hyderabad railway station
-
హైదరాబాద్ కల్చర్ ఉట్టిపడేలా.. సిటీ రైల్వేస్టేషన్లకు ఆధునిక హంగులు
సాక్షి, సిటీబ్యూరో: సిటీ రైల్వేస్టేషన్లు ఆధునిక హంగులతో రూపుదిద్దుకుంటున్నాయి. హైదరాబాద్ సంస్కృతి ప్రతిబింబించే విధంగా రైల్వే స్టేషన్ల రీడెవలప్‌మెంట్‌కు దక్షిణ మధ్య రైల్వే పనులు మొదలు పెట్టింది. కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అమృత్‌భారత్ పథకం కింద నగరంలోని బేగంపేట్, ఉందానగర్, మేడ్చల్, యాకుత్‌పురా స్టేషన్లను అందంగా, ఆహ్లాదం ఉట్టిపడేవిధంగా అభివృద్ధి చేయనున్నారు. ప్రస్తుతం బేగంపేట్ రీడెవలప్మెంట్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మరో ఆరు నెలల్లో పూర్తిగా కొత్తదనంతో అందమైన బేగంపేట్ స్టేషన్ ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. దశలవారీగా మిగతా మూడు స్టేషన్ల అభివృద్ధి పనులను కూడా పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అమృత్ భారత్ పథకం కింద తెలంగాణలో మొత్తం 16 స్టేషన్లను ఎంపిక చేశారు. నగరంలోని 26 స్టేషన్ల నుంచి ఎంఎంటీఎస్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. వాటిలో బేగంపేట్, లింగంపల్లి, హైటెక్‌సిటీ, ఫలక్‌నుమా, ఉందానగర్, మేడ్చల్ స్టేషన్ల నుంచి ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. లింగంపల్లి, బేగంపేట్, హైటెక్‌సిటీ స్టేషన్ల నుంచి కొన్ని దూరప్రాంతాల రైళ్లకు హాల్టింగ్ సదుపాయం కల్పించారు. ఈ స్టేషన్లలో ప్రతిరోజూ సుమారు 10 వేల మంది రాకపోకలు సాగిస్తున్నారు. లింగంపల్లి స్టేషన్లో ప్లాట్‌ఫామ్‌ల ఎత్తు పెంచడంతో పాటు ప్రయాణికులకు సదుపాయాలను అభివృద్ధి చేశారు.రైల్వేస్టేషన్లకు మాస్టర్‌ప్లాన్ అమృత్‌భారత్ పథకం కింద ఎంపికైన నాలుగు స్టేషన్లకు ప్రత్యేకంగా మాస్టర్‌ప్లాన్ రూపొందించారు. ప్రత్యేకమైన విజన్‌తో స్టేషన్ల అభివృద్ధి జరగనుంది. రాబోయే నాలుగైదు దశాబ్దాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని స్టేషన్ల విస్తరణకు చర్యలు చేపట్టారు. మొత్తం నాలుగు స్టేషన్లకు రూ.65 కోట్లకు పైగా నిధులను కేటాయించగా, అందులో బేగంపేట్ స్టేషన్ కోసమే రూ.26.49 కోట్లు వెచ్చించి పనులు చేపట్టారు. రూ.12.37 కోట్లతో ఉందానగర్, రూ.8.37 కోట్లతో మేడ్చల్, మరో రూ.15.31 కోట్లతో యాకుత్‌పురా స్టేషన్ల అభివృద్ధి జరగనుంది. ఈ నిధులతో అవసరమైన చోట కొత్త భవనాలను నిర్మించడంతో పాటు పాత భవనాల్లో అదనపు సదుపాయాలను కల్పిస్తారు. లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఫుట్ఓవర్ బ్రిడ్జిలు, విశాలమైన ఫుట్‌పాత్‌లు, పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. రైల్వేస్టేషన్‌లోకి ప్రవేశించిన ప్రయాణికుడికి ఒక కొత్త అనుభూతి కలుగుతుంది. ఆధునిక సదుపాయాలు లభిస్తాయి. వస్తు విక్రయ కేంద్రాలు కేవలం రైళ్ల రాకపోకలే లక్ష్యంగా కాకుండా సామాన్య ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని షాపింగ్ కేంద్రాలు, కెఫెటేరియాలను ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం 18 బోగీలు ఉన్న రైళ్లు ఆగేందుకు మాత్రమే అనువైన ప్లాట్‌ఫామ్‌లు ఉండగా, అమృత్‌భారత్ స్టేషన్లలో హైలెవల్ ప్లాట్‌ఫామ్‌లను ఏర్పాటు చేయనున్నారు. 24 బోగీలు ఉన్న రైళ్లు కూడా ఈ స్టేషన్లలో ఆగేందుకు అవకాశం ఉంటుంది. వాహనాల పార్కింగ్, కాలిబాటలు, దివ్యాంగుల కోసం ప్రత్యేక టాయిలెట్లు, వివిధ కేటగిరీలకు చెందిన విశ్రాంతి గదులు అభివృద్ధి చేయనున్నారు. అలాగే ఈ స్టేషన్లలో ‘వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్’ కింద ప్రయాణికులకు అవసరమైన వస్తు విక్రయ కేంద్రాలను కూడా అందుబాటులోకి తెస్తారు.అందమైన ల్యాండ్‌స్కేప్‌లు.. స్టేషన్ల చుట్టూ అందుబాటులో ఉన్న స్థలంలో వివిధ రకాల పూలమొక్కలు, గ్రీనరీతో అందమైన ల్యాండ్‌స్కేప్‌లను కూడా ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. పచ్చదనం కనువిందుచేసే విధంగా, పర్యావరణ హితంగా అమృత్‌భారత్ స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు సౌరవిద్యుత్ పలకలను ఏర్పాటు చేస్తారు. అలాగే నీటి నిర్వహణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. మహిళల కోసం ప్రత్యేక విశ్రాంతి గదులను కూడా ఏర్పాటు చేయనున్నారు. అన్ని అమృత్‌భారత్ స్టేషన్లలో ప్రయాణికులు ఒక ప్లాట్‌ఫామ్ నుంచి మరో ప్లాట్‌ఫామ్‌కు వెళ్లేందుకు లిఫ్టులు, ఎస్కలేటర్లతో పాటు కాలినడకన వెళ్లేందుకు ఎఫ్‌ఓబీలను కూడా అందుబాటులోకి తెస్తారు. చదవండి: హైదరాబాద్ మెట్రో రెండో దశ.. నార్త్ హైదరాబాద్‌కు తీవ్ర నిరాశ! -
గుడ్‌న్యూస్! రైల్వే ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు.. ఎక్కడెక్కడంటే?
EV Stations in Hyderabad: రైల్వే శాఖ ఎలక్ట్రిక్ వాహనదారులకు శుభవార్త తెలిపింది. రైల్వే ప్రాంగణాల్లో ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ పాయింట్లను అందుబాటులోకి తెస్తోంది. అందులో భాగంగా ఫేజ్1లో తొలి స్టేషన్‌ను హైదరాబాద్ (నాంపల్లి) రైల్వే స్టేషన్లో ప్రారంభించింది. త్వరలోనే నగరంలో మరిన్ని స్టేషన్లలో ఈవీ ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయనుంది. ఈవీ ఛార్జింగ్ పాయింట్స్ పర్యావరణ హితమైన ఈవీలను కేంద్రం ప్రోత్సహిస్తోంది. ఈవీ కార్లు, స్కూటర్లు, బైకులు కొన్న వారికి ప్రత్యేక రాయితీలు, ప్రోత్సహాకాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నాయి. అయితే ఇంటి బయట ఛార్జింగ్ స్టేషన్లు విరివిగా లేకపోవడం పెద్ద లోపంగా మారింది. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు ప్రక్రియను కేంద్ర ప్రోత్సహిస్తోంది. జంటనగరాల్లో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సికింద్రాబాద్ జోన్లో ఫస్ట్ ఫేజ్‌లో మొత్తం 32 స్టేషన్లలో ఈవీ ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో మొదటి స్టేషన్ నాంపల్లిలో ప్రారంభం అయ్యింది. ఇది కాకుండా హైదరాబాద్ నగర పరిధిలో బేగంపేట, హైటెక్‌సిటీ, ఘట్కేసర్, లక్డీకాపూల్, ఫతేనగర్, నెక్లస్రోడ్, సంజీవయ్య పార్కు స్టేషన్లలో కూడా త్వరలో అందుబాటులోకి రానున్నాయి. As part of GOI's initiative to reduce carbon emission at all major cities by 2030 & as a major boost towards E-mobility -E-Vehicle charging facility set up @ Hyderabad Rly Stn -Initiative promotes usage of environment-friendly vehicles, while generating revenue for Railways pic.twitter.com/6eKcGNz3yS — South Central Railway (@SCRailwayIndia) June 1, 2022 తెలంగాణలో ఇక తెలంగాణ వ్యాప్తంగా ఈవీ ఛార్జింగ్ పాయింట్లను వరంగల్, కాజీపేట, మహబూబాబాద్, డోర్నకల్, మధిర, భద్రాచలంరోడ్, భువనగిరి, జనగామ, జమ్మికుంట, పెద్దపల్లి, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్‌నగర్, వికారాబాద్, తాండూర్, జహీరాబాద్, కరీంనగర్ స్టేషన్లలో ఏర్పాటు చేయనున్నారు. చదవండి: ప్రయాణీకుల ప్రాణాలు గాల్లో, విస్తారాకు భారీ జరిమానా -
Hyderabad Railway Station: నాంపల్లి స్టేషన్ కాడా...
సాక్షి, హైదరాబాద్ : ఓవైపు కోవిడ్ విజృంభణ... మరోవైపు ప్రజల్లో మళ్లీ లాక్డౌన్ భయాలు... వెరసి నగరం నుంచి చాలామంది సొంతూళ్లకు బయల్దేరి వెళ్లిపోతున్నారు. ముందస్తు రిజర్వేషన్ చేయించుకుని రైళ్లలో వెళ్లిపోయేవారికి ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావడం లేదు కానీ తత్కాల్ టికెట్ల ద్వారా బుక్‌చేసుకుని వెళ్లానుకునే ప్రయాణికులకు మాత్రం ‘తత్కాల్ టికెట్ల దందా’చుక్కలు చూపిస్తోంది. దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని హైదరాబాద్ రైల్వే స్టేషన్ (నాంపల్లి)లో తత్కాల్ టికెట్ల దందా అడ్డూ అదుపులేకుండా సాగిపోతోంది. గతంలో తత్కాల్ టికెట్‌ను పొందేందుకు రైల్వే రిజర్వేషన్ కేంద్రానికి వచ్చిన వారికి టోకెన్లను అందజేసేది. ఈ టోకెన్ల కోసం ప్రయాణికులు రైల్వే స్టేషన్ వద్ద రాత్రంతా జాగారం చేసేవారు. అయితే ఈ టోకెన్ల విధానానికి హైదరాబాద్ రైల్వే స్టేషన్ స్వస్తి పలికింది. తత్కాల్ టికెట్ జారీ చేసే సమయానికి క్యూలో నిలబడిన వారిని తోసుకుని ఎవరెవరో ముందుకొచ్చేసి టికెట్ తీసేసుకుంటున్నారు. క్యూలో నిలబడిన వారందరికీ టికెట్ మాత్రం లభించడం లేదు. దీంతో ఎలాగైనా ప్రయాణం చేయాలనుకునేవారు తత్కాల్ టికెట్ల కోసం దళారుల్ని ఆశ్రయిస్తున్నారు. దీంతో ప్రయాణికుల అవసరాన్ని అదునుగా తీసుకున్న దళారులు రెట్టింపు ధరలతో వారి నుంచి వసూలు చేస్తున్నారు. రైల్వే ఉన్నతాధి కారులు తత్కాల్ టికెట్ల జారీపై దళారుల ప్రమేయం లేకుండా చర్యలు చేపట్టాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక్కడ చదవండి: ఆక్సిజన్ కొరత లేదు.. కరోనా కంట్రోల్లోనే: సీఎస్ వెంటిలేటర్ బెడ్స్ లేవ్.. గాంధీకి వెళ్లిపోండి! -
‘దేవగిరి’.. 100 నిమిషాల ఆలస్యం
- ఒకటో ప్లాట్‌ఫారంపైకి వస్తుందని ప్రకటన - వచ్చిందేమో రెండో ప్లాట్ ఫారంపైకి.. - అవస్థలు పడ్డ ప్రయాణికులు నిజామాబాద్‌కల్చరల్ : దేవగిరి ఎక్స్‌ప్రెస్ సుమారు వంద నిమిషాల ఆలస్యంగా నిజామాబాద్ రైల్వే స్టేషన్ వచ్చింది. ఒకటో నంబర్ ప్లాట్ఫారం మీదికి రైలు వస్తుందని ప్రకటన చేయగా.. రెండో ప్లాట్‌ఫారంపైకి వచ్చి ఆగింది. దీంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలిలా ఉన్నాయి. ముంబయి నుంచి బయలుదేరే దేవగిరి ఎక్స్‌ప్రెస్ నిజామాబాద్ మీదుగా సికింద్రాబాద్ వెళ్తుంది. ఇది నిజామాబాద్‌కు రోజూ ఉదయం 11.05 గంటలకు చేరుకుంటుంది. సోమవారం చాలా ఆలస్యంగా స్టేషన్‌కు చేరుకుంది. మధ్యాహ్నం 12.45 గంటలకు నిజామాబాద్ వచ్చింది. సుమారు వంద నిమిషాల ఆలస్యంగా రైలు వచ్చింది. కాగా ఈ రైలు ఒకటో నంబర్ ప్లాట్‌ఫారంపైకి వస్తుందని రైల్వే అధికారులు ప్రకటించారు. ప్రయాణికులు ఒకటో నంబర్ ప్లాట్‌ఫారంపై వేచి ఉన్నారు. కానీ రెండో నంబర్‌పైకి వచ్చి ఆగింది. దీంతో ప్రయాణికులు ఉరుకులు పరుగుల మీద రెండో ప్లాట్ఫారానికి చేరుకున్నారు. అసలే ఆలస్యంగా రావడం, ఆపైన ప్లాట్‌ఫారాలు మారాల్సి రావడంతో ప్రయాణికులు అసహనానికి లోనయ్యారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
హైదరాబాద్, తిరుపతి రైల్వే స్టేషన్లలో ఆధునిక సదుపాయాలు
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్, తిరుపతి సహా దేశవ్యాప్తంగా 24 ముఖ్యమైన రైల్వేస్టేషన్లలో ప్రయాణికులకు ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి తేనున్నట్టు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి అధిర్‌రంజన్ చౌధురి తెలిపారు. ఈ మేరకు ఆయన లోక్‌సభలో లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. అదేవిధంగా రైల్వేస్టేషన్లున్న ప్రదేశాల చారిత్రక నేపథ్యం, పర్యాటక ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని పర్యాటక మంత్రిత్వశాఖ భాగస్వామ్యంతో ప్రయాణికులకు మరిన్ని సదుపాయాలు కల్పించనున్నట్టు తెలిపారు. ఆధునీకరణ, సదుపాయాల వ్యయాన్ని రైల్వే, పర్యాటక శాఖలు భరిస్తాయన్నారు.