
మరుగుదొడ్లకూ పసుపు తెరలు..
మన ఇల్లు–మన లోకేశ్ కార్యక్రమంలో అంతా పసుపు మయం
ఎప్పటినుంచో ఉంటున్న ఇళ్లకూ ‘మన ఇల్లు–మన లోకేశ్’ అంటూ పేరు
గతంలో పలు కార్యక్రమాలకు జగన్ పేర్లపై దుష్ప్రచారం
ఇప్పుడు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికీ లోకేశ్ పేరు
తాను చేస్తే ఒప్పు.. ఇతరులు చేస్తే తప్పన్నట్లుగా టీడీపీ తీరు
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీలో పసుపు రంగు పిచ్చి పరాకాష్టకు చేరింది. చివరికి మరుగుదొడ్లను కూడా వదలడంలేదు. మంగళగిరి మండలం ఎర్రుబాలెంలో సీఎం తనయుడు, ఐటీ, విద్యాశాఖల మంత్రి లోకేశ్ శుక్రవారం నిర్వహించిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం అంతా పసుపుమయంగా మారింది. సభకు వచ్చిన వారికి బయో మరుగుదొడ్లు ఏర్పాటుచేయగా అవి నీలం రంగులో ఉండడంతో వాటి చుట్టూ పసుపు రంగు తెరలు కట్టారు. అలాగే, అక్కడ కాలువపై ఉన్న వంతెనకూ పూర్తిగా పసుపు రంగు వేశారు. ఎ
టు చూసినా పసుపు రంగులతోనే అలంకరించారు. ఆక్రమిత ఇళ్ల స్థలాలను క్రమబద్దీకరించి పట్టాలిచ్చే కార్యక్రమం చిన్నదైనా భారీ హంగామాతో చేయడం గమనార్హం. సీఎం తనయుడి నియోజకవర్గం కావడంతో ప్రభుత్వ సొమ్మును చిన్నా, చితకా కార్యక్రమాలకు సైతం ఇష్టానుసారం దుబారా చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రజల ఇళ్లకు లోకేశ్ పేరా?
మరోవైపు.. పట్టాల పంపిణీ కార్యక్రమానికి లోకేశ్ పేరు పెట్టుకున్నారు. ప్రజలు ఎప్పటి నుంచో ఉంటున్న ఇళ్లను క్రమబద్దీకరించి దాన్ని పెద్ద ఘన కార్యంగా ప్రచారం చేసుకుంటున్నారు. దానికీ ‘మన ఇల్లు–మన లోకేశ్’ అని నామకరణం చేశారు. వీటికి ఆయన పేరు పెట్టడమేంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గతంలో వైఎస్ జగన్ హయాంలో లక్షలాది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసినప్పుడు.. లక్షలాది ఎకరాలను 22ఏ చెర నుంచి విడిపించినప్పుడు అధికారుల నిర్ణయంతో ఆయన ఫొటో వేయడంపై చంద్రబాబు, లోకేశ్, టీడీపీ ముఠాలు చేసిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు.
రంగుల పిచ్చి ఎవరిది?
తప్పుడు ప్రచారాలు, దొంగ హామీలతో అధికారంలోకి వచ్చాక ఇప్పుడు టీడీపీ బ్యాచ్ ప్లేటు ఫిరాయించింది. గతంలో చేసిన ఆరోపణలకు భిన్నంగా ప్రవర్తిస్తోంది. ప్రతి ఊర్లో పసుపు రంగే ఉండాలనేలా టీడీపీ నేతలు, కార్యకర్తలు వ్యవహరిస్తున్నారు. చివరికి.. లోకేశ్ నియోజవర్గంలో నిర్వహించిన కార్యక్రమంలో మరుగుదొడ్లకు కూడా పసుపు రంగువేసే వరకూ వెళ్లిందంటే పరిస్థితి అర్థంచేసుకోవచ్చు. ఏ కార్యక్రమంలో అయినా పసుపు రంగే ఉండాలని అధికార యంత్రాంగానికి చంద్రబాబు అనధికారికంగా ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది.
అందుకే కొందరు టీడీపీ భక్త ఐపీఎస్ అధికారులు ఆఫీసుల్లో పసుపు రంగులు వేసుకున్నారు. చంద్రబాబు తనను కలవడానికి వచ్చే అతిథులు, ఇతరులకు సైతం పసుపు శాలువాలే కప్పుతున్నారు. ఢిల్లీలో ప్రధాని, కేంద్ర మంత్రులు, ఇతర వీవీఐపీలను కలిసినప్పుడు కూడా పసుపు రంగు శాలువాలనే కప్పుతున్నారు. దీన్నిబట్టి రంగుల పిచ్చి ఎవరికి ఉందో అర్థంచేసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తాను చేస్తే ఒప్పు, పక్కవాడు చేస్తే ఏదైనా తప్పేననేది చంద్రబాబు, టీడీపీ సిద్ధాంతమని రుజువైందని వారంటున్నారు.