ప్రస్తుతం వరి పైరు పొట్టదశలో ఉన్న సమయంలో 31వ తేదీ రాత్రి 10గంటల నుంచి కాలువలకు నీటి విడుదలను నిలిపివేసేందుకు...
- మార్చి 31 రాత్రి 10 గంటలకు ‘డెడ్’లైన్
- అన్నదాతల్లో ఆందోళన
- పొట్టదశలో వరి
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : ప్రస్తుతం వరి పైరు పొట్టదశలో ఉన్న సమయంలో 31వ తేదీ రాత్రి 10గంటల నుంచి కాలువలకు నీటి విడుదలను నిలిపివేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారనే ప్రచారం అన్నదాతల్లో ఆందోళన పెంచుతోంది. జిల్లా వ్యాప్తంగా రబీ సీజన్‌లో 2.65 లక్షల ఎకరాల్లో వరిసాగు జరిగింది. పొట్టదశలో ఉన్న పైరు ఈతకు వచ్చి గింజలు పాలుపోసుకోవాలంటే కనీసం మరో నెల రోజుల సమయం పడుతుందని రైతులు పేర్కొంటున్నారు.
31వ తేదీ రాత్రి నుంచే కాలువలకు నీటి విడుదలను నిలిపివేస్తే ఒక్క ఎకరం కూడా కోతకు రాదనేది రైతుల వాదన. మార్చి 31వ తేదీనే సాగునీటి విడుదలను నిలిపివేయాలన్న ప్రతిపాదన ఉన్న మాట వాస్తవమేనని, అయితే ఈ అంశంపై చర్చలు జరుగుతున్నాయని నీటి పారుదలశాఖాధికారులు చెబుతున్నారు. నీటి విడుదలను నిలిపివేస్తే రైతులు పంట చేతికి రాక కోట్లాది రూపాయలు నష్టపోవడమే కాకుండా తీరంలోని మండలాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడుతందని వారు భయపడుతున్నారు.
ఖరీఫ్ ఆలస్యం వల్లే సమస్య ....
ప్రతి ఏటా ఖరీఫ్ సీజన్‌కు జూన్ 15వ తేదీన కాలువలకు సాగునీటి విడుదల చేయడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈ ఏడాది ఆగ స్టు 9వ తేదీన అధికారికంగా కాలువలకు నీటిని విడుదల చేశారు. నెలాపదిహేను రోజులు సాగునీటి విడుదల ఆలస్యం కావటంతో ఖరీఫ్‌లో వరినాట్లు ఆలస్యంగా పడ్డాయి. ఈ నేపథ్యంలో జనవరి నెలలోనూ ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి వరి కోతలు పూర్తయ్యాయి. ఈ ఏడాది జనవరిలో దాళ్వా పంటకు సాగునీరు విడుదల చేస్తారో, లేదో చెప్పకుండా జాప్యం చేశారు. దీంతో ఫిబ్రవరి నెలలో రబీ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 2.65 లక్షల ఎకరాల్లో ఆలస్యంగా వరిసాగు జరిగింది. ప్రస్తుతం వరి పైరు పొట్ట, పాలు పోసుకునే దశల్లో ఉంది. ఈ తరుణంలో వరికి కచ్చితంగా సాగునీరు అవసరం.
ఎకరానికి రూ.20 వేలకు పైనే ఖర్చు,,,
రబీలో దాళ్వా పంటకు ఎకరానికి రూ.20 వేలు చొప్పున రైతులు ఖర్చు చేశారు. గత రెండేళ్లుగా జిల్లా వ్యాప్తంగా, మూడేళ్లుగా కెఈబీ కాలువ కింద రబీకి నీరు విడుదల చేయలేదు. దీంతో దాళ్వా పంటను సాగు చేసేందుకు రైతులు అధికంగా ఎరువులు వినియోగించాల్సి వచ్చింది. ఎరువుల వినియోగం, పురుగు మందుల పిచికారీ, పైపాటుకు ఎకరానికి రూ.20 వేలకు పైగా ఖర్చు చేశామని రైతులు చెబుతున్నారు. ఈ రబీ సీజన్‌లో కాలువలకు నీటిని విడుదల చేయటంలో అధికారులు ఊగిసలాట ధోరణితో వ్యవహరించినా రైతులు అనేక కష్టాలు పడి పైరును కాపాడుకున్నారు.
ఖరీఫ్‌లో కోలుకోలేని దెబ్బ...
గత ఖరీఫ్ సీజన్‌లో నవంబరులో వారం రోజుల వ్యవధిలో హెలెన్, లెహర్ తుపానుల కారణంగా కురిసిన భారీ వర్షాలు, బలమైన గాలులతో పంట చేతికొచ్చే సమయంలో నేలవాలి దెబ్బతింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఖరీఫ్‌లో తుపానుల కారణంగా నష్టపోయామని, దాళ్వా అయినా సక్రమంగా పండితే కొంతమేర ఆర్థికంగా వెసులుబాటు లభిస్తుందని చెబుతున్నారు.
ప్రతి ఎకరానికీ నీరు ఇవ్వాల్సిందే
ఖరీఫ్ సీజన్‌లో సాగునీటి విడుదలలో జాప్యం జరగడంతో ఆ ప్రభావం రబీపై పడింది. మార్చి 31వ తేదీ నాటికే కాలువలకు సాగునీటి విడుదలను నిలిపివేస్తామని అధికారులు చెప్పటం జిల్లాలోని రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. అఖరి ఎకరం కోత పూర్తయ్యే వరకు సాగునీటి విడుదల చేయాల్సిందే. ఈ అంశంపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలి. పొట్ట, ఈతదశలో ఉన్న వరి పైరు ఒక్క ఎకరం ఎండి కోతకు పనికి రాకుండా పోతే ప్రభుత్వమే బాధ్యత వహించాలి.
- ఎంవీఎస్ నాగిరెడ్డి, వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్