
అల్లరి చేశాడని అడవిలో వదిలేశారు!
పిల్లలు అల్లరి చేస్తే పేరెంట్స్ తిడతారు లేదా కొడతారు. కానీ వీణ్ని మాత్రం క్రూరమృగాలు తిరిగి అడవిలో వదిలేశారు..
కారడవిలో ఏడేళ్ల పిల్లాడు.. చుట్టూ క్రూర మృగాలు.. నిద్రాహారాలు లేకుండా ఏడు రోజులు.. వాడి జాడ కోసం 200 మంది సాయుధుల వేట..! పిల్లలు అల్లరి చేస్తే తల్లిదండ్రులు తిడతారు లేదా కొడతారు. కానీ వీణ్ని మాత్రం క్రూరమృగాలు తిరిగే అడవిలో వదిలేశారు. ఏడు రోజుల పాటు కారడవిలో దిక్కుమొక్కూ లేకుండా తిరిగిన ఆ ఏడేళ్ల బాలుడ్ని ఎట్టలేకలకు ప్రాణాలతో కనిపెట్టగలిగారు. పేరెంట్స్ పిల్లలకిచ్చే పనిష్మెంట్ లో పరాకాష్టలాంటి ఈ సంఘటన పూర్తి వివరాలిలా ఉన్నాయి..
జపాన్ లోని హొక్కయిదో దీవికి చెందిన యమతో తనూక ఏడేళ్ల కుర్రాడు. అందరిలాగే అల్లరి చేసే యమతో ఈ మధ్య కాస్త శృతిమించాడు. రోడ్డుపై వెళ్లేవాళ్లపై, ఆగిఉన్న కార్లపై రాళ్లు విసిరేవాడు. ఎంత చెప్పినా వినకపోవడంతో పేరెంట్స్‌కు చిర్రెత్తుకొచ్చింది. దండనతో గానీ దారికిరాడని యమతోను తీసుకెళ్లి ఎలుగుబంట్లు, హైనాలు సంచరించే కారడవిలో వదిలేశారు. అలా ఏడు రోజులుగా కనిపించకుండా పోయిన పిల్లాడి కోసం ఏకంగా ఆర్మీయే రంగంలోకి దిగింది. భారీ ఆయుధాలతో అడవిలో అణువణువూ గాలించారు. చివరికి అడవిలోని ఓ పాడుబడ్డ ఇంట్లో జవానుకు దొరికాడు యమతో.
భయపెట్టాలని భయపడ్డారు..
కొడుకును భయపెట్టాలని అడవిలో వదిలేసిన తల్లిదండ్రులు యమతో అదృశ్యం కావడంతో భయాందోళనకు గురయ్యారు. మొదట.. అడవి పండ్ల కోసం వెళ్లగా తప్పిపోయాడని తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన యమతో పేరెంట్స్ .. చివరికి తాము చేసిన తప్పుడు పనిని పోలీసులకు చెప్పి, ఎలాగైనా కొడుకును కాపాడాలని వేడుకున్నారు. దీంతో ఆర్మీ విభాగమైన సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ రంగంలోకి దిగింది. 200 మంది సైనికులు ఆరు రోజులపాటు గాలించి సురక్షితంగా ఉన్న యమతోను కనిపెట్టి, ఆసుపత్రికి తరలించారు. బుద్ధి చెప్పడానికని కారులో తీసుకెళ్లి అడవిలో వదిలేశామని, ఐదు నిమిషాల తర్వాత వచ్చి చూస్తే యమతో అదృశ్యమయ్యాడని, చుట్టుపక్కల వెదికినా కనిపించలేదని చెప్పుకొచ్చారు అతని తల్లిదండ్రులు. తప్పనిసరైతే పిల్లలను దండించవచ్చేమోగానీ మరీ ఇలా అడవిలో వదిలేయడం లాంటి క్రూరదండనలు మాత్రం సరికాదని హితవు పలికారు ఆర్మీ అధికారులు.