సాక్షి, సిటీబ్యూరో: సిటీ రైల్వేస్టేషన్లు ఆధునిక హంగులతో రూపుదిద్దుకుంటున్నాయి. హైదరాబాద్ సంస్కృతి ప్రతిబింబించే విధంగా రైల్వే స్టేషన్ల రీడెవలప్‌మెంట్‌కు దక్షిణ మధ్య రైల్వే పనులు మొదలు పెట్టింది. కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అమృత్‌భారత్ పథకం కింద నగరంలోని బేగంపేట్, ఉందానగర్, మేడ్చల్, యాకుత్‌పురా స్టేషన్లను అందంగా, ఆహ్లాదం ఉట్టిపడేవిధంగా అభివృద్ధి చేయనున్నారు. ప్రస్తుతం బేగంపేట్ రీడెవలప్‌మెంట్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మరో ఆరు నెలల్లో పూర్తిగా కొత్తదనంతో అందమైన బేగంపేట్ స్టేషన్ ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. దశలవారీగా మిగతా మూడు స్టేషన్ల అభివృద్ధి పనులను కూడా పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
అమృత్ భారత్ పథకం కింద తెలంగాణలో మొత్తం 16 స్టేషన్లను ఎంపిక చేశారు. నగరంలోని 26 స్టేషన్ల నుంచి ఎంఎంటీఎస్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. వాటిలో బేగంపేట్, లింగంపల్లి, హైటెక్‌సిటీ, ఫలక్‌నుమా, ఉందానగర్, మేడ్చల్ స్టేషన్ల నుంచి ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. లింగంపల్లి, బేగంపేట్, హైటెక్‌సిటీ స్టేషన్ల నుంచి కొన్ని దూరప్రాంతాల రైళ్లకు హాల్టింగ్ సదుపాయం కల్పించారు. ఈ స్టేషన్లలో ప్రతిరోజూ సుమారు 10 వేల మంది రాకపోకలు సాగిస్తున్నారు. లింగంపల్లి స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్‌ల ఎత్తు పెంచడంతో పాటు ప్రయాణికులకు సదుపాయాలను అభివృద్ధి చేశారు.
రైల్వేస్టేషన్లకు మాస్టర్‌ప్లాన్
అమృత్‌భారత్ పథకం కింద ఎంపికైన నాలుగు స్టేషన్లకు ప్రత్యేకంగా మాస్టర్‌ప్లాన్ రూపొందించారు. ప్రత్యేకమైన విజన్‌తో స్టేషన్ల అభివృద్ధి జరగనుంది. రాబోయే నాలుగైదు దశాబ్దాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని స్టేషన్ల విస్తరణకు చర్యలు చేపట్టారు. మొత్తం నాలుగు స్టేషన్లకు రూ.65 కోట్లకు పైగా నిధులను కేటాయించగా, అందులో బేగంపేట్ స్టేషన్ కోసమే రూ.26.49 కోట్లు వెచ్చించి పనులు చేపట్టారు. రూ.12.37 కోట్లతో ఉందానగర్, రూ.8.37 కోట్లతో మేడ్చల్, మరో రూ.15.31 కోట్లతో యాకుత్‌పురా స్టేషన్ల అభివృద్ధి జరగనుంది. ఈ నిధులతో అవసరమైన చోట కొత్త భవనాలను నిర్మించడంతో పాటు పాత భవనాల్లో అదనపు సదుపాయాలను కల్పిస్తారు. లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఫుట్‌ఓవర్ బ్రిడ్జిలు, విశాలమైన ఫుట్‌పాత్‌లు, పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. రైల్వేస్టేషన్‌లోకి ప్రవేశించిన ప్రయాణికుడికి ఒక కొత్త అనుభూతి కలుగుతుంది. ఆధునిక సదుపాయాలు లభిస్తాయి.
వస్తు విక్రయ కేంద్రాలు
కేవలం రైళ్ల రాకపోకలే లక్ష్యంగా కాకుండా సామాన్య ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని షాపింగ్ కేంద్రాలు, కెఫెటేరియాలను ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం 18 బోగీలు ఉన్న రైళ్లు ఆగేందుకు మాత్రమే అనువైన ప్లాట్‌ఫామ్‌లు ఉండగా, అమృత్‌భారత్ స్టేషన్‌లలో హైలెవల్ ప్లాట్‌ఫామ్‌లను ఏర్పాటు చేయనున్నారు. 24 బోగీలు ఉన్న రైళ్లు కూడా ఈ స్టేషన్లలో ఆగేందుకు అవకాశం ఉంటుంది. వాహనాల పార్కింగ్, కాలిబాటలు, దివ్యాంగుల కోసం ప్రత్యేక టాయిలెట్లు, వివిధ కేటగిరీలకు చెందిన విశ్రాంతి గదులు అభివృద్ధి చేయనున్నారు. అలాగే ఈ స్టేషన్లలో ‘వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్’ కింద ప్రయాణికులకు అవసరమైన వస్తు విక్రయ కేంద్రాలను కూడా అందుబాటులోకి తెస్తారు.
అందమైన ల్యాండ్‌స్కేప్‌లు..
స్టేషన్ల చుట్టూ అందుబాటులో ఉన్న స్థలంలో వివిధ రకాల పూలమొక్కలు, గ్రీనరీతో అందమైన ల్యాండ్‌స్కేప్‌లను కూడా ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. పచ్చదనం కనువిందుచేసే విధంగా, పర్యావరణ హితంగా అమృత్‌భారత్ స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు సౌరవిద్యుత్ పలకలను ఏర్పాటు చేస్తారు. అలాగే నీటి నిర్వహణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. మహిళల కోసం ప్రత్యేక విశ్రాంతి గదులను కూడా ఏర్పాటు చేయనున్నారు. అన్ని అమృత్‌భారత్ స్టేషన్లలో ప్రయాణికులు ఒక ప్లాట్‌ఫామ్ నుంచి మరో ప్లాట్‌ఫామ్‌కు వెళ్లేందుకు లిఫ్టులు, ఎస్కలేటర్లతో పాటు కాలినడకన వెళ్లేందుకు ఎఫ్‌ఓబీలను కూడా అందుబాటులోకి తెస్తారు.
చదవండి: హైదరాబాద్ మెట్రో రెండో దశ.. నార్త్ హైదరాబాద్‌కు తీవ్ర నిరాశ!
Comments
Please login to add a commentAdd a comment