
తెలంగాణ అమరనాథ్‌గా ప్రసిద్ధిగాంచిన సలేశ్వరం లింగమయ్య ఉత్సవాలు శుక్రవారం అత్యంత వైభవంగా ప్రారంభయ్యాయి

పున్నమికి ముందు రోజు మదినిండా లింగమయ్యను స్మరించుకుంటూ భక్తులు వేలాదిగా నల్లమల బాట పట్టారు

అటవీశాఖ శుక్రవారం నుంచి అనుమతిస్తామని చెప్పినప్పటికీ భక్తులు గురువారం మధ్యాహ్నం నుంచే ఫర్హాబాద్ గేటు వద్దకు చేరుకున్నారు

వస్తున్నాం.. లింగమయ్యా.. అంటూ చిన్నా పెద్ద తేడా లేకుండా దట్టమైన అడవిలో లోయలు, గుట్టలు, సెలయేర్లు దాటుకుంటూ సాహస యాత్రలో ఉత్సాహంగా ముందుకు కదిలారు

అటవీశాఖ ఆంక్షల నేపథ్యంలో భక్తులు భగభగ మండుతున్న ఎండలను సైతం లెక్క చేయకుండా పగటి వేళ లింగమయ్య దర్శనానికి భారీగా తరలివచ్చారు

మొదటిరోజు సుమారు 60 వేల మంది లింగమయ్య దర్శనం చేసుకున్నారు

ఐదురోజుల జాతరను అటవీశాఖ మూడు రోజులకు కుదించడంతో పగలు, రాత్రి తేడా లేకుండా భారీగా తరలివస్తున్నారు

చైత్ర పౌర్ణమికి ముందు రోజు స్వామివారి దర్శనం కోసం భక్తులు తరలిరావడంతో నల్లమల దారులన్నీ కిక్కిరిసిపోయాయి











