మిథాలీనే పక్కన పెడతారా? | Netizens Fires On Harmanpreet Kaur Over Dropped MithaliRaj | Sakshi
Sakshi News home page

Published Fri, Nov 23 2018 10:00 AM | Last Updated on Fri, Nov 23 2018 11:58 AM

Netizens Fires On Harmanpreet Kaur Over Dropped MithaliRaj - Sakshi

హర్మన్‌ దూకుడులో కోహ్లిని మించిపోయింది పో.. మిథాలీని పక్కనబెట్టడం

నార్త్‌ సాండ్‌ (అంటిగ్వా) : మహిళా టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో భారత్‌ ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. గ్రూప్‌ దశలో తిరుగులేని విజయాలతో అభిమానులను ఊరించిన హర్మన్‌ సేన.. సెమీస్‌లో కనీస పోరాట పటిమ​ప్రదర్శించకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.  ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తూ టీమ్‌మేనేజ్‌మెంట్‌పై మండిపడుతున్నారు. ఈ కీలక మ్యాచ్‌కు సీనియర్‌ క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ను పక్కనబెట్టడంపై అభిమానులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఈ టోర్నీలో వరుసగా రెండు హాఫ్‌ సెంచరీలతో అదరగొట్టిన మిథాలీని బెంచ్‌కు పరిమితం చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. చెత్త కెప్టెన్సీతోనే మ్యాచ్‌ చేజారిందని హర్మన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘హర్మన్‌ దూకుడులో కోహ్లిని మించిపోయింది పో.. మిథాలీని పక్కనబెట్టడం అత్యంత చెత్త నిర్ణయం’ అని.. కనీసం ఈ మ్యాచ్‌ చూసైనా సీనియర్‌ క్రికెటర్ల అవసరం ఏంటో గుర్తించాలని కామెంట్‌ చేస్తున్నారు.

బాధపడాల్సిన అవసరం లేదు : హర్మన్‌
మిథాలీని బెంచ్‌కు పరిమితం చేయడంపై మ్యాచ్‌ అనంతరం హర్మన్‌ ప్రీత్‌ స్పందిస్తూ.. తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు. ‘ కొన్ని సార్లు మా వ్యూహం ఫలిస్తోంది. మరికొన్ని సార్లు విఫలమవుతోంది. దీనికి పశ్చాతాపం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. ఈ టోర్నీలో మా మహిళల ఆట పట్ల గర్వపడుతున్నాను.  యువ జట్టుగా ఇది మాకో గుణపాఠం. కొన్ని సార్లు పిచ్‌ వికెట్‌ను బట్టి ఆటను మార్చుకోవాల్సి ఉంటుంది. దీన్ని అర్థం చేసుకుని ఇంగ్లండ్‌ బౌలర్లు అద్భుతంగా రాణించారు. మేం విధించిన టార్గెట్‌ను చేధించడం కూడా అంత సులవు కాదు. మా బౌలర్లు కూడా అద్భుతంగా రాణించారు. మేం మ్యాచ్‌ను 18 ఓవర్లు వరకు తీసుకొచ్చాం. యువజట్టుగా మేం మానసికంగా ధృడపడాల్సిన అవసరం ఉంది. ఒత్తిడిలో ఎలా ఆడాలో అనే దానిపై దృష్టిపెట్టుంటే.. ఇలాంటి మ్యాచ్‌లను సులువుగా మావైపు తిప్పుకునే వాళ్లం.’ అని హర్మన్‌ప్రీత్‌ అభిప్రాయపడ్డారు.

శుక్రవారం తెల్లవారు జామున జరిగిన సెమీస్‌లో హర్మన్‌సేన ఇంగ్లండ్‌ చేతిలో 8 వికెట్ల తేడాతో పరాజయం పాలైన విషయం తెలిసిందే. గ్రూప్‌ దశలో సెంచరీలతో చెలరేగిన భారత బ్యాట్స్‌వుమెన్‌ అసలు మ్యాచ్‌లో చేతులెత్తేశారు. స్మృతి మంధాన (34), జెమీమా రోడ్రిగ్స్‌(26)లు తప్పా అందరూ నిరాశపరిచారు. దీంతో భారత్‌ 19.3 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ఇంగ్లండ్‌ అమీ జోన్స్‌ (53), నటాలీ సివర్‌ (51)లు అర్ధసెంచరీలతో 17.1 ఓవర్లలోనే విజయాన్నందుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement