
న్యూఢిల్లీ: విదేశాంగ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ఎస్ జైశంకర్ కృతజ్ఞతలు తెలిపారు. మాజీ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ అడుగుజాడల్లో ముందుకుసాగడం తనకు గర్వకారణమని పేర్కొన్నారు. భారత విదేశాంగ బృందం 24 గంటలూ దేశ ప్రజల సేవలోనే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కేంద్రమంత్రిగా పగ్గాలు చేపట్టిన అనంతరం ఆయన ఈ మేరకు ట్వీట్‌చేశారు.
‘ఇది నా మొదటి ట్వీట్. శుభాకాంక్షలు అందించినందుకు ధన్యవాదాలు. ఈ బాధ్యతలు చేపట్టడం గౌరవంగా భావిస్తున్నా. సుష్మా స్వరాజ్ అడుగుజాడల్లో నడుస్తుండటం గర్వకారణంగా ఉంది’ అని ఆయన పేర్కొన్నారు.
కేంద్ర విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొట్టమొదటి మాజీ విదేశాంగ కార్యదర్శిగా జైశంకర్ శుక్రవారం చరిత్ర సృష్టించారు. మాజీ ఐఎఫ్‌ఎస్ అధికారి అయిన ఆయన 2015లో విదేశాంగ కార్యదర్శిగా నియమితులయ్యారు. భారత్-చైనా మధ్య తలెత్తిన 73 రోజుల డోక్లామ్ ప్రతిష్టంభనకు తెరదించడంలో జైశంకర్ కీలక పాత్ర పోషించారు.