
న్యూఢిల్లీ: ఆధార్‌ను ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలకు అనుసంధానం చేసే గడువును మరికొంతకాలం పొడిగించే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ గడువు ఈ నెల 31వ తేదీతో ముగియనుంది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం మంగళవారం చేపట్టిన విచారణ సందర్భంగా అటార్నీ జనరల్(ఏజీ) కేకే వేణుగోపాల్ ఈ విషయం తెలిపారు. ఆధార్ కేసుపై సుప్రీంకోర్టులో వాదనలు ప్రస్తుతం కొనసాగుతున్నందున, ఇందుకు వీలుగా ప్రభుత్వం గడువు పెంచాలనుకుంటోందని ఏజీ తెలపగా ధర్మాసనం అంగీకరించింది. ఆధార్ విషయంలో పదేపదే ఒకే రకమైన వాదనలు చేసేందుకు పిటిషనర్లను అంగీకరించబోమని బెంచ్ తెలిపింది. బుధవారం కూడా వాదనలు కొనసాగనున్నాయి.