
'వాడు నన్ను క్షమించాడు'
తన కుమారుడు తనను క్షమించాడని జపాన్ కు చెందిన తయయుకీ తనూక తెలిపాడు.
టోక్యో: తన కుమారుడు తనను క్షమించాడని జపాన్ కు చెందిన తయయుకీ తనూక(44) తెలిపాడు. 'మంచి తండ్రి' అని తనకు కితాబిచ్చాడని చెప్పాడు. అల్లరి ఎక్కువగా చేస్తున్నాడని తన ఏడేళ్ల కొడుకు యమతో తనూకను అడవిలో వదిలేశాడు. ఏడు రోజుల తర్వాత యమతోను సైనికులు సురక్షితంగా రక్షించారు. 'నేను తప్పు చేశాడని నా కుమారుడికి క్షమాపణ చెప్పాను. వాడి అల్లరి భరించలేకే అలా చేశానని వివరించాను. నువ్వు మంచి నాన్నవు అని వాడు జవాబిచ్చాడు. నిన్ను క్షమించానని అన్నాడ'ని తయయుకీ వివరించారు. అడవిలో కనుగొన్న తర్వాత యమతోను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అతడిని మంగళవారం డిశ్చార్జి చేయనున్నారు.
రోడ్డుపై వెళ్లేవాళ్లపై, ఆగిఉన్న కార్లపై రాళ్లు విసిరి అల్లరి చేస్తుండంతో యమతోను అతడి తల్లిదండ్రులు కారడవిలో వదిలేశారు. అడవిలో తప్పిపోయాడని ముందు తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన యమతో పేరెంట్స్ .. చివరికి తామే అతడిని వదిలేశామని నిజం చెప్పారు. ఎలాగైనా తమ కొడుకును కాపాడాలని వేడుకున్నారు. దీంతో 200 మంది సైనికులు ఆరు రోజులపాటు గాలించి సురక్షితంగా ఉన్న యమతోను కనిపెట్టి, ఆసుపత్రికి తరలించారు.