
అమరావతి, సాక్షి: ఎట్టకేలకు ఏపీలో సొంతింటి నిర్మాణం పనులు చేపట్టారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్ర విభజన తర్వాత నుంచి ఉండవల్లిలోని కరకట్టపై ‘అక్రమ’ నివాసంలో ఆయన నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. వరదలు వచ్చిన ప్రతీసారి ఆ నివాసం మునిగిపోతూ వస్తోంది.
బుధవారం ఉదయం వెలగపూడిలో పరదాల మాటున సీఎం చంద్రబాబు నివాసానికి భూమి పూజ జరిగింది. సచివాలయం వెనుక.. ఎమ్మెల్యేల క్వార్టర్ల సమీపంలో ఈ ఇంటి నిర్మాణం చేసుకుంటున్నారాయన. ఇందుకోసం ఐదెకరాల భూమిని కొనుగులు చేశారు. ఈ కార్యక్రమానికి పార్టీ నేతలెవరికీ ఆహ్వానం పంపించలేదు. అలాగే.. ఆ స్థలం వైపుగా ఎవరూ వెళ్లకుండా అధికారులు గ్రీన్ పరదాలు ఏర్పాటు చేశారు.
ఇవాళ జరిగిన నారా వారి గృహ శంకుస్థాపన మహోత్సవంలో నారా లోకేష్ దంపతులు పాల్గొన్నారు. మనవడు దేవాన్ష్‌ను చంద్రబాబు పూజలో కూర్చోబెట్టుకున్నారు. ఇప్పటికే చంద్రబాబుకి హైదరాబాద్‌లో ప్యాలెస్‌లాంటి ఇల్లు ఉంది. మూడు దశాబ్దాలకు పైగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలోనూ సొంతిల్లు లేకపోవడంతో ఆ మధ్య బాగా విమర్శలు వచ్చాయి. దీంతో అక్కడా ఇంటి నిర్మాణం చేపట్టారు. ఇప్పుడు సీఎం హోదాలో ఏపీలో కొత్తింటిని నిర్మించుకోబోతున్నారు. ఐదెకరాల భూమిలో.. 25 వేల గజాల్లో హైదరాబాద్ ప్యాలెస్‌ను తలదన్నెలా భవనం నిర్మించబోతున్నట్లు సమాచారం.
