
సాక్షి, న్యూఢిల్లీ: నిర్భయ కేసు దోషుల ఉరిశిక్ష అమలు మరోసారి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం (మార్చి 2) విచారించనుంది. తన మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చాలని కోరుతూ పవన్ గుప్తా శుక్రవారం సుప్రీం కోర్టులో నివారణ పిటిషన్ దాఖలుచేసిన సంగతి విదితమే. న్యాయమూర్తులు ఎన్‌వీ రమణ, అరుణ్ మిశ్రా, ఆర్‌ఎఫ్ నారిమన్. ఆర్ బానుమతి, అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. నిర్భయ ఉదంతం జరిగేనాటికి తాను మైనర్‌ని అనీ, దీన్ని పరిగణనలోకి తీసుకుని తనకు విధించిన ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలని కోరుతూ పవన్ గుప్తా తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఇదిలావుండగా డెత్ వారెంట్ అమలుపై స్టే కోరుతూ దోషి అక్షయ్ కుమార్ సింగ్ దరఖాస్తుపై నివేదిక ఇవ్వాలని ఢిల్లీ కోర్టు శనివారం తీహార్ జైలు అధికారులను కోరింది. అదనపు సెషన్స్ జడ్జి ధర్మేందర్ రానా సోమవారం ఈ విషయాన్నివిచారించనున్నారు.
పవన్ గుప్తా తాజా క్యురేటివ్ పిటిషన్ తిరస‍్కరణ గురైన తర్వాత కూడా అతను రాష్ట్రపతి క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అంతేకాదు రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరణకు గురైనా కూడా, దాన్ని సవాల్ చేస్తూ మళ్లీ సుప్రీంను ఆశ్రయించవచ్చు. దీంతో పాటు దోషులను విడిగా ఉరితీయాలని ఆదేశించాలని కోరుతూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ) దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మార్చి 5 న విచారణ జరపనుంది. ఈ నేపథ్యంలో నిర్భయ దోషుల ఉరితీత మరోసారి వాయిదా పడవచ్చునన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
2012 డిసెంబర్ 16 రాత్రి నిర్భయను దారుణంగా సామూహిక హత్యాచారం చేసిన దోషులందరూ మృత్యుభయంతో, న్యాయ వ్యవస్తలో ఉన్న అన్ని అవకాశాలను తమకనుకూలంగా మలుచుకుంటూ శిక్షనుంచి తప్పించుకునేందుకు అనేకపన్నాగాలు పన్నుతున్నారు. ఈ క్రమంలోనే నలుగురు నిర్భయ దోషుల్లో ముకేశ్ కుమార్ సింగ్, వినయ్ కుమార్ శర్మ ఇప్పటికే న్యాయపరమైన అన్ని అవకాశాలను ఉపయోగించు కున్నారు. దోషుల వరుస పిటీషన్లతో నిర్భయ దోషులకు ఇప్పటికే రెండుసార్లు శిక్ష వాయిదాపడింది. మొదట జనవరి 22 న ఉరి తీయవలసి ఉండగా, ఆ తరువాత ఫిబ్రవరి 1కి వాయిదా పడింది. తాజా ఆదేశాల ప్రకారం మార్చి 3న ఉదయం 6 గంటలకు నలుగురు దోషులనూ ఉరితీయాల్సి ఉంది. మరోవైపు దోషులకుఉరిశిక్ష అమలు జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నిర్భయ తల్లి, తన కుమార్తెకు న్యాయం జరగడం లేదని కన్నీటి పర్యంతమవుతున్నారు. (నిర్భయకు న్యాయం జరగకుంటే..)
చదవండి : మార్చి 3న ఉరితీయండి