ఆదిమ గెలాక్సీ చిక్కింది
అనంత విశ్వంలో మనకు అత్యంత సుదూరంలో ఉన్న ఒక నక్షత్ర మండలాన్ని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తాజాగా గుర్తించింది. దీన్ని అత్యంత ఆదిమ గెలాక్సీల్లో ఒకటిగా భావిస్తున్నారు. ఎదుకంటే విశ్వావిర్భావానికి మూల కారణమని భావిస్తున్న బిగ్‌బ్యాంగ్ జరిగిన కేవలం 33 కోట్ల ఏళ్లకే అది పురుడు పోసుకుంది! విశ్వం వయసు 1,380 కోట్ల ఏళ్లని అంచనా. ఈ లెక్కన ఈ గెలాక్సీ ఎంత పురాతనమైనదో అర్థం చేసుకోవచ్చు. దీనికి జేడ్స్–జీఎస్–జెడ్13–1గా సైంటిస్టులు నామకరణం చేశారు. భూమి వయసు 450 కోట్ల సంవత్సరాలన్నది తెలిసిందే. అయితే, ‘‘జేడ్ గెలాక్సీ కేవలం 230 కాంతి సంవత్సరాల విస్తీర్ణంలోనే వ్యాపించింది. ఆ లెక్కన మన పాలపుంత కంటే ఇది వందలాది రెట్లు చిన్నదే’’ అని సైంటిస్టులు వివరించారు. కానీ దీని గుర్తింపుకు ఉన్న విశిష్టత అంతా ఇంతా కాదు. చీకట్లను చీల్చుకుని...మనకు ఇప్పటిదాకా తెలిసిన అత్యంత పురాతన గెలాక్సీల్లో జేడ్స్ నాలుగోది. కానీ వాటన్నింట్లోకీ ఇది అత్యంత ప్రకాశవంతమైనది మాత్రం ఇదే. తద్వారా అయానీకరణ దశకు జేడ్స్ తొలి రుజువుగా నిలిచిందని ఈ అధ్యయనంలో పాల్గొన్న సైంటిస్టుల బృందం సంబరపడుతోంది. బిగ్బ్యాంగ్తో పురుడు పోసుకున్న విశ్వం క్షణాల వ్యవధిలోనే శరవేగంగా, అనంతంగా విస్తరించడం మొదలు పెట్టిందన్నది సైంటిస్టుల భావన. నవజాత దశను దాటి కాస్త చల్లబడ్డాక చాలాకాలం పాటు వైశ్విక అంధకార యుగం కొనసాగిందని చెబుతారు. ఆ దశలో విశ్వం మొత్తాన్నీ హైడ్రోజన్ వాయువు దట్టంగా కప్పేయడమే ఇందుకు కారణం. ‘‘దాంతో విశ్వమంతా కేవలం హైడ్రోజన్, హీలియం, కృష్ణరాశితో కూడిన ముద్దగా మిగిలిపోయింది. ఆ తర్వాత విశ్వపు తొలి తారలు, కృష్ణబిలాలు, గెలాక్సీలు పురుడుపోసుకున్నాయి. వాటినుంచి నుంచి అతి శక్తిమంతమైన పరారుణ కాంతి ఉద్గారాలు వెలువడ్డాయి. విశ్వాన్ని చిరకాలంగా కప్పి ఉంచిన తటస్థ హైడ్రోజన్ వాయు మండలాన్ని ఛేదించాయి. తొట్టతొలి వెలుగు కిరణాలుగా నిలిచిపోయాయి’’ అని పెన్హెగన్యూనివర్సిటీ కాస్మిక్ డాన్ సెంటర్‌కు చెందిన ఆస్ట్రో ఫిజిసిస్టు జోరిస్ విట్స్కాక్ వెల్లడించారు. తాజా అధ్యయనానికి ఆయనే సారథ్యం వహించారు. ‘‘అలా విశ్వం అయానీకరణ దశలో తొలిసారిగా వెలుగులు విరజిమ్మడం మొదలైంది. అందుకే దీన్ని విశ్వానికి పొద్దుపొడుపుగా చెబుతుంటారు. జేడ్స్ గెలాక్సీ సరిగ్గా ఆ పరివర్తన దశకు చెందినదని తేలింది’’ అని విట్స్కాక్ వివరించారు. ‘‘ఇప్పటిదాకా మనకు చిక్కిన ఇతర సుదూర గెలాక్సీలకు భిన్నంగా జేడ్స్ అత్యంత స్పష్టంగా కని్పస్తుండటం వెనక కారణం కూడా ఇదే. అందులో అత్యంత శక్తిమంతమైన పరారుణ రేడియేషన్ వంటిది ఉందనేందుకు ఇది నిదర్శనం. అయానీకరణం చెందిన హైడ్రోజన్ దాని చుట్టూ భారీగా పరుచుకుని ఉంది’’ అని చెప్పుకొచ్చారు. ఈ అధ్యయన వివరాలను జర్నల్ నేచర్‌లో ప్రచురించారు. – సాక్షి, నేషనల్ డెస్క్