వక్ఫ్‌ బిల్లుకు మద్దతుపై ముసలం! | Growing pressure within the party on Chandrababus approach to the Waqf Bill | Sakshi
Sakshi News home page

వక్ఫ్‌ బిల్లుకు మద్దతుపై ముసలం!

Published Sat, Apr 5 2025 5:11 AM | Last Updated on Sat, Apr 5 2025 7:16 AM

Growing pressure within the party on Chandrababus approach to the Waqf Bill

బిహార్‌లో జేడీయూ, యూపీలో ఆర్‌ఎల్‌డీని వరుసబెట్టి వీడుతున్న నేతలు

చంద్రబాబు తీరుపై పార్టీలో పెరుగుతున్న ఒత్తిడి.. 

నిలదీస్తున్న ముస్లిం మైనార్టీలు.. సత్తా లేని సవరణలపై ఆగ్రహం

తన డ్రామాలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి

దాని నుంచి బయట పడేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌

ఒకే రోజు.. రుషికొండపై  దుష్ప్రచారం.. షర్మిలను రంగంలోకి దించిన బాబు

వైఎస్సార్‌ సీపీ అసలు విప్‌ జారీ చేయలేదంటూ విష ప్రచారం..

బోనులో నిలబడి ముస్లిం సమాజానికి జవాబు చెప్పలేక సతమతమవుతున్న బాబు

రెండు సభల్లోనూ స్పష్టంగా వ్యతిరేకించి బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసిన వైఎస్సార్‌సీపీ ఎంపీలు

సాక్షి, అమరావతి: వక్ఫ్‌ చట్ట సవరణ బిల్లుకు జేడీయూ మద్దతివ్వటాన్ని నిరసిస్తూ బిహార్‌లో పలువురు నేతలు వరుసగా రాజీనామాలు చేస్తుండటంతో ఆ పార్టీలో ముసలం మొదలైంది. ఎన్డీఏ కీలక భాగస్వామ్య పక్షంగా కొనసాగుతున్న జేడీయూకు బిహార్‌ ఎన్నికలకు ముందు ఇది అతి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. ఇదే మాదిరిగా సీఎం చంద్రబాబు వక్ఫ్‌ సవరణకు బిల్లుకు మద్దతివ్వడం పట్ల టీడీపీకి చెందిన మైనార్టీ నేతల్లో తీవ్ర అసంతృప్తి రాజుకుంటోంది. 

బిల్లుకు అనుకూలంగా ఓటే­యడం ద్వారా ముస్లిం సమాజానికి టీడీపీ ఎంత ద్రోహం తలపెట్టిందో పార్లమెంట్‌ సాక్షిగా తేటతెల్లమైందనే చర్చ జరుగుతోంది. దీంతో పలువురు నేతలు పార్టీని వీడే యోచనలో ఉన్నట్లు గ్రహించడంతో ఒత్తిడి పెరిగిన సీఎం చంద్రబాబు డైవర్షన్‌ పాలిటిక్స్‌కు తెర తీశారు. ఈ క్రమంలో ఏమాత్రం ఉపయోగం లేని మూడు సవరణలను ప్రతిపాదించి గొప్పగా ప్రచారం చేసుకున్నారు. 

పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ద్వారా కుటుంబ వ్యవహారాలను మాట్లాడించడంతోపాటు రుషికొండ గురించి టీడీపీ కరపత్రంలో తప్పుడు కథనాలు రాయించారు. వైఎస్సార్‌ సీపీ వక్ఫ్‌ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిందని పొద్దున టీడీపీ సోషల్‌ మీడియాలో ప్రచారం చేయించిన చంద్రబాబు సాయంత్రాని కల్లా అనుకూలంగా ఓటు వేసిందంటూ మరో ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు. ముస్లిం సమాజానికి సమాధానం చెప్పాల్సిన చంద్రబాబు డైవర్షన్‌ రాజకీయాలు చేస్తుండటం గమనార్హం.

పెరుగుతున్న ఒత్తిళ్లతో ఉక్కిరిబిక్కిరి..
వక్ఫ్‌ చట్ట సవరణ బిల్లుకు అనుకూలంగా ఓటేసిన ఎన్డీఏ పక్షాలు జేడీయూ, రాష్ట్రీయ లోక్‌దళ్‌కు బిహార్, యూపీలో పలువురు నేతలు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తుండటం.. టీడీపీ రెండు నాలుకల వైఖరిపై ముస్లిం సమాజంలో తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతుండటంతో సీఎం చంద్రబాబు మరో డ్రామాకు తెర తీశారు. తనకు అలవాటైన డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగంగా వైఎస్సార్‌ సీపీపై సోషల్‌ మీడియాలో తలా తోకా లోకుండా దుష్ప్రచారానికి పచ్చ కూలీలను రంగంలోకి దించారు. 

హైదరాబాద్‌లోని ‘సాక్షి’ కార్యాలయం వక్ఫ్‌ బోర్డునకు చెందినదని, అందుకే లోక్‌సభలో వక్ఫ్‌ చట్ట సవరణ బిల్లును వైఎస్సార్‌ సీపీ ఎంపీలు వ్యతిరేకించారని.. రాజ్యసభలో మాత్రం అనుకూలంగా ఓటు వేయించారని.. విప్‌ జారీ చేయలేదని.. ఇలా పరస్పర విరుద్ధంగా, పొంతన లేని ప్రచారం చేయించుకున్నారు. సవరణ బిల్లులో ఏమాత్రం సత్తాలేని మూడు సవరణలు ప్రతిపాదించి ముస్లింలను మభ్యపుచ్చేందుకు యత్నించి బోనులో నిలబడ్డ చంద్రబాబు తన నిర్వాకాలకు సమాధానం చెప్పకుండా బురద చల్లేందుకు విఫల యత్నాలు చేశారు.

మైనార్టీలకు నష్టం జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోనని ఎన్నికల  సమయంలో చంద్రబాబు గంభీరంగా ప్రకటనలు చేయగా గుంటూరు ఎంపీ అభ్యర్థి అయితే మైనార్టీలకు నష్టం జరిగితే ఏకంగా రాజీనామా చేస్తానని చెప్పారు. వక్ఫ్‌ బిల్లు  నేపథ్యంలో ముస్లిం మైనార్టీలంతా టీడీపీని నిలదీస్తుండటంతో దీని నుంచి బయట పడేందుకు చంద్రబాబు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు. 

నాడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు నుంచి నేడు పీ 4 కార్యక్రమం దాకా నోరు తెరిస్తే చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ఉన్న షర్మిల ఆ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వక్ఫ్‌ బిల్లుపై స్పందించాల్సి పోయి కుటుంబ విషయాలను ప్రస్తావించటాన్ని బట్టి చంద్రబాబు స్క్రిప్టు ప్రకారమే నడుచుకుంటున్నట్లు మరోసారి స్పష్టమైందని, ఇదంతా డైవర్షన్‌ రాజకీయాల్లో భాగమేనని వ్యాఖ్యానిస్తున్నారు.

స్పష్టంగా వ్యతిరేకించిన వైఎస్సార్‌ సీపీ.. ఆది నుంచి అదే విధానం
వక్ఫ్‌ చట్ట సవరణ బిల్లు విషయంలో వైఎస్సార్‌ సీపీ మొదటినుంచి తన విధానాన్ని చాలా స్పష్టంగా చెబుతూ వచ్చింది. రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్న ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఎప్పుడో ప్రకటించారు. ఆ మేరకు మొన్న లోక్‌సభలో.. నిన్న రాజ్యసభలోనూ బిల్లుకు వ్యతిరేకంగా పార్టీ ఓటు వేసింది.

వక్ఫ్‌ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని వైఎస్సార్‌ సీపీ తన ఎంపీలకు విప్‌ జారీ చేసింది. బిల్లును పార్టీ వ్యతిరేకించిందనేందుకు లోక్‌సభ, రాజ్యసభల్లో రికార్డయిన ఉభయ సభల కార్యకలాపాలే తిరుగులేని రుజువు. వక్ఫ్‌ బిల్లుపై పార్లమెంట్‌లో వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి ప్రసంగాలే మరొక సాక్ష్యం.

టీడీపీ ప్రతిపాదించిన నిస్సత్తువ సవరణలివీ..
వక్ఫ్‌ సవరణ బిల్లుకు మద్దతు ఇవ్వవద్దన్న తమ విజ్ఞప్తిని పట్టించుకోకపోగా.. సత్తువ లేని సవరణలు ప్రతిపాదించి వాటికి జేపీసీ (పార్లమెంట్‌ సంయుక్త కమిటీ) ఆమోదం తెలిపిందని, అది తమ ఘనతేనని టీడీపీ ప్రచారం చేసుకోవడంపై ముస్లిం సమాజం మండిపడుతోంది. జేపీసీకి టీడీపీ సవరణలు ప్రతిపాదించినట్లు ఆ పార్టీ గొప్పలు చెప్పుకోవడం, జాతీయ మీడియాలో ప్రచారం చేసుకోవటమేగానీ దీనికి సంబంధించి ఎక్కడా కనీసం కసరత్తు చేసిన దాఖలాలు లేవని, ఏ ఒక్కరినీ సంప్రదించలేదని పేర్కొంటున్నారు. 

అసలు టీడీపీ ప్రతిపాదించిన మూడు సవరణలు ఏమాత్రం పస లేనివని, ముస్లింల పట్ల ఆ పార్టీ మొసలి కన్నీళ్లు కారుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా బిహార్‌ ఎన్నికల ముంగిట ఎన్డీఏ కీలక భాగస్వామ్య పక్షం ఎన్డీఏకి ఆ పార్టీ నేతలు షాకులిస్తున్నారు. వక్ఫ్‌ సవరణ బిల్లుకు సీఎం నితీష్‌ సారథ్యంలోని జేడీయూ మద్దతివ్వటాన్ని నిరనిస్తూ పలువురు నేతలు మూకుమ్మడి రాజీనామాలు సమర్పిస్తున్నారు.

1) సాధారణంగా కొత్త చట్టాలన్నీ అవి రూపుదిద్దుకుని ఆమోదం పొందిన నాటి నుంచే అమలులోకి వస్తాయి. అంతేగానీ పాత తేదీలకు వర్తించవు. అలాంటప్పుడు ఆస్తుల పునఃపరిశీలనకు అవకాశం లేదంటూ టీడీపీ ప్రతిపాదించిన సవరణకు ఏం విలువ ఉంటుందని ముస్లిం పెద్దలు నిలదీస్తున్నారు.

2) రెండో సవరణ కింద.. వక్ఫ్‌ ఆస్తుల నిర్థారణలో జిల్లా కలెక్టర్‌కు తుది అధికారం ఉండరాదని, రాష్ట్ర ప్రభుత్వం హయ్యర్‌ ర్యాంకింగ్‌ అథారిటీ ఉన్న అధికారిని నియమిస్తుందని ప్రతిపాదించారు. అధికారులు ఎవరైనప్పటికీ ఆయా ప్రభుత్వాల విధానాలకు అనుగుణంగానే వ్యవహరిస్తారు. అలాంటప్పుడు కలెక్టర్‌ అయినా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినా ఒకటే కదా! ఏ అధికారిని నియమించినా ప్రభుత్వ ఆదేశాల మేరకే నడుచుకుంటారు కదా!! మరి ఈ సవరణ సత్తువ లేని సవరణ కాదా?

3) మూడో సవరణ పేరుతో.. డిజిటల్‌ పత్రాలను సమర్పించేందుకు ఆర్నెళ్లకుపైగా గడువు పొడిగింపును ప్రతిపాదించారు. వక్ఫ్‌ ఆస్తుల డిజిటలైజేషన్‌ ప్రక్రియ ఇప్పటికే పూర్తైందని ముఖ్తార్‌ అబ్బాస్‌ నక్వీ లాంటి బీజేపీ నేతలే చెబుతున్నారు. అంటే.. ఇప్పటికే పూర్తయిన ప్రక్రియకు టీడీపీ సవరణలను ప్రతిపాదించిందని భావించాలా??

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement