మండు వేసవిలో నిండు వినోదం
రాత్రి గం. 8 నుంచి
సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
నేడు ముంబై x కోల్‌కతా
ఓవైపు భానుడి భగభగలు... మరోవైపు ఎన్నికల వేడి... ఈ రెండింటితో పగలంతా ‘మండిపోయే’ సగటు భారతీయుడికి... పసందైన వినోదాన్ని అందించేందుకు రంగం సిద్ధమైంది. చుక్కలు చూపే ఎండలో క్రికెటర్ల పోరాటానికి తెరలేవనుంది.
బుల్లెట్‌లాంటి బంతులు వేసే బౌలర్లు... వాయువేగంతో తిప్పికొట్టే బ్యాట్స్‌మెన్... గాలిలోనే గింగరాలు తిరుగుతూ అనితర సాధ్యం కాని క్యాచ్‌లు తీసుకునే ఫీల్డర్లు... ఓవరాల్‌గా తుపాను, సునామీలను మించిన బీభత్సం... ఇలా ఒక్కటేంటి... చెప్పడానికి, వినడానికి, చూడటానికి రెండు కళ్లు చాలవు. క్రికెట్‌ను ఎవరెస్టంత ఎత్తుకు తీసుకెళ్లిన ఐపీఎల్లో ఏడో ఎడిషన్‌కు నేడు తెరలేవనుంది. ధనాధన్ క్రికెట్లో రెప్పపాటు కాలంలో దూసుకుపోయే బౌండరీలు, సిక్సర్ల హోరు నేటి నుంచే...
అబుదాబి: మలింగ యార్కర్ వేస్తే భారత అభిమాని ఆనందంతో ఎగిరిగంతేస్తాడు... డివిలియర్స్ కళ్లు చెదిరే సిక్సర్ కొడితే లంక ఆటగాళ్లు చప్పట్లు చరుస్తారు. కోహ్లి భారీ ఇన్నింగ్స్ ఆడితే గేల్ సంతోషంతో గంగ్నమ్ చేస్తాడు. ధోని వ్యూహాలకు ఆసీస్ ఆటగాళ్లు ఫిదా అయిపోతారు.
అంతర్జాతీయ క్రికెట్లో రంకెలు వేసే మేటి క్రికెటర్లు కూడా ఈ లీగ్‌కు వచ్చేసరికి ఫ్రాంచైజీల కోసం అణువణువు ధార పోస్తారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ లీగ్ ‘ఐపీఎల్’ మహిమ ఇది. అభిమానులను ఉర్రూతలూగించేందుకు ఐపీఎల్-7 సిద్ధమైంది. చిందులేసే ఛీర్ లీడర్స్... ఏడారి స్వర్గం అబుదాబిలో డిన్నర్లు... డిస్కోలు... పార్టీలు.. ఇలా ఆటను మించిన అందాలతో, ఆహ్లాదాన్ని మించిన పోరాటాలతో క్షణక్షణం అభిమానుల నరాలు తెగే ఉత్కంఠ... మరికొద్ది గంటల్లోనే... ఇక ఈ వేసవి సాయంత్రాలను ఆస్వాదించేందుకు సిద్ధంకండి..!
మొదటి దశ యూఏఈలో...
దేశవాళీ టోర్నీ అయిన ఐపీఎల్... షెడ్యూల్ ప్రకారం భారత్‌లోనే జరగాలి. కానీ దేశంలో నెలకొన్న ఎన్నికల హడావుడితో లీగ్‌కు తగినంత భద్రత ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో మొదటి దశ మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహిస్తున్నారు. నేటి నుంచి ఈనెల 30 వరకు అబుదాబి, షార్జా, దుబాయ్‌ల్లో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. మే 2న మళ్లీ భారత్‌లో లీగ్ మొదలవుతుంది. అయితే ఇప్పటికే స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వివాదాలల్లో కూరుకుపోయిన ఐపీఎల్‌ను బుకీల అడ్డా యూఏ ఈలో నిర్వహించడం లీగ్ పాలక మండలికి కత్తిమీద సామే.
ఎవరూ ఫేవరెట్స్ కారు..!
టి20ల్లో ఒకే ఒక్క ఓవర్‌తో మ్యాచ్ తారుమారవుతుంది. గత ఆరు సీజన్లలో చాలా వరకు ఇలాగే జరిగింది. కొన్ని జట్లు ఫేవరెట్‌గా దిగినా లీగ్ దశలోనే వెనుదిరిగాయి. మరికొన్ని అండర్‌డాగ్స్‌గా దిగి సంచలనాలు సృష్టించాయి. అంచనాలు లేని ఆటగాళ్లు ఎంతో మంది ఈ లీగ్‌లో చరిత్ర సృష్టించారు.
ఈసారి వేలంలో అన్ని ఫ్రాంచైజీలు ఆచితూచి ఆటగాళ్లను ఎంచుకున్నాయి. అన్ని అంశాల్లో సమతూకంగా ఉండేలా జట్టును ఎంపిక చేసుకున్నాయి. దీంతో ఎవర్నీ ఫేవరెట్‌గా చెప్పలేని పరిస్థితి. అయితే ఊహించని రీతిలో అమ్ముడుపోయిన యువరాజ్, పీటర్సన్, దినేశ్ కార్తీక్‌తో పాటు డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, గంభీర్ ఆటపై ఎక్కువ మంది దృష్టిసారించారు.
టోర్నీకి ఊపు తెచ్చేలా తొలి మ్యాచ్‌లోనే డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్... పటిష్టమైన కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. రోహిత్ శర్మ నాయకత్వం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ పర్యవేక్షణలో ముంబై రెండోసారి టైటిల్‌పై గురిపెట్టింది.
ఎక్కువ మంది పాత ఆటగాళ్లను రిటైన్ చేసుకున్న ముంబై... మైక్ హస్సీ రాకతో మరింత బలోపేతమైంది. మరోవైపు గంభీర్, మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్‌లను కొనసాగించిన కోల్‌కతా కూడా మంచి సమతుల్యంతో ఉంది. అయితే గంభీర్, కలిస్, యూసుఫ్ పఠాన్‌లపై ఆ జట్టు బ్యాటింగ్ భారం ఆధారపడి ఉంది. ఏదేమైనా తమదైన రోజున ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించే సత్తా ఉన్న ఆటగాళ్లకు రెండు జట్లలో కొదువలేదు. కాబట్టి పోరు రసవత్తరం కానుంది.
47 ఏప్రిల్16 నుంచి జూన్ 1 వరకు 47 రోజుల పాటు టోర్నీ జరుగుతుంది
8 ఈ సీజన్లో పాల్గొంటున్న జట్లు
రూ. 468 కోట్ల 10 లక్షలు ఈ ఒక్క సీజన్ కోసం ఐపీఎల్ జట్లు ఆటగాళ్ల కోసం ఖర్చు చేస్తున్న మొత్తం
13 భారత్,యూఏఈలో కలిపి వేదికలు
60 మొత్తం మ్యాచ్‌లు
40 భారత్‌లో మ్యాచ్‌లు
178 పాల్గొంటున్న ఆటగాళ్ల సంఖ్య