాలను ప్రదర్శనలో పెట్టాం. క్షణాల్లో అమ్ముడయ్యాయి. – మనూ, సహజ స్వీట్స్, బెంగళూరు ప్రదర్శన చాలా బాగుంది ఇలాంటి ప్రదర్శనకు రావడం ఇదే తొలిసారి. చాలా వెరైటీలు ఉన్నాయి. పూల మొక్కలు, కూరగాయల విత్తనాల కోసం వచ్చాను. – తులసి, హైదరాబాద్ రూఫ్ గార్డెనింగ్పై ఆసక్తి దేశీ కూరగాయల విత్తనాలు లభిం చాయి. మార్కెట్లో దొరికేవన్నీ హైబ్రీడ్. ఇలా లభించడం అరుదు. మా ఇంటిపై పండించాలనుకుంటున్నాం. – మౌనిక, హైదరాబాద్ -
ఏపీలో 804మంది రైతుల ఆత్మహత్యలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో 2016లో 804 మంది రైతులు, రైతు కూలీలు ఆత్మహత్యలకు పాల్పడినట్లు వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి పరషోత్తమ రూపాలా వెల్లడించారు. రాజ్య సభలో శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ఒక ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. కేంద్ర హోం మంత్రిశ్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) రైతుల ఆత్మహత్యలకు సంబంధించిన సమాచారాన్ని పొందుపరుస్తూ ప్రతి ఏటా నివేదకలను సమర్పిస్తుందని ఆయన తెలిపారు. 2014-15లో ఎన్సీఆర్బీ సమర్పించిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో 632 మంది రైతులు, 916 మంది రైతు కూలీలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఎన్సీఆర్బీ ప్రతి ఏటా సమర్పించే ఈ నివేదికలు 2015 సంవత్సరం వరకు మాత్రమే ఆ సంస్థ వెబ్ సైట్లో అందుబాటులో ఉన్నాయి. 2016 తర్వాత నివేదికలు ఇంకా వెబ్ సైట్లో ప్రచురించలేదు. అయితే ఎన్సీఆర్బీ 2016 సంవత్సరానికి పొందుపరచి ఇంకా ప్రచురించని సమాచారం ప్రకారం రాష్ట్రంలో 806 మంది రైతులు, రైతు కూలీలు ఆత్మహత్యలకు పాల్పడినట్లు తెలుస్తోందని మంత్రి తన సమాధానంలో వివరించారు. 2015లో ఎన్సీఆర్బీ ప్రచురించిన నివేదిక ప్రకారం దివాలా, అప్పుల ఊబిలో కూరుకుపోవడం, వ్యవసాయంలో సంభవించే నష్టాలు రైతుల ఆత్మహత్యలకు ప్రధాన కారణాలలో కొన్నిగా పేర్కొనడం జరిగింది. రైతులలో అత్యధిక శాతం దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న వారే. వ్యవసాయ రంగంలో సంక్షోభం తలెత్తిన ప్రతిసారి ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ ధోరణిని సమర్థవంతంగా నిలువరించాలంటే రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం ఒక్కటే మార్గమని మంత్రి వివరించారు. వ్యవసాయం రాష్ట్రానికి సంబంధించిన అంశం. అయినప్పటికీ 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ఈ లక్ష్య సాధన కోసం వ్యవసాయ, సహకారం రైతు సంక్షేమ విభాగాలు ఒక అంతర్ మంత్రిత్వ శాఖ బృందాన్ని ఏర్పాటు చేసి రైతుల ఆదాయానికి సంబంధించిన వివిధ ధృక్కోణాలను పరిశీలించి సముచితమైన వ్యూహాన్ని సిఫార్సు చేస్తుంది. అలాగే ప్రభుత్వం కూడా వ్యవసాయ ఉత్పాదకత నుంచి రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా చొరవ తీసుకునేలా తన ప్రాధామ్యాలను మలుచుకుంటుందని మంత్రి తెలిపారు. ఆహార ధాన్యాల సేకరణ కోసం కొత్త పథకం రైతులు పండించిన ఆహార ధాన్యాల సేకరణ కోసం కేంద్ర ప్రభఉత్వం మార్కెట్ హామీ పథకం (ఎమ్‌ఏఎస్) పేరిట ఒక కొత్త పథకాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆహార, ప్రజా పంపిణీ శాఖల మంత్రి శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్ శుక్రవారం రాజ్య సభలో ప్రకటించారు. విజయసాయి రెడ్డి అడగిన ఒక ప్రశ్నకు రాతపూర్వకంగా జవాబిస్తూ మంత్రి ఈ విషయం వెల్లడించారు. ఈ కొత్త పథకానికి సంబంధించిన కాన్సెప్ట్ పేపర్‌ను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిశీలనకు పంపించినట్లు మంత్రి తెలిపారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులతో కేంద్ర బృందాలు రెండు దఫాలుగా జరిపిన చర్చల ద్వారా సేకరించిన అభిప్రాయాలను క్రోడీకరిస్తూ వ్యవసాయ, సహకార, రైతు సంక్షేమ విభాగాలు సవరించిన కాన్సెప్ట్ పేపర్‌ను రూపొందించినట్లు మంత్రి చెప్పారు. దక్షిణ మధ్య రైల్వే భద్రతా విభాగంలో 10 వేల పోస్టులు ఖాళీ దక్షిణ మధ్య రైల్వేలోని రక్షణ, భద్రతా విభాగాలలో దాదాపుగా 10 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు రైల్వే శాఖ సహాయ మంత్రి శ్రీ రంజన్ గోహెయిన్ తెలిపారు. శుక్రవారం రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ, దక్షిణ మధ్య రైల్వేలోని రక్షణ, భద్రత విభాగాలకు మొత్తం 3,309, 58,622 పోస్టులు మంజూరు కాగా అందులో రక్షణ విభాగంలో 784, భద్రత విభాగంలో 9.372 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌లో ఖాళీలు ఏర్పడటం నిరంతరం సాగే ప్రక్రియ. రిటైర్మెట్లు, ప్రమోషన్లు, మరణాలు, రాజీనామాల వంటి కారణాలతో ఏర్పడే ఈ ఖాళీలను, డిపార్ట్మెంటల్ ప్రమోషన్లను నిబంధనల ప్రకారం బహిరంగ నియామకాల ద్వారా చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. రక్షణ, భద్రత విభాగాలలో ఖాళీల భర్తీ కోసం స్పెషల్ డ్రైవ్ వంటివి ఏవీ నిర్వహించడం లేదని చెప్పారు. పోస్టల్ శాఖ ఏపీ సర్కిల్లో 1922 పోస్టులు ఖాళీ పోస్టల్ శాఖ ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో మల్టీ టాస్కింగ్ సిబ్బంది, పోస్ట్‌మాన్, పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్ మాస్టర్ గ్రేడ్, ఇన్స్పెక్టర్ పోస్టులు మొత్తం కలిపి 1922 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి శ్రీ మనోజ్ సిన్హా శుక్రవారం రాజ్య సభలో విజయసాయి రెడ్డి అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. విశాఖలో వ్యాగన్ వర్క్‌షాప్‌కు 150 కోట్లు విశాఖపట్నంలో రైల్వే పీరియాడికల్ ఓవర్‌హాలింగ్ వర్క్ షాప్ (వ్యాగన్ వర్క్‌షాప్) నిర్మాణానికి ప్రస్తుత ఈ ఏడాది బడ్జెట్లో 150 కోట్ల రూపాయలు కేటాయించినట్లు రైల్వే శాఖ సహాయ మంత్రి శ్రీ రంజన్ గొహెయిన్ వెల్లడించారు. వ్యాగన్ వర్క్‌షాప్ నిర్మాణ పనులలో ఎలాంటి జాప్యం జరగడం లేదని 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటి వరకు దీని నిర్మాణం కోసం మొత్తం 265 కోట్ల రూపాయలను కేటాయించినట్లు మంత్రి తెలిపారు. -
రైతులను పట్టించుకోని ప్రభుత్వం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : పట్టెడన్నం పెట్టే అన్నదాతల విషయంలో ప్రభుత్వం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నదని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ వ్యాఖ్యానించారు. సాగుకోసం చేసిన అప్పులను కూడా తీర్చలేక అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం ‘రైతు సమస్యలు– పరిష్కారాల సదస్సు’ పేరిట కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన జేఏసీ నేతలు, రైతు సంఘాల నాయకులు, రైతులు హాజరయ్యారు. ముఖ్యఅతిథిగా హాజరైన కోదండరాం మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న సంక్షోభాలను వివరించారు. అష్టకష్టాల కోర్చి పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధరలేక సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రైతు నుంచి పంట చేజారిపోగానే అమాంతం రేట్లు పెరిగిపోతున్నాయన్నారు. వ్యవసాయ సంక్షోభానికి ప్రధాన కారణం ప్రకృతి వైఫల్యం వల్ల వచ్చినది కాదని, కేవలం మానవ నిర్మితమైనదన్నారు. విత్తనాలు, ఎరువులు ఇలా ప్రతీది కల్తీమయమవుతుందని పేర్కొన్నారు. పారిశ్రామిక రంగానికి ఇస్తున్న ప్రోత్సాహాల మాదిరిగా వ్యవసాయరంగానికి ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. విధిలేని పరిస్థితుల్లో వ్యవసాయం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో వ్యవసాయరంగం పూర్తి సంక్షోభంలో కూరుకుపోయిందని వనపర్తి జిల్లా జేఏసీ చైర్మన్ వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. సాగుకు పెట్టుబడి లేక ఆవులు, దూడలను పెబ్బేర్ సంతలో అమ్ముకుంటున్నారన్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటకు ఎలాంటి గిట్టుబాటు ఉండటం లేదన్నారు. విధిలేని పరిస్థితిలో వ్యవసాయం చేస్తున్నట్లు తమ అధ్యయనంలో తేలిందన్నారు. రైతులకు తీరని నష్టం పత్తి విత్తనాల కంపెనీలు, సీడ్ ఆర్గనైజర్ల మోసాల వల్ల గద్వాల జిల్లా రైతులు తీవ్రంగా మోసపోతున్నారని జిల్లా జేఏసీ చైర్మన్ నాగర్‌దొడ్డి వెంకట్రాములు ఆవేదన వ్యక్తంచేశారు. 20ఏళ్లుగా చేస్తున్న వారి అక్రమాలపై రైతులే స్వయంగా నడుంబిగించి పోరాటం చేయాల్సి వచ్చిందే తప్ప, ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. సీడ్పంట ద్వారా ఎకరాకు రూ.5లక్షల దిగుబడి వస్తే కేవలం రైతుకు రూ.2లక్షలు అందజేసి, మిగతా మూడు లక్షలు కంపెనీలు, సీడ్‌ఆర్గనైజర్లు కొల్లగొడుతున్నారని పేర్కొన్నారు. తుంగభద్రనది నుంచి న్యాయబద్దంగా రావాల్సిన వాటా 15.9టీఎంసీలను ఎందు కు రాబట్టడం లేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి, వివిధ మండలాల నుంచి పెద్దసంఖ్య లో రైతులు తరలివచ్చారు. ఆత్మç ßæత్య చేసుకున్న రైతులకు సంతాప సూచకంగా మౌనం పాటించారు. క్రియాశీలకంగా టీజేఏసీ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీ వ్యవసాయరంగానికి ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని మహబూబ్‌నగర్ జిల్లా జేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ సమాజాన్ని చైతన్యపరిచి ఉద్యమాలలో భాగస్వామ్యం చేయడంలో జేఏసీ క్రియాశీలకంగా వ్యవహరిస్తోందన్నారు. అందులో భాగంగానే ప్రభు త్వ వాగ్దానాలు అమలుచేయాలని జేఏసీ ఒక బాధ్యతతో డిమాండ్ చేస్తోం దని అన్నారు. జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై 45రోజుల పాటు జేఏసీ సమగ్రంగా అధ్యయనం చేసిందని, ఆ నివేదికను కేంద్ర నాయకత్వానికి అందజేశామన్నారు. ఫిబ్రవరి 4న హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి సదస్సులో ఒక కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. -
భూసమస్య పరిష్కరించకుంటే ఆత్మహత్య
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): తన భూ సమస్యను పరిష్కరించాలని, లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని ఓ రైతు హెచ్చరించాడు. సోమవారం మహబూబ్‌నగర్ కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో కిరోసిన్ డబ్బాతో వచ్చాడు. మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌కు చెందిన ఈశ్వరయ్య తనకు ఉన్న ఏడు గుంటల భూమిని పక్క పొలానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి ఆక్రమించుకున్నాడని కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు వచ్చాడు. ఈ సందర్భంగా ఆయన కిరోసిన్ డబ్బాతో వచ్చి.. తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని తెలిపాడు. ఈ మేరకు సిబ్బంది గుర్తించి కిరోసిన్ డబ్బా లాక్కొని సర్ది చెప్పారు. అనంతరం అతను కలెక్టర్ రొనాల్డ్ రోస్కు వినతిపత్రం సమర్పించగా.. ఆయన మిడ్జిల్ తహసీల్దార్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడి ఈశ్వరయ్యకు న్యాయం చేయాలని ఆదేశించారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
సాక్షి, మెట్పల్లి: అప్పుల బాధ భరించలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని చౌలమద్దిలో జరిగింది. గ్రామానికి చెందిన గడ్డం ప్రతాపరెడ్డి(30) తన వ్యవసాయ బావి వద్ద ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధ భరించలేకనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
అనంత రైతు పాత్రలో నటిస్తా..
పెనుకొండ/అనంతపురం కల్చరల్: జిల్లా రైతుల స్థితిగతులు, నైపుణ్యం తెలుసుకున్నాక అనంత రైతు పాత్రలో నటించాలని నిర్ణయించుకున్నట్లు ప్రముఖ సినీ నటుడు సుమన్ పేర్కొన్నారు. సాహితీ గగన్ మహల్ ట్రస్ట్ అధ్యక్షుడు ప్రతాపరెడ్డి నేతృత్వంలో శనివారం రాత్రి స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించిన పురస్కార ప్రధానోత్సవంలో ఆయన మాట్లాడారు. సినిమాల్లో అనంతపురం జిల్లాను ఫ్యాక్షన్ ప్రాంతంగా చిత్రీకరించడం పట్ల విచారం వ్యక్తం చేశారు. సినిమా రంగం తరుఫున క్షమాపణ కోరుతున్నట్లు చెప్పారు. అనంతపురంలో పుట్టి దేశవిదేశాల్లో కీర్తి గాంచిన ఇంతమంది విశిష్ట వ్యక్తులను సత్కరించడం అభినందనీయమన్నారు. తాను ఉత్తమ రైతు శివశంకరరెడ్డి ఇంటిలో అతిథ్యం తీసుకున్న సమయంలో వారి మాటలు విన్న తర్వాత వ్యవసాయంపై ప్రేమ, గౌరవం పెరిగిందన్నారు. సినీ నటుడు జయప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ.. తాను కూడా అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రాంతానికి చెందిన వాడిననే విషయం చాలా తక్కువ మందికి తెలుసునన్నారు. అంతకు ముందు సాహితీ గగన్ మహల్ ట్రస్ట్ అధ్యక్షుడు ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన పురస్కార ప్రదానోత్సవంలో అనంత ఆణిముత్యాల విశిష్టతను మాజీ డీజీపీ రొద్దం ప్రభాకరరావు, విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి నరసింగప్ప, ప్రముఖ పారిశ్రామిక వేత్త మేడా నరసింహులు తెలియజేసారు. సమావేశంలో సుంకు బాలచంద్ర వ్యాఖ్యానం ఆకట్టుకుంది. -
పైసా ఇస్తే ఒట్టు
మదనాపురం : ఆరుగాలం కష్టించి పంటలు పండిస్తున్న రైతన్నకు అడుగడుగునా కష్టాలే.. పంటల సాగు సమయంలో ఎరువులు, విత్తనాల కొరత.. తీరా చేతికొచ్చిన పంటను విక్రయించగా డబ్బుల కోసం చెప్పులరిగేలా తిరగాల్సిన వ్యథ.. ఈ పరిస్థితినే జిల్లాలో కంది రైతులు ఎదుర్కొంటున్నారు. నెలరోజుల క్రితం ధాన్యం అమ్మినా చిల్లిగవ్వా చేతికందని దైన్యం. జిల్లాలోని వనపర్తి, మదనాపురం వ్యవసాయ మార్కెట్ కేంద్రాల్లో డిసెంబర్ 27న మార్కెటింగ్ శాఖ సహకారంతో హాకా ఆధ్వర్యంలో అట్టహాసంగా కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఆరంభం ఆర్భాటంగా మొదలైంది.. ఇదిచూసి సంబురపడిన రైతులు తండోపతండాలుగా తరలొచ్చి పండించిన కందులను మార్కెట్లో విక్రయించారు. మద్దతు ధర వచ్చినా రాకున్నా అమ్ముకున్నారు. రూ.4.67కోట్ల బకాయిలు కొత్తకోట, మదనాపురం, మూసాపేట, అడ్డాకుల మండలాలకు చెందిన 493 మంది రైతులు 4,913 క్వింటాళ్ల కందు లను క్వింటాలుకు రూ.5,450చొప్పున మదనాపురం మార్కెట్లో విక్రయిం చారు. వీరికి సుమారు రూ.2.67కోట్లు చెల్లించాల్సి ఉంది. అలాగే వీపనగండ్ల, పాన్‌గల్, ఖిల్లాఘనపురం గోపాల్పేట, ఎర్రవల్లి, వనపర్తి తదితర మండలాలకు చెందిన సుమారు 281 మంది రైతులు వనపర్తి మార్కెట్లోని కొనుగోలు కేంద్రంలో రూ.3,788క్వింటాళ్ల కందులు విక్రయించారు. వీరికి సుమారు రూ.2కోట్లు చెల్లించాల్సి ఉంది. రైతులకు డబ్బులు అకౌంట్లలో వేస్తామని 25రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఇవ్వకపోవడంతో అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అప్పుచేసి పంట పండిస్తే వచ్చే డబ్బులు వడ్డీలకే సరిపోతున్నాయని ఆక్రందన వ్యక్తం చేస్తున్నారు. ఆలస్యం ఎందుకంటే..! మార్కెట్ యార్డుల్లో కందులు కొనుగోలుచేసే సమయంలో రైతుల నుంచి ధ్రువీకరణ పత్రాలు తీసుకోవాలి. సంబంధిత గ్రామ వీఆర్వోతో పాటు పొలం పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్, జిరాక్స్ కాపీలను తీసుకోవాలి. అలా తీసుకున్న వాటిని ఒక నమూనాలో పొందుపరిచి లారీలో కందుల ధాన్యం తరలించే సమయంలో ప్రభుత్వానికి పంపిస్తారు. ఈ క్రమంలో ఏ ఒక్క రైతు వివరాలను పొందుపర్చకపోయినా అందరికీ బిల్లుల చెల్లింపు ప్రక్రియ ఆగిపోతుంది. ముందుగా ధాన్యం కొనుగోలుచేసిన అధికారులు 20రోజుల తర్వాత రైతుల నుంచి బ్యాంకుల ఖాతాలు, ఇతర ధ్రువీకరణ పత్రాలను సేకరిస్తున్నట్లు తెలిసింది. అడుగడుగునా కష్టాలే! రైతులు భూమి చదును చేసే నాటి నుంచి పంటకోసే వరకు కష్టాలు తప్పడం లేదు. కంది పంట సాగుకు ఎక రా దుక్కి దున్నేందుకు రూ.2వేలు విత్తనాల ఖర్చు రూ.500, అచ్చులతో విత్తనాలు వేసేందుకు రూ.వెయ్యి, కలుపుతీతకు కూలీల ఖర్చు రూ.ఐదువేలు, ఎరువుల ఖర్చు రూ.ఐదువేలు, పంటకోత కూలీ రూ.రెండువేలు, ఇలా ఎకరాకు రూ.15వేలు ఖర్చవుతుందని రైతులు చెబుతున్నారు. రైతు కంది పంట ను సాగుచేస్తే దిగుబడి రాకపోతే అప్పులపాలు కాకతప్పదని వాపోతున్నారు. ప్రభుత్వం వివిధ పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందిస్తూ అన్నంపెట్టే రైతన్నల కు మాత్రం మొండిచేయి చూపుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ధాన్యం అమ్మిన రూ.4.67కోట్ల డబ్బులు చెల్లించాలని కోరుతున్నారు. 10క్వింటాళ్ల కందులు తీసుకొచ్చా 10 క్వింటాళ్ల కందులను మదనాపురం మార్కెట్ యార్డుకు విక్రయించేందుకు తీసుకొచ్చాను. ఇంతకుముందు కందులు అమ్మిన రైతులకు డబ్బులు రాలేదని తెలిసింది. రైతులకు త్వరగా డబ్బులు చెల్లించే విధంగా చూడాలి. – నాగరాజు, రైతు, గట్లఖానాపురం రైతులను ఇబ్బంది పెట్టొద్దు మేం ఆరుగాలం కష్టించి పండించిన పంటను మార్కెట్ యార్డుకు తీసుకొచ్చి విక్రయించాం. గత నెలలో కందులు అమ్మిన రైతులకు డబ్బులు ఇంకా రాలేదు. తక్షణమే అధికారులు స్పందించి డబ్బులు చెల్లించాలి. – బాలస్వామి, రైతు, కొత్తకోట -
పట్టా కోసం రైతు ఆత్మహత్యాయత్నం
-
కలకలం!
శ్రీకాకుళం పాతబస్టాండ్: కలెక్టరేట్ సాక్షిగా కలకలం రేగింది. రెండేళ్లుగా తిరుగుతున్నా విద్యుత్ కనెక్షన్ మంజూరు చేయడం లేదని, అధికార టీడీపీ నాయకులు అడ్డుతగులుతున్నారనే ఆవేదనతో జి.సిగడాం మండలం బాతువ గ్రామానికి చెందిన యువ రైతు టంకాల మోహన్‌రంగ బలవన్మరణానికి ప్రయత్నించాడు. అయితే అక్కడ ఉన్నవారంతా అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. టంకాల మోహన్రంగకి బాతువ గ్రామంలోని సర్వే నంబర్ 279లో ఎకరాన్నర భూమి ఉంది. ఆ భూమి మెట్టు ప్రాంతంలో ఉండడంతో రెండేళ్ల క్రితం బోరుబావి వేయించాడు. దీనికి విద్యుత్ కనెక్షన్ అవసరం ఉండడంతో సంబంధిత శాఖకు డిపాజిట్‌ను కూడా చెల్లించాడు. అయితే విద్యుత్ కనెక్షన్ మంజూరు కానీయకుండా గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారు. అయినప్పటికీ విద్యుత్ కనెక్షన్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. రెండుసారు కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశాడు. మరో రెండు పర్యాయాలు గ్రామంలో జరిగిన జన్మభూమి గ్రామ సభల్లో కూడా వినతి పత్రాలు అందజేశాడు. అలాగే ముఖ్యమంత్రికి తెలియజేసేలా 1100 నంబర్‌కి కూడా ఫిర్యాదు చేశాడు. అయినా ఫలితం లేకపోవడంతో చావే శరణ్యమని భావించాడు. సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్ వచ్చిన మోహనరంగ.. వెంట తెచ్చుకున్న కిరోసిన్‌ను ఒంటిపై పోసుకున్నాడు. అయితే అక్కడ ఉన్న వారు వెంటనే మేల్కొని అడ్డుకోవడంతో ఆపాయం తప్పింది. విషయం జిల్లా కలెక్టర్ కె.ధనంజయరెడ్డి దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు. రైతు మోహనరంగతో మాట్లాడారు. రెండో రోజుల్లో సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. జి.సిగడాం తహసీల్దారు, ఆర్ఐలకు ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. భూమిని అమ్మాలని పట్టుబడుతున్నారు తమ గ్రామానికి చెందిన అధికార్టీ నాయకుడు, రేషన్ డీలర్ కూర్మారావు రియల్ ఎస్టెట్ వ్యాపారం చేస్తుంటారు. దీంతో నా భూమిని అమ్మాలని పట్టుబడుతున్నారు. దీనికి అంగీకరించలేదు. దీంతో విద్యుత్ కనెక్షన్ మంజూరు కానీయకుండా పలుకుబడిని ఉపయోగించి అడ్డుకుంటున్నారు. దీంతో చచ్చిపోవాలనుకున్నాను.- మోహన్‌రంగ,బాధిత రైతు -
కలెక్టరేట్లలో ముగ్గురు రైతుల ఆత్మహత్యాయత్నం
సాక్షి, నెట్వర్క్: రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అధికారులు, టీడీపీ నేతల తీరుతో విసిగి వేసారిన ముగ్గురు రైతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. అప్పుల బాధతో మరో అన్నదాత ఆత్మహత్య చేసుకున్నాడు. జిల్లా కలెక్టరేట్ల ఆవరణల్లోనే కిరోసిన్, పెట్రోల్ పోసుకొని ప్రాణాలు తీసుకోబోయారు. ఇక పత్తికి గిట్టుబాటు ధరల్లేక, అప్పులు తీరేదారి కనిపించక అనంతపురం జిల్లాలో నరసింహులు పురుగు మందు తాగి తనువు చాలించాడు. డిగ్రీ చదివి వ్యవసాయం: గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం బుక్కాపురానికి చెందిన మాడా శివ ప్రసన్న బాబు డిగ్రీ వరకూ చదివాడు. గత పదేళ్లుగా తనకున్న రెండెకరాలతో పాటు మరో 5 ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. నకిలీ విత్తనాలు, ప్రకృతి వైపరీత్యాలతో అరకొర పంట చేతికందుతుండటం.. గిట్టుబాటు ధరల్లేక రూ.8లక్షల వరకు అప్పులపాలయ్యాడు. దీంతో సాగు మానేసి.. డెయిరీ పెట్టుకోవాలనుకున్నాడు. రుణం కోసం మూడేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. వారు పట్టించుకోకపోవడంతో.. 4 నెలల కిందట సీఎం చంద్రబాబును కలిశాడు. ఆయన స్పందిస్తూ డెయిరీ పెట్టుకోవడానికి రుణం మంజూరు చేయిస్తానని, రూ.25 వేలు ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇవ్వడంతో.. ప్రసన్నబాబు మళ్లీ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూనే ఉన్నాడు. సోమవారం జెడ్పీలో నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌లో జేసీ క్రితికా శుక్లాకు వినతిపత్రం అందించాడు. ఆ వెంటనే పెట్రోల్ బాటిల్ బయటకు తీసి శరీరంపై పోసుకొని నిప్పంటించుకోబోయాడు. అప్రమత్తమైన సిబ్బంది ప్రసన్నను పక్కకు తీసుకెళ్లారు. అక్కడే ఉన్న కలెక్టర్ కోన శశిధర్ ప్రసన్నను మళ్లీ లోపలికి పిలిపించుకొని మాట్లాడారు. అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు బాధితుడు చెప్పాడు. కలెక్టర్ వెంటనే నాబార్డు ద్వారా ఐదు గేదెలు కొనుగోలు చేయడానికి రుణం మంజూరు చేయాలని ఆదేశించారు. పాసు పుస్తకం కోసం: చిత్తూరు జిల్లా వీకోట మండలం దొడ్డిపల్లెకు చెందిన ఉదయ్‌కుమార్ 15 ఏళ్లుగా 2.45 ఎకరాల డీకేటీ భూమిలో సాగు చేసుకుంటున్నాడు. అనాథ యువతి వివాహానికి సాయం చేసినందుకు గానూ గ్రామస్తులు ఈ భూమిని ఉదయ్‌కుమార్‌కు గతంలో అప్పగించారు. ఈ భూమికి సంబంధించిన పట్టా పుస్తకాలు ఇప్పించాలని జన్మభూమి సభలో అధికారులను కోరాడు. అయితే ఆ భూమి లక్ష్మమ్మ అనే మహిళ పేరుతో ఉందని తెలపడంతో ఉదయ్‌కుమార్.. జిల్లా కలెక్టర్‌ను కలసి సమస్య పరిష్కరించాలని కోరాడు. వారు పట్టించుకోకపోవడంతో ఇటీవల సీఎం దృష్టికి తీసుకెళ్లాడు. సీఎం ఆదేశాల మేరకు తహసీల్దార్ దొడ్డిపల్లె గ్రామానికి వెళ్లి విచారించగా.. ఆ భూమి ఉదయ్ ఆధీనంలోనే ఉందని తేలింది. తర్వాత కూడా సమస్య కొలిక్కి రాకపోవడంతో ఉదయ్ కుమార్ భార్య, పిల్లలతో కలసి సోమవారం మధ్యాహ్నం కలెక్టరేట్‌కు వచ్చి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. టీడీపీ నేతలు వేధిస్తున్నారంటూ: శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం బాతువకు చెందిన టంకాల మోహనరంగకు ఎకరాన్నర భూమి ఉంది. సాగు కోసం బోరు బావి వేయించుకునేందుకు విద్యుత్ కనెక్షన్ కావాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. అయితే అదే గ్రామానికి చెందిన రేషన్ డీలర్ కూర్మారావు అడ్డుపడుతున్నాడు. రియల్ ఎస్టేట్ చేస్తున్న కూర్మారావు కన్ను మోహనరంగకు చెందిన భూమిపై పడింది. అది తనకు రాసివ్వాలంటూ మోహనరంగపై ఒత్తిడి చేస్తున్నాడు. మోహనరంగ ససేమిరా అనడంతో విద్యుత్ కనెక్షన్ మంజూరు కాకుండా అడ్డుపడుతున్నట్లు తెలిసింది. దీంతో మనస్తాపానికి గురైన మోహనరంగ సోమవారం కలెక్టరేట్‌కు వచ్చి.. శరీరంపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. -
‘పచ్చ బంగారం’ ధర పలికేనా..!
బాల్కొండ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో రైతులకు సిరులు కురిపించి న పసుపుపంట ధర ప్రస్తుతం నేలచూపులు చూస్తోంది. రాజన్న హయాంలో క్వింటాలు ధర రూ.17వేలు పలుకగా, నేడు గరిష్టంగా రూ.8 వేలు పలుకుతోంది. మరోవైపు జిల్లాలో పసుపుబోర్డు కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ప్రత్యేక పసుపు బోర్డు ఏర్పాటైతే మద్దతు ధర లభిస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. జిల్లాలో పచ్చ బంగారంగా పిలుచుకునే పసుపు పంటకు ఆశించిన ధర కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. జిల్లాలో 33వేల ఎకరాల్లో రైతులు పసుపు పంటను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పసుపు తవ్వకాలు జోరందుకున్నా యి. రైతులు పసుపును మార్కెట్‌కు తరలిస్తు న్నారు. కాగా క్వింటాలుకు గరిష్టంగా రూ.8 వేలు, కనిష్టంగా రూ.6 వేల ధర పలుకుతోంది. దీంతో రైతులకు గిట్టుబాటు కావడం లేదు. పసుపు పంట సాగుకు అధిక మొత్తంలో ఖర్చు అవుతుంది. ఎకరానికి రూ.లక్ష నుంచి రూ. లక్షన్నర పెట్టుబడి పెట్టి సాగు చేసే పంట కావడంతో రైతులకు మార్కెట్ ధర గిట్టుబాటు కావడం లేదు. కనీసం క్వింటాలుకు రూ. 10 వేల కంటే ఎక్కువ ఉంటేనే పెట్టిన పెట్టుబడికి గిట్టుబాటు అవుతుందని రైతులు అంటున్నారు. రాజన్న హయాంలో.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో 2007, 2008లో క్వింటాలు పసుపు ధర గరిష్టంగా రూ.17 వేలు, కనిష్టంగా రూ.12 వేలు పలికింది. మార్క్‌ఫెడ్ ద్వారా పసుపు పంటను కొనుగోలు చేయడంతో రైతులకు మంచి ధర లభించింది. ధరలు నిలకడగా ఉండటంతో రైతులకు మంచి లాభాలు వచ్చాయి. రాజన్న వ్యవసాయాన్ని పండగ చేశారు. పసుపుపంట సాగు చేస్తున్నప్పటి నుంచి అంత ధర దక్కలేదని రైతులు అంటున్నారు. అలాంటి ధరను ఎప్పుడు చూస్తామా.. అని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. పసుపు పంట సీజన్ వచ్చిన ప్రతిసారి రాజశేఖర్‌రెడ్డి పాలనలో వచ్చిన ధరను గుర్తు చేసుకుంటున్నారు. పాలకుల నిర్లక్ష్యంతో.. వైఎస్ మరణం తరువాత పాలకుల నిర్లక్ష్యం పసుపు రైతుల పాలిట శాపంగా మారింది. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉండగా పసుపు పంటకు క్వింటాలుకు రూ.4 వేల మద్దతు ధర ప్రకటిస్తే సరిపోతుందని కేంద్రానికి లేఖ రాశా రు. దీంతో పసుపు రైతులకు కష్టాలు ప్రారంభమయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పసుపు రైతులను గురించి పాలకులు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్ద కాలంగా మద్దతు ధర కోసం, పసుపు ప్రత్యేక బోర్డు ఏర్పాటు కోసం పోరాటాలు చేస్తున్నా.. ఇప్పటికీ మోక్షం కలుగలేదు. పసుçపు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయడం కుదరదని కేంద్రం తేల్చి చెప్పడంతో రైతుల్లో ఆందోళన మరింత తీవ్రమైంది. ప్రత్యేక రాష్ట్రంలోనైనా మోక్షం లభిస్తుందని రైతులు నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్నారు. కానీ వారికి నిరాశే మిగులుతోంది. పాలకులు స్పందించి పసుపు పంటకు కనీన మద్దతు ధర ప్రకటించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
యువరైతు ఆత్మహత్య
దిలావర్పూర్(నిర్మల్): కాలం కలిసిరాక.. సాగుకు తెచ్చిన అప్పులు తీర్చే దారి తెలియక ఓ యువరైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం సాంగ్వి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యు లు,పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రైతు కోండ్రు రాజారెడ్డి(36) తనకున్న మూడెకరాల భూమికి తోడు మరో తొమ్మిది ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. రెం డేళ్లుగా ప్రకృతి సహకరించకపోడంతో పాటు పంటలకు చీడపీడలు ఆశించి పెట్టుబడి సైతం అందక అప్పు ల పాలయ్యాడు. సుమారు రూ.లక్ష వరకు బ్యాంకురుణం, బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి మరో రూ.లక్ష అప్పు తెచ్చాడు. మరో రూ.మూడు లక్షల వరకు ప్రైవేట్ వ్యక్తుల వద్ద తెచ్చిన పేరకుపోవడంతో వాటిని ఎలా తీర్చేదని నిత్యం మదనపడుతుండేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో సంక్రాంతి పండుగకు భార్య మమత మూడు రోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది. ఉదయం తల్లిదండ్రులకు పొలంకు వెళ్తున్నానని చెప్పి రాజారెడ్డి బయలుదేరాడు. చేనుకు ఆనుకుని ఉన్న చెట్టుకు మృతదేహం వేలాడుతుండడం చూసిన సమీప రైతులు విషయాన్ని సర్పంచ్ విఠల్, తదితరులకు చెప్పగా వారు అక్కడికి వెళ్లారు. మృతుడు రాజారెడ్డిగా గుర్తించారు. వెంటనే ఎస్సై హరిబాబు, కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కుటంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి ఎనిమిదేళ్ల కుమారుడు జయకేతన్రెడ్డి ఉన్నాడు. ఘటనా స్థలాన్ని ఎమ్మారై రాము, వీఆర్వో శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించి రైతు ఆత్మహత్యకు దారి తీసిన కారణాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు
సాక్షి, జగిత్యాల: పంటలకు సాగునీరు అందించాలని కోరుతూ జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లి రైతులు కోరుట్ల-జగిత్యాల రహదారిపై మంగళవారం ఉదయం రాస్తారోకో నిర్వహించారు. శ్రీరామ్‌సాగర్ కాలువకింద ఉన్న తమ భూములకు నీరందక పంటలు ఎండిపోతున్నాయని, తమ విద్యుత్ మోటార్ల కనెక్షన్లను విద్యుత్ అధికారులు తొలగించారని వారు ఆరోపిస్తున్నారు. ఎస్సారెస్పీ నీళ్లు తమ పంటలకు అందకుండా అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని వారు అన్నారు. రహదారిపై రైతులు భైఠాయించడంతో వాహనాలు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. దాంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తాటిపల్లి రైతుల ఆందోళనకు జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మద్దతు ప్రకటించారు. విద్యుత్ మోటార్లకు కనెక్షన్ పునరుద్ధరించి సాగునీరు ఇచ్చేంతవరకూ ఆందోళన విరమించేది లేదని వారు స్పష్టంచేశారు. -
శ్రమణీయం... రమణీయం!
‘నాకెంత దాహమేసిందో నా మొక్కలకూ అంతే దప్పిక కదా. నాకు నా వాళ్లు నీళ్లిచ్చారు. మరి వాటికి నేనే కదా వాళ్ల వాడిని. మబ్బును వంచి, మొయిలును తుంచి, మొక్క మొక్క మీదా పిండి నీళ్లు కురిపించాలని ఉంటుంది నాకు. అది కుదిరేపని కాదు కదా’ అంటాడు రైతు. అప్పటి వరకూ ఎండలో తిరిగి తిరిగి అప్పుడే ఇంటికి చేరాడాయన. కాసిన్ని నీళ్లవ్వమంటే ఆలి కుండలోంచి మంచినీళ్లిచ్చింది. చల్లటి ఆ నీళ్లు హాయిగా గొంతు దిగుతున్నాయి. కాసేపు ఆ సుఖాన్ని అనుభవిస్తున్నవాడు కాస్తా గబుక్కున లేచాడు. చివరి నీటి గుక్క గొంతుదాటేలోపు ఆయన అడుగు గడప దాటింది. వసారాన కావడి భుజం చేరింది. ఇంటి దగ్గరి తొలి అడుగు పొలం వైపునకు పరుగయ్యింది. ‘‘చల్లటి నీళ్లు గొంతు తడుపుతుంటే... ఆ హాయి నీ మనసు తడుముతుంటే... అనుభవిస్తూ కూర్చోక అంత వేగంతో ఎందుకు కదిలావూ...?’’ అడిగింది మనస్సాక్షి. ‘‘నేనంత హాయిని అనుభవించా కదా. మరి నా బిడ్డలక్కడ నీళ్లు లేక ఎప్పట్నుంచి ఎండుతున్నాయో! మరి వాటికీ ఆ హాయి వద్దా?’’ అంటూ ఎదురుప్రశ్నించాడాయన. ఎవరయ్యా ఆయన... అవును... రైతయా ఆయన. ‘‘పొలంలో మొక్క పదిలంగానే ఉంటుందిలే. వానేమో పడలేదు. రేపైనా పడుతుందేమోలే. కాసేపు నీడపట్టున కూర్చోకపోయావా?’’ మళ్లీ అడిగింది మనస్సాక్షి. ‘‘నాకెంత దాహమేసిందో నా మొక్కలకూ అంతే దప్పిక కదా. నాకు నా వాళ్లు నీళ్లిచ్చారు. మరి వాటికి నేనే కదా వాళ్ల వాడిని. మబ్బును వంచి, మొయిలును తుంచి, మొక్క మొక్క మీదా పిండి నీళ్లు కురిపించాలని ఉంటుంది నాకు. అది కుదిరేపని కాదు కదా. అందుకే ఇలా బయల్దేరా’’ మనస్సాక్షికి సమాధానమిచ్చాడు రైతు. అవును... రైతంటే అంతేమరి. సాధ్యం కానివీ, చేయాలనుకునేవాటినీ చేయాలనుకునేవాడే సేద్యగాడు మరి. చిన్నప్పుడు అందరూ ప్రకృతి వికృతి చదువుకున్నారు కదా. సాధ్యగాడు అనే మాట ప్రకృతి అయితే దాని వికృతి రూపమే సేద్యగాడేమో!? తల్లీ బిడ్డల్ని చూసుకున్నట్టుగానే చేను–మొక్కల్ని తాను చూస్తాడు. అరకపట్టీ మెరకదున్నీ చదునుచేసీ నాట్లు వేసి మొక్క మొలిచీ మొలవగానే... పసిబిడ్డలా దాన్ని పట్టుబట్టి సాకుతాడు. గిట్టుబాటు అవుతుందా లేదా అని కూడా లెక్క చూడడు. బిడ్డల ఖర్చును ఎవడైనా లెక్క చూస్తాడా? హాలికుడూ అంతే... నిజానికి రైతు లెక్క చూస్తే నాగలి కూడా మిగలదు. దాన్ని చేయించడమూ కుదరదు. పొలం ఏండిన ఏడూ... చేను పండని ఏడు పాట్లెక్కువ. అరకొర పండినా మార్కెట్లో అగచాట్లెక్కువ. పండించాక కూడా దళారీ జేబులోని నోట్లూ ఎక్కువ. కానీ... తనకు మాత్రం గిట్టుబాటు తక్కువ. అయినా సరే... రైతు లెక్క చూడడు. అలాంటి వాడు లెక్క చూడటం మొదలు పెట్టి మొక్క మొక్కకూ లెక్కవేసి, గిట్టుబాటు కాదంటూ కాస్తా పాడుబడితే... చేను కాస్తా బీడుపడతది. రైతు క్షేమమే కదా రాజ్య క్షేమం. రైతు భాగ్యమే కదా రాజ్య భాగ్యం. అప్పుడు రైతు గోసపడితే రాజూ గోసపడాల్సి వస్తుంది. ఎందుకంటే... రాజనాలు పండించే వాడే పస్తుంటే పరమాత్మకూ పస్తే అంటారు. ఇక ఆ తర్వాత రాజనగా ఎంత... మహారాజనగా ఎంత! అందుకే వాడు తాను చెడ్డా చేను చెడనివ్వడు. పొలం పొత్తిళ్లలోని మొక్కల చాళ్లలో నీళ్లు కావిళ్లతో పోసి, ప్రతి మొక్క మొదళ్లలోనూ అంతో ఇంతో తడి ఉండేలా చేసి, మర్నాడు మధ్యాహ్నం ఎండపూటన వచ్చి... మట్టిలో వేళ్లు గుచ్చి... తడి ఇంకా ఉందా... నేల పొడిబారిందా అంటూ మాటిమాటికీ చూసుకుంటాడు. ఒకరిద్దరు బిడ్డలున్న తల్లి పని కాస్త సులువు. కానీ పొలంలో ప్రతి మొక్కా రైతుకు బిడ్డేగా. అందుకే మొక్క మొక్కకూ ఆ హలజీవి కావిడి నీళ్లతో పెట్టే తడి ముద్దుతోనేనేమో... రైతులోని ఆ అమ్మదనం – మన కంచంలో కమ్మదనంగా మారి నోటికి ఇంత ముద్దగా రుచిగా అందుతోంది. అందుకే కాలం కాకున్నా... పొలం పండకున్నా... ఏటికేడాది నష్టం వస్తున్నా లాభం లేకున్నా చీడ ఆశించినా... పీడ పట్టేసినా వదలకుండా చేనుకాపలాదారు కనిపెట్టుకొని ఉంటూ ఆలా సేద్యాన్ని చేస్తూనే ఉంటాడా వ్యవసాయదారు. ‘ఎందుకయా ఇంత బాధ’ అంటూ మనస్సాక్షి ఆ కమతగాణ్ణి అడిగితే ఆయనంటాడూ... ‘చేనుకి గట్టూ... ఊరికి కట్టూ’ ఉండాలేమోగానీ ‘రైతుకు బెట్టు ఎందుకయా... పొలం బెట్టగొట్టుకుపోయినా రైతు వ్యవసాయం మానొద్దు. ఎందుకంటే చేను చేసి ఎవడూ చెడిందీ లేదూ... చెడు చేసి ఎవడూ బతికిందీ లేదు’ అంటూ ఏటికేటికి నష్టాలు వస్తున్నా మాటిమాటికి అదే సమాధానమిస్తుంటాడు. ‘నేను సాగు చేస్తే పెంట కూడా పంటవుతుంది. నేను గడ్డి వేస్తే అదే ఊళ్లో పాడి అవుతుంది. పదిమందికీ ఆఖరికి పరమాత్మకూ పరమాన్నం పెట్టేవాడిని నేనే. అలాంటి నేను కాడి దించేస్తే ఎలా?’’ అందుకే మనం ముద్ద ముద్దకూ ఆయన్నే కొలవాలి. ముద్ద తినేముందర ఆయన్నే తలవాలి. ఇకపై మన ప్రతి పనీ ఒకటే మాటను గుర్తుపెట్టుకొని చేయాలి. అదేమిటంటే... చేలు పండాలి. రైతు గుండె నిండాలి. ఊరు నిబ్బరంగా, నిశ్చింతగా, నిర్భయంగా ఉండాలి. లోకం సుక్షేమంగా నిక్షేపంగా సుభిక్షంగా ఉండి తీరాలి. – యాసీన్ -
రాంపూర్‌లో రైతు దారుణ హత్య
భీమిని(బెల్లంపల్లి): భీమిని మండలం మల్లీడి గ్రామపంచాయతీలోని రాంపూర్ గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి అదే గ్రామానికి చెందిన జాపల్లి శ్రీనివాస్(42)దారుణంగా హత్యకు గురయ్యారు. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం...శనివారం ఉదయం గ్రామస్తులు గ్రామ సమీపంలోని అతని కంది చేనులో శ్రీనివాస్ మృతదేహం కనిపించడంతో గ్రామస్తులు వెంటనే కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో భార్య, కుమార్తె, కుమారుడు, బంధువులు వెళ్లి చూడగా తన కంది చేనులోనే విఘతజీవుడై కనిపించాడు. దీంతో కుటుంబీకులు రోదనలు మిన్నంటాయి. కాగా శ్రీనివాస్ మృతదేహం పక్కనే రక్తం మడుగు ఉండటం, మృతదేహం పక్కనే రక్తంతో కూడిన బనియన్ ఉంది. రక్తపు మరకలు అంటిన బండరాయి ఉండటంతో బండరాయితోనే మోది శ్రీనివాస్‌ను హత్య చేసినట్లు పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. విషయం తెలుసుకున్న తాండూర్ సీఐ జనార్ధన్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని గ్రామస్తులను, కుటుంబ సభ్యులను వివరాలు అడిగారు. అనంతరం పోలీసులు డాగ్‌స్క్వాడ్ బృందంతో కుటుంబీకులు చెప్పిన అనుమానిత వ్యక్తుల పేర్ల ఇంటి వద్దే పోలీసు జాగిలం వెళ్లింది. దీనిపై పోలీసులు ఎందుకు హత్యకు గురయ్యాడో గల కారణాలు, నిందితులను పట్టుకుంటేనే తెలిసే అవకాశాలు ఉన్నాయి. మృతుడి భార్య భాగ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శ్రీనివాస్‌కు కూతురు దివ్య, కుమారుడు వంశీ ఉన్నారు. ఈ విచారణలో కన్నెపల్లి ఎస్సై లక్ష్మణ్, తాండూర్ ఎస్సై రవి, వైస్ ఎంపీపీ గడ్డం మహేశ్వర్‌గౌడ్ ఉన్నారు. -
ఫిబ్రవరిలో విస్తృతస్థాయి సమావేశం
సాక్షి, హైదరాబాద్: భవిష్యత్ కార్యాచరణపై చర్చించడానికి ఫిబ్రవరి 3వ తేదీ లేదా 4వ తేదీన విస్తృతస్థాయి సమా వేశం నిర్వహిస్తామని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం వెల్లడించారు. రైతు అధ్యయన యాత్రలపై సమీక్షించడానికి శనివారం హైదరాబాద్‌లో జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం వివరాలను కోదండరాం మీడియాకు వెల్లడించారు. తెలంగాణలోని పాత 10 జిల్లాల్లో రైతు అధ్యయన యాత్రలు పూర్తయ్యాయని, ఇంకా మిగిలిఉన్న ప్రాంతాల్లో ఈ నెల 20వ తేదీ నాటికి పూర్తిచేస్తామన్నారు. 22వ తేదీ నుంచి 30వ తేదీ దాకా జిల్లాల వారీగా జరిగిన అధ్యయన యాత్రల్లో వచ్చిన అంశాలపై సమీక్షా సమావేశాలు, సదస్సులు ఉంటాయని చెప్పారు. జిల్లా స్థాయి సదస్సులు పూర్తయిన తరువాత విçస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తామన్నారు. జేఏసీ నేత గోపాలశర్మ అరెస్టుపైనా సమీక్షించినట్టుగా కోదండరాం వెల్లడించారు. -
ఫ్యూజ్ మారుస్తుండగా ప్రాణాలే పోయాయ్
సాక్షి, ములుగు రూరల్: ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫ్యూజ్ మార్చుతూ విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మృతిచెందాడు. ఈ విషాద సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు మండలం మల్లంపల్లి గ్రామంలో శుక్రవారం జరిగింది. మల్లంపల్లికి చెందిన మోత్కూరి సుధాకర్(43) తన వ్యవసాయ భూమిలో అరటి తోట సాగు నిమిత్తం చేను తడిపేందుకు శుక్రవారం నీరు పారిస్తున్నాడు. ఈ క్రమంలో ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫ్యూజ్ కొట్టేయడంతో మోటార్ ఆగిపోయింది. దీంతో సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లి ఫ్యూజ్ సరిచేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకొని రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
చెక్కులు, ఖాతాలకే రైతుల మొగ్గు
సాక్షి, హైదరాబాద్: రైతులకు పెట్టుబడి రాయితీ సొమ్మును ఎలా అందజేయాలన్న దానిపై తాము నిర్వహించిన సర్వేలో 60 శాతం మంది రైతులు చెక్కులు ఇవ్వాలని లేదా తమ బ్యాంకు ఖాతాలో వేయాలని సూచించారని వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి వెల్లడించారు. సర్వే వివరాలను బుధవారం ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. తాము ఆరు పద్ధతులపై 62,677 మంది రైతులతో సర్వే నిర్వహించామన్నారు. వాటిలో పై రెండింటికి మెజారిటీ రైతులు మొగ్గు చూపారన్నారు. సర్వే ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. ♦ చెక్కు రూపేణా ఇవ్వాలని కోరిన రైతులు– 31.58 శాతం. (జిల్లాల వారీగా చూస్తే సర్వేలో పాల్గొన్న రైతులలో మేడ్చల్ 63.8 శాతం మంది, నిజామాబాద్ 57.1 శాతం, ఆదిలాబాద్ 50 శాతం మంది, అలాగే 40 శాతానికి పైగా ఈపద్ధతిని కోరిన జిల్లాల్లో కామారెడ్డి, కరీంనగర్, జగిత్యాల, సంగారెడ్డి, సిద్దిపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల రైతులున్నారు) ♦ తమ బ్యాంకు ఖాతాలో జమ చేయాలన్న రైతులు– 27.55 శాతం. (వరంగల్ అర్బన్ 81.55 శాతం, రాజన్న సిరిసిల్ల 62.38 శాతం, వరంగల్ రూరల్ 49 శాతం, జనగాంలో 44.94 శాతం మంది ఉన్నారు. అలాగే 30 శాతానికి పైగా కోరిన వారిలో నిర్మల్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, నాగర్ కర్నూల్, మెదక్, నల్లగొండ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల రైతులున్నారు) ♦ నగదు రూపంలో ఇవ్వాలన్నవారు– 26.59 శాతం. (జిల్లాల వారీగా చూస్తే – ఆసిఫాబాద్ 62.17 శాతం, వికారాబాద్ 48 శాతం, జోగుళాంబ గద్వాల 46.08 శాతం, రంగారెడ్డి జిల్లాలో 42 శాతంమంది ఉండగా, 30 శాతానికిపైగా నగదు రూపంలో కోరిన జిల్లాల్లో మహబూబ్‌నగర్, వనపర్తి, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ రైతులున్నారు) ♦ పోస్టాఫీసుల ద్వారా ఇవ్వాలన్నవారు– 6.81 శాతం ♦ ప్రీలోడెడ్ కార్డులు/ఇతర రూపాల్లో కోరినవారు– 6.44 శాతం ♦ c ప్రాథమిక సహకార సంఘాల ద్వారా కోరినవారు– 1.03 మంది -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
సాక్షి, పరకాల రూరల్: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండలం వరికోల్‌లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మోర్తాల తిరుపతి (39) తనకున్న ఎకరం భూమితోపాటు మరో రెండెకరాలు కౌలుకు తీసుకుని మూడేళ్లుగా పత్తి పంట సాగు చేస్తున్నాడు. పెట్టుబడి ఎక్కువ కావడం, దిగుబడి తగ్గడంతో తీవ్రంగా నష్టపోయాడు. అప్పటికే రూ.2 లక్షల అప్పు ఉండగా ఈ ఏడాది మరో రూ.లక్ష అప్పు చేశాడు. దీంతో అప్పు ఎలా తీర్చాలి అని మనోవేదనకు గురైన తిరుపతి సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య సమ్మక్క, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
కాటేసిన కరెంట్
కట్టంగూర్(నకిరకల్) : కరెంట్ కాటుకు ఇద్దరు బలయ్యారు. నల్లగొండ జిల్లాలోని కట్టంగూర్, నిడమనూర్ మండలాల పరిధిలో సోమవారం ఈ విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. కట్టంగూర్ మండలం పామనగుండ్ల గ్రామానికి చెందిన కాడెబోయిన పద్మ(28) నూతనంగా నిర్మిస్నున్న ఇంటికి నీళ్లు చల్లుతుండగా కరెంట్ షాక్‌కు గురైంది. గమనించిన కుటుంబ సభ్యులు నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ రంజిత్ పేర్కొన్నారు. గుంటుకగూడెంలో రైతు.. నిడమనూరు: మండలంలోని గుంటుకగూడెం గ్రామానికి చెందిన మేరెడ్డి నర్సింహారెడ్డి(55) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మధ్యాహ్నం వ్యవసాయ బావి వద్ద పొలం పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో మోటారు నుంచి స్తంభానికి ఉన్న సర్వీస్ వైరును ఎత్తుగా ఉన్న కర్రలపై పెట్టే ప్రయత్నంలో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. ఇతడికి భార్య, వికలాంగురాలైన కుమార్తె ఉన్నారు. పోస్టుమార్టమ్ అనంతరం సాయంత్రం మృతదేహాన్ని గుంటుకగూడెం తీసుకువచ్చారు. మృతదేహాన్ని చూడగానే కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నం టాయి. మృతుడి భార్యమేరెడ్డి రాధ ఫిర్యాదు మేరకు కేసు న మోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ తెలిపారు. అంతకుముందు ఆస్పత్రిలో నర్సింహారెడ్డి మృతదేహాన్ని మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు సందర్శించారు. మృతుడి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. -
జన్మభూమి సభలో కలకలం
కర్నూల్ జిల్లా, డోన్ టౌన్ : చాలా ఏళ్లుగా తాము సాగు చేసుకుంటున్న భూమి వివరాలను రెవెన్యూ అధికారులు ఆన్లైన్ నుంచి తొలగించి, ఇతరుల పేరిట నమోదు చేశారనే మనస్తాపంతో ఓ రైతు జన్మభూమి సభలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మిగిలిన బాధిత రైతులు కూడా పురుగు మందు డబ్బాలతో వచ్చి నిరసన తెలిపారు. ఈ సంఘటన గురువారం కర్నూలు జిల్లా డోన్ మండలం గోసాని పల్లె గ్రామంలో జన్మభూమి సభలో గోసానిపల్లె పరిధిలోని సర్వే నంబర్ 959లో 8.56 ఎకరాల మిగులు భూమి ఉంది. దీన్ని ఇదే గ్రామానికి చెందిన చిన్న రంగస్వామి, శ్రీనివాసులు, బాబయ్య, తిక్కలప్ప, రామాంజనేయులు అనే రైతులు సాగు చేసుకుంటున్నారు. రెవెన్యూ అధికారులు చాలాకాలం క్రితమే వీరికి పట్టాదారు పాసు పుస్తకాలను సైతం మంజూరు చేశారు. రెండేళ్ల క్రితం వరకు వీరి పేర్లే ఆన్లైన్లో ఉన్నాయి. అయితే, ప్రస్తుతం వాటిని తొలగించి బోయ ఈశ్వర్ అనే వ్యక్తితోపాటు మరొక వ్యక్తి పేరు నమోదు చేశారు. బాధిత రైతులు ఈ విషయాన్ని పలుమార్లు స్థానిక రెవెన్యూ అధికారులతోపాటు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ‘చూద్దాం, చేద్దాం’ అంటూ చెబుతూ వచ్చారు తప్ప రైతుల పేర్లను తిరిగి ఆన్లైన్లో నమోదు చేయలేదు. ఈ నేపథ్యంలో వారు గురువారం గ్రామంలో ఏర్పాటుచేసిన జన్మభూమి సభకు వచ్చి, అధికారులకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. అధికారుల నుంచి స్పష్టమైన హామీ లభించకపోవడంతో చిన్న రంగస్వామి అనే రైతు మనస్తాపానికి గురయ్యాడు. తన వెంట తెచ్చుకున్న క్రిమి సంహారక మందు డబ్బాను బయటికి తీసి.. తాగేందుకు ప్రయత్నించాడు. మిగిలిన వారు కూడా పురుగు మందు డబ్బాలను చేతబట్టుకుని అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పురుగు మందు తాగేందుకు ప్రయత్నిస్తున్న చిన్నరంగస్వామిని అడ్డుకున్నారు. మందు డబ్బాను లాగేసుకున్నారు. అతడితోపాటు మిగిలిన రైతులను సముదాయించారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని పోలీస్, రెవెన్యూ అధికారులు పేర్కొన్నారు. నాలాంటి పేదలకు న్యాయం చేయాలి ‘‘మేము ఆ భూమిని తాతల కాలం నుంచి సాగు చేస్తున్నాం. పథకం ప్రకారమే మా పేర్లను ఆన్లైన్లో నుంచి తొలగించి, ఇతరుల పేర్లను నమోదు చేశారు. ఇది రెవెన్యూ అధికారుల అవినీతికి నిదర్శనం. న్యాయం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ కనికరించడం లేదు. చివరకు విసుగెత్తిపోయాం. ఇలాంటి అన్యాయం ఎవరికీ జరగకూడదనే ఉద్దేశంతోనే ఆత్మహత్యకు ప్రయత్నించా. ఇకనైనా అధికారులు కళ్లుతెరిచి నాలాంటి నిరుపేద రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నా’’ –చిన్న రంగస్వామి, బాధితుడు ఫారెస్టు అధికారుల ఫిర్యాదుతోనే... ‘‘బాధిత రైతుల పేర్లు చాలా ఏళ్లుగా ఆన్లైన్లో ఉన్న విషయం మాకు తెలియదు. నేను ఏడాదిన్నర క్రితం ఇక్కడికి బదిలీపై వచ్చా. ఫారెస్ట్ అధికారుల ఫిర్యాదు మేరకు 959 సర్వే నంబర్లో నమోదైన బోయ ఈశ్వర్ తదితరుల పేర్లన్నింటినీ ఆన్లైన్లో నుంచి తొలగించాం. తమ పరిధిలోనే ఈ భూమి ఉందని ఫారెస్ట్ అధికారులు ఫిర్యాదు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. జాయింట్ సర్వే చేయించిన తర్వాత అసలైన రైతులను గుర్తించి వారి పేర్లనే ఆన్లైన్లో నమోదు చేస్తాం’’ – మునికృష్ణయ్య, తహసీల్దార్, డోన్ -
ఇద్దరు రైతులను కబళించిన మృత్యువు
ఆమనగల్లు(కల్వకుర్తి): పండించిన పంటను అమ్ముకుందామని హైదరాబాద్‌కు బయలుదేరిన ఇద్దరు రైతులను మృత్యువు కబళించింది. నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలం గుట్టలపల్లికి చెందిన చిందం ముత్తయ్య (46), తాళ్లపల్లికి చెందిన కెంచ పర్వతాలు (25) కీర దోసకాయను హైదరాబాద్ మార్కెట్లో విక్రయించడానికి ఆదివారం రాత్రి బొలెరో వాహనంలో నింపుకుని బయలుదేరారు. వీరి వాహనం రాత్రి 11.40 గంటల సమయంలో రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం కోనాపూర్ గేటు సమీపంలోకి రాగానే ఆమనగల్లు వైపునకు వేగంగా వస్తున్న టాటా జీజేఎస్ వాహనం ఢీకొట్టింది. ఘటనలో రైతులు ముత్తయ్య, పర్వతాలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ప్రమాదంలో బొలెరో డ్రైవర్ సాయి, టాటా డ్రైవర్ డేరంగుల రవి తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆమనగల్లు ఆస్పత్రికి, అక్కడి నుంచి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బొలెరో వాహనంలో చిక్కుకున్న రైతుల మృతదేహాలను జేసీబీ సాయంతో బయటకు తీశారు. అప్పులబాధతో రైతు ఆత్మహత్య పెద్దవూర: వ్యవసాయ పనులకు చేసిన అప్పును తీర్చే మార్గం లేక ఓ రైతు ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం తుంగతుర్తి గ్రామ పంచాయతీ పరిధి చింతపల్లి గ్రామానికి చెందిన వెలుగు యాదగిరి (32) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తనకున్న ఎకరం భూమితోపాటు మరో 5 ఎకరాలను కౌలుకు తీసుకుని మూడేళ్లుగా పత్తిని సాగు చేస్తున్నాడు. పెట్టుబడులకు రూ.5 లక్షలు అప్పు చేశాడు. దిగుబడి సరిగా లేకపోవడం, అప్పులు తీర్చే మార్గం కనపడకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.