
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి అమలు చేస్తున్న వివిధ జాతీయ ప్రాజెక్టుల ప్రగతిపై బుధవారం ఢిల్లీ నుంచి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పలువురు కేంద్ర శాఖల కార్యదర్శులు, వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ప్రధానంగా వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తున్న ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), ఢిల్లీ–వడోదర–ముంబై ఎక్స్‌ప్రెస్ వే, చోటాదపూర్–ధార్ రత్లాం–మాహౌ–ఖాండ్వా–అకోలా రైల్వే లైన్ కన్వర్షన్, ముంబై–నాగపూర్–ఝూర్సుగుడ పైపులైన్, బైలదిల్లా ఐరన్ ఓర్ డిపాజిట్ ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి (పీఎం స్వానిధి) అంశాలకు సంబంధించి ఆయా ప్రాజెక్టుల ప్రగతిని ప్రధానమంత్రి సమీక్షించారు.
ఈ వీడియో సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్‌రెడ్డి, ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, రహదారులు–భవనాలశాఖ కార్యదర్శి ప్రద్యుమ్న, ఐటీశాఖ కార్యదర్శి కె.శశిధర్, పీసీసీఎఫ్ ఎ.కె.ఝా తదితరులు పాల్గొన్నారు.