
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ నగరపాలక సంస్థలో నిరుపేదలకు అండగా నిలిచేందుకు వినూత్న పథకాన్ని చేపట్టారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక్క రూపాయికే దహన సంస్కారాలు చేసేందుకు శ్రీకారం చుట్టారు. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే దహన సంస్కారాలు కూడా చేయలేని స్థితిలో ఉన్న వారికి భరోసా ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ‘అంతిమయాత్ర.. ఆఖిరిసఫర్’ పేరుతో పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ మేరకు సోమవారం మేయర్ రవీందర్‌సింగ్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. శ్మశాన వాటికల్లో మౌలిక వసతులు కల్పించడంతోపాటు అంత్యక్రియలను కూడా నగరపాలక సంస్థ బాధ్యతగా చేపడుతుందని చెప్పారు.
నిరుపేద కుటుంబాల్లో అంత్యక్రియలకు పుట్టెడు దుఃఖంలో ఉండి కూడా అప్పుల కోసం కాళ్లావేళ్లా పడటం తనను కలిచివేసిందని పేర్కొన్నారు. అందుకే ఒక్క రూపాయికే అంత్యక్రియలు చేసే కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. కులాలు, మతాలతో సంబంధం లేకుండా వారి వారి సంప్రదాయాల ప్రకారం ఈ పథకాన్ని అమలు చేస్తామని వెల్లడించారు. ఇందుకోసం రూ.1.5 కోట్లు నిధులు మంజూరు చేశామని, రెండు వ్యాన్‌లు, ఫ్రీజర్లు కూడా కొనుగోలు చేస్తున్నామని, పార్థివదేహాలను కాల్చేవారికి కట్టెలు, కిరోసిన్, పూడ్చిపెట్టే వారికి గొయ్యి తవ్వడం వంటివి సమకూర్చుతామని వివరించారు. జూన్ 15వ తేదీ నుంచి ఈ పథకం అమలు చేస్తామని స్పష్టం చేశారు. దాతలు కమిషనర్ అకౌంట్ ద్వారా ఆర్థిక సహాయం అందించవచ్చని, సీఎస్‌ఆర్ ద్వారా సేవ చేయాలనుకునే వారు తమతో కలసి పనిచేయాలని కోరారు.