
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ నెల 11 నుంచి ప్రారంభం కావలసిన వివిధ పీజీ కోర్సుల పరీక్షలను వచ్చే ఏడాది జనవరి 22 నుంచి నిర్వహించనున్నట్లు ఓయూ అధికారులు తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగుల సమ్మె, పార్ట్ టైం అధ్యాపకుల దీక్షలు, కాంట్రాక్టు అధ్యాపకుల పరీక్షల బహిష్కరణ కారణంగా పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
14 నుంచి డిగ్రీ పరీక్షలు యథాతథం
హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో 14 నుంచి జరిగే వివిధ డిగ్రీ కోర్సుల సెమిస్టర్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. డిగ్రీ పరీక్షల వాయిదాపై వదంతులు నమ్మవద్దని ఓయూ అధికారులు పేర్కొన్నారు.
ఆ పోస్టుల దరఖాస్తుల సవరణకు ఎడిట్ ఆప్షన్
సాక్షి, హైదరాబాద్: చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్, అడిషనల్ చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్ పోస్టులకు చేసుకున్న దరఖాస్తుల్లో పొరపాట్లను సవరించుకునేందుకు ఎడిట్ ఆప్షన్‌ను కల్పిస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెల 9 నుంచి 12వ తే దీ వరకు అభ్యర్థులు పొరపాట్లను స వరించుకోవాలని సూచించింది. ఈ పోస్టులకు వచ్చే నెల 4న ఉదయం, మధ్యాహ్నం కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుందని తెలిపింది.
‘కాంట్రాక్టు లెక్చరర్ల వేతనాలు ఇవ్వండి’
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోని కాంట్రాక్టు లెక్చరర్ల వేతనాలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ఆర్జేడీ అపాయింటెడ్ గవర్నమెంట్ కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ కోరింది. 4 నెలలుగా వారికి వేతనాలు రావడం లేదని గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది.