
అన్న మృతదేహం వద్ద రోదిస్తున్న రాజేష్ (ఇన్‌సెట్‌లో) మృతుడు యశ్వంత్
‘ప్రతిరోజూ చదువుకోవాలని ఉదయాన్నే నిద్ర లేపేవాడివే.. ఇప్పుడు నువ్వే శాశ్వతంగా నిద్రపోయావా.
అనంతపురం, ధర్మవరం అర్బన్: ‘ప్రతిరోజూ చదువుకోవాలని ఉదయాన్నే నిద్ర లేపేవాడివే.. ఇప్పుడు నువ్వే శాశ్వతంగా నిద్రపోయావా.. లే అన్నా.. పైకి లే.. అన్నా’ అంటూ తమ్ముడు రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ధర్మవరం పట్టణంలోని సత్యసాయినగర్‌కు చెందిన చేనేత కార్మికుడు కొక్కంటి నాగరాజు, అనుపమ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు యశ్వంత్ (17) ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ, రెండో కుమారుడు రాజేష్ పదో తరగతి చదువుతున్నాడు. బుధవారం మధ్యాహ్నం యశ్వంత్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్నాడు. కాసేపటి తర్వాత చుట్టుపక్కల వారు గమనించి అతడిని కిందకు దించి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే యశ్వంత్ మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. ఆస్పత్రికి చేరుకున్న తమ్ముడు, తల్లిదండ్రులు బోరున విలపించారు. అన్న మృతదేహంపై పడి రాజేష్ గుండెలవిసేలా రోదించాడు. పదో తరగతి కదా చదువుకో అంటూ తెల్లవారుజామున నిద్రలేపే అన్న ఇక లేడని తెలిసి కన్నీరుమున్నీరయ్యాడు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.