
ముంబై: అంతర్జాతీయ మార్కెట్‌లో తీవ్ర స్థాయిలో పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు (బ్రెంట్ 80 డాలర్ల స్థాయి), డాలర్ ఇండెక్స్ పటిష్టత (94 స్థాయి) భారత్ రూపాయిపై పెను భారాన్ని మోపుతున్నాయి. ఇంట్రా బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో బుధవారం ఒక్కరోజే రూపాయి 38పైసలు బలహీనపడింది. 68.42 వద్ద ముగిసింది. రూపాయి ఈ స్థాయికి రావడం గడచిన 18 నెలల్లో ఇదే తొలిసారి. గడచిన మూడు వారాల్లో రూపాయి దాదాపు మూడు రూపాయలు నష్టపోయింది. క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల, ఈ కమోడిటీ ప్రధాన దిగుమతి దేశంగా భారత్‌పై పెను ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.
ఇప్పటికే వాణిజ్యలోటు (ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం) కరెంట్ అకౌంట్ లోటు (ఎఫ్‌ఐఐ, ఎఫ్‌డీఐ, ఈసీబీలు మినహా దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం)పై ఆందోళనలను సృష్టిస్తోంది. ఇక దేశంలో ధరల పెరుగుదల భయాలు ఉండనే ఉన్నాయి. దీనివల్ల ఆర్‌బీఐ రెపో రేటు పెంపు, వృద్ధిపై ప్రభావం వంటి ఆందోళనలు నెలకొన్నాయి. ఆ స్థూల ఆర్థిక సవాళ్లన్నీ కలిసి రూపాయి జారుడుకు కారణమవుతున్నాయి. ఆయా అంశాలు కార్పొరేట్లు, దిగుమతిదారుల నుంచి డాలర్ కోసం డిమాండ్‌నూ పెంచుతోంది. మరోవైపు క్యాపిటల్ అవుట్‌ఫ్లోస్‌తో ఈక్విటీ మార్కెట్లూ నష్టాలకు గురవుతుండడం గమనార్హం.