తమ మాజీ భాగస్వామి శివసేనతో చర్చల విషయంలో తాము సున్నితంగానే వ్యవహరిస్తామని బీజేపీ పేర్కొంది.
ముంబై: తమ మాజీ భాగస్వామి శివసేనతో చర్చల విషయంలో తాము సున్నితంగానే వ్యవహరిస్తామని బీజేపీ పేర్కొంది. ఇరు పార్టీల మధ్య చర్చల్లో సత్ఫలితాలొస్తాయని ఆశాభావం వ్యక్తంచేసింది. ఈ విషయమై ఆ పార్టీ రాష్ర్ట వ్యవహారాల ఇంచార్జి, కేంద్ర మంత్రి రాజీవ్‌ప్రతాప్ రూడీ గురువారం మీడియాతో మాట్లాడారు. ‘శివసేనతో ఎట్టిపరిస్థితుల్లోనూ చర్చలు జరుపుతాం. మంచి ఫలితాలు వస్తాయనే విశ్వాసం మాకు ఉంది. శివసేనతో సంబంధాల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదు’అని అన్నారు. కేంద్ర ప్రభుత్వంలో తామిరువురం కలిసే పనిచేస్తున్నామని, అయితే రాష్ట్రస్థాయిలో కొన్ని అంశాల విషయంలో విభేదాలు ఉన్నమాట నిజమేనంటూ ఆయన అంగీకరించారు.
ఎవరు మద్దతిచ్చినా ఆమోదయోగ్యమే
మహారాష్ట్ర అభివృద్ధే ఎజెండాగా ముందుకుసాగుతున్న తమకు ఏ పార్టీలుగానీ, స్వతంత్ర ఎమ్మెల్యేలుగానీ మద్దతు ఇచ్చినా అది తమకు ఆమోదయోగ్యమేనన్నారు. ప్రభుత్వానికి ఎన్సీపీ మద్దతు విషయమై ప్రశ్నించగా ఎవరైనా తమ ప్రభుత్వానికి మద్దతు ఇస్తానంటే తాము అందుకు ఆమోదం తెలపకూడదా అంటూ ఆయన ఎదురు ప్రశ్నించారు. మేము అధికారంలో నుంచి దిగిపోవాలని మీరు కోరుకుంటున్నారా అని అడిగారు. మహారాష్ట్ర విషయంలో ఎటువంటి గందరగోళమూ లేదని, తమది సుస్థిర ప్రభుత్వమేనని ఆయన వివరించారు.