begumpet railway station
-
బేగంపేటకు ఆధునిక హంగులు
సనత్‌నగర్: బేగంపేట రైల్వేస్టేషన్ సరికొత్త రూపును సంతరించుకుంది. ఆధునిక హంగులతో.. అంతర్జాతీయ ప్రమాణాలను అద్దుకుంది. ‘అమృత్ స్టేషన్’ పథకం కింద మొత్తం రూ.38 కోట్లతో బేగంపేట రైల్వేస్టేషన్ (begumpet railway station) అభివృద్ధి పనులను గత ఏడాది ఫిబ్రవరి 26న ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్‌గా ప్రారంభించారు. రూ.26 కోట్ల వ్యయంతో ప్రారంభమైన మొదటి ఫేజ్ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పుడు బ్రాహ్మణవాడీ వైపు నుంచి చూస్తే ఇది బేగంపేట రైల్వేస్టేషనేనా? అనే రీతిలో కనువిందు చేసేలా ముఖద్వారాన్ని అందంగా తీర్చిదిద్దారు. రైల్వేస్టేషన్ ప్రాంగణంలోకి అడుగుపెట్టే ముందే రాష్ట్ర పక్షి పాలపిట్టల బొమ్మలు ప్రయాణికులను ఆకట్టుకుంటాయి. రైల్వేసేషన్ లోపలికి వెళ్లకముందే బయట ప్రకృతి అందాలతో మైమరిపించే రీతిలో తీర్చిదిద్దుతున్నారు. ప్రాంగణంలో ఉన్న రాక్‌ను అందమైన ఫౌంటెన్‌గా మలిచి పచ్చటి లాన్లతో ప్రకృతి ప్రేమికులు మంత్ర ముగ్ధులయ్యే విధంగా అభివృద్ధి చేస్తున్నారు.ప్రయాణికులకు సకల వసతులు.. ఎస్కలేటర్లు, ర్యాంప్‌లు, లిఫ్టులు, చూడముచ్చటగా తీర్చిదిద్దిన వెయిటింగ్ హాల్, రైళ్ల సమాచారాన్ని ప్రయాణికులు ప్రత్యక్షంగా చూసుకునేలా వివరాల డిస్ప్లే, రద్దీకి అనుగుణంగా టికెట్ కౌంటర్ల నిర్మాణం, స్టేషన్లో ఏ సేవలు ఎక్కడన్న విషయాలను సులభంగా తెలుసుకునేలా ఎల్ఈడీ సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. స్టేషన్ ప్రాంగణాన్ని ఆహ్లాదంగా తీర్చిదిద్దే పనులు కొనసాగుతున్నాయి. రైల్వే స్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా తీర్చిదిద్దారు. మొదటి ఫేజ్ కింద రైల్వేస్టేషన్‌కు ఒకవైపు చేపట్టిన అభివృద్ధి పనులు 95 శాతం పూర్తయ్యాయి. త్వరలో మరో 5 శాతం పనులు కూడా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆ తర్వాత రెండో ఫేజ్‌లో మరోవైపు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. -
హైదరాబాద్ కల్చర్ ఉట్టిపడేలా.. సిటీ రైల్వేస్టేషన్లకు ఆధునిక హంగులు
సాక్షి, సిటీబ్యూరో: సిటీ రైల్వేస్టేషన్లు ఆధునిక హంగులతో రూపుదిద్దుకుంటున్నాయి. హైదరాబాద్ సంస్కృతి ప్రతిబింబించే విధంగా రైల్వే స్టేషన్ల రీడెవలప్‌మెంట్‌కు దక్షిణ మధ్య రైల్వే పనులు మొదలు పెట్టింది. కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అమృత్‌భారత్ పథకం కింద నగరంలోని బేగంపేట్, ఉందానగర్, మేడ్చల్, యాకుత్‌పురా స్టేషన్లను అందంగా, ఆహ్లాదం ఉట్టిపడేవిధంగా అభివృద్ధి చేయనున్నారు. ప్రస్తుతం బేగంపేట్ రీడెవలప్మెంట్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మరో ఆరు నెలల్లో పూర్తిగా కొత్తదనంతో అందమైన బేగంపేట్ స్టేషన్ ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. దశలవారీగా మిగతా మూడు స్టేషన్ల అభివృద్ధి పనులను కూడా పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అమృత్ భారత్ పథకం కింద తెలంగాణలో మొత్తం 16 స్టేషన్లను ఎంపిక చేశారు. నగరంలోని 26 స్టేషన్ల నుంచి ఎంఎంటీఎస్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. వాటిలో బేగంపేట్, లింగంపల్లి, హైటెక్‌సిటీ, ఫలక్‌నుమా, ఉందానగర్, మేడ్చల్ స్టేషన్ల నుంచి ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. లింగంపల్లి, బేగంపేట్, హైటెక్‌సిటీ స్టేషన్ల నుంచి కొన్ని దూరప్రాంతాల రైళ్లకు హాల్టింగ్ సదుపాయం కల్పించారు. ఈ స్టేషన్లలో ప్రతిరోజూ సుమారు 10 వేల మంది రాకపోకలు సాగిస్తున్నారు. లింగంపల్లి స్టేషన్లో ప్లాట్‌ఫామ్‌ల ఎత్తు పెంచడంతో పాటు ప్రయాణికులకు సదుపాయాలను అభివృద్ధి చేశారు.రైల్వేస్టేషన్లకు మాస్టర్‌ప్లాన్ అమృత్‌భారత్ పథకం కింద ఎంపికైన నాలుగు స్టేషన్లకు ప్రత్యేకంగా మాస్టర్‌ప్లాన్ రూపొందించారు. ప్రత్యేకమైన విజన్‌తో స్టేషన్ల అభివృద్ధి జరగనుంది. రాబోయే నాలుగైదు దశాబ్దాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని స్టేషన్ల విస్తరణకు చర్యలు చేపట్టారు. మొత్తం నాలుగు స్టేషన్లకు రూ.65 కోట్లకు పైగా నిధులను కేటాయించగా, అందులో బేగంపేట్ స్టేషన్ కోసమే రూ.26.49 కోట్లు వెచ్చించి పనులు చేపట్టారు. రూ.12.37 కోట్లతో ఉందానగర్, రూ.8.37 కోట్లతో మేడ్చల్, మరో రూ.15.31 కోట్లతో యాకుత్‌పురా స్టేషన్ల అభివృద్ధి జరగనుంది. ఈ నిధులతో అవసరమైన చోట కొత్త భవనాలను నిర్మించడంతో పాటు పాత భవనాల్లో అదనపు సదుపాయాలను కల్పిస్తారు. లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఫుట్ఓవర్ బ్రిడ్జిలు, విశాలమైన ఫుట్‌పాత్‌లు, పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. రైల్వేస్టేషన్‌లోకి ప్రవేశించిన ప్రయాణికుడికి ఒక కొత్త అనుభూతి కలుగుతుంది. ఆధునిక సదుపాయాలు లభిస్తాయి. వస్తు విక్రయ కేంద్రాలు కేవలం రైళ్ల రాకపోకలే లక్ష్యంగా కాకుండా సామాన్య ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని షాపింగ్ కేంద్రాలు, కెఫెటేరియాలను ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం 18 బోగీలు ఉన్న రైళ్లు ఆగేందుకు మాత్రమే అనువైన ప్లాట్‌ఫామ్‌లు ఉండగా, అమృత్‌భారత్ స్టేషన్లలో హైలెవల్ ప్లాట్‌ఫామ్‌లను ఏర్పాటు చేయనున్నారు. 24 బోగీలు ఉన్న రైళ్లు కూడా ఈ స్టేషన్లలో ఆగేందుకు అవకాశం ఉంటుంది. వాహనాల పార్కింగ్, కాలిబాటలు, దివ్యాంగుల కోసం ప్రత్యేక టాయిలెట్లు, వివిధ కేటగిరీలకు చెందిన విశ్రాంతి గదులు అభివృద్ధి చేయనున్నారు. అలాగే ఈ స్టేషన్లలో ‘వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్’ కింద ప్రయాణికులకు అవసరమైన వస్తు విక్రయ కేంద్రాలను కూడా అందుబాటులోకి తెస్తారు.అందమైన ల్యాండ్‌స్కేప్‌లు.. స్టేషన్ల చుట్టూ అందుబాటులో ఉన్న స్థలంలో వివిధ రకాల పూలమొక్కలు, గ్రీనరీతో అందమైన ల్యాండ్‌స్కేప్‌లను కూడా ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. పచ్చదనం కనువిందుచేసే విధంగా, పర్యావరణ హితంగా అమృత్‌భారత్ స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు సౌరవిద్యుత్ పలకలను ఏర్పాటు చేస్తారు. అలాగే నీటి నిర్వహణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. మహిళల కోసం ప్రత్యేక విశ్రాంతి గదులను కూడా ఏర్పాటు చేయనున్నారు. అన్ని అమృత్‌భారత్ స్టేషన్లలో ప్రయాణికులు ఒక ప్లాట్‌ఫామ్ నుంచి మరో ప్లాట్‌ఫామ్‌కు వెళ్లేందుకు లిఫ్టులు, ఎస్కలేటర్లతో పాటు కాలినడకన వెళ్లేందుకు ఎఫ్‌ఓబీలను కూడా అందుబాటులోకి తెస్తారు. చదవండి: హైదరాబాద్ మెట్రో రెండో దశ.. నార్త్ హైదరాబాద్‌కు తీవ్ర నిరాశ! -
హైదరాబాద్‌లో దారుణం.. భార్య, కుమార్తె ప్రాణాలు తీసి..
సాక్షి, హైదరాబాద్: ఎంతో అన్యోన్యంగా ఉంటున్న ఆ కుటుంబంలో విధి విషాదం నింపింది. చూడచక్కని ముగ్గురు పిల్లలతో సాఫీగా సాగుతున్న జీవనంలో ఏం కష్టం వచ్చిందో ఏమో...తండ్రి గణేష్ ఆత్మహత్యే శరణ్యమంటూ బేగంపేట్ రైల్వేస్టేషన్లో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్య,పిల్లల్ని హత్య చేసి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.బోయిన్‌పల్లిలో విషాదం చోటు చేసుకుంది. భార్య, 10 సంవత్సరాల కుమార్తెను చంపి ఆ తర్వాత భర్త ఆత్మ చేసుకున్నాడు. బేగంపేట వద్ద రైలు కిందపడి భర్త గణేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఆయన కుటుంబ సభ్యుల సమాచారం మేరకు..వృత్తి రిత్యా డాక్టరైన భర్త గణేష్ కుటుంబానికి గత కొంతకాలంగా ఆర్ధిక ఇబ్బందులు ఎక్కువైనట్లు తెలుస్తోంది. దీంతో భార్య, భర్తల మధ్య మనస్పర్దలు తలెత్తాయి. ఓ వైపపు అప్పుల బాధలు, మరోవైపు కుటుంబంలో కలహాలు తట్టుకోలేక గణేష్ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న బేగం పేట్ రైల్వే పోలీసులు,బోయిన్ పల్లి పోలీసులు గణేష్ ఇంటి పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీ, ఫోన్ కాల్ డేటాను పరిశీలిస్తున్నారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్య, ఆత్మహత్యకు గల కారణాల్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. -
మహిళా రైల్వేస్టేషన్‌గా బేగంపేట్
సాక్షి, హైదరాబాద్: దక్షిణమధ్య రైల్వే మహిళా రైల్వేస్టేషన్‌కు శ్రీకారం చుట్టింది. మహిళా ఉద్యోగుల శక్తి సామర్థ్యాలను ప్రోత్సహించేందుకు, వారిలోని ఆత్మవిశ్వాసం, సృజనాత్మకతలను పెంపొందించేందుకు ప్రత్యేక స్టేషన్లపై దృష్టి సారించింది. గురువారం(8న) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బేగంపేట్ రైల్వేస్టేషన్‌ను ‘మహిళా ఉద్యోగుల రైల్వేస్టేషన్’గా ప్రకటించనున్నట్లు సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ తెలిపారు. బేగంపేట్‌లో 8 మంది కమర్షియల్ ఉద్యోగులు, నలుగురు అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్లు, మరో ఆరుగురు పాయింట్స్ ఉమెన్, ఇద్దర్ ఆర్పీఎఫ్ మహిళా పోలీసులను నియమించనున్నట్లు సీపీఆర్వో పేర్కొన్నారు. వీరు రైల్వేస్టేషన్ నిర్వహణ, టిక్కెట్ బుకింగ్, ప్రయాణికుల భద్రత తదితర కార్యకలాపాలను ని ర్వహిస్తారు. దక్షిణమధ్య రైల్వే పరిధిలో ఇప్పటికే చంద్రగిరి స్టేషన్‌ను మహిళా ఉద్యోగుల రైల్వేస్టేషన్‌గా అభివృద్ధి చేశారు. త్వరలో ఫిరంగిపురం స్టేషన్ కూడా మహిళా ఉద్యోగుల రైల్వేస్టేషన్‌గా మారనుంది. -
రైలు ఢీ కొని గుర్తుతెలియని మహిళ మృతి
హైదరాబాద్ : రైలు ఢీకొన్న ప్రమాదంలో ఓ గుర్తు తెలియని మహిళ దుర్మరణం చెందింది. ఈ సంఘటన హైదరాబాద్ నాంపల్లి రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలోని బేగంపేట్ రైల్వే స్టేషన్ వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సుమారు 40 సంవత్సరాల వయస్సు గల ఓ గుర్తు తెలియని మహిళ శుక్రవారం బేగంపేట్ రైల్వే స్టేషన్ బ్రిడ్జి సమీపంలో పట్టాలు దాటుతుండగా గుర్తు తెలియని రైలు ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే దుర్మరణం చెందింది. మృతురాలు ఎరుపు రంగు జాకెట్, వంకాయ రంగు చీర ధరించినట్లు పోలీసులు తెలిపారు. అదే విధంగా ఆమె మెడ ఎడమ భాగంలో పుట్టుమచ్చ ఉందని తెలిపారు. స్థానికులు అందించిన ఫిర్యాదుతో సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించినట్లు తెలిపారు. సంబంధీకులెవరైనా ఉంటే నాంపల్లి జీఆర్పీ పోలీసులను లేదా 040-23202238 ఫోన్ నంబరును సంప్రదించవచ్చును.