
మహబూబాబాద్: మహబూబాబాద్ ఎంపీ టికెట్ తనకు రాకపోవడం బాధాకరమని టీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎంపీ అజ్మీర సీతారాంనాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో టీఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గస్థాయి ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీతారాంనాయక్ మాట్లాడుతూ.. తనకు టికెట్ రాకపోవడం బాధాకరమంటూ కంటతడి పెట్టారు.
వెంటనే మంత్రి దయాకర్‌రావు, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆయనను ఓదార్చారు. అనంతరం సీతారాంనాయక్ మాట్లాడుతూ... పార్లమెంట్‌లో అనేక సమస్యలను ప్రస్తావించానని అన్నారు. టికెట్ విషయంలో తన పనితనం చూడకుండా సర్వేల పేరుతో అన్యాయం చేశారన్నారు. అయినా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నడుచుకుంటానని, పార్టీ ఎంపీ అభ్యర్థి విజయానికి సహకరిస్తారనని అన్నారు. మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అందరికీ న్యాయం చేస్తారన్నారు. అందుకు సత్యవతి రాథోడ్, కవితలే నిదర్శనమని పేర్కొన్నారు.