
బంగారం దిగుమతులు డౌన్
బంగారం దిగుమతుల విలువ గడచిన ఆర్థిక సంవత్సరం (2016–17) 14 శాతం తగ్గింది. దిగుమతుల విలువ రూపంలో 27.4 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది .
గతేడాది 13 శాతం తగ్గిన విలువ
న్యూఢిల్లీ: బంగారం దిగుమతుల విలువ గడచిన ఆర్థిక సంవత్సరం (2016–17) 14 శాతం తగ్గింది. దిగుమతుల విలువ రూపంలో 27.4 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది . కరెంట్ అకౌంట్ లోటు (ఎఫ్‌ఐఐ, డీఐఐ, ఈసీబీలు కాకుండా దేశంలోకి వచ్చీ–పోయే మొత్తం విదేశీ మారక ద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం)కు సంబంధించి దేశ స్థూల ఆర్థిక వ్యవ స్థకు ఇది సానుకూల అంశమని అధికార వర్గాలు వివరించాయి. 2016–15లో దేశ పసిడి దిగుమతుల విలువ 31.7 బిలియన్ డాలర్లు.
ఈ రెండు ఆర్థిక సంవత్సరాల్లో కరెంట్ అకౌంట్ విలువ 118.7 బిలియన్ డాలర్ల నుంచి 105.7 బిలియన్ డాలర్లకు తగ్గింది. పసిడి దిగుమతులు చేసుకునే పెద్ద దేశాల్లో భారత్ ఒకటి. ప్రస్తుతం పసిడి దిగుమతులపై 10 శాతం సుంకం విధిస్తున్నారు. ఈ సుంకాన్ని తగ్గించాలని రత్నాలు, ఆభరణాల పరిశ్రమతో పాటు వాణిజ్య మంత్రిత్వశాఖ సైతం ఆర్థిక శాఖను కోరుతున్నాయి.